Bashu, the Little Stranger (1989) {Persian: باشو غریبه کوچک‎‎} సినిమా పరిచయం

 Bashu, the Little Stranger (1989) సినిమా ఇరాన్-ఇరాక్ యుద్ధం నేపథ్యంలో, యుద్ధం తాలూకు వినాశనం ఒక పసి హృదయం పై ఎంతటి ప్రభావం చూపిందో మనవీయ కోణంలో ఎండగడుతూ సాగుతుంది. ఒక పర్శియన్ సినిమా పత్రిక, విమర్శకులు & సినీ పండితుల మధ్య 1999లో నిర్వహించిన సర్వేలో “Best Iranian Film of all time” గా ఎన్నుకోబడింది ఈ చిత్రం. సినిమాలోని ప్రతి సన్నివేశం జరుగుతున్నప్పుడు & ఆ సన్నివేశం పూర్తయ్యాక ఆలోచించుకోవడానికి  మనకు కావలసినంత ‘స్పేస్’ దొరుకుతుంది. ఆ ‘స్పేస్’లో మన మనస్సు ఒక చోట నిలవక ఎన్నో ఆలోచనలతో పరుగెత్తిస్తూనే ఉంటుంది. అనుభూతి ప్రధానంగా సాగే కథనం మంత్రం ముగ్ధుల్ని చేస్తుంది. సినిమా చూస్తున్ననంత సేపు అక్కడక్కడా సత్యజిత్ రే దర్శకత్వ శైలి గుర్తుకొస్తుంది.

కథ: బాంబుల వర్షంతో కథ మొదలవుతుంది. అందులో ఒక ఇల్లు తునాతునకలవడం, నిప్పు అంటుకొని ఒక మహిళ బెమ్బేలెత్తిపోవడం, భయంతో ఓ బాలిక పరుగెత్తడం కనిపిస్తాయి. ఇవేవి లెక్క చేయకుండా పేలుళ్ళ మధ్యలోంచి ఒక ట్రక్ వెళ్లిపోతూ ఉండగా, కొద్ది దూరం వెళ్ళాక టైర్ దెబ్బతిన్నదేమో అన్న అనుమానంతో ట్రక్ఆపి చూస్తాడు డ్రైవర్. ఆ రోడ్డు పక్కనే ఎండిపోయిన పంటలోంచి తొంగిచూస్తాడు Bashu(వయసు దాదాపు పన్నెండేళ్ళు). పరుగెత్తుకుంటూ వచ్చి డ్రైవర్ కి తెలియకుండా ఆ ట్రక్ ఎక్కుతాడు. అది పగలు, రాత్రి ప్రయాణిస్తూనే ఉంటుంది. ఉదయం Bashu లేచి చూసే సరికి ఒక చోట ఆగి ఉంటుంది. ఆ కొత్త ప్రాంతాన్ని తెరిపార చూస్తుండగా మళ్ళీ బాంబు పెలిన శబ్ధం వినపడటంతో, భయపడి ట్రక్కు లోంచి దూకి పరుగెత్తుతాడు. అయితే అక్కడ యుద్ధం జరగటం లేదు. టన్నెల్ నిర్మాణంలో భాగంగా బాంబులు పేల్చుతుండటంతో, యుద్ధం ఇక్కడ కూడా జరుగుతుందేమో అనుకొని Bashu, ఆగకుండా పరుగెత్తుతూ, చెట్లలోంచి వెళుతూ చివరికి పంట పొలాల్లో పడి వెళ్ళిపోతాడు.

ఓ ఇద్దరు అన్నా చెల్లెల్లు తమ పొలంలో ఉన్న Bashu ని చూసి, తల్లి Naii తో చెప్తారు. మొదట్లో Naii, Bashu ని దూరంగా పెట్టినా తర్వాత జాలేసి చేరదీస్తుంది. Bashu కూడా Naii ని నమ్మడానికి కాస్త సమయం తీసుకుంటాడు. ఆ తర్వాత ఆ కుటుంబంలో ఒకడిగా కలిసిపోతాడు. కాని Bashu అసలు మాట్లాడకపోవడంతో అతను చెవిటి లేదా మూగవాడు అయివుంటాడు అనుకుంటారు. కాని ఒకనొక సందర్భంలో పిల్లల పుస్తకాలు కిందపడటంతో వాటిని తీసిస్తూ అక్కడ ఉన్నది చదవడంతో అతనికి Persian భాష మాట్లాడటం, చదవడం వచ్చునని తెలుస్తుంది. కాని Bashu మాట్లాడేది Arabic భాష కాగా, Naii మాట్లాడేది Gilaki భాష (మరో Iranian భాష). దాంతో ఇద్దరికీ మాట్లాడుకోవడం ఇబ్బందిగా మారుతుంది. అయితే ఆ మాటలతోనే Bashu ఇంటిమీద బాంబు పడటంతో అమ్మా, నాన్న, చెల్లి చనిపోయారని చెబుతాడు (సినిమా ప్రారంభంలో చూపించిన సన్నివేశాలు అవే).

