A Separation (2011) {Persian: جدایی نادر از سیمین‎‎ } సినిమా పరిచయం

Best Foreign Language Film కేటగిరిలో అకాడమీ అవార్డ్(2011)తో సహా మొత్తం 47 అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న సినిమా A Separation(2011). About Elly తరువాత Asghar Farhadi దర్శకత్వంలో వచ్చిన మరో ఆణిముత్యం ఈ చిత్రం.

కథ: ఒక జంట విడాకులు కావాలని జడ్జ్ ముందుకు వాదనలు వినిపించేందుకు రావడంతో కథ మొదలవుతుంది. Simin తమ దేశం (Iran)ను భర్త, కూతురు(11ఏళ్ళు)తో వదిలి వేల్లాలనుకుంటుంది. కాని అందుకు ఆమె భర్త Nader అంగీకరించడు. కారణం అల్జీమర్ వ్యాధితో పోరాడుతున్న అరవైయేళ్ళ అతని తండ్రి. సహేతుకమైన కారణాలు లేనందున విడాకుల అర్జీని కోర్టు కొట్టివేస్తుంది. దాంతో Simin ఆ ఇంటిని వదిలి అమ్మ దగ్గరికి వెళ్తుంది. కూతురు Termeh మాత్రం తండ్రి వద్దే ఉంటానంటుంది. అయితే భార్య సలహా మేరకు తను బ్యాంకులో ఉద్యోగానికి వెళ్ళిన తరువాత తన తండ్రిని చూసుకునేందుకు ఒక ఆవిడ(Razieh )ని నియమిస్తాడు Nader. అక్కడి సంప్రదాయం ప్రకారం భర్త అనుమతి తీసుకోవాల్సి ఉన్నా ఆమె తీసుకోకుండా వచ్చేస్తుంది, అందుకు కారణం పేదరికం మరియు భర్త నాలుగు నెలలుగా ఉద్యోగం లేకుండా ఉండటం. ఒకవేళ అడిగినప్పటికీ ఆమె భర్త ఒప్పుకునే రకం కాకపోవడం, పైగా అతనికి క్షణాల్లోనే విపరీతమైన కోపం రావడం వంటి ఇబ్బందులతో అతనికి చెప్పకుండా తన ఐదేళ్ళ కూతురిని వెంటబెట్టుకొని వస్తుంది. అయితే ఒక రోజు పనికే విపరీతంగా అలసిపోయి మరునాడు రాను అని చెబుతుంది. ఒక వేళ మా ఆయన వస్తానంటే పంపిస్తాను అని చెబుతుంది. ఆమె భర్త కూడా Nader పనిచేసే బ్యాంకుకు వెళ్లి మాట్లాడతాడు. కానీ మరునాడు అతను రాకుండా ఆమే వస్తుంది.

ఒకరోజు Nader వచ్చే సరికి తండ్రి మంచం పక్కన నేల మీద పడిపోయి కనిపిస్తాడు. అతని చేయి మంచానికి కట్టివేసి ఉంటుంది. ఓ పది నిముషాలు ఆలస్యమైతే అతను చనిపోయేవాడే. కాసేపటికి Razieh వస్తుంది. ఆమెని ఇంట్లోంచి వెళ్లి పొమ్మంటాడు. ఆమె వినకపోవడంతో నెట్టేస్తాడు. మెట్లపై పడిపోతుంది ఆవిడ.

మరునాడు ఉదయం ఆవిడ నాలుగు నెలల గర్భిణి అని, నిన్న జరిగిన సంఘటనలో ఆమె గర్భం కోల్పోయిందని తెలిసి పరామర్శించేందుకు Simin & Nader కలిసి ఆసుపత్రికి వెళతారు. అసలు భార్య పనికి వెళ్తోంది అని తెలియని Razieh భర్త, అప్పటివరకు ఒక ఆక్సిడెంట్ లో గర్భం పోయిందనుకున్న అతనికి అసలు కారణం Nader అని తెలుసుకొని కోపంతో ఊగిపోయి అతన్ని కొడతాడు. పెనుగులాటలో Simin ముక్కుకి కూడా బలమైన దెబ్బ తగులుతుంది.

ఆ తర్వాత న్యాయం కోసం కేసు వేస్తాడు Razieh భర్త. కోర్టులో వాదనలు మొదలవుతాయి. అసలు ఆమె గర్భవతి అన్న విషయం తనకు తెలియదని అంటాడు Nader.  ఆ తరువాతి వాదనలో Termeh తండ్రి వాదనకు అబద్ధపు సాక్ష్యం చెబుతుంది. తర్వాత Termeh పదే పదే అడగడంతో ఆమె గర్భవతి అని తెలుసు కాని ఆ క్షణంలో గుర్తురాలేదని వివరిస్తాడు.

ఒక దశలో Simin భర్తతో కలిసి ఉండేందుకు వస్తుంది కాని భార్యాభర్తల మధ్య వాదనలు పెరగడంతో కూతురిని కూడా తనతో పాటు తీసుకొని మళ్ళీ అమ్మ వద్దకు వెళ్తుంది. అంతకు ముందు తల్లి వెళ్ళిపోయినా, Termeh తండ్రి వద్దే ఉండటానికి కారణం తన కోసమైనా అమ్మ దేశం విడిచి వెళ్ళదు అని. కాని కోర్టులో తండ్రి అబద్ధపు వాదనతో తల్లితో కలిసి వెళ్ళిపోతుంది.

Razieh భర్త, Termeh స్కూలు వద్ద కనిపిస్తుండటం, అంతకు మునుపు ఇదే కేసు విషయంలో Termeh టీచర్ ని బెదిరించడంతో భయపడిన తల్లి Simin అతనితో మాట్లాడి కొంత డబ్బుతో ఒప్పందం చేసుకొని కేసు ఉపసంహరించుకునేందుకు ఒప్పిస్తుంది. భర్త Nader కి కూడా ఎలాగోలా ఒప్పిస్తుంది. పెద్దల సమక్షంలో చెక్కులు ఇచ్చే ముందు ఒక్క సారి ఖురాన్ మీద ఒట్టేసి ఆమె గర్భం పోవడానికి తనే కారణం అని చెప్పాల్సిందిగా Nader, Raziehని కోరతాడు. అయితే అంతకు ముందు రోజే తన గర్భం పోవడానికి కారణం మీ భర్త కాదు అని, దానికన్నా ఒకరోజు ముందు కారు డీకొట్టడం అసలు కారణం అని, నా కూతురుకి ఏమైనా అవుతుందేమో అన్న భయంతో నిజం చెప్పేస్తున్నానని, మీ డబ్బు కూడా వద్దు అని Razieh, Siminతో చెబుతుంది. ఈ విషయాలేవీ తెలియని Nader తన కూతురి ముందు దోషిగా నిలబడలేక ఖురాన్ మీద ఒట్టు వేయమనడంతో Razieh భర్త ఆగ్రహంతో బయటకి వెళ్ళిపోతాడు, వెళ్తూ వెళ్తూ Nader కారు అద్దాలు ద్వంసం చేసి వెళతాడు. ఆ కేసు అంతటితో ముగుస్తుంది.

Simin & Nader విడాకుల కేసు మళ్ళీ వస్తుంది. తల్లితండ్రుల్లో ఎవరివద్ద ఉంటావు అని జడ్జి Termehని అడుగుతాడు. తను ఎవరి వద్ద ఉండాలో నిర్ణయించుకున్నాను అని జడ్జితో చెబుతుంది కాని అది ఎవరు అని చెప్పలేక రోదిస్తుంది. జడ్జి వాళ్ళిద్దరిని బయటకు వెళ్ళమంటాడు.

Simin & Nader జడ్జి గది బయట ఎదురెదురుగా, ఒక గ్లాస్ తలుపుకి అటుఇటుగా కూర్చుంటారు. వాళ్ళిద్దరినీ ఆ గ్లాస్ విడదీసి ఉంచుతుంది. Termeh కోసం వాళ్ళు ఎదురుచూస్తూ ఉంటారు. సినిమా అక్కడికే అయిపోతుంది. Termeh నిర్ణయం మన ఊహకే వదిలేశాడు దర్శకుడు.

కొసమెరుపు: Asghar Farhadi కూతురు Sarina Farhadi, Termeh పాత్రలో చాలా అద్భుతంగా సహజసిద్ధంగా నటించింది.

