ఆమె - ఆవిడ

ఆమె చేస్తోంది.
ఆవిడ చేయిస్తోంది.
ఇలా కొన్నేళ్లుగా సాగుతోంది.
రోజు రోజుకూ భారమవుతున్న దేహంతో కదలకుండా చెప్తుంటుంది ఆవిడ.
లేడి పిల్లలా పరుగులు తీస్తూ చకచక చేస్తుంది ఆమె.

ఆవిడ పత్రిక తిరగేస్తూ ఆమెని ఓ సారి చూసింది... "నాకెన్ని జబ్బులొచ్చినా ఆరోగ్యాన్ని కొనుక్కోగలను. పాపం! దీనికేదైనా అయితే?" అని జాలిపడింది. పండంటి బిడ్డని కన్న మరునాడే ఆమె పనిలోకొచ్చిందని గుర్తురాలేదావిడకి.

పది రకాల వంటలతో నాలుగు పూటలు తిన్నా, సగం కడుపుకే తింటుంది ఆవిడ.. అదీ మందులు, సూదులతో కలిపి..!
పప్పుతో రెండు పూటలే తిన్నా మనసు నిండేలా తింటుంది ఆమె.

కూనిరాగాలు తీస్తూ హుషారుగా చేసేస్తోన్న ఆమెని చూసి, "దీనికెన్ని అవసరాలున్నాయో?" అనుకుంది. కాని ఆమెకు ఆస్తి ఉందన్న సంగతి ఆవిడకి తెలియదు. ఆవిడకే కాదు చాలా మందికి తెలియదు.

ఆమెకు పనంటే ప్రాణం.
అది చేయకపోతే ఏమీ తోచదు.
అందుకే ఇష్టంగా చేస్తుంది.

ఇంతలో ఆవిడ మొహంలో చిన్ని వెన్నెల, పత్రికలో ప్రకటన చూసి..! నెలరోజుల్లో ముప్పై కిలోలు తగ్గిస్తారట.. నమ్మండని ముందు, తరువాత ఫోటోలని కూడా వేశారు. "దీన్ని కూడా ప్రయత్నిద్దాం..!" అనుకుని ఫోన్ దగ్గరికి వెళ్లేందుకు మెల్లిగా లేవసాగింది.

పని చేయిస్తున్నంత కాలం ఆవిడ ఆస్తి తెల్లకోటు కళ్లకి ఆనుతూనే ఉంటుంది.
పని చేస్తున్నంత కాలం ఆమె ఆస్తి మాత్రం ఎవ్వరికీ కనబడదు.. ఆమె ఒంట్లోనే భద్రంగా గూడుకట్టుకొని ఉంటుంది.