ఊళ్ళో వాల్లందరూ  “Bashu ని చేరదీయవద్దు” అని Naii ఇంటికి వచ్చి పంచాయితీ పెట్టి మరీ సలహా ఇస్తారు. అందుకు అతని శరీర ఛాయ వాళ్ళలా తెల్లగా కాకుండా నల్లగా ఉండటం కూడా ఒక కారణం అవుతుంది. కాని Naii  అవేవి పట్టించుకోదు. తల్లిలా లాలిస్తుంది. Naii భర్త కుటుంబానికి దూరంగా ఉంటూ కాస్తో కూస్తో సంపాదిస్తూ ఉంటాడు. అతనికి ఉత్తరాల ద్వారా Bashu ఉంటున్న విషయం చెబుతుంది. అయితే అతని నుంచి స్పందన కరువవుతుంది.

పిల్లలతో ఒంటరిగా ఉంటున్న Naii కి భర్త నుండి ఎటువంటి ఆర్థిక సహకారం లభించకపోవడం, తనే ఒంటరిగా పొలం పనులు చూసుకుంటూ, సొంత డబ్బులతో కుటుంబాన్ని సాకడం ఇబ్బందిగా ఉన్నప్పటికీ Bashu ని ఆదరిస్తుంది. అటువంటి సమయంలో Bashu చేదోడు వాదోడుగా మారతాడు. కోళ్లు, గుడ్లు అమ్మటానికి వెళ్లినప్పుడు లెక్కల్లో దొర్లిన తప్పును చెప్పి Naii నష్టపోకుండా చూస్తాడు. అయితే ఎందుకనో Bashu అక్కడి నుండి పారిపోతాడు. సంత అయ్యాక కూడా చాలా సేపు వెతికి చివరికి ఇంటికి వస్తుంది Naii. విషయం తెలిసి మరునాడు ఊళ్ళో వాల్లందరూ మళ్ళీ ఆమె ఇంటికి వచ్చి తలో మాట అంటుండగా Bashu తిరిగి వస్తాడు.

Naii రోజు అర్థరాత్రి లేచి అడవి పంది పొలంలో పడి పంట నాశనం చేయకుండా శబ్దాలు చేస్తూ అది వెళ్ళాక వచ్చి పడుకుంటూ ఉంటుంది. దాంతో ఆవిడకు రోజు సగం నిద్రే అవుతుంది. దాంతో ఆమెకి జ్వరం వస్తుంది. ఆ సమయంలో వైద్యుడు కూడా ఊళ్ళో లేకపోవడంతో ఏం చేయలో తోచక బిగ్గరగా ఏడుస్తూ, డప్పు వాయిస్తూ ప్రార్థిస్తాడు Bashu. ఆమె కోలుకుంటుంది. అప్పటినుండి రాత్రుల్లు పొలం కాపు కాసే పనిని Bashu తన నెత్తిన వేసుకుంటాడు.

ఇలా రోజులు గడుస్తుండగా Naii భర్త దగ్గరి నుంచి ఉత్తరం వస్తుంది. మనకే తినడానికి తిండి లేనప్పుడు అతన్ని సాకడం దేనికి అని నిలదీస్తాడు. ఆ ఉత్తరం Bashu కంట పడకుండా దాచినప్పటికీ, దొంగతనంగా చదివిన Bashu  బాధతో మళ్ళీ ఇల్లు విడిచి వెళ్ళిపోతాడు. దూరంగా ఉన్న ఒక గుడిసేలోకి వెళ్ళిపోతాడు. ఈ సారి Naii ఊరుకోదు. జోరున వర్షం పడుతున్నా లెక్కచేయకుండా Bashu ని వెతికి పట్టుకొని కన్న తల్లిలా కోపంతో కొట్టుకుంటూ ఇంటికి తీసుకువస్తుంది. మరునాడు Bashuతో ఉత్తరం రాయిస్తూ, అతను ముమ్మటికీ ఇక్కడే ఉంటాడని చెబుతూ, “ఈ ఉత్తరం నా కొడుకు Bashu రాసింది” అని ముగించమంటుంది.

చివరికి Naii భర్త వస్తాడు. ఒక చేతిని పోగొట్టుకొని, డబ్బులేమి సంపదించుకు రాకుండా, ఉద్యోగం లేకుండా, ఒట్టి చేతులతో వస్తాడు. Naii  తో అతను ఎంతగా వాదించినప్పటికీ, ఆమె Bashu మాత్రం ఇక్కడే ఉంటాడని ఖరాఖండిగా చెబుతుంది. విషయం తెలుసుకున్న Bashu అక్కడికి వచ్చి, అతన్ని చూసి “ఎవరు ఇతను?” అంటాడు. “మీ నాన్నని” అని అతను సమాధానం ఇవ్వడంతో అతన్ని హత్తుకొని భోరున ఏడుస్తాడు Bashu. ఇంతలో అడవి పంది మళ్ళీ పంటపొలాల్లోకి వచ్చిన శబ్ధం రావడంతో చిన్న పిల్లలతో సహా ఆ కుటుంబం మొత్తం దాన్ని తరమడానికి అరుస్తూ పరుగెత్తుకుంటూ వెళతారు. ఆ సన్నివేశంతో సినిమా ముగుస్తుంది.


కొసమెరుపు(లు):
  • కథనంలో Bashu తల్లితండ్రులు చనిపోయినప్పటికీ ఆత్మ రూపంలో అతని వెంటే ఉన్నారు అన్న విషయాన్ని సిమ్బాలిక్ గా దర్శకుడు చెప్పే తీరు బాగుంటుంది.
  • సినిమాలో అసలు నేపథ్య సంగీతం వాడలేదు. అదైతే నిజంగా సహాసమే!! ఒక మూడు నాలుగు సన్నివేశాల్లో సంగీతం వినిపించినా అది సందర్భానుసారమే! ఆయా సందర్భాల్లో అక్కడ పాత్రధారులు నిజంగా ఆ సన్నివేశాల్లో ఆయా పరికరాలను వాయించడం వల్ల వచ్చిన సంగీతమే అది. నూటికి నూరు శాతం నేపథ్య సంగీతం లేకపోవడంతో ఒక కళాత్మక డాక్యుమెంటరీ చూసిన భావన కలుగుతుంది.
  • సినిమా ఇలా తీయాలి అన్న నియమాలేవి పాటించకుండా తీసిన సినిమాగా దీన్ని చెప్పవచ్చు.
  • ఇదే సినిమాని కమర్షియల్ సినిమాలు తీసే మనవాళ్ళకు ఇస్తే ఈ 120 నిమిషాల నిడివిని 30 నిమిషాలకు క్షణాల్లో మర్చేయిస్తారు. ఈ సినిమా దర్శకుడు  Bahram Beizai ఏమనుకున్నాడో తెలీదు కాని అతని సినిమని అతనే ఎడిట్ చేసుకున్నాడు.
  • ఈ సినిమా చూస్తున్నంత సేపు ఇది ఇరానియన్ సినిమా అన్న సంగతి దాదాపు మర్చిపోతాం, అందుకు కారణం సినిమాలో కనిపించే విసుర్రాయి, వరి పంట, డప్పు, వేణువు, సంత, దేశీ కోళ్లు, వెల్లుల్లి, మనుషుల మనస్తత్వాలు మనకు చాలా దగ్గరగా ఉండటమే!

Bashu, the Little Stranger సినిమాని ఇక్కడ చూడండి:
మొదటి భాగం:

రెండవ భాగం:

(ఈ సినిమాని అధికారికంగా యూట్యూబ్ లో పెట్టినట్టు కనిపించడం లేదు, ఏ క్షణమైనా తొలగించే అవకాశం ఉంది)


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి