ఆటా వారి బహుమతి పొందిన కథ: మేడిపండు

ఆటా-2008(అమెరికన్ తెలుగు అసోసియేషన్) దశమ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన కథల పోటీలో రెండవ బహుమతిని గెలుచుకున్న కథ.

మేడిపండు
- అరుణ్ కుమార్ ఆలూరి

"వచ్చేనెల ఇరవై రెండవ తేదీ నుంచి నీకు లీవ్ సాంక్షన్ అయిందయ్యా!" అని మా సూపర్ వైజర్ సుబ్రహ్మణ్యం గారు చెప్పినప్పటి నుంచి, మనసు మనసులో లేదు. గాలిలో తేలిపోతున్నట్టంది. నాకు అంత తొందరగా సెలవు మంజూరు కావడానికి మర కారణం, సుబ్రహ్మణ్యంగారు తెలుగువారు కావడమే! వారిది బందరు. నాకన్నా వయసులో చాలా పెద్ద, అయినా స్నేహితుళ్ళా కలిసుంటాం!

కన్నతల్లిని, ఉన్న ఊరిని, మాతృదేశాన్ని వదిలి ఒమాన్‌కి వచ్చి మూడు సంవత్సరాలైంది. ఇప్పుడు సెలవు మంజూరు కావడంతో పట్టరాని సంతోషంతో ఉన్నాను. వచ్చేనెల ఇరవైరెండువ తారీఖు వరకు ఇక్కడే ఉండాలంటే భారంగా ఉంది. ఆఫీసులో అస్సలు పని చేయాలనిపించడం లేదు. ఎప్పుడు భారతంలో వాలదామా అనుంది.

-౦-

ఇంటి అప్పులు తీర్చడానికి మళ్ళీ అప్పులు చేసి ఒమాన్‌లో వాలాను. ఒమాన్‌లో అన్నీ చాలా ప్రణాళికాబద్ధంగా జరుగుతాయి. అన్ని పనులు కాంట్రాక్టుల పద్ధతిలో నడుస్తాయి. ఆఖరికి ప్రభుత్వ ఆఫీసుల్లో టీ‌కి వాడే పంచదార, టీ‌పొడి కూడా ఏదో కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చేస్తారు. అలా ప్రతీది అన్నమాట. ప్రతీ దానికీ లెక్కలుంటాయి కాబట్టి అవినీతికి పాల్పడే అవకాశం చాలా తక్కువ. 

ఒక ఆఫీసుకి ఇంఛార్జ్‌ను నేను. ఇక్కడ కంప్యూటర్ పాడైనా, కిచెన్ లో టీ పొడి అయిపోయినా నాకు ఫోన్ చేస్తారు. నా పనల్లా, ఆయా సంబంధిత కంట్రాక్టు తీసుకున్న కంపెనీలకి ఫోన్ చేసి చెప్పటం, వాటికి సంబంధించిన లెక్కలు చూసుకోవడం! మళ్ళీ ఆయ కంపెనీల వారే వచ్చి రిపేర్లు చేయడం, సరుకులు ఇచ్చి వెళ్లడం చేస్తుంటారు.

ఇక్కడ పాకిస్థానీయులు, బంగ్లాదేశీయులు, నేపాల్ వాళ్ళు కూడా కనిపిస్తుంటారు. మనదేశం వారు, అందునా తెలుగు వారు ఎక్కువగా ఉంటారు. అప్పుడు నాకనిపించింది, కష్టాలు కూడా తెలుగు వారికే ఎక్కువా అని!

-౦-

మామూలుగా అందరం మాట్లాడే భాష హిందీ. ఇక్కడ ఉండటం వల్ల అరబ్బి కూడా కాస్త ఒంటబట్టింది. భాషకున్న ప్రాధాన్యం చాలా గొప్పది. మా ఆఫీస్‌లోని పై అధికారులతో వచ్చీరాని అరబ్బిలో మాట్లాడటానికి ప్రయత్నిస్తుంటే, చాలా గర్వంగా నా వంక చూసే వారు. నేను చేసే చిన్న చిన్న పొరపాట్లని చూసీచూడనట్టు వదిలేసేవారు. ఎవరి భాష మీద వారికంత మమకారం! కొత్త తెలుగు సినిమా సి.డి. వచ్చిందంటే మన కరెన్సీలో నాలుగు వందల రూపాయలు పెట్టడానికి కూడా వెనకడుగు వేయం! అదో మంచి వ్యాపారం ఇక్కడ. పాటల సి.డి.లైతే పల్లీ బఠానీల్లా అమ్ముడుపోతాయి. నాతో పాటు రూంలో పాకిస్థానీయుడు ఉంటాడు. కానీ మేమెప్పుడూ శత్రుదేశాల వాళ్ళలా ఉండేవాళ్లం కాదు. వాడు నాకు మంచి స్నేహితుడు. మహమ్మద్ అలీ వాడి పేరు. వాడికి తెలుగు పాటలంటే ప్రాణం! అర్థం అయినా, కాకపోయినా వింటాడు. మాయదారి మైసమ్మో, అ అంటే అమలాపురం పాటలు చెవిన పడితే చాలు ఆనందంగా గంతులేస్తాడు. 

