కవిత: భగవత్స్వరూపం


aloori
భగవత్స్వరూపం
        – అరుణ్ కుమార్ ఆలూరి

 

 

ఆకలికి దయలేదు
రేపు సంపాదించి కడుపు నింపుతాడన్న నమ్మకం కానీ
ఈ పూటకి వదిలేద్దమన్న జాలి కానీ దానికి లేవు
ఆకలికి దయలేదు.. ఆకలికి జాలి కూడా లేదు

మరీ వీధి రౌడీలా ప్రవర్తిస్తోంది
“మామూలు” ఇవ్వడం కాస్త ఆలస్యమైనా పేగుల్ని పిప్పి చేస్తోంది.
దీనికి తోడు ముక్కొకటి బద్ధశత్రువై కూర్చుంది.
కాస్త కమ్మటి వాసన తగలగానే ఆకలికి రెచ్చగొడుతోంది
ఆకలికి దయలేదు.. ఆకలికి జాలి లేదు.

హే భగవంతుడా..!
మనిషికి అన్నీ ఇచ్చి
అతిపెద్ద శత్రువుని మాత్రం కడుపులోనే దాచావా?
కొందరు దానికి తలొగ్గి ఇతరుల ప్రాణాలు తీస్తుంటే
మరికొందరు ఏం చేయలేక తమ ప్రాణాలు వదిలేస్తున్నారు
అటూఇటు  కాని నాలాంటి వాళ్ళు
సంపాదించిన దాంట్లో దానికీ వాటా ఇచ్చి ప్రాణాలు కాపాడుకుంటున్నారు
కాని ఎవ్వరూ దాన్ని
నిందిచట్లేదు, ఎదురించట్లేదు, పోరాడట్లేదు..!

హే సృష్టికర్తా..!
ఇప్పటికి ఎన్ని కోట్ల జీవరాశులు దానికి బలైపోయాయో!
ఎన్ని లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయో!
రాక్షస బల్లుల కాలం నుంచి నేటి దాక
దాని ప్రస్థానం కొనసాగుతూనే ఉంది.
దానికి మరణం లేదు.
అంటే దానికి అమరత్వం సిద్ధించిందా?
అయితే అది భాగవత్సరూపమా?

భగవద్గీతలో చెప్పినట్టు భగవంతుడు మనిషిలోనే ఉంటూ
క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఏ దారిలో ప్రయాణిస్తున్నాడో
అని నిరంతరం పర్యవేక్షిస్తున్నాడా?
ఆ దారిని బట్టే మోక్షం ప్రసాదిస్తున్నాడా?

హే లయకారకా..!
ఎటునుంచి ఎటువైపుకు తీసుకెళ్తున్నావు నన్ను..!

-౦-

 

 

4 కామెంట్‌లు: