రాజు - జోష్ Youth Rockzzz చిత్రం సమీక్ష

ఈ చిత్రానికి శీర్షిక, ఉపశీర్షిక చాలా బాగా సరిపోయాయి. కథ, పాత్రలు, అవి మలచిన తీరు, వారి హావభావాలు.. కొత్తగా,సహజసిద్ధంగా ఉన్నాయి. అందమైన కథని రంగవల్లికంత అందంగా తీర్చి దిద్దారు జోష్ బృందం. నిర్మాత రాజు, దర్శకులు వాసు వర్మ, ఛాయాగ్రాహకులు సమీర్ రెడ్డి, నటులు జె.డి.చక్రవర్తి, ప్రకాశ్ రాజ్, కళా దర్శకులు బ్రహ్మ కడలి, పోరాటాలూ అందించిన విజయ్, అమన్ ఘని నూటికి నూరు శాతం కష్టపడి తమ ప్రతిభని చూపేందుకు ప్రయత్నించారు.. విజయం సాధించారు. ఈ చిత్రం ద్వారా పరిచయమైన నాగ చైతన్య నటనలో ప్రేక్షకులు కాస్త సర్దుకుపోక తప్పదు. మొత్తానికి ఫర్వాలేదు అనిపించాడు. మున్ముందు అతని ప్రతిభ మరింత మెరుగవుతుందని ఈ చిత్రం చూస్తే అర్థమవుతోంది. సందీప్ చౌత సంగీతం, కథానాయిక కార్తీక నటన బాగానే ఉన్నాయి. ఈ చిత్రంలో నటించిన పిల్లల నటన బాగుండి, వారి అమాయకపు మొహాలు మనసుకు హాయిగొల్పుతాయి.

వాసు వర్మ కథ, దర్శకత్వంలలో పూర్తి విజయం సాధించారు.. అయితే మాటలు, కథనం(స్ర్కీన్ ప్లే)లలో కాస్త తడబడ్డట్టు కనిపించింది. వాటిల్లో మరికాస్త శ్రద్ధ వహించి ఉంటే ఈ చిత్రం మరింత శోభాయమానంగా ఉండేది. మాటలల్లో కొన్ని చోట్ల పరిణతి చూపిస్తే, రెండు మూడు చోట్ల చేతులెత్తేసినట్లు, వేరే విషయాలపై దృష్టి కేంద్రీకరించి మాటలకు సడలింపుని ఇచ్చినట్టు కనిపించింది. కథనంలో తడబడటం వల్ల విశ్రాంతి తరువాత ప్రేక్షకులకు ఆవలింతలు వచ్చే అవకాశం కొద్దిగా ఉంది. కథ మొత్తం విశ్రాంతి తరువాతే ఉండటం కూడా చిత్రం అలా రావడనికి కారణమైంది. పాత్రల విషయంలో అతని శ్రద్ధ మంత్ర ముగ్థుల్ని చేస్తుంది. పరిశ్రమకి మరో మంచి దర్శకుడు పరిచయమయ్యాడు అనిపిస్తుంది.

ఒక కళాత్మకమైన చిత్రానికి వాణిజ్య హంగులు అద్ది తీస్తే ఎలా ఉంటుందో చాలా మంది దర్శకులు నిరూపించారు. కాని అలాంటి చిత్రాలను నిర్మించే నిర్మాతలు చాలా తక్కువ. ఆ బాటలోనే పయనిస్తున్న వ్యక్తి రాజు. గత కొన్ని చిత్రాలుగా, తన చిత్రాలు చూడటనికి వచ్చే ప్రేక్షకులకు వినోదంతో పాటు, సందేశం కూడా సున్నితంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు రాజు. చిత్రాలు తీయడంలో తన మనసుని పూర్తిగా లగ్నం చేస్తున్నందుకైనా ఆయన్ని "దిల్" రాజు అనవచ్చు. కేవలం ఒక్క చిత్రాన్ని మాత్రమే విజయవంతం చేసి, మిగితావి విఫలం చేస్తున్న వాళ్లకి అలా పేరు ముందు వాళ్ల చిత్రాన్ని పత్రికల వాళ్లు తగిలిస్తే వాళ్లకీ కాస్త చురక తగిలించినట్లు ఉంటుంది. ప్రతి చిత్రాన్ని ఇంత బాగా తీస్తున్న రాజుకి అలాంటివి అవసరం లేదు అనుకుంట! పైగా మన పరిశ్రమలో అలాంటి పేర్లు ఉన్న నిర్మాతలు పది మంది లేరు, ఉన్న ఆ ఒక్క నిర్మాతకి ఇంటి పేరు ఎలాగో ముందరుంది కాబట్టి ప్రేక్షకులు తికిమక పడే అవకాశమూ లేదు.

రాజు చిత్రాల్లో హాస్యం కోసం పాత్రల్ని అవమానించడం కనిపించదు. కథానాయికల అందాల ఆరబోత ఉండదు. మహిళా ప్రేక్షకులు తలదించుకుని చూసే సన్నివేశాలు ఉండవు. ఇతర చిత్రాల్ని అనుకరించడం ఉండదు. సకుటుంబం మొత్తం ఆయన చిత్రం చూస్తూ ఓ సాయంత్రం ఆహ్లాదంగా గడిపేలా ఉంటాయి. దర్శకుల ప్రతిభ వెలుగులోకి రావాలంటే ఇలాంటి నిర్మాతల వల్లే సాధ్యమవుతుంది. ఈ చిత్రంతో ఆయన పేరు, ఆయన సంస్థ పేరు మరి కొన్ని మెట్లు పైకి ఎక్కుతాయి అనడంలో అతిశయోక్తి లేదు.

ఆయన తీసేది డబ్బుకోసమే కదా అని ఎవరైనా అనవచ్చు.. కాని ఆ డబ్బు కోసం అడ్డమైన చిత్రాలు తీస్తున్న నిర్మాతలు, దర్శకులు, కథా నాయికానాయకులు ఉన్న పరిశ్రమ మనది. ఎన్నో అంచనాలతో చిత్రాల్ని చూడటానికి వెళ్లే ప్రేక్షకులకు, ఎలాగైనా విజయం దక్కించుకోవాలనో లేక తమ అహం చల్లార్చుకోవడానికో అడ్డమైన చెత్తనంతా నింపి చిత్రాల్ని ప్రదర్శిస్తూ వారి మనోభావాలను దెబ్బతీస్తూ, పైపెచ్చు అదంతా అభిమానులకోసమని చెప్పుకు తిరుగే మేథావులు రాజుని చూసి నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది.. కాని నిజమేంటంటే మూర్ఖులకు ఇలాంటి విషయాలు బ్రహ్మ పదార్థంతో సమానం.. అవి ఎప్పటికీ అర్థం కావు!

తరచూ చిత్రాలు చూసే ప్రేక్షకులకు వారు మాట్లాడుకునే ఆర్థిక భాషలో చెప్పాలంటే ఈ చిత్రం చూడటనికి వాళ్లు వెచ్చించిన డబ్బులకు సరిపడ చిత్రాన్ని విశ్రాంతి వరకు చూడటంతోనే సరిపోయింది అని వారికి అనిపిస్తుంది.

నా సలహా: తప్పక చూడండి.