-౦-

అమ్మానాన్నలకీ, అన్నావదినలకీ, బంధువులకీ, స్నేహితలకీ తీసుకెళ్ళాల్సిన బహుమతులను గుర్తొచ్చినప్పుడల్లా కాగితంపై రాసుకుంటూ, వీలున్నప్పుడల్లా కొంటున్నాను. నిజానికి ఇంట్లో అప్పులింకా తీరలేదు! అయినా ఒకసారి అందరిని చూసి రావాలన్న ఆశతో సెలవుకి అర్జీ పెట్టుకున్నాను. మా ఇందూరు జిల్లా వాసులు వాళ్ల ఆప్తులకు చేరవేయాల్సిందిగా కొన్ని బహుమతులు నాకిచ్చారు. కొంతమంది వస్తురూపంలో, మరికొంత మంది నగదు రూపంలో!

ఇంతలో ఇరవైరెండవ తారీఖు వచ్చింది. అలీ, మరికొంత మంది స్నేహితులు ఎయిర్ పోర్ట్‌కి వచ్చి, నేను తిరిగి వచ్చేటప్పుడు వాళ్లకేమేం తీసుకు రావాలో ఎకరువు పెట్టి మరీ వీడ్కోలిచ్చారు. 

చెకింగ్ పూర్తి చేసుకుని, విమానమెక్కి నా సీట్లో కూర్చున్నాను. ఎప్పుడు బేగంపేట్‌లో దిగుతానా అని మనసు ఉరకలేస్తోంది. విమానం మెల్లిగా గరుడ పక్షిలా గాలిలోకెగిరింది. విమానాన్ని చూసినప్పుడల్లా మనిషి మేథకి జోహార్లనిపిస్తుంది. మరి ఆ మనిషిని సృష్టించిన దేవుడి మేథని ఏమని పొగడాలి? మొదట్లో దేవుడిని నమ్మేవాణ్ణి కాదు. ఎప్పుడైతే మానవ శరీర నిర్మాణం, లోపల కణాలతో సహా అవయవాలు నిరంతరంగా చేసే విధులు తెలుసుకున్నానో, అప్పటినుండి ఈ ప్రకృతి అంతా ఆ శక్తిస్వరూపుడి సృష్టేనని అనిపించి, దేవుడిని నమ్మటం మొదలుపెట్టాను. సృష్టిలో ఓ శక్తి ఉందని నా నమ్మకం. ఆ నమ్మకమే దేవుడు. ఆ నమ్మకం శివుడు కావచ్చు, అల్లా కావచ్చు, క్రీస్తు కావచ్చు, మరెవరైనా కావచ్చు. ఎవరికి నచ్చిన పేరుతో వారు పిలవచ్చని నా అభిమతం.

ఓ రోజు సుబ్రహ్మణ్యం గారు అన్నారు "నోటిని పెద్దగా తెరిచి గాలిని బయటకు వదిలితే వేడిగాలి వస్తుంది. అదే నోటిని మూసి పెదాల మధ్య చిన్న ఖాళీ వదిలి ఊదితే చల్లని గాలి వస్తుంది. అదే శరీరం, అవే పెదాలు, అదే గాలి కాని ఎంత తేడా? మరి దేవుడున్నట్టా? లేనట్టా? నోటిని లయబద్ధంగా మలచడం వల్ల, నోటి ఆకృతిలోని తేడా వల్ల ఉష్ణోగ్రతల్లో తేడా వచ్చింది. ఆ ప్రక్రియని పరిశోధిస్తే పుట్టిందే ఏ.సి. మనిషి రక్తమాంసాలు కప్పి ఉంచే చర్మాన్ని, ఇంతవరకు మనిషి మేథస్సు కృత్రిమంగా తయారు చేయలేకపోయింది. మనిషి మేథస్సు గొప్పదే! మరి ఆ మనిషి మేథస్సుని సృష్టించిన సర్వేశ్వరుడెంత గొప్పవాడయ్యుంటాడు?" అని. నిజమే! నేనిప్పటి వరకు ఆ రకంగా ఆలోచించలేదు. మనిషి మేథస్సే గొప్పదని, దేవుడే లేడని అప్పటి వరకు నా సిద్ధాంతంగా ఉండేది. ఆ రోజుతో నా అభిప్రాయం మారిపోయింది. ఏ ఆధారం లేకుండా గాలిలో విమానం ఎగరటం నాకిప్పటికీ ఆశ్చర్యమనిపించే విషయమే!

ఎయిర్ హోస్టెస్ తెచ్చిన చల్లని బీరుతో ఆలోచనల్లోంచి బయటపడ్డాను. బీరు వద్దని చికెన్ బిర్యానీ మాత్రం తిన్నాను. ఎన్ని దేశాలు తిరిగినా, ఎన్ని బిర్యానీలు తిన్నా, మన హైదరాబాద్ బిర్యానీ ముందు అవన్నీ దిగదుడుపే!

ఆలోచనల్లో ఉండగా నా ఊరు గుర్తొచ్చింది. మూడు సంవత్సరాల క్రితం ఊళ్లో పరిస్థితులు కళ్లముందు కదలాడాయి. 

అప్పుడు కరువు ప్రళయతాండవం చేస్తోంది. వర్షాలు లేక, పొలం పనలు లేక అందరం ఖాళీగా ఉండేవాళ్లం. కాస్తో కూస్తో చదువుకోవడం వల్ల నేను ఇందూరులో ఓ షాపులో పనికి కుదిరాను. కాని నా తోటి సావాసగాళ్ళంతా అలాగే ఖాళీగా ఉడేవారు. వర్షాలు పడకపోతాయా, పంటలు పండించకపోతామా అని వాళ్ళ ఆశ! వ్యవసాయం తప్ప మరొకటి తెలియదు వాళ్ళకి. 

సాయంత్రం అయిందంటే, మా ఇంటి ముదు ఖాళీ స్థలంలో, ఎప్పుడూ విశ్రాంతి తీసుకుంటుండే ఎడ్లబండి మీద కూర్చునే వాళ్ళం. చీకటి పడ్డాక, ఒప్పందాలు కుదుర్చుకుని, జట్లు జట్లుగా, చీకటి దారిలో మెల్లిగా కల్లు బట్టీకి చేరుకునే వాళ్ళం. ఎవడి దగ్గర డబ్బులుంటే వాడు తాగించే వాడు. రోజూ అదే తంతు. నిస్సారమైన ఆ జీవనంలో ఉత్తేజాన్ని నింపేవి పండుగలు, పెళ్ళిళ్ళు మాత్రమే! ఎవరి పెళ్ళైనా నిశ్చయమయిందంటే, అందరూ అక్కడే ఉండి, అన్ని పనులు కలిసికట్టుగా చేసి, పెళ్ళి ఆర్భాటంగా జరిపించే వాళ్ళం. పెళ్ళిలో ఒక్కక్కరం హీరోల్లా తయారై ఫోజులిచ్చే వాళ్ళం, అమ్మాయిల్ని పడగొట్టడానికి. అలా ఓ అమ్మాయికి దొరికిపోయాడు గంగాధర్. ఆ తర్వాత ఆ అమ్మాయితో పెళ్ళైందని తెలిసింది. 

గణేష్ చతుర్థిని చాలా ఘనంగా, ఆర్భాటంగా చేసేవాళ్లం. చందాలు పోగు చేసి, గణపతిని కూర్చోబట్టి, పదకొండు రోజులు నియమనిష్ఠలతో, భజనలతో, కోలాటలతో, పాటలతో ఓలలాడించి బాసర గోదావరిలో నిమజ్జనం చేసేవాళ్ళం. ఆ పదకొండు రోజులు ఎంతో సంబరంగా గడిచిపోయేవి. ఊళ్ళో మిగితా గణేష్ మండలిలకన్నా మాదే మిన్నా ఉండేది. ఆ రోజులే వేరు!

అన్నయ్య పెళ్ళి నిశ్చయమవడంతో, ఊరందరిని పిలిచి పెళ్ళి ఘనంగా జరిపించాం! శృతిమించి ఖర్చుపెట్టడం వల్ల తీసుకున్న కట్నం కన్నా అప్పు ఎక్కువ తేలింది. అదే సమయంలో పాలెగాళ్లు, కౌలుదార్ల మోసం వల్ల ఐదెకరాల వరి చేజారిపోయింది. అప్పుడే తెలిసిన వారి దగ్గర నుండి ఒమాన్‌లో ఉద్యోగం గురించి చెవిన పడింది. అన్నయ్య వెళ్తానంటూ ముందుకు వచ్చినా, పందిరైనా తీయకముందే కొత్త పెళ్లికొడుకుని ఎలా పంపిస్తారంటూ 
నాన్నమ్మ కోప్పడింది. దాంతో నేను ప్రయాణానికి సిద్ధమవ్వాల్సి వచ్చింది!

నేను ఒమాన్ వెళ్లాక, మా ఊరి వాళ్ళు చాలా మంది కరువుకి తాళలేక దుబాయ్, మస్కట్ వెళ్ళారని తెలిసింది. వీధంతా బోసిపోయిందని మిత్రులు ఉత్తరాల్లో రాసే వాళ్ళు. ఇప్పుడు ఎవరెవరు ఎక్కడున్నారో? ఏం చేస్తున్నారో?

ఆలోచనల్లో ఎప్పుడు కునుకు పట్టిందో తెలియదు. ఫ్లైట్ లాండ్ అయ్యేటప్పుడు ఆ కుదుపులకు మెలుకువ వచ్చింది. భారత్‌లో అడుగుపెట్టానని గుర్తొచ్చి మనసు గర్వపడింది. మూడు సంవత్సరాల తరువాత నా దేశంలో నేను అడుగుపెట్టాను. 

నేను ఒమాన్ బయలుదేరే రోజు వచ్చిన వాళ్ళే మళ్ళీ ఇప్పుడు నన్ను రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు. వాళ్ళే మా అన్నయ్య, నా స్నేహితులు. లగేజీ అంతా సుమోలో సర్ది బయలుదేరాం! అస్థవ్యస్తంగా ఉన్న హైదరాబాద్ ట్రాఫిక్‌ను చూస్తుంటే అక్కడి ట్రాఫిక్ గుర్తొచ్చింది. ఎంతటి వారైనా అక్కడ ట్రాఫిక్ రూల్స్‌కి తలొగ్గాల్సిందే! పొరపాటున ఆక్సిడెంట్ అయితే, ఆ బళ్ళు జరపడానికి వీల్లేదు. పోలీస్ వచ్చి తప్పెవరిదో విచారించి, ఫైను రాసి రశీదులిచ్చి వెళ్ళిపోతాడు. రశీదు చూపిస్తేనే రిపేర్ చేస్తారు. ఆ విషయంలో చాలా స్ట్రిక్ట్. ఆ రశీదు పుచ్చుకుని కోర్ట్ కెళ్లి డబ్బులు కట్టి రాల్సి ఉంటుంది. మనలా డబ్బులు నేరుగా పోలీస్‌కే చెల్లించే వీల్లేదు. మార్గం మధ్యలో ఆ దేశ విశేషాలు, వింతలు, నా పని గురించి చెప్పాను.

"మనూళ్ళో ఎలా ఉంది?" అనడిగాను.

"నువ్వెళ్ళినపుడు ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉంది. తేడా ఏం లేదు. దుబాయ్ వెళ్లిన వాళ్లంతా తిరిగి వచ్చేసారు. అక్కడి ప్రభుత్వం తిప్పి పంపించింది. వాళ్ల అప్పులు అలాగే మిగిలిపోయాయి." అన్నాడు అన్నయ్య.

"చెరువు నిండిందా? వర్షాలు పడుతున్నాయా?" అనడిగాను.

"ఈ ఏడు బాగానే ఉంది. వర్షాలు బాగానే పడ్డాయి. చెరువు నిండింది. పంటలు పండుతాయిలే!" అన్నాడు.

నాలుగు గంటల ప్రయాణం తరువాత ఇంటికి చేరుకున్నాను. ఆత్రంగా ఇంట్లోకెళ్తే అమ్మ కనిపించలేదు. నాన్న కూడా లేడు. పొద్దున్నే పొలానికెళ్తే సాయంత్రానికి కానీ రాడు. తాతయ్యను, వదినమ్మను, పలకరించి, యోగక్షేమాలు కనుక్కుని ద్వారం వద్దకు రాగానే అమ్మ ఎదురొచ్చింది. నన్ను చూడగానే చేతిలో ఉన్న కొత్తిమీరకట్టను కింద పారేసి, నన్ను గుండెలకు హత్తుకుని విలపించసాగింది. నా నోటి నుంచి మాట పెగల్లేదు. అమ్మ మూగగా రోదిస్తూనే ఉంది. సంవత్సరాల నాటి వ్యథను, అనురాగ స్మృతులను, ఓదార్పుల ఉప్పెనల భావనలను, మనసు మూగబోయిన వేళ, శరీరాల ఆలింగన స్పర్శతోనే పంచుకున్నాము. చంటిపిల్లలా నా గుండెపై తలవాల్చిన అమ్మకు, నా హృదయం బిగ్గరగా అరుస్తూ చెబుతోంది "నేనొచ్చానమ్మా! నీకోసం వచ్చానమ్మా!" అని. రెండు నిమిషాల పాటు మౌనం రాజ్యమేలింది.

కాసేపటికి తేరుకుని, కన్నీళ్ళని కొంగుతో తుడుచుకుంటూ, "కొత్తిమీర అయిపోతే తీసుకురావడానికి లక్ష్మత్త ఇంటికి వెళ్ళాను. కూర అయిపోవచ్చింది, కాళ్ళూ చేతులు కడుక్కురా, తిందువుగాని, ఆకలేస్తున్నట్టుంది, తొందరగా రా నాన్న!" అంది.

ఇంతలో నేనొచ్చానన్న సంగతి తెలిసి ఒక్కొక్కరు నన్ను చూడటానికి వస్తున్నారు. వాళ్ళని కలుద్దామని వరండాలోకి వస్తుంటే, అమ్మ వారించి "ముందు తిను నాన్న! అందరలాగే వస్తుంటారు. తిన్నాక అందరితో మాట్లాడొచ్చు." అని కూర్చోబెట్టింది. వచ్చిన వాళ్ళలో కొందరు వరండాలోనే ఉండి మాట్లాడిస్తుంటే, మరి కొందరు వంటగదిలోకొచ్చి నన్ను చూసి మాట్లాడిస్తున్నారు. రంగు తేలావని కొందరంటే, లావయ్యావని కొందరంటున్నారు. 
"అంతకు ముందు పంపిన ఫోటోలో కంటే సన్నబడ్డావురా నాన్న!" అని అమ్మ అంది. చీకటి పడే వరకు ఊళ్ళో వాళ్ళు వచ్చి చూసిపోతూ ఉన్నారు. దగ్గరి బంధువులు కూడా వచ్చారు. రాత్రి ఇంట్లో ఉన్న బంధువులతో నా చిన్ననాటి ఙ్ఞాపకాలను నెమరవేస్తూ, నాకు గోరుముద్దలు తినిపించింది అమ్మ. అమ్మ ఒళ్ళో కాసేపు పడుకున్నాను.

-౦-

ఊళ్ళు తిరుగుతూ, బంధువుల ఇళ్ళకు వెళ్లి పలకరిస్తూ, వారికి తెచ్చిన బహుమతులు ఇస్తూ, నా స్నేహితులు పంపిన వస్తువులను, నగదును వాళ్ళ ఇళ్ళకి చేరుస్తూ ఉండేసరికి నెలరోజుల సమయం విష్ణు చక్రంలా గిర్రున తిరిగిపోయింది. నా చేతికున్న బ్రస్‌లెట్, మెడలో గొలుసులు, తీసుకొచ్చిన వస్తువులు చూసి నేను బాగా సంపాదించాననుకున్నారు. కాని అదంతా పరువు కోసమే అని ఎవ్వరికీ తెలియదు. 

పత్రికల్లో రోజూ వార్తలొస్తున్నాయి. రాష్ట్రం విడిపోవాలని, అయితేనే అభివృద్ధి సాధ్యమని! ప్రత్యేక తెలంగాణ కావాలని తెలంగాణ వాసుల ఆరాటం, దానిక్కారణం ఈ ప్రాంతం అభివృద్ధి చెందక పోవడమే! కొత్త రాష్ట్రాల్ని తయారు చేయగలరు కాని నాయకుల్ని కాదుగా! ముందు రాజకీయ నాయకుల్ని మార్చాలి. అవినీతిని అంతమొందించగల చదువుకున్న యువతరన్నే ఎన్నికల్లో నిలబెట్టాలి. అప్పుడే ఏ ప్రాంతమైనా అభివృద్ది చెందుతుంది. మనమందరం సమస్యలకు సరైన పరిష్కారం వెతకుండా ప్రత్యామ్నాయాల్ని వెతుకుతున్నాం! ప్రత్యామ్నాయాల వల్ల పరిష్కారం ఎన్నటికీ లభించదు. 

ఇదే విషయాన్ని అన్నయ్య దగ్గర ప్రస్థావించినప్పుడు "నువ్వు దేశాలు తిరుగుతున్నావు. నీ ప్రపంచం పెద్దదయింది. ఇక్కడి సమస్యలన్ని నీకు చిన్నవిగా కనిపిస్తున్నాయి. కాని ఇక్కడే బతికే వారికి మాత్రమే ఆ సమస్య తీవ్రత అర్థమవుతుంది. నా వేలికి దెబ్బ తగిలితే నీకు నొప్పి ఎలా తెలుస్తుంది?" అన్నాడు. నిజమేనేమో! అనిపించింది.

ప్రక్క రాష్టానికెళ్ళినప్పుడు మన రాష్టం వాడు కనిపిస్తే ఆనందం, వాడిదే ప్రాంతమైనా అభ్యంతరం ఉందదు. పక్కదేశానికెళ్ళినప్పుడు మనదేశం వాడు కనిపిస్తే మహదానందం, వాడిదేభాషైనా సమస్యుండదు. కాని మనూళ్ళో పక్కింటి వాడు కనిపించినా పట్టించుకోం. అదీ మన నైజం! ఇక్కడ తెలంగాణ, సీమ, కోస్తా రాజకీయనాయకలు ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకోవడం చూస్తే చాలా బాధేసింది. అక్కడ నా రూంలో పాకిస్థానీ స్నేహితుడు అలీ, మరో బంగ్లాదేశీయుడు, నేను కలిసిమెలసి ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్లం! నేనొచ్చేసరికి ఆలస్యమవుతుందని, లేటయితే మెస్ మూసేస్తారని, నా ఫుడ్ తెచ్చి రూంలో పెట్టేసేవాడు అలీ. నాకు టైం ఉండదని నా బట్టలు కూడా వాడి బట్టలతో పాటు ఉతికి ఇస్త్రీ చేసేవాడు. కాని ఇక్కడ పాకిస్తాన్ వాడంటే ఐ.ఎస్.ఐ. ఏజెంటేమోని అనుమానం. "తెలుగు సాంగ్స్ ఎమ్.పీ.త్రీ కో కంపల్సరీ లేకే ఆనా" అన్నవాడి తెలుగు అభిమానం ముందు మన నాయకుల అసూయాద్వేషాల మనసులు మేడిపండులా కనిపించాయి. 

సుబ్రహ్మణ్యం గారు అన్నారు ఓసారి, "కులం, మతం, ప్రాంతం.. సమస్యలకు కారణాలైన ఈ మూడింటిని వదిలి బయటకు వచ్చినప్పుడే మనిషికి నిజమైన ఆనందం లభిస్తుంది. ఈ ప్రపంచమంతా నాదే, మనుషులంతా నా వాళ్ళే అనుకునే వారికి ఏ బాధా ఉండదు. చెట్లకు, గాలికి, నీటికి, సమస్త జీవరాశికి లేని ఈ కులమతప్రాంతాల జబ్బు మనకెందుకు?" అని. కులాల చొప్పున, మతాల చొప్పున, భాషల చొప్పున మనల్ని మనం విభజించుకుంటూ పోతుంటే మనిషనే వాడే మిగలడు, మానవత్వం అనే మాటే వినిపించదు. చివరికి "నేను మనిషిని" అని చెప్పుకునే దుస్థితి వస్తుంది. ఒమాన్ వెళ్ళాక నాలో చాలా మార్పొచ్చింది. సుబ్రహ్మణ్యం గారి వ్యాఖ్యల ప్రభావం నాలో చాలా ఉంది.

-౦-

ఇప్పుడు ఊళ్ళో నేను ఎప్పటిలా పాతవాణ్ణయిపోయాను. ఓ సాయంత్రం స్నేహితులందరితో కలిసి చీకటి దారిలో కల్లుబట్టీకి వెళ్ళాను. "తీసుకోరా" అని బలవంతపెట్టినా వద్దని వారించాను. ఆ దేశానికి వెళ్ళగానే నేను తీసుకున్న మొదటి నిర్ణయం మద్యం మానేయడం. సంపాదించడానికొచ్చి, మద్యం మోజులో ఖర్చుపెట్టేసుకుని లబోదిబోమన్న వాళ్ళెందరినో చూశాను. నేనూ అలా కాకూడదనే ఆ నిర్ణయం. అప్పటి నుంచి ఇప్పటి వరకు మందు ముట్టింది లేదు. 

మాటల మధ్యలో గంగాధర్ అన్నాడు, "లవ్ మ్యారేజ్ చేసుకొని తప్పు చేశాననిపిస్తుందిరా మామ! రెండు మూడు లక్షల కట్నం మిస్ అయ్యాను. వాటితో ఏ బిజినెస్ పెట్టుకున్నా సుఖంగా ఉండేవాణ్ణి. అప్పుడేదో తొందరపడి పెళ్ళిచేసుకున్నాను కాని ఇప్పుడు చూడు పరిస్థితి, నలబైవేలు పోసి హోంగార్డుగా చేరాను. వచ్చేది నెలకు మూడువేల చిల్లర. ఇద్దరు పిల్లలు, భార్యని పోషించడానికి అదేమూలకు సరిపోతుంది? అప్పులు చేసి కిరాణా షాపు పెట్టాను, నా భార్య చూసుకుటోంది షాపుని. జీవితంలో ఏదో సాధిద్ధాం అనుకుంటాంగాని ఒక స్టేజ్ దాటాక డబ్బు సంపాదించడం కంటే సాధించేది ఏదీ ఉండదనిపిస్తుందిరా!"

ఎనభైవేలు ఏజెంట్ కిచ్చి దుబాయ్ వెళ్ళొచ్చిన మల్లిగాడు, "నువ్వు ఒమాన్ వెళ్ళి మంచి పని చేశావ్ రా! అయినా కంపెనీలో ఉన్న వాడికి ఏ దేశమైనా ప్రాబ్లం లేదు. నాలా విజిటింగ్ మీద వెళ్ళి సంపాదించుకోవాలనుకున్నోడికే బాధ! మనోళ్ళు అందరూ వచ్చేశారు. వీధంతా కళకళలాడుతోంది. మళ్ళీ అవే ముచ్చట్లు, అదే ఎడ్లబండి!"

"ఇంతకీ చుక్కీ సంగతి చెప్పలేదు. ఎక్కడుంది? కనిపించట్లేదు?" అనడిగాను.

మల్లి, చుక్కీలు చిన్నప్పటినుంచి ఒకర్నొకరు ఎంతగానో ఇష్టపడుతున్నారు.

"బాసరలో ఉంటోంది. పెళ్ళైపోయింది కదా! డబ్బులేదని, వాళ్ల నాన్న పెళ్లికొప్పుకోలేదు. డబ్బు సంపాదించడానికని దుబాయ్ వెళ్తే రెండు నెలల్లోనే వాపసు వచ్చేశాను. ఏజెంట్‌కి పెట్టిన డబ్బులు కూడా సంపాదించలేకపోయాను. అప్పులు మిగిలాయి. దాంతో చుక్కీకి వేరే పెళ్ళి చేశాడు వాళ్ళ నాన్న." మొహంలో ఏ భావం లేకుండా చెప్పాడు మల్లి.

మా ఊళ్ళో ఏ పంటపొలాన్ని అడిగినా చెప్తాయి వారి అన్యోన్నత గురించి. ఏటికలువ గట్టు, రైలుపట్టాల దగ్గరి చెరకు తోట, పెద్దచెరువు కట్ట, పోశవ్వ గుడి పక్కనుండే రాగి చెట్టు, దుబ్బకాడి బావి వారి అనురాగానికి సజీవ సాక్షాలు! 

"ఆ జంటని చూస్తేనే చూడముచ్చటగా ఉంటుంది." అని మా నాన్నమ్మ అనేది.

"ఏరా! అంత బాధని ఎలా దిగమింగుకున్నావు?" తడారిపోయిన గొంతుతో అడిగాను.

కాసేపు మౌనమే వాడి సమాధానమైంది. మెల్లిగా గొంతు పెగుల్చుకుని, "మొదట్లో బాధనిపించింది రా! ఆ తర్వాత అలవాటయిపోయింది. జీవితంలో అనుకున్నవన్నీ జరగవు కదరా!" అని కల్లుసీసా పైకెత్తాడు తడిసిన కళ్లని దాచేందుకు ప్రయత్నిస్తూ!

"ఇప్పుడేం చేస్తున్నావ్? వ్యవసాయమేనా?"

"ఇప్పటికైతే అదే! దుబాయ్ నుంచి వాపసు వచ్చిన వాళ్ళకి జాబ్ ఇప్పిస్తమంటున్నారు కదా! చూడాలి మరి!" అన్నాడు.

ఊళ్ళో సంగతులు మాట్లాడుకుంటూ తిరిగి చీకటి దారిలోనే ఇళ్లకి చేరుకున్నాము.

కంప్యూటర్ ఇన్స్టిట్యూట్‌లో చరాను. ఈ రెండు నెలల్లో సాధ్యమైనంత మేర కంప్యూటర్ పై పరిఙ్ఞానం పెంచుకోవాలి. ఒమాన్ తిరిగి వెళ్లాక అది చాలా ఉపయోగపడుతుంది. కంప్యూటర్ పై అవగాహన ఉంటే పదోన్నతులు సాధించవచ్చు. సుబ్రహ్మణ్యం గారు మాటచ్చారు, "కంప్యూటర్ నాలెడ్జ్ పెంచుకో, ప్రమోషన్‌కి రికమండ్ చేస్తా" అని. అక్కడి కంప్యూటర్‌లతో కుస్తీపట్టీ కాస్త ఙ్ఞానాన్ని సంపాదించాను. దాన్ని ప్పుడు మెరుగు పరుచుకోవాలి.

ఇంతలో దసరా పండగొచ్చింది. మాకు దసరా చాలా పెద్ద పండగ. కొత్త బట్టలు వేసుకుని, ఊళ్లోని అందరం మంగళ వాయిద్యాలతో జంబి చెట్టు వద్దకు వెళ్ళి పూజలు జరిపి, జంబితో పాటు వరి, తొగరు కొమ్మలు తీసుకొచ్చి, హనుమంతుని గుళ్ళో ఉంచి, ఇంటికొచ్చి పెద్దల ఫోటోల చెంత పెట్టి, ఇంట్లో వారి ఆశీర్వాదం తీసుకుని, ఆ తర్వాత అందరిని ఆలింగనం చేసుకుంటూ, "బంగారం (జంబి)" ఇచ్చిపుచ్చుకోవడం సాంప్రదాయం. బద్ధశత్రువులు కూడా ఈ ఒక్కరోజు మిత్రుల్లా కలిసిపోయి బంగారాన్ని ఇచ్చిపుచ్చుకుంటారు. జంబిని బంగారంతో సమానంగా గౌరవిస్తారు, అందుకే బంగారం అనే పిలుస్తారు. ఈ సాంప్రదాయంలో పాలుపంచుకోవడం చాలా ఆనందాన్నిచ్చింది. ఈ సమయంలో ఇక్కడికి రావడం నా అదృష్టం. ఊళ్ళో ఎవరు విదేశాల నుంచి వచ్చినా దసరాను దృష్టిలో ఉంచుకొని, తేదీలు సర్దుబాటు చేసుకుని వస్తారు. ఈ సారి హైదరాబాద్‌లో, ఇందూరు(నిజామాబాద్)లో, పక్క రాష్ట్రాల్లో, విదేశాల్లో, ఎక్కడెక్కడో ఉన్న మా ఊరి వారంతా వచ్చే సరికి పండగకే ఓ కొత్త కళ వచ్చింది. చాలా రోజుల తర్వాత అందరిని చూసేసరికి, నా మనసు ఆనందంతో నిండిపోయింది.

-౦-

ఓ రోజు పేపర్లో ప్రకటనిచ్చారు. గల్ఫ్ భాదితులకి జాబ్ మేళా అని. ఇందూరుకి నా స్నేహితులంతా వెళ్ళారు. కానీ వీరు ఆశించిందొకటి, అక్కడ ఎదురైంది మరొకటి. అంతా రసాభసాగా మారింది. నిరాశగా వెనుదిరిగారు. చివరికి వ్యవసాయమే వారికి దిక్కయింది.
మరికొన్ని రోజుల్లో మా స్నేహితుల్లో ఒకడికి పెళ్ళి నిశ్చయమయింది. పదిరోజుల్లో ముహూర్తం కుదిరింది. వాడి బామ్మ నేడో రేపో అన్నట్టుంది. వీడి పెళ్ళి చూసి ఆనందంగా కళ్లు మూయాలని ఆవిడ చివరి కోరిక. అందుకే ఆ ముహూర్తానికి పెళ్లిచేయాలని నిశ్చయించారు. దాంతో అందరం ఎప్పటిలా పెళ్ళి పనుల్లో తలమునకలయ్యాం. 
పెళ్లిరోజు హీరోల్లా తయారై గత స్మృతులను నెమరువేసుకుంటూ ఘనంగా పెళ్లి జరిపించాం. సాయంత్రం ఆరుగంటలకు ఊళ్ళోని హనుమాన్ మందిర్ దగ్గర మొదలైన బరాత్ (పెళ్ళి జంటని, బ్యాండ్ మేళాల సంగీతపు హోరులో నృత్యాలగంతులేస్తూ స్వాగతించే కార్యక్రమం) ఏడు గంటల పాటు సాగి, పెళ్లి కొడుకు ఇంటి దగ్గర, రాత్రి ఒంటి గంటకు ముగిసింది.

నేనింకో పదిరోజుల్లో ఒమాన్ వెళ్తానన్న సమయంలో, ఇంట్లో అప్పులు ఆ లెక్కల గురించి వాకబు చేశాను. అమ్మ సమాధానంతో బుర్రగిర్రున తిరిగింది. నేనిన్నాళ్లు పంపిన డబ్బుతో ముప్పావు భాగం అప్పైనా తీర్చుంటారు అనుకున్నాను. సగభాగం మాత్రమే తీర్చారట! మిగితా డబ్బు ఇంటి మరమ్మత్తులకి, వదిన ఆసుపత్రి ఖర్చులకి, 
ఇంటి అవసరాలకి, పండగలకి, శుభకార్యాలకి వినియోగమైంది అనడంతో ఒక్కసారిగా అంధఃకారం అలుముకున్నట్టయింది. రాత్రే కాదు మరో మూడు రోజులు నాకు అన్నం సహించలేదు, కంటికి కునుకు రాలేదు. అక్కడ ఉదయం ఆరింటికి బయలుదేరితే, రాత్రి పది దాటాక కాని రూంకొచ్చేవాణ్ణి కాను. వారానికుండే ఒక్కరోజు సెలవు పూర్తిగా పడుకుని విశ్రాంతి తీసుకునేందుకే సరిపోయేది. మరమనిషలా పనిచేస్తూ, భావోద్వేగాలను తుంగలో తొక్కి, గుండెను రాయి చేసుకుని, కోరికలను అదుపులో పెట్టుకుని, పైసా పైసా కూడబెట్టి పంపించిన డబ్బుని ఇలా ఖర్చు చేస్తారని కల్లో కూడా ఊహించలేదు!

-౦-

ఇక్కడికొచ్చిన ఈ మూడునెలల్లో ఎంతో ఆనందాన్ని మూటగట్టుకుని, ఆ స్మృతులను మరో మూడు సంవత్సరాలు నెమరు వేసుకుంటూ గడుపుదామనుకున్నాను. కానీ ఇక్కడి ఇంట్లో పరిస్థితులు, స్నేహితుల వెతలు, రాజకీయ వాతావరణం నన్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. అంతా అన్యమనస్కంగా ఉంది. 

మూణ్ణెలలు చూస్తుండగానే గడిచిపోయాయి. ఇంట్లో వాళ్ళ దగ్గర, ఆప్తుల వద్ద కన్నీటి వీడ్కోలు తీసుకుని అన్నయ్యతో సహా ఎయిర్ పోర్ట్‌కి చేరుకున్నాన. ఈసారి స్నేహితులు రాలేదు. ఇంట్లో వాళ్లకి, బంధువులకి, స్నేహితులకి బహుమతుల కోసం అనవసరంగా వేలకువేలు తగలేసానని నామీద కోపంగా ఉన్నారు.
నిజమే! ఆ డబ్బుతో ఇప్పుడున్న అప్పులో సగభాగమైనా తీర్చేవాణ్ణి. ఇక్కడి పరిస్థితులు తెలియక గొప్పలకు పోయాను. నేను కూడా మేడిపండునేమో!

అన్నయ్య దగ్గర వీడ్కోలు తీసుకుని చెకింగ్ దాటి లగేజ్‌తో మెల్లిగా వెళ్తున్నాను. మనసంతా ఏవో ఆలోచనలు. మరో మూడు సంవత్సరాలు అక్కడే ఉండాలని మొదట అనుకన్నా, ఇప్పుడు ఆరు సంవత్సరాలైనా ఉండాలని నిశ్చయించుకున్నాను. అప్పటి వరకైనా నా ఇంట్లో, నా ఊళ్ళో, నా రాష్ట్రంలో అనుకూల వాతావరణం ఏర్పడుతుందన్న ఆశ! ఆ తర్వాత, అక్కడ సంపాదించిన డబ్బుతో తిరిగి వచ్చ నిరుద్యోగ గ్రామీణ యువత కోసం ఏదైనా ప్రణాళికాబద్ధంగా మొదలుపెట్టాలని నా ఆలోచన. నా ఆలోచనల్లోంచి బయటకొచ్చి ఫ్లైట్ ఎక్కాను. సీట్లో కూర్చున్నాక గుర్తొచ్చింది, ఈ టెన్షన్‌లో పడి అలీ గాడి తెలుగు సాంగ్స్ సి.డి. మర్చిపోయానని! అమ్మ చేతి లడ్డూలతో వాణ్ణి బుజ్జగించొచ్చని సమాధాన పరచుకుని ఊపిరి పీల్చుకున్నాను. ఫ్లైట్ మెల్లిగా నింగికెగిరింది. మళ్లీ ఆరేళ్ల వరకు ఈ నేలని చూడలేనన్న ఉద్విగ్నభరిత మనసుతో, కంటికి దూరమవుతున్న నా దేశాన్ని మేఘాలపై నుంచి చూస్తూ కన్నీటి వీడ్కోలిచ్చాను.

- అయిపోయింది -





ఆష్టా చమ్మా - చిత్రం సమీక్ష

ఇదొక మంచి చిత్రం..
మిమ్మల్ని మీరు మైమరచిపోతూ ఈ చిత్రాన్ని చూస్తారు..
సకుటుంబ సపరివార సమేతంగా, విసుక్కోకుండా ఈ చిత్రాన్ని చూడోచ్చు..
కొత్త మాటలు, ముచ్చటైన చిత్రీకరణ, వినసొంపైన పాటలు, నటీనటులందరి అద్భుతమైన నటన .. అన్నీ కలిసిన అష్టా చమ్మా ..

నా సలహా : తప్పక చూడండి.