A Separation సినిమా ట్రైలర్ ఇక్కడ చూడండి:


About Elly (2009) {Persian: درباره الی‎‎} సినిమా పరిచయం

About Elly (2009) సైకలాజికల్ డ్రామా లో సాగే ఇరాన్ సినిమా. మధ్యతరగతి జీవితాల మానసిక స్థితిగతులపై అద్భుతంగా పరిశోధన చేసినట్టు ఉండే కథ, కథనం ఈ సినిమాకి ఆయువుపట్టు. సినిమాలా కాకుండా నిజంగా జరుగుతున్న భావనను మనలో రేకెత్తించిన దర్శకుడి (Asghar Farhadi) ప్రతిభకి బెర్లిన్ ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో Silver Bear for Best Director అవార్డు దక్కింది. ఇతర అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో దాదాపు 10 అవార్డులని దక్కించుకోవడమే కాకుండా 82వ అకాడమీ అవార్డులకి, Foreign Film section లో, ఇరాన్ తరఫున అధికారికంగా పంపబడిందీ చిత్రం. అందరూ బాగా నటించినా ముఖ్య భూమిక పోషించిన Golshifteh Farahani నటన మెస్మరైజ్ చేస్తుంది. సినిమాటోగ్రఫీ ఫీల్ ని నిలబెట్టేలా సాగుతూ ఉంటుంది.

కథ: మూడురోజుల విహారయాత్రకు ఎనిమిది మంది పెద్దలు, వారి పిల్లలతో సహా Caspian Sea కి రావడంతో కథ మొదలవుతుంది. వీళ్ళంతా లా యూనివర్సిటి పూర్వ విద్యార్థులు. Sepideh & Amir జంటకి ఒక కూతురు(సుమారుగా ఆరేళ్ళు). Shohreh & Peyman జంటకి ఒక బాబు (Arash)(సుమారుగా  ఐదేళ్ళు) & ఒక పాప (సుమారుగా మూడేళ్ళు). Nazy & Manuchehr మూడో జంట. Sepideh కూతురి టీచరైన Ellyని, Ahmadకి పరిచయం చేసేందుకు Sepideh ఆహ్వానిస్తుంది. Ahmad భార్యకు విడాకులిచ్చి ఒంటరిగా జర్మనీలో ఉంటున్నాడు.

Sepideh ముందుగా బుక్ చేసిన మాన్షన్ కు, ఆ యజమానులు తరువాతి రోజు వస్తుండటంతో ఒక్క రాత్రి కొరకైతేనే ఇస్తాను అని ఆ మాన్షన్ ను చూసుకునే ఆవిడ అనడంతో, కొత్తగా పెళ్ళైన జంట వచ్చారని, ఇది వాళ్ళకు హనీమూన్ అని అబద్ధం ఆడడంతో బీచ్ కు దగ్గరగా ఉన్న మరో విల్లాను ఇవ్వడానికి ఒప్పుకుంటుంది. విల్లా ఉన్న ప్రాంతంలో సెల్ ఫోన్ సిగ్నల్స్ లేకపోవడంతో ఫోన్స్ చేసుకోవడానికి ఈమె వద్దకే రావాల్సి ఉంటుంది. అయితే Sepideh అబద్ధం ఆడటానికి మరో కారణం, పెళ్లవ్వని జంట ఇరాన్ చట్టం ప్రకారం కలిసి ప్రయాణం చేయడం నిషిద్ధం అవడం.

