నా మూడవ కథ - మమతల వనం

మమతల వనం
- అరుణ్ కుమార్ ఆలూరి


అత్యద్భుతమైన శుభముహూర్తాన వధూవరులకి కళ్యాణం జరిగింది. వధువు రాధిక, వరుడు మురళి. శోభన ముహూర్తమే తరువాయి. అది కూడా నిశ్చయమైపోయింది. ఆ శుభఘడియ రానే వచ్చింది. ఆ గదిలో తీపిపదార్థాలు లేవు. మంచం మీద మల్లెపూలు లేవు. నిత్యజీవితంలో ఎదురుపడే సాధారణ పడలగదిలా ఉంది. దోమలు కుట్టకుండా ఆలవుట్ వేసుంది. రెండు అగరొత్తులు మాత్రం సువాసనలు వెదజల్లుతూ కాలుతున్నాయి.


గదిలోకి అడుగు పెట్టింది రాధిక. తలుపు గడియవేసింది. ఆమె చేతిలో పాల గ్లాసు లేదు. గదిలోకైతే వచ్చింది కాని అక్కడి నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది. తల దించుకునే ఉంది.


'అతను నన్ను చూశాడా? చూడలేదా? చూసేవరకు ఇలాగే నిలబడలా? చూసినా చూడనట్టు నటిస్తున్నాడా?' అంటూ రాధిక మనసు పరిపరి విధమైన ఆలోచనలతో సతమతమైపోతున్నది. రాధిక రాగానే మురళి చూశాడు. కానీ ఆమె అక్కడే ఎందుకు నిలబడిపోయిందో అతనికి అర్థం కావడం లేదు.


'ఇలా రా!' అని అందామా? వద్దా? అని ఆలోచిస్తున్నాడు. చివరికి "హాయ్" అన్నాడు. కాని ఆమె నుండి ఏ స్పందనా రాలేదు. అలాగే తలవంచి నేలకేసి చూస్తోంది. అతను పిలిచిన పదం గొంతు దాటి రాలేదు. అతనికున్న కంగారుకి మాట గొంతు లోపలే ఇరుక్కు పోయింది. మొదటిసారి మొహమాటం అంటే ఏంటో అర్థమవుతోంది
మురళికి. విక్స్‌బిళ్ల యాడ్‌లోలాగా గొంతు సవరించుకున్నాడు.


ఆ చిరు అలికిడికి ఆమె తల అలాగే ఉంచి కళ్లని మాత్రం నెమ్మదిగా పైకెత్తసాగింది. మురళి ఆమె కళ్లనే చూస్తున్నాడు. ఆమె తన కంటి చూపును నేలపైనుంచి అలా పైకి సారిస్తూ, మంచంవైపు కదుపుతూ మురళి పాదాల చెంత చూపుని కేంద్రీకరించింది. పాదాలకు ఉన్న గోరింటాకు వల్ల అవి ఎంతో అందంగా కనిపిస్తున్నాయి. కంటిచూపుని మరికాస్త పైకి సారించింది. పట్టు ధోవతి మెరిసిపోతోంది. వంకర టింకరగా ధోవతి కట్టుకున్నట్టు స్పష్టంగా అర్దమవుతోంది రాధికకు. అతనికి కట్టుకోవడం రాదని గుర్తొచ్చి కిసుక్కున నవ్వింది. ఆ నవ్వు మురళిలో ఆందోళన పెంచింది. 'ఎందుకు నవ్వింది? ఏమన్నా బాలేదా?' అనుకుంటూ ఆపదమస్తకం చూసుకున్నాడు. 'అన్నీ బాగానే ఉన్నాయే!' అనుకున్నాడు.
ఆమె తన కళ్లని మరికాస్త పైకి లేపి చూసింది. పట్టు చొక్కా గోరింటాకు పండిన చేతులు, చేతికి బ్రాస్‌లెట్, చేతి వేళ్లకి ఉంగరాలు. చూపుని మరికాస్త పైకనడానికి వీలుకావట్లేదు. లాభం లేదని తలనే నెమ్మదిగా పైకెత్తింది. అప్పటి వరకు రాధికను చూస్తున్న మురళి వెంటనే చూపుని మరల్చాడు. అతని ముగ్ధమనోహర రూపం రాధిక మనస్సుని దోచేసింది. పెళ్లి హడావిడిలో పడి పక్కనే ఉన్నా అతన్ని సరిగ్గా చూడలేకపోయానని చాలా బాధపడింది. ఇప్పుడా కోరిక తీరినందుకు ఎంతో ఆనందంతో ఆమె మొహం మిరుమిట్లు గొలుపుతోంది. అతడి ఛాయా చిత్రాన్ని అలాగే తన మనో:ఫలకంపై ముద్రించింది. అంతటి అందగాడు తన భర్త కావడం అదృష్టం అని మురిసిపోయింది. క్షణమొక యుగంలా గడుస్తోంది అక్కడి సమయం.


అతను గదిని ఆసాంతం పరిశీలిస్తూ చూపుని రాధికవైపు మరల్చగానే, రాధిక అప్పుడు ఆ గదిని పరిశీలించడం మొదలుపెట్టింది. అలా ఒకరి చూపును ఒకరు తప్పించుకుంటూ దిక్కులు చూస్తున్నారు. మన్మథుడు బాణం వేశాడో, ఏదన్నా అద్భుతం జరిగిందో తెలియదు కాని, ఇద్దరి చూపులు ఒకదాన్నొకటి ఢీకొని కౌగిలించుకున్నాయి. ఒకరి కళ్లలోకి మరొకరు అలాగే చూసుకున్నారు. వెంటనే తేరుకుని చిరునవ్వులని విసురుకున్నారు. అతను నవ్వుతుంటే ఆ నవ్వుని అంత దూరం నుంచి ఆస్వాదిస్తున్నందుకు తనను తానే దూషించుకుంది. మురళి "హాయ్" అన్నాడు కాస్త బిగ్గరగా. అది రాధిక చెవి దాకా స్పష్టంగా చేరలేదు. ఏదో చప్పుడైనట్టు అనిపించి అప్రయత్నంగా "ఆ.." అంది. ముచ్చటగా మూడోసారి గొంతు ధ్వని పెంచి "హాయ్" చెప్పాడు మురళి.


చిరునవ్వుల్ని చిందిస్తూ "హాయ్" అంది రాధిక. ఆ నవ్వులో ఆమె పలువరుసలు ఎంతందంగా ఉన్నాయో! ఎర్రటి దొండపండులాంటి పెదాల మధ్య తెల్లటి పలువరుస , కళ్ళలో మన:స్ఫూర్తిగా నవ్వుతున్న కాంతి, సిందూర వర్ణమైన బుగ్గలు, వాటి మీద పడిన సొట్టలు, ఎనిమిదో వింత చూస్తున్నట్టుగా ఉంది మురళికి. కన్నార్పకుండా ఆ నవ్వే మోముని అలాగే చూడసాగాడు. తేరుకొని మురళి కూడా నవ్వి "ఇలా రా!" అంటూ తన పక్కన కూర్చోమన్నట్టుగా చేతిని చూపిస్తూ, కళ్లతో సైగ చేశాడు.


అప్పుడు కదిలింది పాదం. పట్టీల శబ్బ్దాలు ఘల్లున సవ్వడి చేస్తూ శ్రవణానందకరంగా స్వాగతం పలుకుతోంటే, గాజుల చప్పుళ్ళు పట్టీల శబ్దానికి వినసొంపుగా తాళం వేస్తుంటే, లయబద్ధంగా ఒక్కో అడుగు ముందుకేస్తూ నడుస్తోంది. రాధికని ఆపాదమస్తకం గమనించసాగాడు. నిండుపున్నమి వెన్నెలలా కాంతులీనుతున్న మోము, లేత గులాబి పట్టు చీరలో సన్నటి నడుము, దానిపై వడ్డాణం, అందమైన మెడ, ఆ అందాన్నిచ్చే తాళిబొట్టు దానికి తోడు మరిన్ని పసిడిగొలుసులు. వాహ్! బాపు బొమ్మ కదిలొస్తున్నట్టుగా ఉంది మురళికి. తను దగ్గరవుతున్న కొద్ది ఆమె జడలోని మల్లెపూల మకరందం మనసులో కోరికలను రెచ్చగొడుతున్నాయి. మల్లెపూవు మాధుర్యం విలువెంతో అప్పుడు తెలిసొచ్చిందతనికి.


రాధిక వచ్చి మురళి పక్కన ఇటు దగ్గర, అటు దూరం అనలేని ప్రాంతంలో మంచంపై కూర్చుంది. అంత అందాన్ని అంత దగ్గర నుండి చూడటనికి అతనికి రెండు కళ్లూ చాలడం లేదు.

'ఇప్పుడేం చేయాలి?' ఇద్దరి మనసుల్లో మెదులుతున్న ప్రశ్న. మళ్లీ అదే నిశ్శబ్దం, అదే దిక్కులు చూడటం.


ఏదో గుర్తొచ్చినట్టు మొహం పెట్టి మళ్లీ వెంటనే ఏదో మరచిపోయినట్టు ముఖకవళికలు మార్చి చటుక్కున లేచి నిలబడింది. మురళి కూడా అప్రయత్నంగా లేచాడు. అప్పుడు రాధిక వంగి మురళి పాదాలను తాకుతూ ఆశీర్వాదం కోసం ఎదురుచూస్తోంది. రాధిక వేళ్లు మురళి పాదాలను తాకగానే ఒక్క గెంతులో వెనక్కి దుమికి "ఏంటది?" అన్నాడు.


తెలిసి అడొగాడో తెలుసుకుందామని అడొగాడో అర్థం అవక లేచి నిలబడి అతన్నే ఆశ్చర్యంగా చూడసాగింది. "నాకిలాంటివన్నీ నచ్చవు" మెల్లిగా చిరునవ్వులు ఒలకబోస్తూ చెప్పాడు మురళి.

"భర్త దేవునితో సమానం అన్నారు. అందుకే మీ ఆశీర్వాదం కోసం.. " అంది రాధిక.

"ఎవరు చెప్పారు?" అడిగాడు మురళి.

"పంతులు గారు చెప్పారు!" అమాయకంగా బదులిచ్చింది రాధిక.

"మనిద్దరం దాదాపు ఒకే వయసు వాళ్లం. అలాంటప్పుడు నువ్వు నా పాదాలకి నమస్కరించడం..?"

"భర్త పాదాలకు నమస్కరిస్తే భార్యకు శుభప్రదం. పొద్దున లేవగానే ఆ పాదాలకు నమస్కరిస్తే అంతకంటే పుణ్యం మరొకటుండదంటా!"

ఆమె అమాయకత్వానికి మురళికి నవ్వొచ్చింది. "దీవించండి" బతిమాలుతున్నట్టుగా అడిగింది రాధిక.

"కానీ, ఏమని దీవించాలో నాకు తెలియదు" అన్నాడు మురళి.

"మీ ఇష్టం! ఏదో ఒకటి అనండి. ప్లీజ్" అని మళ్లీ అతని పాదాలు నమస్కరించింది.

"శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు" అన్నాడు.

కిసుక్కున నవ్వి, " నాకు ఆల్‌రెడీ పెళ్లైందండి. అదీ మీతోనే!" తల పైకెత్తి మురళి కళ్లలోకి సూటిగా చూస్తూ కొంటెగా అంది రాధిక.

"సారీ! శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తూ" అన్నాడు.

"అమ్మాయిలంటే ఇష్టం లేదా? అబ్బాయే కావాలా?" అలాగే ఉండి అంది.

"అలాంటిదేం లేదు! నోట్లోంచి అలా వచ్చేసిందంతే! నువ్వు ముందులేచి అక్కడ కూర్చో" అన్నాడు.

ఆమెది అమాయకత్వమో, గడుసుతనమో అర్థం కాలేదు అతనికి. రాధిక మంచంపై కూర్చోగానే అతనూ కూర్చున్నాడు. "నీకు.." అంటూ ఇద్దరూ ఒకేసారి ఏదో అడగబోయి ఆగిపోయారు.

"మీరు చెప్పండి" అంది రాధిక.

"ఫర్వాలేదు, నువ్వు చెప్పు" అన్నాడు మురళి.

"మీరు చెప్పాక చెప్తాను. మీరు చెప్పండి"

"నీకేదంటే ఇష్టం"

"అంటే?"

"అంటే..! ఎందులో అయినా సరే ఏదంటే ఇష్టం? ఇ మీన్ టు సే అన్నింట్లోనూ నీ ఇష్టాలేంటో చెప్పు" అన్నాడు.

"అమ్మ, శైలజ.., జాంపండు.., టమాటా ఫ్రై.., హృతిక్‌రోషన్.., తెలుపు రంగు.., మావూరు.., ఇంకా.. మీరు" అంది తలదించుకొని సిగ్గుపడుతూ! "ఇంకా.. మీరు" అన్న పదం మురళి మనసులో గింగిర్లు తిరుగుతోంది! ఇప్పటి వరకు తనతో చాలామంది అమ్మాయిలు "నువ్వంటే ఇష్టం" అని చెప్పారు, కాని వాటిల్లో ఎందులోను లేని అద్భుతమైన భావనా, ప్రేమ రాధిక గొంతులో ఆమె మాటల్లో కన్పించాయి. ఆనందం వల్లో, సిగ్గువల్లో మురళి నవ్వుతూ ఆమెని చూస్తున్నాడు. అతని చూపు ఆమె చేతుల దగ్గర ఆగిపోయింది. తెల్లని చేతులకు అందంగా వేయబడిన గోరింటాకు ఎర్రగా పండి ఎంతో అందాన్నిస్తుండగా, ఆమె చేతి గాజులు, ఆ చేతులకు మరింత శోభను చేకూర్చాయి.


"మీకేవంటే ఇష్టం" సన్నగా అడిగింది రాధిక.

"అమ్మానాన్న.., ఇల్లు.., పొలాలు.., గుత్తొంకాయకూర.., బాపు బొమ్మలు.., వారపత్రికలు."

"అంటే.. నేనంటే ఇష్టం లేదా?" మెల్లిగా అడిగింది.

"ఇష్టపడకుండానే పెళ్లి చేసుకున్నానా?" కొంటెగా చెప్పాడు మురళి.

'అలాంటప్పుడు ఆ మాటేదో నోటితో - నువ్వంటే ఇష్టం అని చెప్తే ఎంత సంతోషించేదాన్ని! అయినా ఈ మగాళ్ళంతా ఇంతే ఓ పట్టాన బయటపడరు' అనుకుంది.

"పడుకుందామా! బాగా అలసిపోయాను. నిద్దరొస్తుంది!" అడిగింది రాధిక.

అమాయకంగా ఆదిగేసరికి కాదనలేక నవ్వుతూ తలూపాడు మురళి. అలా ముగిసింది వారి తొలిరేయి.


***


రెండోరోజు రాత్రి మురళి తన మనసులో మాటని చెప్పాలని నిశ్చయించుకున్నాడు. రాధిక కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు. ఇంతలో తను వచ్చి మురళి పక్కన కూర్చుంది.

"టమాట ఫ్రై తిన్నారా?" అడిగింది రాధిక.

"ఊ" సమాధానమిచ్చాడు మురళి.

"ఎలా ఉంది?"

"బావుంది"

"నిజంగా?"

"అవును"

"నేనే వండాను. అమ్మ వద్దన్నా వినకుండా వండాను. మీకు నచ్చుతుందో లేదో అని ఎంత టెన్షన్ పడ్డానో!" సిగ్గుపడుతూ అమాయకంగా చెప్పింది. ఆ అమాయకత్వానికి మురళికి ముచ్చటేసి తన నుదిటిపై ఓ ముద్దు ఇవ్వాలనుకున్నాడు, కాని తను చెప్పవలసిన విషయం గుర్తొచ్చి అలాగే ఉండిపోయాడు.

"నీ దృష్టిలో శృంగారం అంటే ఏంటి?" అడిగాడు మురళి. కుండబద్దలు కొట్టినట్టు మొహంమీదే ఆడిగేసరికి ఆశ్చర్యపోయింది రాధిక. మెందుకు అడుగుతున్నాడో అర్థం అవక అలాగే చూస్తుండిపోయింది.

"శృంగారం అనేది శరీరానికి సంబంధించిందా? లేక మనసుకు సంబంధించిందా?" అడిగాడు మురళి.

"రెండింటికి సంబంధించింది"

"గుడ్..కానీ మనసులు కలుసుకోకుండా శరీరాలు ఒకటైతే అది శృంగారం ఎలా అవుతుంది?"

"అఫ్‌కోర్స్"

"మొన్నటి వరకు నువ్వెవరో? నేనెవరో? ఇప్పుడు పెళ్లైంది కదా అని మన శరీరాలు కలిస్తే దాన్ని శృంగారం అంటారా? ఒకర్నొకరం అర్థం చేసుకునే వ్యవధి లేకుండా ముహూర్థాలు కుదిరాయి"

మధ్యలోనే రాధిక "ఉన్న వారం రూజులైనా మీతో ఫోన్లో మాట్లాడాలని ఎంతో ప్రయత్నించాను! ఎప్పుడు ఫోన్ చేసినా పనిలో ఉన్నాను అనేవారు" అంది.


"అందుకే ఇప్పుడు అర్థం చేసుకుందాం! ఒకర్నొకరు పరిపూర్ణంగా తెలుసుకుందాం! అయినా వారం రోజుల్లో పెళ్ళి అంటే నాకెన్ని పనులుంటాయి? ఎంత హడావిడి ఉంటుంది! ఒకవేళ ఈ వారం రోజుల్లో మనం మాట్లాడుకున్నా ఒకర్నొకరం పూర్తిగా అర్థం చేసుకునేవాళ్లమా? అందుకే ముందు మన మనసులు ఒకటయ్యాకే మన శోభనం జరగాలి అని నేననుకుంటున్నాను. నువ్వేమంటావ్?"


'నువ్వేమంటావ్ అని అడిగారు, అదే పదివేలు. అర్థాంగి అభిప్రాయం తెలుసుకోవాలన్న సంస్కారం మీకుండటం, మీలాంటి భర్త నాకు దొరకడం, నా అదృష్టం' అనుకుంది మనసులో! ఏ విధంగా ఆలోచించినా మురళి చెప్పింది అన్ని విధాలా శ్రేయస్కరం అనిపించింది రాధికకి. "నాకు చాలా సంతోషంగా ఉందండి! ఆ మాట నేనే చెబుదామనుకున్నాను. ఫోటోలు చూసుకొని పెళ్లి చేసుకున్నాం, పెళ్లిలోనే ఒకర్నొకరం చూసుకున్నాం! సడన్‌గా శోభనం అంటే నాకు చాలా ఎంబారిసింగా అనిపించింది. ఫస్ట్ టైం కదా!" అని నాలుక కరుచుకుంది.


"నాకు మాత్రం పదోదా మరి" మధ్యలో అన్నాడు మురళి.


ఒక్కసారిగా షాక్ అయింది రాధిక, ఆ తర్వాత తేరుకొని మురళి చిలిపితనానికి నవ్వింది. ఆ నవ్వుతో మురళి నవ్వు కూడా పాలుపంచుకుంది.


"అన్నట్టు మనం రేపే బయలుదేరాలి! రేపటితో నా లీవ్స్ అయిపోయాయి. ఆఫీస్‌లో రిపోర్ట్ చేయాలి!"

"అలాగే! అత్తయ్యా మామయ్యా కూడా వస్తున్నారా? తీరిగ్గా వస్తారా?"

"రావట్లేదు! అక్కడ ఉండేది మనమిద్దరమే!"

"మీరెళ్లిపోయాక నేనొక్కదాన్నే సాయంత్రం వరకు ఉండాలంటే బోరొస్తుందేమో!"

"బోరొస్తే బిందెతో నీళ్లు పట్టు!"

గలగలా నవ్వింది రాధిక.

"టీవీ చూడు. వీక్లీ చదువు. ఇంటి పక్కనుండే నిరంజన్ వైఫ్ నీ కోసం ఎదురుచూస్తోంది, తను కూడా సాయంత్రం వరకు ఒంటరిగానే ఉండాలి కదా! ఇప్పట్నుంచి నీకు బెస్ట్ కంపెనీ ఇస్తుంది!"

"ఏ కంపెనీ! విప్రోనా? ఇన్ఫోసిసా?" అంది రాధిక.

ఆశ్చర్యపోవడం మురళి వంతైంది. "యూ నాటీ!" అన్నాడు. నవ్వు మాత్రం ఇద్దరి పెదాలపై నుండి ప్రవహిస్తూనే ఉంది!


***


ఓ చల్లటి సాయంకాలం రెండో ఆట సినిమాకెళ్లి తిరిగొస్తున్నారు. అర్థరాత్రి, పైగా బైక్‌పై ప్రయాణం, అందునా అది చలికాలం! చలికి గజగజా వణుకుతూ మురళిని గాఢంగా కౌగిలించుకుంది రాధిక. మురళి నరాలు జివ్వుమన్నాయి. గుండె వేగం పెరిగిపోయింది. ఒకవైపు చల్లటిగాలి, మరోవైపు వెచ్చటి కౌగిలి. ఇంతకంటే రొమాంటిక్ సీన్ ఇంకోటుండదేమో అనుకున్నాడు. ఇంతలో మెరుపులాంటి అళొచన వచ్చింది మురళికి. బైకు స్పీడుని కాస్త పెంచాడు. దాంతో రాధికకు చలి కాస్త ఎక్కువనిపించింది. శ్రీవారి చిలిపితనాన్ని అర్థం చేసుకొని, మనసులోనే నవ్వుకొని, మురళికి మరికాస్త దగ్గరగా జరిగి, మరింత గాఢంగా కౌగిలించుకుంది. మురళి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఇరువురి శరీరాలు వేడెక్కాయి. ఆ వేడిని చలిగాలి సైతం చల్లార్చలేకుండా పోయింది. వారిపై వెన్నెల వెలుతురు వెండిపోత పోసినట్టుగా పరుచుకుంది. నిర్మానుష్యమైన రోడ్డుపై వెన్నెల వెలుతురులో మెరిసిపోతున్న ఆ జంటను చూసి చందమామ సైతం సిగ్గుపడ్డట్టున్నాడు, ఓ మబ్బుచాటుకు వెళ్ళిపోయాడు. ఆ అనుభూతిని అలాగే ఒడిసిపడుతూ బైక్‌ని ఇంటివైపు పరుగెత్తించాడు మురళి.


రాధికకు ఆ రాత్రి నిద్రాదేవి కరుణించలేదు. ఆ మధుర భావనలోనే మునిగిపోయింది. కానీ మరోవైపు దిగులు కూడా పట్టుకుంది. తను మురళిని అర్థం చేసుకుంది. ఇప్పుడు పరిపూర్ణంగా ప్రేమిస్తోంది. కాని మురళి తనను ప్రేమించడానికి ఇంకా ఎన్ని రోజులు? ఆ దిగులే ఆమెని వేధిస్తోంది. ఒక వేళ తను మురళికి ఏ కారణం చేతైనా నచ్చకపోతే..! ఆ ఊహకే గుండె ఆగినంత పనయింది. అలా జరక్కూడదనుకుంటూ బలవంతంగా నిద్రలోకి జారుకుంది.


***


మరో రాత్రి.. ఒకరు ఉత్తరం వైపు, మరొకరు దక్షిణం వైపు తిరిగి పడుకున్నారు. ఇద్దరూ మగత నిద్రలోనే ఉన్నారు. ఒకేసారి ఇద్దరూ దిక్కులు మార్చి తిరిగేసరికి వారి ఆకారాలు ఎదురెదురయ్యాయి. ఇరువురి పెదాలు స్పర్శించుకున్నాయి. మురళి పెదవుల మధ్యనున్న లోతట్టు ప్రాంతంలో, రాధిక పై పెదవి సర్దుకుంది. ఒకరి ఊపిరి మరొకరిని తాకి గిలిగింతలు పెడ్తోంది. మెత్తటి పెదాలు మరో మెత్తటి పెదాల్ని అలాగే స్పర్శిస్తున్నాయి. ఇద్దరికీ రసానుభుతి కలుగుతున్నా, నిద్రని నటిస్తున్నారు. ఆ మధురానుభుతిని మనఃస్ఫూర్తిగా అనుభవిస్తున్నారు. క్షణాలు నిమిషాలై దొర్లిపోతున్నాయి. మొహమాటం వీడి, చొరవ తీసుకోవాలని మురళి నిర్ణయించుకొని, ఆమె పెదాల్ని తన పెదాలతో అల్లుకునేందుకు ప్రయత్నించే క్షణంలో, రాధిక ఆ వైపు తిరిగింది. మనసులోనే నిట్టూర్చి నిద్రకుపక్రమించాడు మురళి.


***


రోజూ వాళ్ల గురించి, వాళ్ల చిన్ననాటి సంఘటనల గురించి మాట్లాడుకుంటూ ఒకరి భావాల్ని ఒకరు అర్థం చేసుకుంటూ గౌరవించుకుంటూ, అలాగే నిద్దరోతున్నారు. రాధిక నిద్రలోకి జారుకున్నాక, ఆమె మొహాన్ని చూడటం మురళికి అలవాటయింది. ఒక్కోసారి పడుకున్నట్టు నటించి, వెంటనే కళ్లు తెరిచేది రాధిక. దొరికిపోయిన దొంగలా చటుక్కున అటుతిరిగి పడుకునేవాడు మురళి. పొద్దున లేవగానే మురళిని తనివితీరా చూసి అతని పాదాలకు నమస్కరించడం రాధికకు అలవాటుగా మారింది.


ఒకరినొకరు పరిపూర్ణంగా అర్థం చేసుకున్నారు. ఒకర్నొకరు మనఃస్ఫూర్తిగా ప్రేమిస్తున్నారు. కానీ ఆ విషయం మాత్రం పెదవిదాటి బయటపడటం లేదు. 'ముందు నేనే ఎందుకు చెప్పాలి?' అన్న చిన్న ఇగో ఫీలింగ్ ఇద్దరిని బాధిస్తోంది. రోజూ ఒంటరిగా పడుకోవడం ఇద్దరికీ చాలా ఇబ్బందిగా ఉంది. భర్తగా మురళి, ఆశించినదానికంటే ఎక్కువ ప్రేమగానే చూసుకుంటున్నాడు. ఆ ప్రేమను దుర్వినియోగం చేయకుండా కాపాడుకుంటూ తనూ జాగ్రత్తగానే మసలుకుంటోంది.


ఇంతలో ఫిబ్రవరి 14, ప్రేమికులరోజు దగ్గరపడుతోంది. ఆ రోజుకున్న మహత్యమో, లేక విరహవేదనను భరించలేని ఒంటరితనెమో, 'నేనే ఎందుకు చెప్పాలి?' అనుకున్న రాధికని 'నేనే చెప్తే తప్పేంటి? ప్రేమించేది మా ఆయన్నే కదా!' అనుకునే స్థాయికి తీసుకొచ్చింది. తన మనసులోని ప్రేమని తెలియచెప్పేందుకు అదే తగిన సమయమని నిర్ణయించుకుంది. ఆ రోజు రానే వచ్చింది. ఉదయం మురళి ఆఫీసుకు వెళ్లేంతవరకు ఏమి ఎరుగని దానిలా ఉండిపోయి, సాయంత్రం తెల్లచీర కట్టుకుని, మల్లెపూలు పెట్టుకుని మురళి కోసం ఎదురుచూడసాగింది.

కాలింగ్ బెల్ మోగింది.

ఆత్రంగా వెళ్లి తలుపు తీస్తే నిరాశే ఎదురైంది. కొరియర్ బాయ్ వచ్చి ఏదో గిఫ్ట్ బాక్స్ ఇచ్చి వెళ్లాడు. దాన్ని అలాగే సోఫాలో పారేసి, తను అల్లిన కర్చీఫ్ వంక చూడసాగింది. తన మనసులోని మాటని ఖర్చీఫ్‌పై 'ఐ ఎల్ యు' అని ఎంబైడరీ చేసింది. ఓ గ్రీటింగ్ కార్డ్ కూడా తయారుచేసింది. ఇంతలో మురళి వచ్చాడు. తెల్లచీరలో మల్లెపూలు పెట్టుకున్న రాధికని చూసి ఆశ్చర్యపోయాడు. రాధికకు దగ్గరగా వఆడు. రాధిక సంతోషంతో ఖర్చీఫ్‌ని మురళికి అందివ్వబోగా మురళి అది గమనించకుండా, సోఫాపై ఉన్న బాక్స్‌ని చూశాడు.

"ఏంటది? ఓపెన్ చేయలేదా?" అనడిగాడు.

"మీకొచ్చిందని, ఓపెన్ చేస్తే బాగోదని" అంది.

తనలో తానే తిట్టుకున్నాడు మురళి. ఆ బాక్స్‌పై పొరపాటున తన పేరే రాసి కొరియర్ చేశాడు. అందులో ఓ తెల్లచీర, మల్లెపూలు, ఓ గ్రీటింగ్‌కార్డ్ ఉన్నాయి. తన ప్రేమని అలా తెలియజెప్పాలనుకున్నాడు. ఆ బాక్స్ తీసుకొని రాధికకు ఇచ్చాడు.

"ఇది నీకే! నేనే పంపాను" అన్నాడు.

రాధిక ఆశ్చర్యపోతూ అందుకుని ఖర్చీఫ్‌ని, గ్రీటింగ్‌కార్డ్‌ని మురళి చేతికందించింది. ఖర్చీఫ్ మొత్తం విప్పేసరికి, మురళి కళ్లలో నీళ్ళు తిరిగాయి. ఖర్చీఫ్‌ని ముద్దాడి, అందంగా పెయింట్ వేయబడిన గ్రీటింగ్‌కార్డ్‌ని చూశాడు. ముత్యాల్లాంటి అక్షరాలతో అందమైన కవిత్వం. రాధిక సృజనాత్మకతకి మురళి నిలువెల్లా పరవశించిపోయాడు.


రాధిక బాక్స్‌ని ఓపెన్ చేయగానే మల్లెపూల వాసన గుబాళించింది. పూలు తాజాగా ఉన్నాయి. తెల్లటి పట్టు చీరను తడిమి, గ్రీటింగ్‌కార్డ్‌ని చూసింది. ద బెస్ట్ అండ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్స్ ఇన్ ద వరల్డ్ కెనాట్ బి సీన్ ఆర్ టచ్‌డ్, దె ఆర్ జస్ట్ ఫెల్ట్ విత్ ద హార్ట్ - అవర్ లవ్ ఈస్ వన్ ఎమాంగ్ దెమ్. ఆనందభాష్పాలతో మురళిని హత్తుకుంది.


ఆ క్షణం కోసం నిరీక్షిస్తూ, ఆ క్షణం కోసం దిగులుపడుతూ, ఆ క్షణం కోసం దైవాన్ని వేదుకుంటూ గడిపిన ప్రేమికులు ఆ క్షణం ఎదురయ్యేసరికి, గాఢంగా పెనవేసుకున్న మనసులు గాలిలో తేలుతూ, విశ్వాన్ని జయించిన విజయ గర్వంతో ఓలలాడుతూ, కట్టలు తెంచుకున్న గోదారిలా ఉరకలేస్తూ, ఆనందభాష్పాలు రాలుస్తూ ఒదిగిపోయారు. గాలిదూరే సందులేకుండా అలుముకున్న వారి మనసులు ఆ శుభకార్యానికి ఆ రాత్రే ముహూర్తమని నిర్ణయించాయి.


***


పడకగదిని శుభ్రంగా సర్ది, వాటి మీద మల్లెపూలు చల్లింది రాధిక. ఆఫీసు నుంచి వస్తూ తీసుకొచ్చిన తీపి పదార్థాలను సర్ది, అగరొత్తులు వెలిగించాడు మురళి. ఇద్దరూ తలంటు స్నానం చేశారు. శోభనం నాటి దుస్తులు వేసుకున్నాడు మురళి. తెల్ల పట్టుచీర, మల్లెపూలతో రెడీ అయింది రాధిక. మురళి, రాధిక కోసం శోభనం గదిలో ఎదురుచూస్తూ ఉన్నాడు. రాధిక పాలగ్లాసుతో లోపలికి అడుగుపెట్టింది. ఆమె దగ్గరకు వెళ్లి నడుం మీద చేయి వేశాడు. అతడు చేయి వేసిన ప్రాంతంలో తరంగాలు వేల ప్రకంపనాలుగా మారి మెదడు తీరాలని చేరి మెదడుని మొద్దుబారిపోయేలా చేశాయి. మత్తుగా అతని వంక తల పైకెత్తి చూసింది. మెల్లిగా రాధికను తోడ్కొని, మంచం దగ్గరకు తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. సగం పాలు తాగి, మిగితా సగం గ్లాసు పాలు రాధిక పెదవుల చెంతకు తీసుకెళ్లాడు. రాధిక ఆ పాలు తాగగానే, అవి పై పెదవిని తగిలి మీసకట్టులా కన్పిస్తోంది. రాధికకు దగ్గరగా వెళ్లి, పెదాలతో ఆ మీసకట్టుని తుడిచాడు మురళి. మెదడు పూర్తిగా చలనం లేనిదై అమాంతం అలాగే వెనక్కు వాలిపోయింది రాధిక. అరచేతిని ముద్దుపెట్టుకొని ఆ చేతి ఉంగరాలను తీస్తూ వేలికో ముద్దును బహూకరిస్తున్నాడు. గాజులు, ఉంగరాలు లేని అందమైన చేతులను మళ్లీ ముద్దాడి చూపుని మెడపై సారించాడు. అక్కడ మంగళసూత్రం మినహా అన్ని గొలుసులను రాధిక ఒంటినుండి విడదీస్తూ, గొలుసుకో ముద్దు చొప్పున మెడపై మేడ కట్టాడు. ఆ ముద్దుల వానకి మైకంగా కళ్లు మూసింది రాధిక. అలవాటులేని కొత్తలోకంలోకి వెళ్లిపోయింది. ఆభరణాలన్ని తొలగిస్తూ మురళి కురిపిస్తున్న ముద్దుల వానకి తడిసి ముద్దైపోయింది.


అతడి చూపు ఆమె దుస్తులపై పడింది. ముద్దుల వర్షం మళ్ళీ మొదలైంది. ఆరు నెలల క్రితం జరిగిన తొలిరేయిలో, ఇలాంటి ముద్దును దక్కించుకున్నా, ఇంతటి మాధుర్యం మాత్రం ఉండేది కాదు అనిపించింది రాధికకి. అప్పుడు కొత్తగా పెళ్లైన భార్యాభర్తలు, ఇప్పుడు ఒకర్నొకరు పూర్తిగా అర్థం చేసుకున్న ప్రేమికులు. తేడా లేదూ?


అతని కళ్లలోకి సూటిగా చూడలేక, నవ్వుతూ చెవిని ముద్దాడి, సన్నగా అడిగింది, "మీరిలాగే ఉంటారా?" అని.


ఎక్కడ సిగ్గుపడాలో అక్కడే సిగ్గుపడాలి. అలా అయితేనే ఆ సిగ్గుకి అందం. శుభకార్యంలోనూ సిగ్గుపడితే సంసారాలు సాగుతాయా? దాంపత్య జీవితం ఏ ఒక్కరి కోసమో కాదు కదా! ఇద్దరి ఆనందాల మేళవింపు. ఆ సత్యాన్ని రాధిక గ్రహించినందుకు మురళికి ముచ్చటేసింది. రాధిక పెదాలపై చిన్న ముద్దిచ్చి, ఆమె మాదిరి మారిపోయాడు.


***


ఉదయం లేవగానే మురళిని చూడగానే సిగ్గుతో వణికిపోయింది. మురళి మాత్రం గాఢ నిద్రలో ఉన్నాడు. తన బట్టలు వెతికి పట్టుకొని బాత్రూంలోకి నడిచింది రాధిక. తలంటు స్నానం చేసి టిఫిన్ చేస్తూ ఆలోచించసాగింది. రాత్రి జరిగిందంతా కలా? నిజమా? జరిగిందంతా నిజమే అని తెలుసు అయినా ఓ అందమైన కలలా అన్పిస్తోంది రాధికకు. మురళి పరిస్థితి అలాగే ఉంది. రాధిక కళ్లలోని కళ్లు పెట్టి చూడలేక పోతున్నాడు. టిఫిన్ చేశాక, రాధిక వచ్చి మురళి పక్కన నిలబడింది సిగ్గుపడుతూ.


రాధికని ఆప్యాయంగా కౌగిలించుకుని పెదాలపై తియ్యటి ముద్దిచ్చాడు. "బై" అని చెప్పి కౌగిలివీడి ద్వారం వద్దకు చేరుకున్నాడు. మురళిని కౌగిలించుకునేందుకు రాధిక వచ్చి అతని చెంతకు చేరగానే, అప్పటికి అదే ఆలోచనతో ఉన్న మురళి సరిగ్గా ఆ సమయంలోనే రాధిక కోసం వెనక్కి తిరిగాడు. కళ్ల ముందే రాధిక కనిపించే సరికి ఆశ్చర్యపోయి, బిగి కౌగిలిలో నలిపేస్తూ గాఢంగా చుంబించాడు. ఇంతలో మురళి సెల్ మోగింది. " సారీ అండీ! ఒంట్లో బాలేదు! ఆఫీస్‌కి రావట్లేదు" అని చెప్పి కట్ చేశాడు. పడకగదిలో వారిరువురూ అడుగిడగానే మంచంపై నలిగిపోయి ఉన్న మల్లెపులు, మిగిలిపోయిన తీపి పదార్థాలు, ఖాళీ పాలగ్లాసు వారికి స్వాగతం పలుకుతున్నట్టుగా అగుపించాయి.



- అయిపోయింది -


* ఆంధ్రభూమి సచిత్ర వార పత్రికలో 24-ఏప్రిల్-2008న ప్రచురితం *





5 కామెంట్‌లు:

  1. అరుణ్ గారికి,
    నమస్తే, మీ కథలన్నీ చదివాను. మీరు ప్రతి కథలొనూ వైవిధ్యం చూపేందుకు ప్రయత్నిస్తున్నారు.
    అది నచ్చింది కానీ, త్వరగా మీ నాడి తెలుసుకొని ప్రత్యేక శైలి పట్టుకుంటారని ఆశిస్తాను.
    మీరు నవలలు రాయగలరని అనిపిస్తోంది.
    కథలకు హాస్యం, సామజిక వస్తువులను వాడి, నవలలకు యొద్దనపూడి లా కొద్ది పాళ్ళలో శ్రుంగారం వాడితే విజయం సాధించగలరనిపిస్తోంది.
    మీ మలిసంధ్య కన్నా మమతలవనం సున్నితంగా అర్థవంతంగా ఉన్నట్లనిపించింది.
    పై దారిలో హీరో (అంటే మీరేగా) కన్నా వేరే వారికి (నర్సమ్మ) ఎక్కువ ప్రధాన్యం ఇచ్చారనిపించింది.
    పిల్లి ఫోయి ఎలుక వచ్చె మీకు హాస్యంలో ముందు ముందు మంచి భవిష్యత్తు వుందని చెబుతోంది.
    అభినందనలతో
    మీ మిత్రుడు
    ప్రభాకర్

    రిప్లయితొలగించండి
  2. arun nenu me malisandya chadivanu,appude nenu sariga feedback ivvalenu nenu malli vakkasari chadavali appudu nenu danugurinchi matladagalanu,naration chala bagundi prastutham inthe cheppagalanu k tc bye

    రిప్లయితొలగించండి
  3. excellent.u have got very good writing skills. prathi katha different ga different concepts tho kathaku nyayam chesthunnavu.fantastic

    రిప్లయితొలగించండి
  4. Shruti9/12/2010

    nice one. beautiful and romantic.

    every story is different from each other. i like this one from all of your 6 stories.

    thank you and all the best

    రిప్లయితొలగించండి