విల్లా చాలా రోజులుగా వాడకుండా ఉండటం వల్ల దుమ్ము పట్టి ఉంటుంది. తలో చెయ్యి వేసి శుభ్రం చేసుకుంటారు. Elly సంకోచిస్తూనే మెల్లి మెల్లిగా Ahmad పట్ల ఆకర్షితురాలు అవుతుంది, అలాగే Ahmad కూడా. అయితే Elly ఇంట్లో తన విహారయాత్ర గురించి చెప్పకుండా, సహోద్యోగులతో కలిసి సముద్రం వైపు ఉన్న రిసార్ట్ కి వచ్చానని, మరునాడు ఉదయం Tehranకి అనుకున్నట్టుగానే వెళ్ళిపోతానని చెబుతుంది. తన తల్లికి గుండె ఆపరేషన్ జరిగి పక్షం రోజులు కూడా కాలేదని, అందుకే అలా చెప్పానని Ahmadకు
సమాధానం ఇస్తుంది. Sepidehకు Elly వెళ్ళడం ఇష్టం లేక ఆమె లగేజ్ ని దాచేస్తుంది. మాతో పాటు వెళ్ళొచ్చు అని బలవంత పెడుతుంది. Elly అయిష్టంగానే ఒప్పుకుంటుంది. మగాళ్ళంతా వాలీబాల్ ఆడుతూ ఉండగా, Sepideh & Shohreh సామాను తీసుకురావడానికి బజారుకు వెళ్తూ, బీచ్ లో ఆడుకుంటున్న పిల్లల్ని చూస్తుండమని Nazyకి పురమాయిస్తారు. కాసేపయ్యాక అక్కడే మెట్లపై కూర్చున్న Ellyని పిల్లల్ని చూడమని చెప్పి, క్లీన్ చేయడానికి లోపలి వెళ్తుంది
Nazy. Arash సముద్రపు నీళ్ళల్లో ఆడుకుంటూ ఉండగా, మిగితా ఇద్దరు పిల్లలు పతంగిని ఎగరేయలేక పోతుండడంతో Elly పరుగెత్తుకుంటూ ఎగరేస్తూ వాళ్ళని ఆడిస్తుంది. కాసేపయ్యాక ఆ ఇద్దరు పిల్లలు తండ్రుల వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చి Arash నీళ్ళలో కొట్టుకుపోయాడని కంగారుగా చెబుతారు. మగాళ్ళంతా వెళ్లి సముద్రంలో దూకి వెతకగా వెతకగా నీళ్ళలో తేలియాడుతున్న Arash కనిపిస్తాడు. ఒడ్డుకు తీసుకొస్తారు. కాసేపటికి నీళ్ళు కక్కుతూ Arash లేచి కూర్చోవడంతో అంతా ఊపిరి పీల్చుకుంటారు. కాస్త స్థిమిత పడ్డాక Elly కనిపించడం లేదని గుర్తిస్తారు. అయితే Elly, Arashని రక్షించే ప్రయత్నంలో సముద్రంలో కొట్టుకు వెళ్ళిందా? లేక ఎవరికీ చెప్పకుండా Tehranకి
వెళ్లిపోయిందా? అనేది ప్రశ్నగానే మిగిలిపోతుంది. పోలీసులకి సమాచారం ఇస్తారు, ఒక టీం సముద్రంలో గాలిస్తుంది కానీ దొరక్కపోవడంతో, ఒక వేళ నిజంగా సముద్రంలో కొట్టుకొని వెళ్ళిపోతే, మరునాడు ఉదయం తీరానికి శవం కొట్టుకు వస్తుంది అని, చెప్పి వెళ్ళిపోతారు. ఈ పరిస్థితికి కారణం నువ్వంటే నువ్వు అని ఒకరి పై ఒకరు నిందలు వేసుకుంటారు. ఈ క్రమంలో Elly కొన్ని అబద్ధాలు చెప్పిందని తెలుస్తుంది. Sepideh కూడా Elly విషయాలు కొన్ని దాచిపెట్టిందని తెలుస్తుంది. ఒక దశలో Elly క్యారెక్టర్ పై అనుమానం కలుగుతుంది. Sepideh దాచిపెట్టిన Elly బ్యాగ్ లోంచి సెల్ ఫోన్ తీసి వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి ఆమె వచ్చిందేమో అని కనుక్కోగా ఆమె అన్నయ్య సమాధానం ఇచ్చాడని Ahmad
చెబుతాడు. అతను అన్నయ్య కాదని, కాబోయే భర్త Ali Reza అని Sepideh చెబుతుంది. మూడేళ్ళ కిందటే వాళ్ళకి వివాహం నిశ్చయమైందని, కాని ఆ పెళ్లి అంటే ఇష్టం లేదని, ఆ విషయం అతనికి చెప్పిన తనని వదిలి పెట్టటం లేదని, అందుకే Ahmadను కలిసేందుకు వచ్చిందని, Sepideh చెప్పడంతో అందరూ షాక్ అవుతారు, ఎందుకంటే ఆ విషయాలు Sepideh కు తప్ప ఎవరికీ తెలియవు.

Elly కి కాబోయే భర్త Ali Reza రావడం, అతను వచ్చాక వీళ్ళంతా ఎంత మేనేజ్ చేసినా చివరికి విల్లా ఇచ్చిన ఆవిడ వద్దకు, ఫోన్ చేసుకోవడానికి వచ్చిన Ali Reza తో మాటలమధ్యలో కొత్త పెళ్ళికూతురు అంటూ మాట్లాడటంతో విషయం మొత్తం అర్థమై Ahmadని కొడతాడు. అప్పటికే Sepideh ఒక నిర్ణయానికి వచ్చేస్తుంది. బతికుందో లేదో తెలియని Elly క్యారెక్టర్ ని, స్వార్థ స్వప్రయోజనాల కోసం చంపలేను అని చెప్పేసి అతనితో పూర్తిగా నిజం చెప్పేస్తానని అందరితో చెబుతుంది. కాని Ali Reza ఆ విషయాలేవీ అడగడు, ఒకే ఒక్క ప్రశ్న అడుగుతాడు. “మీరు ఇక్కడికి మీ ఫ్రెండ్ ని
కలవడానికి రమ్మన్నప్పుడు తను ఏమి అనలేదా? రాను అని కాని, నాకో ఫియన్సే ఉన్నాడని కాని, ఇంకేదైనా కాని చెప్పిందా?” అని హృద్యంగా అడుగుతాడు. దానికి ముందు Elly గురించి కాస్త చెబుతాను అని Sepideh అనబోతుంటే వద్దని వారించి యస్ ఆర్ నో అని మాత్రమే చెప్పమంటాడు. Sepideh “నో, నా ప్రతిపాదనని తను తిరస్కరించలేదు” అని చెప్పగానే అతనిలోని మూడేళ్ళ ఆ భగ్న ప్రేమికుడు ఆ క్షణంలోనే మరణిస్తాడు. జరిగిన సంఘటనలకి Sepideh  కుమిలి
కుమిలి ఏడుస్తుంది. ఇంతలో Elly శవం దొరికిందని, గుర్తించడానికి రమ్మన్నారని అనడంతో అక్కడికి వెళ్ళిన Ali Reza ఆమె శవం చూసి విలపిస్తాడు. తిరిగి వెళ్తుండగా Ahmad తలదించుకొని కనిపిస్తాడు. “Elly మరణించిన విషయం వాళ్ళింట్లో మీరు చెబుతారా?” అని Ali Reza ని వాళ్ళు అడగ్గా, అతను “మీరే చెప్పండి” అంటాడు. దానికి “మీరు చెబితేనే బాగుంటుంది” అని అనడంతో, “సగం చచ్చిపోయి ఉన్న నాపై మోయలేని భారం వేసి పూర్తిగా చంపేస్తారా” అన్నట్టుగా వాళ్ళవైపు చూసి వెళ్ళిపోతాడు. వెళ్తూ వెళ్తూ Elly బ్యాగ్ ని ఆమె జ్జ్ఞాపకాలుగా తీసుకొని వెళ్తాడు.  Sepideh ఇంకా అలాగే కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. మిగితా వారంతా బీచ్ లో ఇరుక్కుపోయిన కార్ ను లాగేందుకు ప్రయత్నిస్తుంటారు.

సినిమా అంతా అయ్యాక Ali Reza పై మనకు జాలి కలుగుతుంది. Elly నిలకడలేని మనస్తత్వంపై బాధ వేస్తుంది. మిగితా ఏడుగురి ప్రవర్తనకు కోపం వస్తుంది.

మనిషిలోని స్వార్థం, నిజాయితీల మధ్య ఘర్షణని అత్యద్భుతంగా చూపించారు దర్శకులు. అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు మనిషి సేఫ్ జోన్ లో ఉండటానికి పడే తాపత్రయం, తప్పుల్ని ఇతరులపైకి నెట్టివేసే స్వార్థం, చివరికి నిజాయితీగా అంగీకరించే మానవత్వం ఇవే సినిమాని శిఖరాగ్రం పై నిలబెట్టాయి.

ఏడు పాత్రల స్వభావాల్ని డిజైన్ చేసుకున్న తీరు గొప్పగా ఉంటుంది. వేటికవే భిన్నంగా ఉండటం, ప్రవర్తించడం అత్యద్భుతం.
Sepideh: అందరిలో తొందరగా కలిసిపోయే మనస్తత్వం. సమస్య వచ్చినప్పుడు అందరికన్నా ముందుండే నాయకత్వ లక్షణాలు కలిగి సమస్య నుండి పారిపోకుండా పోరాడే తత్త్వం.
Amir: కోపం వస్తే అగ్ని పర్వతంలా బద్దలవడం లేదా సైలెంట్ అయిపోయి దూరంగా వెళ్లి నిల్చోవడం.
Shohreh: తనదాక వస్తే ఎంతటికైనా తెగించే ధీరగుణం.
Peyman: సమస్యని లోతుగా విశ్లేషించి, తప్పు మనదా కాదా అని శోధించి, మనది కాదు అని తెలిపేందుకు ప్రయత్నించడం.
Nazy: సమస్య వస్తే భయపడిపోవడం. 
Manuchehr: నొప్పివ్వక తానొవ్వక అనే మనస్తత్వం.

Ahmad: ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండే మనస్తత్వం.

About Elly సినిమా ట్రైలర్ ఇక్కడ చూడండి: