రాజు - జోష్ Youth Rockzzz చిత్రం సమీక్ష

ఈ చిత్రానికి శీర్షిక, ఉపశీర్షిక చాలా బాగా సరిపోయాయి. కథ, పాత్రలు, అవి మలచిన తీరు, వారి హావభావాలు.. కొత్తగా,సహజసిద్ధంగా ఉన్నాయి. అందమైన కథని రంగవల్లికంత అందంగా తీర్చి దిద్దారు జోష్ బృందం. నిర్మాత రాజు, దర్శకులు వాసు వర్మ, ఛాయాగ్రాహకులు సమీర్ రెడ్డి, నటులు జె.డి.చక్రవర్తి, ప్రకాశ్ రాజ్, కళా దర్శకులు బ్రహ్మ కడలి, పోరాటాలూ అందించిన విజయ్, అమన్ ఘని నూటికి నూరు శాతం కష్టపడి తమ ప్రతిభని చూపేందుకు ప్రయత్నించారు.. విజయం సాధించారు. ఈ చిత్రం ద్వారా పరిచయమైన నాగ చైతన్య నటనలో ప్రేక్షకులు కాస్త సర్దుకుపోక తప్పదు. మొత్తానికి ఫర్వాలేదు అనిపించాడు. మున్ముందు అతని ప్రతిభ మరింత మెరుగవుతుందని ఈ చిత్రం చూస్తే అర్థమవుతోంది. సందీప్ చౌత సంగీతం, కథానాయిక కార్తీక నటన బాగానే ఉన్నాయి. ఈ చిత్రంలో నటించిన పిల్లల నటన బాగుండి, వారి అమాయకపు మొహాలు మనసుకు హాయిగొల్పుతాయి.

వాసు వర్మ కథ, దర్శకత్వంలలో పూర్తి విజయం సాధించారు.. అయితే మాటలు, కథనం(స్ర్కీన్ ప్లే)లలో కాస్త తడబడ్డట్టు కనిపించింది. వాటిల్లో మరికాస్త శ్రద్ధ వహించి ఉంటే ఈ చిత్రం మరింత శోభాయమానంగా ఉండేది. మాటలల్లో కొన్ని చోట్ల పరిణతి చూపిస్తే, రెండు మూడు చోట్ల చేతులెత్తేసినట్లు, వేరే విషయాలపై దృష్టి కేంద్రీకరించి మాటలకు సడలింపుని ఇచ్చినట్టు కనిపించింది. కథనంలో తడబడటం వల్ల విశ్రాంతి తరువాత ప్రేక్షకులకు ఆవలింతలు వచ్చే అవకాశం కొద్దిగా ఉంది. కథ మొత్తం విశ్రాంతి తరువాతే ఉండటం కూడా చిత్రం అలా రావడనికి కారణమైంది. పాత్రల విషయంలో అతని శ్రద్ధ మంత్ర ముగ్థుల్ని చేస్తుంది. పరిశ్రమకి మరో మంచి దర్శకుడు పరిచయమయ్యాడు అనిపిస్తుంది.

ఒక కళాత్మకమైన చిత్రానికి వాణిజ్య హంగులు అద్ది తీస్తే ఎలా ఉంటుందో చాలా మంది దర్శకులు నిరూపించారు. కాని అలాంటి చిత్రాలను నిర్మించే నిర్మాతలు చాలా తక్కువ. ఆ బాటలోనే పయనిస్తున్న వ్యక్తి రాజు. గత కొన్ని చిత్రాలుగా, తన చిత్రాలు చూడటనికి వచ్చే ప్రేక్షకులకు వినోదంతో పాటు, సందేశం కూడా సున్నితంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు రాజు. చిత్రాలు తీయడంలో తన మనసుని పూర్తిగా లగ్నం చేస్తున్నందుకైనా ఆయన్ని "దిల్" రాజు అనవచ్చు. కేవలం ఒక్క చిత్రాన్ని మాత్రమే విజయవంతం చేసి, మిగితావి విఫలం చేస్తున్న వాళ్లకి అలా పేరు ముందు వాళ్ల చిత్రాన్ని పత్రికల వాళ్లు తగిలిస్తే వాళ్లకీ కాస్త చురక తగిలించినట్లు ఉంటుంది. ప్రతి చిత్రాన్ని ఇంత బాగా తీస్తున్న రాజుకి అలాంటివి అవసరం లేదు అనుకుంట! పైగా మన పరిశ్రమలో అలాంటి పేర్లు ఉన్న నిర్మాతలు పది మంది లేరు, ఉన్న ఆ ఒక్క నిర్మాతకి ఇంటి పేరు ఎలాగో ముందరుంది కాబట్టి ప్రేక్షకులు తికిమక పడే అవకాశమూ లేదు.

రాజు చిత్రాల్లో హాస్యం కోసం పాత్రల్ని అవమానించడం కనిపించదు. కథానాయికల అందాల ఆరబోత ఉండదు. మహిళా ప్రేక్షకులు తలదించుకుని చూసే సన్నివేశాలు ఉండవు. ఇతర చిత్రాల్ని అనుకరించడం ఉండదు. సకుటుంబం మొత్తం ఆయన చిత్రం చూస్తూ ఓ సాయంత్రం ఆహ్లాదంగా గడిపేలా ఉంటాయి. దర్శకుల ప్రతిభ వెలుగులోకి రావాలంటే ఇలాంటి నిర్మాతల వల్లే సాధ్యమవుతుంది. ఈ చిత్రంతో ఆయన పేరు, ఆయన సంస్థ పేరు మరి కొన్ని మెట్లు పైకి ఎక్కుతాయి అనడంలో అతిశయోక్తి లేదు.

ఆయన తీసేది డబ్బుకోసమే కదా అని ఎవరైనా అనవచ్చు.. కాని ఆ డబ్బు కోసం అడ్డమైన చిత్రాలు తీస్తున్న నిర్మాతలు, దర్శకులు, కథా నాయికానాయకులు ఉన్న పరిశ్రమ మనది. ఎన్నో అంచనాలతో చిత్రాల్ని చూడటానికి వెళ్లే ప్రేక్షకులకు, ఎలాగైనా విజయం దక్కించుకోవాలనో లేక తమ అహం చల్లార్చుకోవడానికో అడ్డమైన చెత్తనంతా నింపి చిత్రాల్ని ప్రదర్శిస్తూ వారి మనోభావాలను దెబ్బతీస్తూ, పైపెచ్చు అదంతా అభిమానులకోసమని చెప్పుకు తిరుగే మేథావులు రాజుని చూసి నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది.. కాని నిజమేంటంటే మూర్ఖులకు ఇలాంటి విషయాలు బ్రహ్మ పదార్థంతో సమానం.. అవి ఎప్పటికీ అర్థం కావు!

తరచూ చిత్రాలు చూసే ప్రేక్షకులకు వారు మాట్లాడుకునే ఆర్థిక భాషలో చెప్పాలంటే ఈ చిత్రం చూడటనికి వాళ్లు వెచ్చించిన డబ్బులకు సరిపడ చిత్రాన్ని విశ్రాంతి వరకు చూడటంతోనే సరిపోయింది అని వారికి అనిపిస్తుంది.

నా సలహా: తప్పక చూడండి.

నీ చిరునవ్వుల అలలలో కొట్టొకొచ్చె నీ పిలుపే..

ఎప్పుడో ఏడుసంవత్సరాల క్రితం భావోద్వేగంలో తన్నుకొచ్చిన కవిత.. నా జీవితంలో మొదటిది.. చివరిది కూడ అనుకుంటా.. ఎందుకంటే నేను రచయితను కాని కవిని కాను కదా.. ఎలా వుందో చెప్పండి.. మార్పులు చేర్పులు అవసరమనుకుంటే తెలియజేయండి..


నీ చిరునవ్వుల అలలలో కొట్టొకొచ్చె నీ పిలుపే
ఆ సిరునగవుల వెన్నెలలో వెళ్లిపోయె నా మనసే

వెళ్లిన నా మనసేమో ముత్యాలను వెతికెనంట
ముత్యాలకన్న స్వచ్ఛమైన హృదయాంతరాలు చూసెనంట

తన్మయత్వంతో గర్వించిపోయె నా మనసే
ఏమంటే అచట చూసింది తన ముగ్థరూపే

మనసేమో బయటకొచ్చి తనువుకే చెప్పెనంట
తనువేమో పులకరించి ఆమెనే హత్తుకునెనంట

అనురాగపు కౌగిలిలో కళ్లలోకె చూసెనంట
కళ్ళేమో చిరుజల్లు వంటి కన్నీరే కురిపించెనంట

ఆ మమతానురాగాలకు ఎల్లలే లేవంట
ఆ ప్రణయ సామ్రాజ్యాన్ని రాధాకృష్ణులై ఏలాలంట

నా మూడవ కథ - మమతల వనం

మమతల వనం
- అరుణ్ కుమార్ ఆలూరి


అత్యద్భుతమైన శుభముహూర్తాన వధూవరులకి కళ్యాణం జరిగింది. వధువు రాధిక, వరుడు మురళి. శోభన ముహూర్తమే తరువాయి. అది కూడా నిశ్చయమైపోయింది. ఆ శుభఘడియ రానే వచ్చింది. ఆ గదిలో తీపిపదార్థాలు లేవు. మంచం మీద మల్లెపూలు లేవు. నిత్యజీవితంలో ఎదురుపడే సాధారణ పడలగదిలా ఉంది. దోమలు కుట్టకుండా ఆలవుట్ వేసుంది. రెండు అగరొత్తులు మాత్రం సువాసనలు వెదజల్లుతూ కాలుతున్నాయి.


గదిలోకి అడుగు పెట్టింది రాధిక. తలుపు గడియవేసింది. ఆమె చేతిలో పాల గ్లాసు లేదు. గదిలోకైతే వచ్చింది కాని అక్కడి నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది. తల దించుకునే ఉంది.


'అతను నన్ను చూశాడా? చూడలేదా? చూసేవరకు ఇలాగే నిలబడలా? చూసినా చూడనట్టు నటిస్తున్నాడా?' అంటూ రాధిక మనసు పరిపరి విధమైన ఆలోచనలతో సతమతమైపోతున్నది. రాధిక రాగానే మురళి చూశాడు. కానీ ఆమె అక్కడే ఎందుకు నిలబడిపోయిందో అతనికి అర్థం కావడం లేదు.


'ఇలా రా!' అని అందామా? వద్దా? అని ఆలోచిస్తున్నాడు. చివరికి "హాయ్" అన్నాడు. కాని ఆమె నుండి ఏ స్పందనా రాలేదు. అలాగే తలవంచి నేలకేసి చూస్తోంది. అతను పిలిచిన పదం గొంతు దాటి రాలేదు. అతనికున్న కంగారుకి మాట గొంతు లోపలే ఇరుక్కు పోయింది. మొదటిసారి మొహమాటం అంటే ఏంటో అర్థమవుతోంది
మురళికి. విక్స్‌బిళ్ల యాడ్‌లోలాగా గొంతు సవరించుకున్నాడు.


ఆ చిరు అలికిడికి ఆమె తల అలాగే ఉంచి కళ్లని మాత్రం నెమ్మదిగా పైకెత్తసాగింది. మురళి ఆమె కళ్లనే చూస్తున్నాడు. ఆమె తన కంటి చూపును నేలపైనుంచి అలా పైకి సారిస్తూ, మంచంవైపు కదుపుతూ మురళి పాదాల చెంత చూపుని కేంద్రీకరించింది. పాదాలకు ఉన్న గోరింటాకు వల్ల అవి ఎంతో అందంగా కనిపిస్తున్నాయి. కంటిచూపుని మరికాస్త పైకి సారించింది. పట్టు ధోవతి మెరిసిపోతోంది. వంకర టింకరగా ధోవతి కట్టుకున్నట్టు స్పష్టంగా అర్దమవుతోంది రాధికకు. అతనికి కట్టుకోవడం రాదని గుర్తొచ్చి కిసుక్కున నవ్వింది. ఆ నవ్వు మురళిలో ఆందోళన పెంచింది. 'ఎందుకు నవ్వింది? ఏమన్నా బాలేదా?' అనుకుంటూ ఆపదమస్తకం చూసుకున్నాడు. 'అన్నీ బాగానే ఉన్నాయే!' అనుకున్నాడు.
ఆమె తన కళ్లని మరికాస్త పైకి లేపి చూసింది. పట్టు చొక్కా గోరింటాకు పండిన చేతులు, చేతికి బ్రాస్‌లెట్, చేతి వేళ్లకి ఉంగరాలు. చూపుని మరికాస్త పైకనడానికి వీలుకావట్లేదు. లాభం లేదని తలనే నెమ్మదిగా పైకెత్తింది. అప్పటి వరకు రాధికను చూస్తున్న మురళి వెంటనే చూపుని మరల్చాడు. అతని ముగ్ధమనోహర రూపం రాధిక మనస్సుని దోచేసింది. పెళ్లి హడావిడిలో పడి పక్కనే ఉన్నా అతన్ని సరిగ్గా చూడలేకపోయానని చాలా బాధపడింది. ఇప్పుడా కోరిక తీరినందుకు ఎంతో ఆనందంతో ఆమె మొహం మిరుమిట్లు గొలుపుతోంది. అతడి ఛాయా చిత్రాన్ని అలాగే తన మనో:ఫలకంపై ముద్రించింది. అంతటి అందగాడు తన భర్త కావడం అదృష్టం అని మురిసిపోయింది. క్షణమొక యుగంలా గడుస్తోంది అక్కడి సమయం.


అతను గదిని ఆసాంతం పరిశీలిస్తూ చూపుని రాధికవైపు మరల్చగానే, రాధిక అప్పుడు ఆ గదిని పరిశీలించడం మొదలుపెట్టింది. అలా ఒకరి చూపును ఒకరు తప్పించుకుంటూ దిక్కులు చూస్తున్నారు. మన్మథుడు బాణం వేశాడో, ఏదన్నా అద్భుతం జరిగిందో తెలియదు కాని, ఇద్దరి చూపులు ఒకదాన్నొకటి ఢీకొని కౌగిలించుకున్నాయి. ఒకరి కళ్లలోకి మరొకరు అలాగే చూసుకున్నారు. వెంటనే తేరుకుని చిరునవ్వులని విసురుకున్నారు. అతను నవ్వుతుంటే ఆ నవ్వుని అంత దూరం నుంచి ఆస్వాదిస్తున్నందుకు తనను తానే దూషించుకుంది. మురళి "హాయ్" అన్నాడు కాస్త బిగ్గరగా. అది రాధిక చెవి దాకా స్పష్టంగా చేరలేదు. ఏదో చప్పుడైనట్టు అనిపించి అప్రయత్నంగా "ఆ.." అంది. ముచ్చటగా మూడోసారి గొంతు ధ్వని పెంచి "హాయ్" చెప్పాడు మురళి.


చిరునవ్వుల్ని చిందిస్తూ "హాయ్" అంది రాధిక. ఆ నవ్వులో ఆమె పలువరుసలు ఎంతందంగా ఉన్నాయో! ఎర్రటి దొండపండులాంటి పెదాల మధ్య తెల్లటి పలువరుస , కళ్ళలో మన:స్ఫూర్తిగా నవ్వుతున్న కాంతి, సిందూర వర్ణమైన బుగ్గలు, వాటి మీద పడిన సొట్టలు, ఎనిమిదో వింత చూస్తున్నట్టుగా ఉంది మురళికి. కన్నార్పకుండా ఆ నవ్వే మోముని అలాగే చూడసాగాడు. తేరుకొని మురళి కూడా నవ్వి "ఇలా రా!" అంటూ తన పక్కన కూర్చోమన్నట్టుగా చేతిని చూపిస్తూ, కళ్లతో సైగ చేశాడు.


అప్పుడు కదిలింది పాదం. పట్టీల శబ్బ్దాలు ఘల్లున సవ్వడి చేస్తూ శ్రవణానందకరంగా స్వాగతం పలుకుతోంటే, గాజుల చప్పుళ్ళు పట్టీల శబ్దానికి వినసొంపుగా తాళం వేస్తుంటే, లయబద్ధంగా ఒక్కో అడుగు ముందుకేస్తూ నడుస్తోంది. రాధికని ఆపాదమస్తకం గమనించసాగాడు. నిండుపున్నమి వెన్నెలలా కాంతులీనుతున్న మోము, లేత గులాబి పట్టు చీరలో సన్నటి నడుము, దానిపై వడ్డాణం, అందమైన మెడ, ఆ అందాన్నిచ్చే తాళిబొట్టు దానికి తోడు మరిన్ని పసిడిగొలుసులు. వాహ్! బాపు బొమ్మ కదిలొస్తున్నట్టుగా ఉంది మురళికి. తను దగ్గరవుతున్న కొద్ది ఆమె జడలోని మల్లెపూల మకరందం మనసులో కోరికలను రెచ్చగొడుతున్నాయి. మల్లెపూవు మాధుర్యం విలువెంతో అప్పుడు తెలిసొచ్చిందతనికి.


రాధిక వచ్చి మురళి పక్కన ఇటు దగ్గర, అటు దూరం అనలేని ప్రాంతంలో మంచంపై కూర్చుంది. అంత అందాన్ని అంత దగ్గర నుండి చూడటనికి అతనికి రెండు కళ్లూ చాలడం లేదు.

'ఇప్పుడేం చేయాలి?' ఇద్దరి మనసుల్లో మెదులుతున్న ప్రశ్న. మళ్లీ అదే నిశ్శబ్దం, అదే దిక్కులు చూడటం.


ఏదో గుర్తొచ్చినట్టు మొహం పెట్టి మళ్లీ వెంటనే ఏదో మరచిపోయినట్టు ముఖకవళికలు మార్చి చటుక్కున లేచి నిలబడింది. మురళి కూడా అప్రయత్నంగా లేచాడు. అప్పుడు రాధిక వంగి మురళి పాదాలను తాకుతూ ఆశీర్వాదం కోసం ఎదురుచూస్తోంది. రాధిక వేళ్లు మురళి పాదాలను తాకగానే ఒక్క గెంతులో వెనక్కి దుమికి "ఏంటది?" అన్నాడు.


తెలిసి అడొగాడో తెలుసుకుందామని అడొగాడో అర్థం అవక లేచి నిలబడి అతన్నే ఆశ్చర్యంగా చూడసాగింది. "నాకిలాంటివన్నీ నచ్చవు" మెల్లిగా చిరునవ్వులు ఒలకబోస్తూ చెప్పాడు మురళి.

"భర్త దేవునితో సమానం అన్నారు. అందుకే మీ ఆశీర్వాదం కోసం.. " అంది రాధిక.

"ఎవరు చెప్పారు?" అడిగాడు మురళి.

"పంతులు గారు చెప్పారు!" అమాయకంగా బదులిచ్చింది రాధిక.

"మనిద్దరం దాదాపు ఒకే వయసు వాళ్లం. అలాంటప్పుడు నువ్వు నా పాదాలకి నమస్కరించడం..?"

"భర్త పాదాలకు నమస్కరిస్తే భార్యకు శుభప్రదం. పొద్దున లేవగానే ఆ పాదాలకు నమస్కరిస్తే అంతకంటే పుణ్యం మరొకటుండదంటా!"

ఆమె అమాయకత్వానికి మురళికి నవ్వొచ్చింది. "దీవించండి" బతిమాలుతున్నట్టుగా అడిగింది రాధిక.

"కానీ, ఏమని దీవించాలో నాకు తెలియదు" అన్నాడు మురళి.

"మీ ఇష్టం! ఏదో ఒకటి అనండి. ప్లీజ్" అని మళ్లీ అతని పాదాలు నమస్కరించింది.

"శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు" అన్నాడు.

కిసుక్కున నవ్వి, " నాకు ఆల్‌రెడీ పెళ్లైందండి. అదీ మీతోనే!" తల పైకెత్తి మురళి కళ్లలోకి సూటిగా చూస్తూ కొంటెగా అంది రాధిక.

"సారీ! శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తూ" అన్నాడు.

"అమ్మాయిలంటే ఇష్టం లేదా? అబ్బాయే కావాలా?" అలాగే ఉండి అంది.

"అలాంటిదేం లేదు! నోట్లోంచి అలా వచ్చేసిందంతే! నువ్వు ముందులేచి అక్కడ కూర్చో" అన్నాడు.

ఆమెది అమాయకత్వమో, గడుసుతనమో అర్థం కాలేదు అతనికి. రాధిక మంచంపై కూర్చోగానే అతనూ కూర్చున్నాడు. "నీకు.." అంటూ ఇద్దరూ ఒకేసారి ఏదో అడగబోయి ఆగిపోయారు.

"మీరు చెప్పండి" అంది రాధిక.

"ఫర్వాలేదు, నువ్వు చెప్పు" అన్నాడు మురళి.

"మీరు చెప్పాక చెప్తాను. మీరు చెప్పండి"

"నీకేదంటే ఇష్టం"

"అంటే?"

"అంటే..! ఎందులో అయినా సరే ఏదంటే ఇష్టం? ఇ మీన్ టు సే అన్నింట్లోనూ నీ ఇష్టాలేంటో చెప్పు" అన్నాడు.

"అమ్మ, శైలజ.., జాంపండు.., టమాటా ఫ్రై.., హృతిక్‌రోషన్.., తెలుపు రంగు.., మావూరు.., ఇంకా.. మీరు" అంది తలదించుకొని సిగ్గుపడుతూ! "ఇంకా.. మీరు" అన్న పదం మురళి మనసులో గింగిర్లు తిరుగుతోంది! ఇప్పటి వరకు తనతో చాలామంది అమ్మాయిలు "నువ్వంటే ఇష్టం" అని చెప్పారు, కాని వాటిల్లో ఎందులోను లేని అద్భుతమైన భావనా, ప్రేమ రాధిక గొంతులో ఆమె మాటల్లో కన్పించాయి. ఆనందం వల్లో, సిగ్గువల్లో మురళి నవ్వుతూ ఆమెని చూస్తున్నాడు. అతని చూపు ఆమె చేతుల దగ్గర ఆగిపోయింది. తెల్లని చేతులకు అందంగా వేయబడిన గోరింటాకు ఎర్రగా పండి ఎంతో అందాన్నిస్తుండగా, ఆమె చేతి గాజులు, ఆ చేతులకు మరింత శోభను చేకూర్చాయి.


"మీకేవంటే ఇష్టం" సన్నగా అడిగింది రాధిక.

"అమ్మానాన్న.., ఇల్లు.., పొలాలు.., గుత్తొంకాయకూర.., బాపు బొమ్మలు.., వారపత్రికలు."

"అంటే.. నేనంటే ఇష్టం లేదా?" మెల్లిగా అడిగింది.

"ఇష్టపడకుండానే పెళ్లి చేసుకున్నానా?" కొంటెగా చెప్పాడు మురళి.

'అలాంటప్పుడు ఆ మాటేదో నోటితో - నువ్వంటే ఇష్టం అని చెప్తే ఎంత సంతోషించేదాన్ని! అయినా ఈ మగాళ్ళంతా ఇంతే ఓ పట్టాన బయటపడరు' అనుకుంది.

"పడుకుందామా! బాగా అలసిపోయాను. నిద్దరొస్తుంది!" అడిగింది రాధిక.

అమాయకంగా ఆదిగేసరికి కాదనలేక నవ్వుతూ తలూపాడు మురళి. అలా ముగిసింది వారి తొలిరేయి.


***


రెండోరోజు రాత్రి మురళి తన మనసులో మాటని చెప్పాలని నిశ్చయించుకున్నాడు. రాధిక కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు. ఇంతలో తను వచ్చి మురళి పక్కన కూర్చుంది.

"టమాట ఫ్రై తిన్నారా?" అడిగింది రాధిక.

"ఊ" సమాధానమిచ్చాడు మురళి.

"ఎలా ఉంది?"

"బావుంది"

"నిజంగా?"

"అవును"

"నేనే వండాను. అమ్మ వద్దన్నా వినకుండా వండాను. మీకు నచ్చుతుందో లేదో అని ఎంత టెన్షన్ పడ్డానో!" సిగ్గుపడుతూ అమాయకంగా చెప్పింది. ఆ అమాయకత్వానికి మురళికి ముచ్చటేసి తన నుదిటిపై ఓ ముద్దు ఇవ్వాలనుకున్నాడు, కాని తను చెప్పవలసిన విషయం గుర్తొచ్చి అలాగే ఉండిపోయాడు.

"నీ దృష్టిలో శృంగారం అంటే ఏంటి?" అడిగాడు మురళి. కుండబద్దలు కొట్టినట్టు మొహంమీదే ఆడిగేసరికి ఆశ్చర్యపోయింది రాధిక. మెందుకు అడుగుతున్నాడో అర్థం అవక అలాగే చూస్తుండిపోయింది.

"శృంగారం అనేది శరీరానికి సంబంధించిందా? లేక మనసుకు సంబంధించిందా?" అడిగాడు మురళి.

"రెండింటికి సంబంధించింది"

"గుడ్..కానీ మనసులు కలుసుకోకుండా శరీరాలు ఒకటైతే అది శృంగారం ఎలా అవుతుంది?"

"అఫ్‌కోర్స్"

"మొన్నటి వరకు నువ్వెవరో? నేనెవరో? ఇప్పుడు పెళ్లైంది కదా అని మన శరీరాలు కలిస్తే దాన్ని శృంగారం అంటారా? ఒకర్నొకరం అర్థం చేసుకునే వ్యవధి లేకుండా ముహూర్థాలు కుదిరాయి"

మధ్యలోనే రాధిక "ఉన్న వారం రూజులైనా మీతో ఫోన్లో మాట్లాడాలని ఎంతో ప్రయత్నించాను! ఎప్పుడు ఫోన్ చేసినా పనిలో ఉన్నాను అనేవారు" అంది.


"అందుకే ఇప్పుడు అర్థం చేసుకుందాం! ఒకర్నొకరు పరిపూర్ణంగా తెలుసుకుందాం! అయినా వారం రోజుల్లో పెళ్ళి అంటే నాకెన్ని పనులుంటాయి? ఎంత హడావిడి ఉంటుంది! ఒకవేళ ఈ వారం రోజుల్లో మనం మాట్లాడుకున్నా ఒకర్నొకరం పూర్తిగా అర్థం చేసుకునేవాళ్లమా? అందుకే ముందు మన మనసులు ఒకటయ్యాకే మన శోభనం జరగాలి అని నేననుకుంటున్నాను. నువ్వేమంటావ్?"


'నువ్వేమంటావ్ అని అడిగారు, అదే పదివేలు. అర్థాంగి అభిప్రాయం తెలుసుకోవాలన్న సంస్కారం మీకుండటం, మీలాంటి భర్త నాకు దొరకడం, నా అదృష్టం' అనుకుంది మనసులో! ఏ విధంగా ఆలోచించినా మురళి చెప్పింది అన్ని విధాలా శ్రేయస్కరం అనిపించింది రాధికకి. "నాకు చాలా సంతోషంగా ఉందండి! ఆ మాట నేనే చెబుదామనుకున్నాను. ఫోటోలు చూసుకొని పెళ్లి చేసుకున్నాం, పెళ్లిలోనే ఒకర్నొకరం చూసుకున్నాం! సడన్‌గా శోభనం అంటే నాకు చాలా ఎంబారిసింగా అనిపించింది. ఫస్ట్ టైం కదా!" అని నాలుక కరుచుకుంది.


"నాకు మాత్రం పదోదా మరి" మధ్యలో అన్నాడు మురళి.


ఒక్కసారిగా షాక్ అయింది రాధిక, ఆ తర్వాత తేరుకొని మురళి చిలిపితనానికి నవ్వింది. ఆ నవ్వుతో మురళి నవ్వు కూడా పాలుపంచుకుంది.


"అన్నట్టు మనం రేపే బయలుదేరాలి! రేపటితో నా లీవ్స్ అయిపోయాయి. ఆఫీస్‌లో రిపోర్ట్ చేయాలి!"

"అలాగే! అత్తయ్యా మామయ్యా కూడా వస్తున్నారా? తీరిగ్గా వస్తారా?"

"రావట్లేదు! అక్కడ ఉండేది మనమిద్దరమే!"

"మీరెళ్లిపోయాక నేనొక్కదాన్నే సాయంత్రం వరకు ఉండాలంటే బోరొస్తుందేమో!"

"బోరొస్తే బిందెతో నీళ్లు పట్టు!"

గలగలా నవ్వింది రాధిక.

"టీవీ చూడు. వీక్లీ చదువు. ఇంటి పక్కనుండే నిరంజన్ వైఫ్ నీ కోసం ఎదురుచూస్తోంది, తను కూడా సాయంత్రం వరకు ఒంటరిగానే ఉండాలి కదా! ఇప్పట్నుంచి నీకు బెస్ట్ కంపెనీ ఇస్తుంది!"

"ఏ కంపెనీ! విప్రోనా? ఇన్ఫోసిసా?" అంది రాధిక.

ఆశ్చర్యపోవడం మురళి వంతైంది. "యూ నాటీ!" అన్నాడు. నవ్వు మాత్రం ఇద్దరి పెదాలపై నుండి ప్రవహిస్తూనే ఉంది!


***


ఓ చల్లటి సాయంకాలం రెండో ఆట సినిమాకెళ్లి తిరిగొస్తున్నారు. అర్థరాత్రి, పైగా బైక్‌పై ప్రయాణం, అందునా అది చలికాలం! చలికి గజగజా వణుకుతూ మురళిని గాఢంగా కౌగిలించుకుంది రాధిక. మురళి నరాలు జివ్వుమన్నాయి. గుండె వేగం పెరిగిపోయింది. ఒకవైపు చల్లటిగాలి, మరోవైపు వెచ్చటి కౌగిలి. ఇంతకంటే రొమాంటిక్ సీన్ ఇంకోటుండదేమో అనుకున్నాడు. ఇంతలో మెరుపులాంటి అళొచన వచ్చింది మురళికి. బైకు స్పీడుని కాస్త పెంచాడు. దాంతో రాధికకు చలి కాస్త ఎక్కువనిపించింది. శ్రీవారి చిలిపితనాన్ని అర్థం చేసుకొని, మనసులోనే నవ్వుకొని, మురళికి మరికాస్త దగ్గరగా జరిగి, మరింత గాఢంగా కౌగిలించుకుంది. మురళి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఇరువురి శరీరాలు వేడెక్కాయి. ఆ వేడిని చలిగాలి సైతం చల్లార్చలేకుండా పోయింది. వారిపై వెన్నెల వెలుతురు వెండిపోత పోసినట్టుగా పరుచుకుంది. నిర్మానుష్యమైన రోడ్డుపై వెన్నెల వెలుతురులో మెరిసిపోతున్న ఆ జంటను చూసి చందమామ సైతం సిగ్గుపడ్డట్టున్నాడు, ఓ మబ్బుచాటుకు వెళ్ళిపోయాడు. ఆ అనుభూతిని అలాగే ఒడిసిపడుతూ బైక్‌ని ఇంటివైపు పరుగెత్తించాడు మురళి.


రాధికకు ఆ రాత్రి నిద్రాదేవి కరుణించలేదు. ఆ మధుర భావనలోనే మునిగిపోయింది. కానీ మరోవైపు దిగులు కూడా పట్టుకుంది. తను మురళిని అర్థం చేసుకుంది. ఇప్పుడు పరిపూర్ణంగా ప్రేమిస్తోంది. కాని మురళి తనను ప్రేమించడానికి ఇంకా ఎన్ని రోజులు? ఆ దిగులే ఆమెని వేధిస్తోంది. ఒక వేళ తను మురళికి ఏ కారణం చేతైనా నచ్చకపోతే..! ఆ ఊహకే గుండె ఆగినంత పనయింది. అలా జరక్కూడదనుకుంటూ బలవంతంగా నిద్రలోకి జారుకుంది.


***


మరో రాత్రి.. ఒకరు ఉత్తరం వైపు, మరొకరు దక్షిణం వైపు తిరిగి పడుకున్నారు. ఇద్దరూ మగత నిద్రలోనే ఉన్నారు. ఒకేసారి ఇద్దరూ దిక్కులు మార్చి తిరిగేసరికి వారి ఆకారాలు ఎదురెదురయ్యాయి. ఇరువురి పెదాలు స్పర్శించుకున్నాయి. మురళి పెదవుల మధ్యనున్న లోతట్టు ప్రాంతంలో, రాధిక పై పెదవి సర్దుకుంది. ఒకరి ఊపిరి మరొకరిని తాకి గిలిగింతలు పెడ్తోంది. మెత్తటి పెదాలు మరో మెత్తటి పెదాల్ని అలాగే స్పర్శిస్తున్నాయి. ఇద్దరికీ రసానుభుతి కలుగుతున్నా, నిద్రని నటిస్తున్నారు. ఆ మధురానుభుతిని మనఃస్ఫూర్తిగా అనుభవిస్తున్నారు. క్షణాలు నిమిషాలై దొర్లిపోతున్నాయి. మొహమాటం వీడి, చొరవ తీసుకోవాలని మురళి నిర్ణయించుకొని, ఆమె పెదాల్ని తన పెదాలతో అల్లుకునేందుకు ప్రయత్నించే క్షణంలో, రాధిక ఆ వైపు తిరిగింది. మనసులోనే నిట్టూర్చి నిద్రకుపక్రమించాడు మురళి.


***


రోజూ వాళ్ల గురించి, వాళ్ల చిన్ననాటి సంఘటనల గురించి మాట్లాడుకుంటూ ఒకరి భావాల్ని ఒకరు అర్థం చేసుకుంటూ గౌరవించుకుంటూ, అలాగే నిద్దరోతున్నారు. రాధిక నిద్రలోకి జారుకున్నాక, ఆమె మొహాన్ని చూడటం మురళికి అలవాటయింది. ఒక్కోసారి పడుకున్నట్టు నటించి, వెంటనే కళ్లు తెరిచేది రాధిక. దొరికిపోయిన దొంగలా చటుక్కున అటుతిరిగి పడుకునేవాడు మురళి. పొద్దున లేవగానే మురళిని తనివితీరా చూసి అతని పాదాలకు నమస్కరించడం రాధికకు అలవాటుగా మారింది.


ఒకరినొకరు పరిపూర్ణంగా అర్థం చేసుకున్నారు. ఒకర్నొకరు మనఃస్ఫూర్తిగా ప్రేమిస్తున్నారు. కానీ ఆ విషయం మాత్రం పెదవిదాటి బయటపడటం లేదు. 'ముందు నేనే ఎందుకు చెప్పాలి?' అన్న చిన్న ఇగో ఫీలింగ్ ఇద్దరిని బాధిస్తోంది. రోజూ ఒంటరిగా పడుకోవడం ఇద్దరికీ చాలా ఇబ్బందిగా ఉంది. భర్తగా మురళి, ఆశించినదానికంటే ఎక్కువ ప్రేమగానే చూసుకుంటున్నాడు. ఆ ప్రేమను దుర్వినియోగం చేయకుండా కాపాడుకుంటూ తనూ జాగ్రత్తగానే మసలుకుంటోంది.


ఇంతలో ఫిబ్రవరి 14, ప్రేమికులరోజు దగ్గరపడుతోంది. ఆ రోజుకున్న మహత్యమో, లేక విరహవేదనను భరించలేని ఒంటరితనెమో, 'నేనే ఎందుకు చెప్పాలి?' అనుకున్న రాధికని 'నేనే చెప్తే తప్పేంటి? ప్రేమించేది మా ఆయన్నే కదా!' అనుకునే స్థాయికి తీసుకొచ్చింది. తన మనసులోని ప్రేమని తెలియచెప్పేందుకు అదే తగిన సమయమని నిర్ణయించుకుంది. ఆ రోజు రానే వచ్చింది. ఉదయం మురళి ఆఫీసుకు వెళ్లేంతవరకు ఏమి ఎరుగని దానిలా ఉండిపోయి, సాయంత్రం తెల్లచీర కట్టుకుని, మల్లెపూలు పెట్టుకుని మురళి కోసం ఎదురుచూడసాగింది.

కాలింగ్ బెల్ మోగింది.

ఆత్రంగా వెళ్లి తలుపు తీస్తే నిరాశే ఎదురైంది. కొరియర్ బాయ్ వచ్చి ఏదో గిఫ్ట్ బాక్స్ ఇచ్చి వెళ్లాడు. దాన్ని అలాగే సోఫాలో పారేసి, తను అల్లిన కర్చీఫ్ వంక చూడసాగింది. తన మనసులోని మాటని ఖర్చీఫ్‌పై 'ఐ ఎల్ యు' అని ఎంబైడరీ చేసింది. ఓ గ్రీటింగ్ కార్డ్ కూడా తయారుచేసింది. ఇంతలో మురళి వచ్చాడు. తెల్లచీరలో మల్లెపూలు పెట్టుకున్న రాధికని చూసి ఆశ్చర్యపోయాడు. రాధికకు దగ్గరగా వఆడు. రాధిక సంతోషంతో ఖర్చీఫ్‌ని మురళికి అందివ్వబోగా మురళి అది గమనించకుండా, సోఫాపై ఉన్న బాక్స్‌ని చూశాడు.

"ఏంటది? ఓపెన్ చేయలేదా?" అనడిగాడు.

"మీకొచ్చిందని, ఓపెన్ చేస్తే బాగోదని" అంది.

తనలో తానే తిట్టుకున్నాడు మురళి. ఆ బాక్స్‌పై పొరపాటున తన పేరే రాసి కొరియర్ చేశాడు. అందులో ఓ తెల్లచీర, మల్లెపూలు, ఓ గ్రీటింగ్‌కార్డ్ ఉన్నాయి. తన ప్రేమని అలా తెలియజెప్పాలనుకున్నాడు. ఆ బాక్స్ తీసుకొని రాధికకు ఇచ్చాడు.

"ఇది నీకే! నేనే పంపాను" అన్నాడు.

రాధిక ఆశ్చర్యపోతూ అందుకుని ఖర్చీఫ్‌ని, గ్రీటింగ్‌కార్డ్‌ని మురళి చేతికందించింది. ఖర్చీఫ్ మొత్తం విప్పేసరికి, మురళి కళ్లలో నీళ్ళు తిరిగాయి. ఖర్చీఫ్‌ని ముద్దాడి, అందంగా పెయింట్ వేయబడిన గ్రీటింగ్‌కార్డ్‌ని చూశాడు. ముత్యాల్లాంటి అక్షరాలతో అందమైన కవిత్వం. రాధిక సృజనాత్మకతకి మురళి నిలువెల్లా పరవశించిపోయాడు.


రాధిక బాక్స్‌ని ఓపెన్ చేయగానే మల్లెపూల వాసన గుబాళించింది. పూలు తాజాగా ఉన్నాయి. తెల్లటి పట్టు చీరను తడిమి, గ్రీటింగ్‌కార్డ్‌ని చూసింది. ద బెస్ట్ అండ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్స్ ఇన్ ద వరల్డ్ కెనాట్ బి సీన్ ఆర్ టచ్‌డ్, దె ఆర్ జస్ట్ ఫెల్ట్ విత్ ద హార్ట్ - అవర్ లవ్ ఈస్ వన్ ఎమాంగ్ దెమ్. ఆనందభాష్పాలతో మురళిని హత్తుకుంది.


ఆ క్షణం కోసం నిరీక్షిస్తూ, ఆ క్షణం కోసం దిగులుపడుతూ, ఆ క్షణం కోసం దైవాన్ని వేదుకుంటూ గడిపిన ప్రేమికులు ఆ క్షణం ఎదురయ్యేసరికి, గాఢంగా పెనవేసుకున్న మనసులు గాలిలో తేలుతూ, విశ్వాన్ని జయించిన విజయ గర్వంతో ఓలలాడుతూ, కట్టలు తెంచుకున్న గోదారిలా ఉరకలేస్తూ, ఆనందభాష్పాలు రాలుస్తూ ఒదిగిపోయారు. గాలిదూరే సందులేకుండా అలుముకున్న వారి మనసులు ఆ శుభకార్యానికి ఆ రాత్రే ముహూర్తమని నిర్ణయించాయి.


***


పడకగదిని శుభ్రంగా సర్ది, వాటి మీద మల్లెపూలు చల్లింది రాధిక. ఆఫీసు నుంచి వస్తూ తీసుకొచ్చిన తీపి పదార్థాలను సర్ది, అగరొత్తులు వెలిగించాడు మురళి. ఇద్దరూ తలంటు స్నానం చేశారు. శోభనం నాటి దుస్తులు వేసుకున్నాడు మురళి. తెల్ల పట్టుచీర, మల్లెపూలతో రెడీ అయింది రాధిక. మురళి, రాధిక కోసం శోభనం గదిలో ఎదురుచూస్తూ ఉన్నాడు. రాధిక పాలగ్లాసుతో లోపలికి అడుగుపెట్టింది. ఆమె దగ్గరకు వెళ్లి నడుం మీద చేయి వేశాడు. అతడు చేయి వేసిన ప్రాంతంలో తరంగాలు వేల ప్రకంపనాలుగా మారి మెదడు తీరాలని చేరి మెదడుని మొద్దుబారిపోయేలా చేశాయి. మత్తుగా అతని వంక తల పైకెత్తి చూసింది. మెల్లిగా రాధికను తోడ్కొని, మంచం దగ్గరకు తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. సగం పాలు తాగి, మిగితా సగం గ్లాసు పాలు రాధిక పెదవుల చెంతకు తీసుకెళ్లాడు. రాధిక ఆ పాలు తాగగానే, అవి పై పెదవిని తగిలి మీసకట్టులా కన్పిస్తోంది. రాధికకు దగ్గరగా వెళ్లి, పెదాలతో ఆ మీసకట్టుని తుడిచాడు మురళి. మెదడు పూర్తిగా చలనం లేనిదై అమాంతం అలాగే వెనక్కు వాలిపోయింది రాధిక. అరచేతిని ముద్దుపెట్టుకొని ఆ చేతి ఉంగరాలను తీస్తూ వేలికో ముద్దును బహూకరిస్తున్నాడు. గాజులు, ఉంగరాలు లేని అందమైన చేతులను మళ్లీ ముద్దాడి చూపుని మెడపై సారించాడు. అక్కడ మంగళసూత్రం మినహా అన్ని గొలుసులను రాధిక ఒంటినుండి విడదీస్తూ, గొలుసుకో ముద్దు చొప్పున మెడపై మేడ కట్టాడు. ఆ ముద్దుల వానకి మైకంగా కళ్లు మూసింది రాధిక. అలవాటులేని కొత్తలోకంలోకి వెళ్లిపోయింది. ఆభరణాలన్ని తొలగిస్తూ మురళి కురిపిస్తున్న ముద్దుల వానకి తడిసి ముద్దైపోయింది.


అతడి చూపు ఆమె దుస్తులపై పడింది. ముద్దుల వర్షం మళ్ళీ మొదలైంది. ఆరు నెలల క్రితం జరిగిన తొలిరేయిలో, ఇలాంటి ముద్దును దక్కించుకున్నా, ఇంతటి మాధుర్యం మాత్రం ఉండేది కాదు అనిపించింది రాధికకి. అప్పుడు కొత్తగా పెళ్లైన భార్యాభర్తలు, ఇప్పుడు ఒకర్నొకరు పూర్తిగా అర్థం చేసుకున్న ప్రేమికులు. తేడా లేదూ?


అతని కళ్లలోకి సూటిగా చూడలేక, నవ్వుతూ చెవిని ముద్దాడి, సన్నగా అడిగింది, "మీరిలాగే ఉంటారా?" అని.


ఎక్కడ సిగ్గుపడాలో అక్కడే సిగ్గుపడాలి. అలా అయితేనే ఆ సిగ్గుకి అందం. శుభకార్యంలోనూ సిగ్గుపడితే సంసారాలు సాగుతాయా? దాంపత్య జీవితం ఏ ఒక్కరి కోసమో కాదు కదా! ఇద్దరి ఆనందాల మేళవింపు. ఆ సత్యాన్ని రాధిక గ్రహించినందుకు మురళికి ముచ్చటేసింది. రాధిక పెదాలపై చిన్న ముద్దిచ్చి, ఆమె మాదిరి మారిపోయాడు.


***


ఉదయం లేవగానే మురళిని చూడగానే సిగ్గుతో వణికిపోయింది. మురళి మాత్రం గాఢ నిద్రలో ఉన్నాడు. తన బట్టలు వెతికి పట్టుకొని బాత్రూంలోకి నడిచింది రాధిక. తలంటు స్నానం చేసి టిఫిన్ చేస్తూ ఆలోచించసాగింది. రాత్రి జరిగిందంతా కలా? నిజమా? జరిగిందంతా నిజమే అని తెలుసు అయినా ఓ అందమైన కలలా అన్పిస్తోంది రాధికకు. మురళి పరిస్థితి అలాగే ఉంది. రాధిక కళ్లలోని కళ్లు పెట్టి చూడలేక పోతున్నాడు. టిఫిన్ చేశాక, రాధిక వచ్చి మురళి పక్కన నిలబడింది సిగ్గుపడుతూ.


రాధికని ఆప్యాయంగా కౌగిలించుకుని పెదాలపై తియ్యటి ముద్దిచ్చాడు. "బై" అని చెప్పి కౌగిలివీడి ద్వారం వద్దకు చేరుకున్నాడు. మురళిని కౌగిలించుకునేందుకు రాధిక వచ్చి అతని చెంతకు చేరగానే, అప్పటికి అదే ఆలోచనతో ఉన్న మురళి సరిగ్గా ఆ సమయంలోనే రాధిక కోసం వెనక్కి తిరిగాడు. కళ్ల ముందే రాధిక కనిపించే సరికి ఆశ్చర్యపోయి, బిగి కౌగిలిలో నలిపేస్తూ గాఢంగా చుంబించాడు. ఇంతలో మురళి సెల్ మోగింది. " సారీ అండీ! ఒంట్లో బాలేదు! ఆఫీస్‌కి రావట్లేదు" అని చెప్పి కట్ చేశాడు. పడకగదిలో వారిరువురూ అడుగిడగానే మంచంపై నలిగిపోయి ఉన్న మల్లెపులు, మిగిలిపోయిన తీపి పదార్థాలు, ఖాళీ పాలగ్లాసు వారికి స్వాగతం పలుకుతున్నట్టుగా అగుపించాయి.



- అయిపోయింది -


* ఆంధ్రభూమి సచిత్ర వార పత్రికలో 24-ఏప్రిల్-2008న ప్రచురితం *





నా రెండవ కథ - పై దారి


పైదారి
- అరుణ్ కుమార్ ఆలూరి
నాదో అందమైన చిన్న ఇల్లు. ఇంటి వెనక రైలు పట్టాలు, ఇంటి ముందర తారు రోడ్డు, మధ్యలో ఇల్లు. నూట పది గజాల స్థలంలో ఒక్క అంగుళం కూడా వదిలి పెట్టకుండా కట్టుకున్న అందమైన ఇల్లు. ఈ పట్టణంలో నాలాంటి మధ్యతరగతి జీవికి ఇంటికి ముందు కొంత, ఇంటి వెనక కొంత స్థలం వదిలి అక్కడ మొక్కలు పెంచుకోవాలని, వాటి దినదినాభివృద్ధి చూస్తూ తన్మయత్వం చెందాలని ఆశపడితే అది అత్యాశే అవుతుంది. అందుకే పట్టాల గట్టున పెరిగే మొక్కలే నా చిట్టి మొక్కలని ఊహించుకుంటూ ఉంటాను. ఊహ ఎంత అందమైనది! ఊహలోనే జీవితం ఉంది. నిజానికి సగటు మనిషి ఆనందంగా బ్రతికేది ఊహా జీవితంలోనే కదా!

ఇంటి ముందర భాగంలో షెట్టర్ కట్టించాను. దాని గుండా లోపలికి వస్తే వరండా, తర్వాత బెడ్‌రూం, చివరగా వంట గది. దాని వెనకాల రైలు పట్టాలు. షెట్టర్‌లో కిరాణా షాపు పెట్టాను. నేను ఆఫీసుకి బయలుదేరేంత వరకు షాప్‌ని చూసుకుని, ఆ తర్వాత నా భార్యకు అప్పజెప్పేవాణ్ణి. సాయంత్రం రాగానే మళ్ళీ నేనే కూర్చునే వాణ్ణి.

***

ఇంటి పక్కన నర్సమ్మ, ఆమె భర్త ఉండేవారు. కాని నర్సమ్మే అందరికి ఎక్కువగా తెలుసు. వాళ్ళకీ ఇంటి ముందర భాగంలో షెట్టర్ ఉంది. దాంట్లో చాయ్ దుకాణం పెట్టింది. కొన్ని రోజులకు ఉదయం పూట ఐడ్లీలు, సాయంత్రం పూట మిరపకాయ బజజీలు వేయడం మొదలు పెట్టింది. ఆమె చేసిన బజ్జీలు ఎత రుచో, ఆమె మాటలు అంత ఘాటు. లేవగానే గొడవ పెట్టుకనేది. గొడవ పెట్టుకోవడనికి ఆమెకి చిన్న కారణం చాలు. ఒక వేళ ఏరోజైనా కారణం దొరక్కపోతే అంతకు ముందు రజు గొడవనే మళ్లీ సాగదీసేది. ఒక్కోరోజు ఒక్కొక్కరతో గొడవ. చివరికి ఆమెకది అలవాటుగా మారిపోయింది. ఆె "సుప్రభాతం"తోనే ఉదయం నిద్రలేవడం అలవాటయింది. ివరికి ఆమెను ఎవరూ పట్టించుకోని పరిస్థితి వచ్చంది. ఇంటి వెనక రైలు శబ్దాలు, ముందర వాహనాల శబ్దాల, పక్కన నర్సమ్మ అరుపులు ... నిత్య జీవితంలో భాగమైపయాయి.

జీవితం హాయిగా సాగిపోతూ ఉంది. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. నగరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. నా కిరాణా కొట్టులో కూడా మార్పులు వచ్చాయి. పరిస్థితులకు తగ్గట్టు మారాలి. లేకపోతే జీవితం లేదు కదా! పిల్లలు డిగ్రీ కొచ్చారు! కొత్తగా పైదారులు(ఫ్లై ఓవర్లు) కట్టనున్నట్టు దిన పత్రికలో చదివి ఆశ్చర్యపోయాను. అదేంటో అర్థం కాక అమ్మాయినడిగాను. "నది దాటడనికి వంతెన ఎలాగో, ట్రాఫిక్ జాంని తప్పించడనికి పైదారి అలాగ" అని చెప్పింది. చాలా ముచ్చటేసింది. నా ఇంటికి కిలో మీటరు దూరంలో ఉన్న ఆర్.టి.సి. చౌరస్తాలో కూడా ఒక పైదారి వస్తే బాగుండుననుకున్నాను.  రోజూ అక్కడ అరగంట గడిపితే గాని ఆకుపచ్చ సిగ్నల్ కనిపించడం లేదు. రాను పోను, గంట సమయం అక్కడే ఆవిరైపోతూ ఉంటుంది. 

ఎప్పటిలాగే ఆ ఉదయం లేవగానే నర్సమ్మ "సుప్రభాతం" వినిపించలేదు. అందుకే ఆలస్యంగా లేచానేమో అనిపించింది. బ్రష్ చేస్తూ బయటకొచ్చి చూస్తే ఆశ్చర్యం! నా కళ్లను నేనే నమ్మలేకపోయాను. నర్సమ్మ ఛాయ్ దుకాణంలో  వేరే ఎవరో వచ్చి టిఫిన్ సెంటర్ పెట్టారు. ఇడ్లీలతో పాటు దోశలు, వడలు, పూరీలు కూడా కనిపిస్తున్నాయి.


నా ఆశ్చర్యాన్ని గమనించిన అర్థాంగి, నీళ్ల బిందెతో అలాగే నిలబడి వివరణ ఇచ్చింది. "ఇల్లు అద్దెకు ఇచ్చేసి రాత్రికి రాత్రే భర్తతో కలిసి నర్సమ్మ ఎక్కడికో వెళ్లిపోయింద"ని చెప్పింది. పాపం నర్సమ్మ! ఆమె పరిస్థితి తలచుకుంటే జాలేసింది. కాలానుగుణంగా ఆమె మారలేకపోయింది.

ఇడ్లీలు, మిరపకాయ బజ్జీలు తప్ప వేరేవి వేసేది కాదు. ఆ దుకాణానికి కూత వేటు దూరంలో మరో టిఫిన్ సెంటర్ వెలిసింది. అక్కడ అన్ని రకాల అల్పాహారాలు ఏర్పాటు చేశారు. ఇడ్లీలు మాత్రమే తినేవారు ఎంత మంది ఉంటారు? గిరాకీ పడిపోయింది. ఒక్కోరోజు పది రూపాయలకు మించి అమ్ముడు పోయేవి కావు. నర్సమ్మకి, కోడలికి ఒక్క క్షణం కూడా పడేది కాదు. ఆ సమయంలో నర్సమ్మ కొడుకు భార్యతో సహా మరో ఊరికి మకాం మార్చాడు. అప్పులు చేసి బ్రెడ్ తయారు చేసే పని మొదలు పెట్టాడు. అతను తయారు చేసే నాణ్యమైన బ్రెడ్‌కు తిరుగు లేకుండా పోయింది. అప్పులు తీర్చేశాడు. సొంతంగా ఆటోలు కొని వాటితోనే బ్రెడ్ సప్లయ్ చేయసాగాడు. నర్సమ్మ ఇంట్లోకి కలర్ టీవీ వచ్చింది. మరెన్నో కొత్త వస్తువులు తరలి వచ్చాయి. ఆ ఇంటి స్వరూపమే మారిపోయింది ఒక్క దుకాణం తప్ప. ఛాయ్, ఇడ్లీ, బజ్జీలను మాత్రం నర్సమ్మ వదలలేదు. అలవాటైన ప్రాణం ఖాళీగా ఉండటం ఇష్టం లేక ఆ దుకాణాన్ని అలాగే నడిపించేది.

నర్సమ్మ కొడుకు అప్పుడప్పుడూ ఒక్కడే వచ్చి చూసి వెళ్తుండేవాడు. సంఘంలో పేరు కోసం అనవసరపు ఖర్చులు చేయడం మొదలు పెట్టాడు ఆమె కొడుకు. ఆ పనుల్లో పడి డబ్బు వసూళ్లను డ్రైవర్లకు అప్పజెప్పాడు. కొన్నాళ్లకు ఆటో డ్రైవర్లు, పనివాళ్లు కుమ్మక్కై, వసూళ్లు పంచుకొని ఉడాయించారు. వ్యాపారం కుప్పకూలింది. ఆదాయానికి మించిన ఖర్చులతో అప్పటికే అప్పులపాలయ్యాడు. పరిస్థితి చేదాటిపోయింది. వేరే దారిలేక ఆటోలు అమ్మి అప్పులు తీర్చేశాడు. సంగతి తెలిసి లబోదిబోమంటూ ఏడ్చింది నర్సమ్మ. కొన్నాళ్లకు నర్సమ్మ కొడుకు ఇంటికి రావడం మానేశాడు. ఒక్కసారిగా ఆకాశానికెక్కిన నర్సమ్మ జీవితం పాతాళానికి జారింది. అందుకే ఆమె వెళ్లిపోయింది.  ఎక్కడికెళ్లిందో ఆమెకే తెలియాలి!

***

వయసు పెరుగుతున్న కొద్దీ ముసలితనం రాకపోగా, రోజురోజుకీ యవ్వనం పెరుగుతున్నట్లు అనిపిస్తోంది ఈ నగరానికి. పాత భవంతుల స్థానంలో కొత్త అద్దాల షాపింగ్ మాల్‌లు వెలిశాయి. మాదాపూర్ కాస్తా హైటెక్ సిటీ అయింది. పార్క్‌లు, పబ్‌లు, మల్టీప్లెక్స్‌లు, కొత్త కంపెనీలు, ఉద్యోగాల కోసం వచ్చే యువకులు, చదువుకోవడానికి వచ్చే విద్యార్థులు.... వారితో పాటే ట్రాఫిక్ అన్నీ పెరిగిపోయాయి. ఇంటి ముందర ఖరీదైన కార్లు, వెనక ఎం.ఎం.టి.ఎస్. రైళ్లు పరుగెత్తుతున్నాయి. పట్టాలు మాత్రం అలాగే ఉన్నాయి. వాటి జంట భలే గమ్మత్తుగా ఉంటుంది. కలిసి ఉంటాయి. కాని ఎప్పటికీ కలవ లేవు.

కొన్నేళ్ల తర్వాత నర్సమ్మ వచ్చింది. ఇన్నాళ్లుగా ఇంటికి వచ్చిన అద్దె, వేరే ఊళ్లో ఆమె సంపాదన మొత్తానికి ఆర్థికంగా స్థిరత్వం సంపాదించింది. కొడుకుతో మళ్లీ అదే బ్రెడ్ తయారీ మొదలు పెట్టించింది. కాని ఆ దుకాణాన్ని మాత్రం వదిలిపెట్టలేదు. అదే చాయ్, అదే బజ్జీ, అదే "సుప్రభాతం".

***

హాయిగా సాగిపోతున్న జీవితంలో మరో శుభవార్త తెలిసింది. మరిన్ని ఫ్లైఓవర్లు కట్టనున్నట్టు పత్రికలో చదివి ఆనందపడ్డాను. ఎక్కడెక్కడ కట్టనున్నారో అని ఆత్రంగా వెతుకుతున్న నా కళ్ల నుండి నీళ్లు జలజల రాలాయి. గుండెల్లో కలుక్కుమంది. నా ఇంటి ముందున్న రోడ్డుపై ఫ్లైఓవర్ వస్తుందట. తార్నాకకి వెళ్లే వాహనాలు ఇక మీదట ఈ పైదారి గుండా వెళ్తాయట. క్యాంపస్ గుండా వెళ్లడం మానేస్తాయట. దీని నిర్మాణమే గనక జరిగితే నా కిరాణా కొట్టు గిరాకీ కచ్చితంగా దెబ్బతింటుంది. ాదేమిటీ, నర్సమ్మ చాయ్ దుకాణం, ఆ పక్కనే శీనుగాడి ూలకొట్టు, ఎదురుగుండా ఉన్న నేతి మిఠాయిల గిరాకీ న్నీ దెబ్బతింటాయి. ఆ వార్త తెలిసిన క్షణం నుంచి తుకు భారమైపోయింది.

***

కొన్న రోజులకి ఆర్ & బి వాళ్లు వచ్చి కొలతలు చూసి రోడ్ుకిరువైపులా ఉన్న ఇళ్ల ముందర భాగాల్ని కూలగొట్టల్సొస్తుందని చెప్పారు. నా కాళ్ల కింద భూమి కంపించినట్లైంది. పస్తులుండి, ఒక్కో రూపాయి కూడబెట్టి కట్టుకున్న నా అందమైన ఇల్లు మట్టిలో కలిసిపోతుంది. నర్సమ్మ ఆవేశం కట్టలు తెంచుకుంది. నోటికొచ్చినట్లు తిట్టింది. శాపనార్థాలు పెట్టింది.

"ఆర్.టి.సి. చౌరస్తాలో ట్రాఫిక్‌లో చిక్కుకుని రోజు ఎంతో మంది ఆఫీసులకు ఆలస్యంగా వెళ్తున్నారు. ఎంతో మంది విద్యార్థులు కాలేజీలకు లేటుగా వెళ్తున్నారు. అక్కడ కట్టడం మానేసి ఇక్కడ కట్టి ఏం సాధిస్తారు? ఇక్కడంత ట్రాఫిక్ లేదే, ఇక్కడ కడితే ఎంత మందికి ఉపయోగం?" అన్నాను ఆవేశంగా.

"ఆడ కట్టరయ్యా! ఆడ కడితే ఓటళ్లు, టాకీసుల గిరాకీలేం గావాల? ఆడయితే ఎట్ల కడ్తరని అడిగెటోళ్లు శానా మంది పెద్దోల్లు ఉన్నరయ్యా! మన పేదోళ్ల మాటలు ఓళ్లింటరయ్యా! అయినా ట్రాఫిక్ జాంని తగ్గియ్యాలంటే బ్రిడ్జిలు కడితే సరిపోతదా? ఇక్కడికచ్చే మనుసుల్ని తగ్గియ్యాలగని! ఇక్కడ ఇన్ని వందల కంపిన్లున్నయ్. పెద్ద పెద్ద కంపిన్లని ఏం జెయ్యలేరు. ఆఖిరికి శిన్న శిన్న కంపిన్లన్నింటిని అన్ని జిల్లాలకు పంపించి అక్కడే పెట్టుకోండ్రి అంటే  అయిపోతది కదా! ఎక్కడోళ్లు అక్కడే పంజేసుకుంటరు. ఇక్కడిదాక ఎందుకస్తరు?

గీ పట్నమొక్కటే డెవలప్ జేసుడు గాదు, అన్ని టౌన్‌లని డెవలప్ జెయ్యాల. అయితెనే ట్రాఫిక్ సమస్య తీర్తది. అంతేకాని బ్రిడ్జీల్ కడితే తీర్తదా? ఊరంత బ్రిడ్జిలు కట్టినా ఈ ట్రాఫిక్ ఇట్లనే ఉంటది. ఈల్ల నోట్లె మన్నువడ. ఈల్లు బాగువడరు. మన ఉసురు తగిలి సర్వనాశ్నమైపోతరు." అంటూ గుండెలు అవిసేలా ఏడుస్తూ తన బాధని వెళ్లగక్కింది. నిజంగా నర్సమ్మది ఎంత గొప్ప ఆలోచన.

కాని ఎవరు మాత్రం ఏం చేయగలరు? మరికొన్ని రోజులకు "రోడ్ క్లోజ్‌డ్" అని బోర్డ్ పెట్టేసి, సికింద్రాబాద్ వెళ్లే వాహనాలన్ని రాం నగర్ గుండా, అడిక్‌మెట్ మీదుగా దారి మళ్లించారు.

ప్రొక్లెయిన్లు, పోలీసులతో రంగంలోకి దిగారు అధికారులు. అన్ని ఇళ్ల ముందరి భాగాలని కూలగొడుతున్నారు. నా దుకాణం మట్టిలో కలిసిపోబోతుంది. అది తలచుకోగానే గుండె బరువెక్కిపోయింది. చివరిసారి తనివితీరా చూసుకున్నాను. ప్రొక్లెయిన్లు నా ఇంటివైపే వస్తున్నాయి, బతికున్న మనిషిని తినేందుకు వస్తున్న రాబందుల్లా! చూస్తుండగానే రెండే రెండు దెబ్బలతో నేలకొరిగింది. ఎం.ఎం.టి.ఎస్. రైలు శబ్దంలో కలిసిపోయింది దాని అరుపు. తలలేని మొండెంలా మిగిలిపోయి మూగగా రోదిస్తోంది. ఆ ప్రాంతమంతా శోకసంద్రమైపోయింది. అందమైన ఇల్లు అదృశ్యమైపోయింది.

అది గడిచి నాలుగు సంవత్సరాలైంది. కాని ఇప్పటికీ ఆ పైదారి పూర్తి కాలేదు. చౌరస్తాలో పైదారి మంజూరు కాలేదు. ట్రాఫిక్ జాం మాత్రం ఇంకా పెరుగుతూనే ఉంది హనుమంతుని తోకలా..!

*** అయిపోయింది ***
డిసెంబర్ 9, 2007న ప్రజాశక్తి ఆదివారం అనుబంధంలో ప్రచురితం.

నా తొట్టతొలి కథ - పిల్లి పోయి ఎలుక వచ్చె డాం డాం డాం



పిల్లి పోయి ఎలుక వచ్చె డాం డాం డాం
- అరుణ్ కుమార్ ఆలూరి

నా పేరు వెంకటేశం. ఓ ప్రభుత్వ కార్యాలయంలో చిరుద్యోగిని. ఈ మధ్య ఎడతెరపిలేకుండా కురిసిన వర్షాలని కూడా లెక్కచేయకుండా ఆఫీస్‌కి వెళ్లేసరికి, నాకు జ్వరమొచ్చింది. మామూలే అంటారా! నాకు మాత్రం కాదండీ! ఎందుకంటే, గత నాలుగు సంవత్సరాలుగా అలాంటిదేమీ రాలేదు. అదేమిటి, దగ్గు, జలుబు, తలనొప్పి వంటి చిన్న చిన్న రోగాలు కూడా రాలేదంటే నమ్మండి. అంతటి గట్టి శరీరం నాది. కానీ ఈ జ్వరమెందుకొచ్చిందో అర్థం కావడం లేదు. డాక్టరుగారు ఓ నాలుగురోజులు కచ్చితంగా విశ్రాంతి తీసుకోమన్నారు. అక్కడే చిక్కొచ్చి పడింది. నా నిఘంటువులో లేని పదం విశ్రాంతి తీసుకోవడం.

ఆదివారాలు కూడా ఆఫీస్‌కెళ్లి, సాయంత్రం దాకా ఫైళ్లు ముందేసుకుని ఆ తర్వాత క్లబ్బుకి చేరి దేశ కాలమాన వైపరిత్యాల గురించి చీకటి పడే వరకు చర్చించి ఇంటికి చేుకోవడం నా దినచర్య. ఇక పండగలూ, పబ్బాలూ అంటారా ..! వటిమీద నాకంత ఆసక్తి లేదు. పెళ్లి అవక ముందు ఉండేద. పెళ్లయ్యక వాటి మీదే కాదూ అన్నింటి మీదా ఆసక్తి డుగంటి పోయింది. పిల్లలు పుట్టాక పూర్తిగా అణగారిపోయింది. ఇక పెళ్లిళ్లూ, ఇతర శుభకార్యాలూ అంటారా.n.! సెలవు రోజుల్లో ఉంటేనే వాటికి హాజరవుతాను, లేకపతే వాటి బాధ్యత మా శ్రీమతిదే! ఈ విషయంలో తరచు మా ఆవిడకీ, నాకు గొడవలు జరుగుతాయనుకోండి - అది వేరే విషయం.


నాతో మాట్లడటానికి చాలామంది భయపడతారు. కొంతమంది వితండవాదం అంటారు. ఇంకొంత మంది మొండితనం అంటారు. ఎవరేమనుకుంటే నాకేంటటా! నాకు నచ్చింది చెప్పడం, నచ్చని దాన్ని తిట్టడం జన్మతః వచ్చిన సుగుణం. దాన్ని మార్చుకోమంటే ఎలా?

***

ఈ నాలుగు రోజుల విశ్రాంతిలో నాకు జ్వరం తగ్గకపోగా, కొత్తగా తలనొప్పి కూడా అంటుకుంది. దానికో పెద్ద కథే ఉంది లేండి. నాలుగు రోజులు వెనక్కి వెళ్తే..

డాక్టరుగారు నిర్భంధ విశ్రాంతిని శిక్షగా విధించడంతో, ఆ నాలుగు రోజులూ పని చేయకుండా ఎలా ఉండాలా? అని దిగులు పట్టుకుంది. టీవీ ముందు కూర్చున్నాను. రాత్రుళ్లు ఏదైనా మంచి పౌరాణిక సినిమా వస్తే తప్ప టీవీ ముందు కూర్చోవడం అసలే లేదు. పెళ్లవక ముందు కూర్చునే వాణ్ణి. పెళ్లయ్యాక మా ఆవిడ టీవీ సీరియళ్లు చూడటనికే టైము చాలకపోతే, ఇంక నేనెక్కడ చూడాలి? ఆ సీరియళ్లేమో మనకు పడి చావవు. 

టీవీ ముందు మోకరిల్లగానే.. మా ఆవిడ రిమోట్ నా చేతికిచ్చింది, జాలిగా చూస్తూ! ఎంత చూసినా నాలుగు రోజులే కదా అన్నట్టు ఒక చూపు విసిరింది. మొదట న్యూస్ ఛానల్ పెట్టాను. 24 గంటల న్యూస్ ఛానల్ అని మా ఆవిడ చెప్పింది. టీవీలో ఓ గ్రామాన్ని చూపిస్తున్నారు. ఆ ఛానల్ ప్రతినిధి హడావిడిగా వివరాలందించసాగింది ఫుల్‌స్టాప్‌లు, కామాలూ లేకుందా! అంతే స్పీడ్‌గా న్యూస్ సెంటర్‌లో వ్యాఖ్యాత ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. పది నిమిషాలు శ్రధ్ధగా గమనించాక అప్పుడర్థమైంది.. అక్కడ రోడ్డు ప్రమాదం జరిగిందని, ఒకరికి గాయాలయ్యాయని. అయితే ఆ గాయపడిన వారెవరో నాకు కనిపించలేదు. చుట్టూ జనాలు గుమికూడారు. ఆంబులెన్స్ వచ్చేవరకు ఆమె అలా వివరాలందిస్తూనే ఉంది. ఆంబులెన్స్ లోకి ఎక్కించేటప్పుడు కూడా ఆ గాయపడిన వ్యక్తిని చూడలేకపోయాను. ఆంబులెన్స్‌ని ఫాలో చేస్తూ వెళ్లి వెళ్లి చివరికి ఆసుపత్రిలో అర్థగంట గడిచాక, ఆ వ్యక్తిని చూపించారు. సారీ, అది వ్యక్తి కాదు, జీవి. మేక. ఏడుకొండలూ కాలినడకన ఎక్కి వెంకన్నని దర్శించుకున్నంత ఆనందం కలిగింది. కాని వెంటనే దిగ్భ్రాంతి కలిగింది. కేవలం మేకకు గాయాలయ్యాయని ముప్పావుగంట సేపు సస్పెన్స్‌తో చంపారు. అసలే జ్వరంతో బాధపడుతూ నా మానన నేను మూలుగుతూ కూర్చుంటే, అనవసరంగా బి.పి. పెంచారు. పైగా మద్యలో ఆ ప్రాణి బ్రతుకుతుందా? లేదా? అని ఎస్.ఎం.ఎస్. చేయమన్నారు. చేతి దూల కదా, వెంటనే చేశాను. ఆ వెంటనే బ్యాలెన్స్‌లో మూడ్రూపాయలు ఫట్టన్నాయి. అదో బొక్క. అయినా మేక ప్రాణి కాదా అనిపించింది. ఎంత ప్రాణి అయినా కేవలం మేక కోసం ముప్పావుగంట విలువైన సమయాన్ని వృథా చేయడం నాకు సుతరామూ నచ్చలేదు. పాపం ఏ న్యూసూ దొరక్క ఇలా చేశారేమో అని జాలిపడి సరిపెటుకున్నాను.

ఛానల్ మార్చాను. ఇది కూడా ఇరవై నాలుగ్గంటల నిరంతర ప్రసార సాధనమట. ఇందులో పాటలు వేస్తున్నారు. ప్రేక్షకులు ఫోన్ చేసి డిగిన పాటను ప్రసారం చేస్తారట. మా ఆవిడ చెప్పింద. ఆ న్యూస్ ఛానల్ కంటే ఈ పాటలే నయమనుకుని అలాగే గుడ్లప్పగించి చూస్తున్నాను. ఇంతలో పాట పూర్తికాగానే ఒకావిడ ఫోన్ చేసింది. ఆవిడ "హలో" అనగానే, ఇక్కడ వ్యాఖ్యాత 'హలో' అన్నాడు. ఆ తర్వాత సంభాషణ ఇలా కొనసాింది..
"హలో రాంబాబుగారు"
'ఆఁ చెప్పండి మేడం'
"గుర్తుపట్టారా అండి"


పాపం ఈ ప్రశ్నతో సదరు వయాఖ్యాత గతుక్కుమన్నాడు. ఆయన గుర్తుపట్టలేదని స్పష్టంగా అర్థమవుతోంది. పచ్చి వెలక్కాయ నోట్లో పడ్డట్టు మొహం పెట్టి, నవ్వు పులుముకుని అడగసాగాడు.

"లేదు మేడం గుర్తుపట్టలేదు"
'ఇంకా గుర్తు పట్టలేదా?'
"లేదండీ? ఏదైనా క్లూ ఇస్తారా కొంచెం!"
'నేను మాట్లాదినప్పుడు బయట కుక్క అరిచింది..'
"ఆఁ గుర్తొచ్చింది. మీరు మాట్లాడటం మొదలు పెట్టగానే అది అరవడం స్టార్ట్ చేసింది కదా!"
'అవునండీ'
"ఎలా ఉన్నారండీ? ఆ కుక్కెలా ఉంది? మళ్లీ అరుస్తోందా? మానేసిందా?"
'లేదండీ అరవడం లేదు. నేను పాడటం మానేశాను.'
"అయినా మీరు చాలా బాగా పాడతారండి. ఆ రోజు దానికేదో ప్రాబ్లం వచ్చి అరిచుంటుంది. మళ్లీ ఓ సారి పాడండీ"
'అయ్యో! వద్దండీ'
"ఫర్వాలేదు పాడండి. మీరు చాలా బాగా పాడుతారు."
'అయితే ఒక్క నిముషం. కుక్కుందో లేదో చూసొస్తా'

ఆ మాట వినగానే ఆయనగారి మొహంలో ఎక్స్‌ప్రెషన్స్ మారిపోయాయి. కోరి కోరి కొరివితో తలగోక్కవడమంటే ఇదేనేమో! ఇంతసేపు మాట్లాడటమెందుకు? లైన్ కట్ చేసి పాటవేస్తే అయిపోతుంది కదా! అనుకున్నాను. నాభార్య నాలాగే మహా ఘటికురాలు. నా ముఖకవళికలు ఇట్టే పట్టేసింది. నా అనుమానాన్ని నివృత్తి చేస్తూ.. "మొదట్లో పది సెకన్ల కన్నా మాట్లాడే వారే కాదు. కాని ఈ మధ్య ఫోన్లు రావడం తగ్గిపోయేసరికి, ఫోన్ చేసిన వారిని, మినిమం పదినిమిషాలు మాట్లాడకుండా వదిలి పెట్టట్లేదు." అంది.
ఇంతలో అనుమానం వచ్చి అడిగాను ..
"నువ్వు గానీ ఈ ఛానల్‌కి ఫోన్ చేసి సోది పెడుతున్నావా?"
"అబ్బే లేదండీ" అంది.
ఈ మధ్య ఫోన్ బిల్లు మోగిపోతోంది. నాకు తెలియకుండా చేసే ఉంటుందిలే అనుకున్నాను. చేసినా చెబుతుందా ఏంటి నా పిచ్చి కాకపోతే.

ఇంతలో ఆవిడ రానే వచ్చింది.
"బయట కుక్క లేదండి"
'అయితే స్టార్ట్ చేయండి '

పాడటం మొదలు పెట్టింది. చిన్నప్పుడు డొక్కు రేడియోలో మంచి పాట గనుక రాకుంటే, స్టేషన్ మార్చే వాణ్ణి. అది ఓ పట్టాన కలిసేది కాదు! ఆ స్టేషన్ మార్చే క్రమంలో వచ్చే వింత శబ్దంలా వినిపిస్తోంది ఆమె గొంతు. ఇంతలో కుక్క అరుపులు వినిపించసాగాయి. కంగారు పడి అటూ ఇటూ చూశాను. అసలే కుక్కంటే చచ్చేంత భయం నాకు. ఇంతలో మా ఆవిడ ఫక్కున నవ్వి "అది టీవీలో శబ్దం అండీ" అంది.

మళ్లీ టీవీ వైపు చూశాను. కుక్క అరుపులు వినిపిస్తూనే ఉన్నాయి. ఓ ఐదు సెకన్ల తరువాత ఈవిడ పాటపాడటం మానేసింది. కుక్క అరవడం ఆపేసింది. ఆ వెంటనే కెవ్వున కేకేసినట్టు శబ్దం వినిపించింది. ఇక్కడ వ్యాఖ్యాత కంగారు పడిపోయి "ఏమైంది మేడం" అనడిగాడు.

"దొంగముండ కరిచేసిందండీ"
'సారీ మేడం ఇలా జరుగుతుందని ఎక్స్‌పెక్ట్ చేయలేదు '
"అమ్మా! ఫర్వాలేదు లెండి. దానికి మీరెం చేస్తారు. మీకు నచ్చింది కాని, ఆ కుక్కకే నా గొంతు నచ్చినట్టు లేదు. ఇది వరకు ఓ సారి ఇలాగే కరిచింది లెండి"
'సరేలెండి! ముందు మీరు హాస్పిటల్‌కి వెళ్లి, ఇంజక్షన్ చేయించుకోండి. మీరు కోరిన పాట వేస్తాం. మీరు చూడలేకపోతున్నందుకు బాధపడకండి. మళ్లీ రేపు ఫోన్ చేసి మీ ఆరోగ్యం ఎలా ఉందో చెప్పి, మీకిష్టమైన పాట అడగండి. ఉంటాను.' అని పెట్టేశాడు ఆ వ్యాఖ్యాత. ఇదేం గోలరా నాయనా అనుకుని ఛానల్ మార్చాను.

మా ఆవిడ మట్టుకు ఒకింత కోపంగానే చూస్తోంది. తను చూడబోయే ఆ దిక్కుమాలిన సీరియల్స్‌ని మిస్ అవుతున్నందుకు.

ఈ మధ్యలో మరో ఛానల్ పెట్టి చూద్దును గదా.. అందులో దాదాపు అరగంట నుంచీ వాణిజ్య ప్రకటనలు వస్తూనే ఉన్నాయి. ఏవేవో కొత్త కొత్త వస్తువుల గురించి చెప్తోంది. డబ్బింగ్ సినిమాలు చూశాను కానీ, డబ్బింగ్ ప్రకటనలు చూడటం మాత్రం ఇదే ప్రథమం. ఫోన్ చేసి చెప్తే చాలట. అంతా బాగానే ఉంది కాని, టీవీలో అంత సేపు ఆపకుండా ప్రకటనివ్వడానికి ఎంత డబ్బు ఖర్చవుతుందో అని అనుమానం వచ్చింది. అంత డబ్బు ఎక్కడ నుంచి వచ్చిందా అని మరో అనుమానం. అంటే వాళ్లు మనకు అమ్మే సరుకుల మీద ఎంత లాభం తీసుకుంటున్నారో అని మరో చిన్ని అనుమానం. అలా ఆపకుండా వచ్చే ప్రకటనల్ని ఎంత మంది మాత్రం చూస్తారని మరో బుల్లి అనుమానం వచ్చింది.. ఆ అనుమానాలు నివృత్తి కాకముందే మా ఆవిడ వచ్చి ఛానల్ మార్చింది.


నేను నోరెళ్ల అలా ఆ టీవీ వంక ఇటు మా ఆవిడ వంకా చూస్తుండి పోయాను. తను పెట్టింది న్యూస్ ఛానల్ మరి! నా ఊహలో తను అంతకు ముందు ఎప్పుడూ న్యూస్ ఛానల్ పెట్టినట్టు లీలగా కూడా గుర్తు రావడం లేదు. నోట్లో దోమలు దూరతాయని కంగారు పడ్డట్టుంది మా ఆవిడ. వచ్చి నా నోరు మూసింది.

కొత్తగా వచ్చిన సినిమా బంపర్ హిట్ అంటూ చెప్తున్నారు టీవీలో. న్యూస్ ఛానల్‌లో సినిమా గురించి చెప్పడమేంటో అర్థమయి చావలేదు నా మట్టి బుర్రకి. అయినా విడుదలై ఒక రోజు గడవక ముందే సినిమా హిట్ అని ఎలా తెలుస్తుందండీ విడ్డూరం కాకపోతే! ఆ ఛానల్‌లో ప్రకటనలు చూస్తే మరీ తక్కువగా ఉన్నాయి. మరి ఆ వ్యాఖ్యాతలకి, విలేఖరులకి జీతాలెలా ఇస్తున్నారో అర్థమయి చావలేదు. బుర్ర వేడెక్కి పొగలు వస్తున్నట్టుగా అనిపించింది. వెంటనే కాఫీ తెమ్మని కేకేసాను. జ్వరమొచ్చిందని జాలి కాబోలు ఈసారి ఆట్టే ఆలస్యం చేయకుండా అరగంటకే తీసుకొచ్చింది. తనకి నేనంటే ఎంత ప్రేమో అని మురిసిపోయాను. మురవడం పూర్తవగానే మళ్లీ టీవీకి కళ్లప్పగించాను. హాస్పిటల్స్ యొక్క అడ్వర్‌టైజ్‌మెంట్స్ వస్తున్నాయి. ఇదేంటి? చోద్యం కాకపోతే! ఆ రోజుల్లో ఆసుపత్రుల్ని, విద్యాలయాల్ని గుడులతో సమానంగా చూసేవారు. కేవలం వాటి పేరు ప్రఖ్యాతల మీదే అవి నడిచేవి. అలాంటిది, మా ఆసుపత్రికే రండి బాబూ అంటూ బతిమాలుకునే హీనస్థితికి చేరుకున్నామా అనిపించింది. ఇంతలో విద్యా సంస్థల ప్రకటనలు మొదలయ్యాయి. హారి దేవుడా? అనుకుంటుండగా, ఒక ఆసుపత్రికి ఒక పేరు మోసిన దర్శకుడు అంబాసిడర్‌గా రావడంతో నాకు పిచ్చెక్కడం, తలనొప్పి నషాళానికెక్కడం రెండూ ఒకేసారి జరిగిపోయాయి. ఇహ ఇలాగైతే కష్టమని టీవీ కట్టేసి, రేడియో ఆన్ చేశాను.

రేడియో ఆన్ చేయగానే మా ఆవిడ ఫక్కున నవ్వింది. ఆ నవ్వులోని అంతరార్థం తర్వాత తెలిసింది. తెలుగు, హిందీ, ఇంగ్లీషు ఏ భాషా సరిగ్గా రాని అభాగ్యులు అతికష్టమ్మీద అవస్థపడుతూ, ఆయాసపడుతూ మాట్లాడుతున్నట్టు అనిపించింది. ఈ మధ్యే కొత్తగా ప్రారంభమైన రేడియో ఛానల్‌కి ట్యూన్ చేశాను. బయట పెద్ద పెద్ద హోర్డింగులతో ప్రకటనలిచ్చారు కదా, అదైనా బాగుంటుందన్న నమ్మకంతో! ఏదో కొత్త ప్రోగ్రాం అంట. కోడలు అత్తగారిమీద ఏ విధంగా కసి తీర్చుకుందో ఫోన్ చేసి బహుచక్కగా వర్ణించి వర్ణించి చెప్పింది. ఆ కోడలుగారు కసి తీర్చుకోవడం మీకు కరక్ట్ అనిపిస్తే ఒక నంబర్‌కి, లేకుంటే ఇంకో నంబర్‌కి, ఏం చెప్పలేకపోతే మరో నంబర్‌కి ఎస్.ఎం.ఎస్. చేయమన్నారు. హతవిధీ! రేడియోని కనిపెట్టిన మహానుభావుడు కనక బతికుంటే, ఈ పాటికి ఉరేసుకుని చచ్చుండేవాడే అనిపించింది. గుడ్డిలో మెల్లలా రేడియో కన్నా టీవీనే మెరుగనుకుంటా. టీవీలో వాళ్లు చెప్పేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రేడియోలో ఆ ఛాన్స్ కూడా లేదు.

***

నాలుగు రోజులు పూర్తవడతో డాక్టరుగారు వచ్చి మళ్లీ నా ఆరోగ్య పరిస్థితి సమీక్షించారు. జ్వరం తగ్గకపోగా, బీపీ, తలనొప్పి, కుగుడ్లు లాగేయ్యడం వంటి రోగాలు కూడా తోడుగా వచ్చయని చెప్పారు. విశ్రాంతి తీసుకొమ్మంటే ఒత్తిడి పెంచే బరువు పనులు ఎందుకు చేశావని చీవాట్లేసి, మరో నాలుగు రోజులు కచ్చితమైన విశ్రాంతి తీసుకోమని చెప్పి చక్కాపోయారు. ఈ నాలుగురోజులూ ఏం చేయాలా అని అవిశ్రాంతంగా ఆలోచించడం మొదలుపెట్టింది నా బుర్ర.|br />
***      ***     ***
నవ్య వార పత్రిలో 31-జనవరి-2007 న ప్రచురితం.






నా ఐదవ కథ - మలిసంధ్య

మలిసంధ్య
- అరుణ్ కుమార్ ఆలూరి

సముద్రతీరానికి దగ్గరగా ఉన్న ఆ కొత్త ఇంట్లోంచి కొడుకులూ, కోడళ్లూ తిరుగు ప్రయాణమయ్యాక బోసిపోయినట్టుగా కనిపిస్తోంది. అలసిపోయిన రాజ్యం సోఫాలో కూలబడింది. ఓ సారి సముద్రాన్ని చూడాలనిపించి బాల్కనీలోకి వెళ్లి అక్కడి చెక్కకుర్చీలో ఒదిగిపోయింది. చల్లటిగాలి, ఆ అలసిన శరీరాన్ని స్ఫృశిస్తూవుంటే కాస్త ఊరటగా అనిపిస్తోంది. ఇలాంటి వాతావరణం కోసం, ఇలాంటి ఏకాంతం కోసం తను ఎన్ని సంవత్సరాలుగా ఎదురుచూస్తోంది. ’ఇక్కడ సూర్యం ఇంటిని ఎందుకు కట్టించినట్టు?’ అని మదిని ప్రశ్నించుకుంటోంది. భర్త సూరిబాబుని ఎవరూ లేనప్పుడు సూర్యం అని సంబోధిస్తుంటుంది. "నీమీద ప్రేమతోనే! అయినా నీకు నీళ్లంటే ఎంతిష్టమో సూర్యానికి తెలియదా!" అని మది సమాధానమిస్తోంది. సముద్రపు అలల్లా చల్లటిగాలి మాటి మాటికి శరీరాన్ని తాకివెళుతూ ఉంటే ఏవో కొత్త కొత్త భావాలు చిగురిస్తున్నాయి రాజ్యంలో. ’ఈ వయసులో ఇలాంటి భావాలు తప్పేమో?’ అని మళ్లీ
మదిని ప్రశ్నించింది. "తప్పెందుకవుతుంది! అదే తప్పైతే ఆ తప్పునుండే కదా ఈ సృష్టి మొత్తం జనించింది. అయినా అసలవి కొత్తభావాలైతే కదా! ఎప్పుడో పాతిక సంవత్సరాల క్రితం వాడిపోయిన భావాలు ఈ ఏకాంత వాతావరణంలో మళ్లీ మొలకెత్తుతున్నాయి" అని జవాబిచ్చింది.

ఇంతలో వర్షం తుంపర చినుకులుగా మొదలైంది. పిల్లల్ని స్టేషన్ లో దిగబెట్టడానికి వెళ్లిన ఆయన తడుస్తాడేమోనని కంగారుపడింది ఆమె! 'కంగారెందుకే! వెళ్లింది కార్లోనే కదా!’ అంది మది.
"అయితే మాత్రం స్టేషన్ నుంచి కారు దగ్గరికి వచ్చేటప్పుడు తడిస్తే ఎలా?" అందామె.

’గొడుగు తీసుకెళ్లాడు కదా!’ అని గుర్తు చేసింది. అవునుకదా అని స్థిమితపడింది. వర్షానికి చల్లని గాలి తోడై నీటి తుంపరలను రాజ్యంపై విసురుతున్నాయి. ఆ తుంపరలతో ఙ్ఞాపకశక్తి మేల్కొన్నట్లైంది. సముద్రతీరాన్ని చూడగానే ఆనందంతో చిరునవ్వు చిందించింది. అది సిగ్గు అంటూ గుర్తుచేసి ఆమెకు మరింత ఆనందాన్ని కలిగించింది ఆమె మది. అంతటితో ఆగకుండా, ఉన్నపళంగా ఆమెను ముప్పై సంవత్సరాల వెనక్కి లాక్కెళ్లిపోయింది ఆమె మనసు.

-౦-
అంగరంగవైభవంగా పెళ్లి జరిపిద్దామనుకున్నా, సూరిబాబు అమ్మ విశాలాక్షి పట్టుబట్టడంతో తిరుమలలో శ్రీనివాసుని కళ్లముందు నిరాడంబరంగా జరిపించారు రాజ్యం తల్లిదండ్రులు. తిరుగుప్రయాణంలో శ్రీశైలం, వేములవాడ కూడా దర్శింపజేసి ఆ పెళ్లియాత్రకు మరింత పవిత్రతను చేకూర్చింది విశాలాక్షి. వేములవాడలో బస్సు బయలుదేరగానే "ఇంతటితో దైవదర్శనాలు ముగిశాయి. ఇక నేరుగా ఇందూరుకే!" అని ప్రకటించిన మరుక్షణంలోనే సూరిబాబు చేయి రాజ్యం నడుముని తాకింది. కెవ్వున కేకేసింది అమ్మాయి. "ఏమైందమ్మా?" అంటూ అమ్మాయి అమ్మానాన్న, అబ్బాయి అమ్మ వాళ్లిద్దరి ముందు ప్రత్యక్షమవడంతో "ఏదో గుచ్చుకున్నట్టుంది" అని చెప్పాడు అతను. అప్పుడర్థమైంది ఆమెకు, అది ఆయన పనేనని.

"బస్సులో పెళ్లాం మొగుడు కలిసి పక్కపక్కనే కూర్చుని ప్రయాణం చేస్తున్నప్పుడు అలాగే గుచ్చుకుంటాయమ్మా" దీర్ఘాలు తీస్తూ అంది వెనక వరసల్లోంచి ఒకావిడ. అందరూ గొల్లుమన్నారు. ఆమె ఆనందపడుతూ తలదించుకుంది. బుగ్గలు గులాబీలయ్యాయి. అప్పటికి ఆ అమ్మాయికి తెలియదు అది సిగ్గని! ఎలా తెలుస్తుంది ఆమె వయసు పదహారైతే. అతనికి తెలుసు, వయసు ఇరవై కదా మరి! బస్సులో కిటికీ వైపు కూర్చున్న ఆమె తదేకంగా బయటకు చూస్తోంటే అతనికి ఏం తోచటం లేదు. ఆ అమ్మాయికి ఎడమచేతి పక్కగా కూర్చున్న ఆ అబ్బాయి చేతులు కట్టుకుని, తన ఎడమచేతితో మరోసారి ఆమె నడుముని తాకాడు. తుళ్లిపడింది అమ్మాయి. ఈసారి అరుపురాకుండా నియంత్రించుకుంది.

వాళ్లిద్దరిని ఎవరు చూసినా అక్కడ జరుగుతున్న తతంగమేమి గుర్తుపట్టలేనట్టుగా ఉంది అబ్బాయి ఏర్పాటు. ముందు జాగ్రత్తగా చేతివేళ్లతో కొంగుని కిందికనడంతో ఆ చేతిని చీర కప్పేసింది. ఆమె నడుముపై అతని చేయి తచ్చాడుతుందని కనిపెట్టడం చాలా కష్టం! పైగా ఏమీ తెలియని అమాయకుడిలా పక్కకిటికీల్లోంచి బుద్ధిమంతుడిలా ప్రకృతిని చూస్తున్నట్టు కనిపిస్తున్నాడు. చేతిని మరికాస్త ముందుకి జరిపి ఆమె నడుంపై అరచేతిని పూర్తిగా ల్యాండ్ చేశాడు. సరిగ్గా అతని అరచేతంత ఉంది ఆమె నడుము. ఊపిరి బిగపట్టింది రాజ్యం! బయటంతా తెల్లనికాంతిలా కనిపిస్తోంది తప్ప మరేమీ కనిపించడం లేదు. ఏదోలా ఉందామెకు. అప్పుడే చక్కిలిగింతలు పెట్టినట్టు, అప్పుడే మనసులో ఏదో భావన చెలరేగి రోమాలు నిక్కబొడుచుకున్నట్టు, అంతలోనే వేడి ఊపిరి బయటకు వస్తున్నట్టు, ఒళ్ళంతా చిరుచెమటలు పోస్తున్నట్టు, గుండె గుర్రంలా పరుగెడుతున్నట్టు.. కొన్ని వేల రకాలుగా ఉంది.

అంతటితో అతని చేయి సంతృప్తిపడలేదు. ఆ నడుంపై ఆ చేయి తన వేళ్లతో ఏదో వెతికేందుకు ప్రయత్నిస్తోంది. కానీ దొరకలేదు. ఆమె చిన్నగా నవ్వి మళ్లీ ఆపుకుంది. నాభిని కప్పి చీర కట్టడంతో అది దొరికే అవకాశం చిక్కలేదు. కానీ ఏదో తెలియని మోహం కమ్ముకొస్తోంది ఆమెలో! "అప్పుడే ఎందుకు?" అని చెవిలో మెల్లిగా చెప్పింది. అతను వెంటనే చేతిని కదనరంగం నుంచి ఉపసంహరించడంతో ఊపిరి పీల్చుకుంది. ఓసారి ఓర కంటితో గమనించింది. అతని మోము ఆనందంతో వికసిస్తోంది. మోహం వీడాక అసలు విషయం గుర్తొచ్చి నాలిక కరుచుకుంది. "అప్పుడే ఎందుకు" అని చెప్పాలని అనుకున్నా, ఆ కంగారులో "ఇక్కడే ఎందుకు?" అని బయటకొచ్చింది.


రెండ్రోజుల తర్వాత శోభన ముహూర్తం కుదరడంతో అప్పటికప్పుడు ఆరు బయట తాత్కాలికంగా ఒక పూరి గుడిసెని వేయించారు. కొత్తగా పెళ్ళైన జంటకి శోభనం ఇంట్లో కాకుండా ఆరు బయట ప్రత్యేకంగా వేయించిన గుడిసెలోనే జరగాలన్నది ఆచారం. సాయంత్రం కాగానే హోరువాన మొదలైంది. ఆ వానలోనే వాళ్లని ఆ గుడిసెలోకి పంపించారు. గుడిసెలో కొబ్బరితాడుతో నేసిన మంచం, దాని పైన వేసిన మెత్తటి బొంత, రెండు తక్కెలు(తల దిండ్లు) వీరి కోసం ఎదురుచూస్తున్నాయి. ఇద్దరికీ చలిగా ఉండటంతో మెల్లిగా నడుం వాల్చారు. జడివానకి గుడిసెలోపల అంతా పచ్చిగా మారి, చివరికి బురదరూపాన్ని సంతరించుకుంది. అప్పుడప్పుడు ఒక్కో నీటి బిందువు శరీరంలో ఎక్కడోచోట పడి గిలిగింతలు పెట్టసాగాయి. చలికి తాళలేక దుప్పటిని కప్పుకుందామని కాళ్ల దగ్గర చూస్తే, అక్కడ ఒకటే దుప్పటి కనిపించడంతో, ఏం చేయాలో తెలియక అయోమయంలో అలాగే కూర్చుండిపోయింది.
"చలేస్తోందా?" అడిగాడు అతడు.
అవునన్నట్టు తల నిలువునా ఊపింది ఆమె.
"ఒక్కటే దుప్పటి ఉందా?"
మళ్లీ తలతోనే సమాధానమిచ్చింది ఆమె.
"సరే అదే కప్పుకుందాం" అన్నాడు.
ఆమె మాత్రం కదలకుండా, మెదలకుండా అలాగే కూర్చుండిపోయింది.
"ఏమైంది"
"భయమేస్తోంది"
"ఎందుకు?"
"తెలియదు కాని భయమేస్తోంది"
"భయమెందుకు? దుప్పటి తీసుకో, చలెక్కువైంది" అన్నాడు. అనడమేకాకుండా, అతనే చొరవ తీసుకుని తనని పడుకోబెట్టి, ఇద్దరికి సరిపోయేలా దుప్పటి కప్పాడు. అటువైపు తిరిగి పడుకుందామె. తన వైపు తిప్పుకున్నాడు అతను.
"ఒకే దుప్పటి ఎందుకు పెట్టారో తెలుసా?" అడిగాడు.
"తెలియదు కానీ భయమేస్తోంది"
"ముద్దుపెట్టుకోనా"
"భయమేస్తోంది" అంది కాస్త ఏడుపుమెహంతో!
"సరే పడుకో!" అని దుప్పటి కప్పేసుకున్నాడు అతను.

-౦-

తన వ్యాపారంలో ఎప్పటిలా నిమగ్నమైపోయాడు సూరిబాబు. సూరిబాబు నాన్న వస్త్రవ్యాపారాన్ని ప్రారంభించి, గణనీయమైన అభివృద్ధిలోకి తీసుకొచ్చి కొడుకు చేతిలో పెట్టి అతను పదిహేనవ ఏట ఉండగా మరణించాడు. అప్పటినుంచి వ్యాపారాన్ని సూరిబాబే చూసుకుంటూ మరింత వృద్ధిలోకి తీసుకొచ్చి ఇందూరులోని వస్త్రవ్యాపారుల్లో అగ్రస్థానానికి ఎదిగాడు. ఇంతలో ఆషాడమాసం దగ్గరపడింది. రాజ్యంని పుట్టింటికి తనే తీసుకెళ్లాలని నిశ్చయించుకున్నాడు సూరిబాబు. భైంసాలోని ఆమె పుట్టింటికి బాసర మీదుగా కాకుండా కాస్త దూరమైనా ఆర్మూర్, నిర్మల్ మీదుగా తీసుకెళ్లాలనుకున్నాడు. బయట ప్రపంచం అంటే ఏమిటో తెలియని ఆమెకు అందమైన లోకాన్ని దగ్గరగా చూపించాలని అతని తాపత్రయం.

డ్రైవరును వద్దని రాజ్యంతో పాటు కార్లో బయలుదేరాడు సూరిబాబు. ఆర్మూర్ దగ్గరికొస్తుందన్నట్టుగా నల్లకొండలు చెప్పకనే చెబుతున్నాయి. పెద్ద పెద్ద నల్లబండరాళ్లని ఎవరో తెచ్చి కుప్పగా పోసినట్టు అందంగా ఉన్నాయి ఆ కొండలు. అన్ని కొండలు మట్టి, గడ్డిపరకైనా లేకుండా ఆశ్చర్యం గొలుపుతూ కనువిందు చేస్తున్నాయి. నోరెళ్లబెట్టి ఆశ్చర్యంగా చూస్తోంది రాజ్యం. ఒక కొండకు దగ్గరగా వెళ్లే మట్టి దారిగుండా కారుని మళ్లించాడు. ఇంటినుండి తెచ్చిన ఫలహారాలు తీసుకెళ్లి ఓ విశాలమైన నల్లబండపై కూర్చున్నారు. మేఘావృతమై ఉండడం వల్ల ఆ బండ చల్లగా ఉంది.
"కొండలెలా ఉన్నాయి" అడిగాడు అతను.
అప్పటివరకు నోరెళ్లబెట్టి వాటినే చూస్తున్న ఆమె, అతని మాటలతో లోకంలోకి వచ్చి తలదించుకుంది. బావున్నాయన్నట్టుగా తలమాత్రం ఊపింది.
"నచ్చిందా?"
మళ్లీ తలతోనే సమాధానం నచ్చిందన్నట్టుగా!
"ఓ ముద్దిస్తావా?"

రాజ్యం నెత్తిన పిడుగుపడ్డట్టైంది. చేతులు వణకసాగాయి. "అమ్మో నాకు భయం" అదే ఏడుపు మొహంతో అంది. ఇంకేమీ మాట్లాడలేదు సూరిబాబు. కాసేపు అక్కడే ఉండి, ఫలహారాలు కానిచ్చి, అక్కడి అమృతబావిలోని నీటిని తాగి అక్కడి నుంచి బయలుదేరారు. అక్కడి బావిలోని నీటిని తాగితే ఎటువంటి జబ్బులైనా నయమవ్వడంతో, ఆ బావికి అమృతబావి అని పేరొచ్చిందని రాజ్యానికి వివరించాడు. అతను చెప్తుంటే కళ్లింతవి చేసుకుని వినసాగింది ఆమె. అక్కడి నుంచి నేరుగా నిర్మల్ వైపు కారుని దౌడు తీయించి, అక్కడి కొయ్యబొమ్మలు చూపించి, నాగలితో దున్నుతున్న రైతు, అతనికి సాయపడుతున్న అతని భార్య ఉన్న బొమ్మని ఆమెకిచ్చాడు. ఏదో తెలియని భావం ఏర్పడింది అతడిపై. ఆ తర్వాత కారుని భైంసా దారికి మళ్లించకుండా నేరుగా కుంటాల జలపాతానికి తీసుకెళ్లాడు.

ఆ ప్రకృతిని, నీటిని చూడగానే రాజ్యం ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. చిన్నపిల్లలా నీళ్లతో ఆడుకోసాగింది. పరిసరాలన్నీ మర్చిపోయి, ప్రకృతిలో తనొక్కత్తే భాగమన్నట్టు గెంతసాగింది. ఓ పదినిమిషాలయ్యాక గుర్తొచ్చింది, అతను అక్కడే ఉన్నాడని. కృతఙ్ఞత నిండిన కళ్లతో అతన్ని చూసింది. దాదాపుగా తడిసిపోయిన ఆమె అందాలు అతడిని తలతిప్పనీయకుండా చేశాయి. రాజ్యం దగ్గరకొచ్చి అడిగాడు "ముద్దిస్తావా?" అని.
"భయమేస్తోంది"
"ఇక్కడ కూడానా? అయినా ఇస్తే కదా తెలిసేది" అన్నాడు.
ఆలోచనల్లో పడింది రాజ్యం. ’ఎన్నాళ్లని తప్పించుకుంటావ్? ఆశాఢమైన తర్వాతైనా ఇవ్వక తప్పదు కదా! అదేదో ఇప్పుడే ఇచ్చెయ్యవే!’ అంది మది.
"నన్ను చూస్తే జాలేయడం లేదా?" అన్నాడు సూరిబాబు. అతడిని బాధపెడుతున్నాననిపించింది ఆమెకు. తన స్నేహితురాండ్లు ఎంత మంది చెప్పలేదు వాళ్ల భర్తల మోటు సరసం గురించి! కాని ముద్దుకి కూడా ఇన్నాళ్ళ నుండి అనుమతి అడుగుతున్న భర్త మొహం చూస్తే రాజ్యంకు నిజంగానే జాలేసింది.

సూరిబాబుకి దగ్గరగా వచ్చింది రాజ్యం. అతని ఛాతిభాగం వరకు ఆమె, ఆమెకు అందనత ఎత్తులో అతను. కాళ్లవేళ్లపై నిలబడి వణుకుతున్న పెదాలతో సూరిబాబు ఎడమచెంపపై సుతిమెత్తని ముద్దునిచ్చింది. చలో, వేడో, రెంటి కలయికో తెలియని ఉష్ణోగ్రత అతడి చెంపపై కాసేపు నమోదైంది. వేళ్లపై నిలబడుతూ అవస్థపడుతున్న రాజ్యానికి ఆమెనడుం కిందిభాగాన చేతులేసి గట్టిగా హత్తుకుని పైకి లేపి ఆమెకు సౌకర్యాన్ని కలిగించాడు. పూలపాన్పుని హత్తుకున్న భావన అతనిలో మెదిలింది. అప్పుడు అతని చూపుని దోచుకుంది ఓ ఆవగింజ. ఆమె మెడ, ఎడమ భుజం కలిసే జాలువారే ప్రాంతంలో తెల్లని మేనిపై ఆవగింజంత ఉన్న నల్లని పుట్టుమచ్చ. ఆ ఆవగింజను మురిపెంగా ముద్దాడాడు. చల్లని వాతావరణంలో వెచ్చని కౌగిలిలో ప్రకృతిని మరచిపోయి సేదతీరుతూ అలాగే ఉండిపోయాడు.

పక్షులు చెట్లపై ఉన్న తమ గూళ్లకు చేరుకుని కీచుకీచుమంటూ శబ్దం చేయడంతో కౌగిలిలోకం నుండి మామూలు లోకంలోకి వచ్చారు. వద్దని మనసులో వారిస్తున్నా తప్పదన్నట్టుగా ఇరువురి శరీరాలు భారంగా కదిలాయి. భైంసాకి వెళ్లేసరికి రాత్రైంది. ఆ రాత్రికి అత్తవారింట్లోనే ఉండి మరునాడు ఉదయం బయలుదేరాడు సూరిబాబు.

-౦-

ఆ ముద్దు, తుఫాను ధాటికి ఉక్కిరిబిక్కిరైన తీరంలా అతని మనసుని కల్లోల పరిచింది. ఆషాఢం ముగిసే వరకు ఆ ముద్దునే వేలసార్లు తలచుకుంటూ తృప్తిపడ్డాడు. రాజ్యమైతే సూరిబాబు మళ్లీ ఎప్పుడొస్తాడా అని అతనిచ్చిన కొయ్యబొమ్మని లక్షలసార్లు చూస్తూ గడిపింది.

ఆషాఢం ముగియగానే రాజ్యాన్ని తీసుకువచ్చాడు. ఆ మరునాడే "విశాఖపట్టణంలో కొత్త సరుకు వచ్చిందట. బట్టలు బాగున్నాయో లేదో చూసి వస్తాన"ని తల్లి విశాలాక్షితో చెప్పి రాజ్యంతో సహా సూరిబాబు బయలుదేరాడు. సరుకు కోసం ఎప్పుడూ బొంబాయి వెళ్లే కొడుకు విశాఖపట్టణం అందునా కోడల్ని తీసుకుని మరీ ఎందుకు వెళ్లాడో విశాలాక్షికి అంతుబట్టలేదు.

రాజ్యానికి నీళ్లంటే ఎంతిష్టమో కుంటాల జలపాతం వద్ద చూసినప్పుడే సూరిబాబుకి అర్థమైంది. అందుకే ఆమెకు సముద్రాన్ని చూపించాలని, మరో ముద్దు అందుకోవాలని అతని ఆశ. అందుకే భీమిలి తీరానికి తీసుకెళ్లాడు. కాని అక్కడ ఊహించని విధంగా సినిమా షూటింగు జరుగుతుండటంతో నీరసపడిపోయారు. మేకప్ తో ఉన్న కళాకారుల్ని చూస్తే ఇద్దరికి నవ్వొచ్చింది. గుమికూడిన జనం అరుపులు, అంతకు మించి షూటింగు తాలూకు శబ్దాలతో గందరగోళంగా మారిన ఆ వాతావరణంలో ఇమడలేక నిష్క్రమించి, కైలాసగిరి చూపించి సాయంత్రానికి విశాఖ చేరుకున్నాడు. దాదాపు నిర్మానుష్యంగా, ప్రశాంత వదనంతో తపస్సు చేసుకుంటున్న మునిలా గంభీరంగా ఉంది సముద్రం. కనుచూపుమేరలో భూమి కనిపించకుండా మొత్తం నీరే కనిపిస్తుండటం రాజ్యానికి కొత్త లోకానికి వచ్చిన అనుభూతినిచ్చింది. పరుగెత్తుకుంటూ వెళ్లి జలకన్యలా మమేకమైంది. ఆమెతో జతకట్టాడు సూరిబాబు. సూర్యాస్తమయం అయ్యేవరకు అలా జలకాలాడుతూనే ఉన్నారు.

అప్పుడే వికసించిన పువ్వులా కనువిందు చేస్తున్న రాజ్యాన్ని చూశాక సూరిబాబులో కొత్త ఆలోచనలు మొగ్గలు తొడిగాయి. నీటిని వీడి ఒడ్డుకు రాగానే చలి వణికించింది. రాతి అమరికలతో గుహలా ఏర్పడిన దాంట్లోకి బట్టలు మార్చుకునేందుకు రాజ్యాన్ని తీసుకెళ్లాడు. కాని బయటకు రాలేదు. ఏంటన్నట్టుగా చూసింది ఆమె. "ముద్దివ్వు" అన్నాడు. రాజ్యం కొయ్యబారిపోయి చూస్తుండిపోయింది. సూరిబాబే రాజ్యానికి దగ్గరగా వెళ్లాడు. చెంపపై ఇవ్వబోతున్న ముద్దుని తెలివిగా పెదాలపై ఇచ్చేలా తలతిప్పాడు అతను. తడిసిన బట్టలతో వణుకుతున్న శరీరాల్లో ఆ ముద్దు విద్యుత్తును ప్రసరింపజేసింది. గుండెలోతుల్లో దాగున్న ప్రేమాగ్ని బద్దలై వారిని మరింత దగ్గర చేసింది. తడిసిన బట్టలు కిందపడ్డాయి. పొడిబట్టల అలంకరణకు శరీరాలు ససేమిరా అన్నాయి. ఇసుక పరుపైంది. చీకటి దుప్పటైంది. బిగికౌగిలిలో ఒదిగిపోతూ, నలిగిపోతూ సుదూర తీరాలు పయనిస్తూ అనంత దూరాలు చేరుకుంటూ ఏదో మత్తులాంటి అపస్మారక స్థితిలోకి జారిపోయారు. ఆ రాత్రంతా ఆప్యాయతలోని కమ్మని రుచిని అంది పుచ్చుకుంటూనే ఉన్నారు.

-౦-

మరునాడు ఇందూరుకి తిరుగు ప్రయాణమయ్యారు. శృంగార వ్యవసాయాన్ని మనస్ఫర్థలనే కలుపు మొక్కలు లేకుండా ప్రేమనే నీటిని అందిస్తూ సాగు చేయసాగారు. ఇద్దరూ ఒక్కటైన ఆ క్షణం నుంచి ఒకరికొకరు కొత్తగా కనిపించడం మొదలుపెట్టారు. ఈ లోకం కూడా వారికి కొత్తగా కనిపిస్తోంది. విశ్వమంతా ప్రేమమయంలా అనిపించింది. ఉషోదయాలు, పక్షుల కిలకిలారావాలు, పూల మకరందాలు, పళ్లలోని కమ్మని రుచులు, పచ్చని చెట్లు, నీలాకాశం, మినుకుమనే నక్షత్రాలు, వెన్నల కురిపించే చంద్రుడు, సెలయేళ్ల హొయలు, సన్నటి పైరగాలులు, చిరుజల్లుల పులకరింతలు, అవి నేలని ముద్దాడగానే వచ్చే పరిమళాలు అన్ని కలగలిసిన ఈ అందమైన లోకంలో అవి ప్రేమ చిహ్నాలుగా కనిపించాయి.

సంవత్సరంపాటు నిర్విరామంగా సాగిన వ్యవసాయం సాగుబడినిచ్చింది. రాజ్యం తల్లిగా పదోన్నతి పొంది, నెలలు నిండగానే పుట్టింటికి వెళ్తూ, నామకరణ మహోత్సవమయ్యాక వస్తూ, మళ్లీ వెళ్తూ.. మూడు సంవత్సరాల్లో సంవత్సరానికొకరి చొప్పున ముచ్చటగా ముగ్గురు పిల్లలకి జన్మనిచ్చింది. పిల్లల రూపంలో దంపతుల మధ్య అసంకల్పిత దూరం ఏర్పడింది. రాజ్యం పిల్లలే లోకంగా బతుకుతోంది. పిల్లలు పెద్దనవుతున్న కొద్ది, వ్యాపారం మరింత వృద్ధిచెందుతున్న కొలదీ దంపతుల మధ్య ఎడం ఎక్కువవసాగింది. పిల్లల పెళ్లిళ్లు అయ్యాయి. పెద్దకొడుకు వ్యాపారాన్ని చూసుకుంటూ నిజామాబాద్‌లోనే ఉండగా, రెండవవాడు గ్రానైట్ వ్యాపారంతో హైదరాబాద్‌లో స్థిరపడ్డాడు. చిన్నవాడు బెంగుళూరులో ఓ కంపెనీ ఏర్పాటు చేశాడు. ముగ్గిరి పెళ్లిళ్లు జరిపించాక సూరిబాబుకి విశ్రాంతి తీసుకోవాలనిపించింది. వ్యాపారాన్ని పూర్తిగా పెద్దకొడుక్కి అప్పజెప్పి, సముద్ర తీరానికి దగ్గరగా ఓ ఇల్లు కట్టించాడు. పెళ్లిరోజు కానుకగా రాజ్యం చేతిలో ఇంటి తాళాలు పెట్టేసరికి ఆశ్చర్యపోవడం రాజ్యం వంతైంది. అందరూ కొత్తింటికి చేరుకుని గృహప్రవేశం చేశారు.

-౦-

గతంలోంచి వర్తమానంలోకి వచ్చిండి రాజ్యం. "ఇంతకీ సూర్యం ఇక్కడ ఇంటిని ఎందుకు కట్టించినట్టు?" మదిని మళ్లీ అడిగింది రాజ్యం.
’ఇంకెందుకు.. అందుకే! ఓసారి అడిగిచూడు తెలుస్తుంది’ అంది మది.
"ఎలా అడగను? అదీ ఈ వయసులో? తప్పుపడితే ఎలాగ?" అంది రాజ్యం.
’వయసేంటే నువ్వేమైనా ముసలిదానివా? శరీరం సహకరించేంతవరకు ఇద్దరూ ఒకటవడం ఆరోగ్యానికి కూడా చాలా అవసరమని డాక్టర్లు చెబుతుంటే..! అయినా నీ సూర్యం దగ్గర నీకు సిగ్గేమిటే రాజ్యం" అంది ఆమె మనసు. ఇంతలో సూరిబాబు వచ్చాడు. అతని చూపులు పాతగా ఉన్నాయి. ముప్పై సంవత్సరాల క్రితం నాటి చూపుల్లా! మధ్యాహ్న భోజన సమయంలో అడిగింది రాజ్యం, నవ్వి ఊరుకున్నాడు సూరిబాబు.

సాయంత్రం సముద్ర తీరానికి చేరుకున్నారు. సముద్రం ప్రశాంతంగా కనిపించింది. తొలిరేయి కళ్లముందు కదలాడింది. మనసులా నిండా ఏదో అనిర్వచనీయమైన ఆనందం. చల్లటిగాలి హాయి గొల్పింది. చీకటి పడే వేళ ఇంటికొచ్చారు. భోజనాల వేళ మళ్లీ అడిగింది రాజ్యం. మళ్లీ నవ్వాడు సూరిబాబు, పాత చూపుతో కళ్లలోకి చూస్తూ! పాత చూపైనా రాజ్యానికి కొత్తగా ఉంది. ఇద్దరూ పడకగదిలోకెళ్లగానే, అక్కడ చోటు లేని వారి మనసులు బయటకు బయలుదేరాయి. అలా వస్తుండగా ఆ మనసులకి వారి మాటలు లీలగా వినిపించసాగాయి "జీవితపు పరుగులో చాలా అలిసిపోయాం! ఇకనైనా మనకోసం మనం బతికేందుకు ఈ ఇల్లు! నీరు నీకెంత దగ్గరగా ఉంటే నువ్వంత సంతోషంగా ఉంటావని ఇక్కడ కట్టించాను" అన్నాడు సూరిబాబు. మనసులు నవ్వుకుంటూ బాల్కనిలో చేరి వెండి వెన్నెలలో కాంతులీనుతూ అలల పొంగుల నురగలో వజ్రాలహారంలా మెరుస్తున్న సముద్రం వంక చూస్తుండిపోయాయి.

ఇద్దరూ ఒక్కటయ్యారు. తొలిరేయి పునరావృతమైంది. సముద్రం చల్లటిగాలిని బాల్కనీలోంచి పడకగదిలోకి కిటికీలగుండా సరఫరా చేయసాగింది.

- అయిపోయింది -

* ఆంధ్రభూమి సపరివార పత్రికలో ఏప్రిల్ 2, 2009 న ప్రచురితం *








పులకరింత-మిటకరింత


"కోఠి నుండి ఉప్పల్‌కి వెళ్ళాలంటే ఎంత సమయం పడుతుందంటారు?" నగరానికి కొత్తగా వచ్చిన ఓ వ్యక్తి సగటు నగర పౌరుణ్ణి అడిగాడు.

"మామూలుగా మీరు బస్‌లో వెళితే.. ఉదయం ఐదున్నర, ఆరు గంటల ప్రాంతంలో అయితే పావుగంటలో వెళ్ళొచ్చు.. ఏడు ఎనిమిది గంటల ప్రాంతంలో అయితే అరగంటలో వెళ్ళొచ్చు.. తొమ్మిది నుండి పదకుండు గంటల ప్రాంతంలో లేదా సాయంత్రం నాలుగు నుండి రాత్రి పది గంటల ప్రాంతంలో ట్రాఫిక్ ఎక్కువుంటుంది కాబట్టి ముప్పవుగంటలో వెళ్ళొచ్చు" అని చెప్పాడు నగర పౌరుడు.

"మరి బైక్‌పై వెళితే?" అడిగాడు కొత్త వ్యక్తి.

"ట్రాప్ఫిక్ రూల్స్ పాటించకుండా వాహనాల మధ్య సందుల్లోంచి దౌడు తీయిస్తూ, రెడ్‌లైట్‌కి కూడా కనీస మర్యాద ఇవ్వకుండా వెళ్ళిపోతే అరగంటలో వెళ్ళొచ్చు" అన్నాడు.

కొత్త వ్యక్తి "ఓ"ని వదిలి "హో!'ని వదిలేలోపే, నగర పౌరుడు "అది కూడా గ్యారంటీ లేదు!" అన్నాడు. దాంతో "హో!"ని నోటి గ్రైండర్‌లో నాలుకతో మిక్సి చేసి దాన్ని "హౌ?"గా వదిలాడు కొత్త వ్యక్తి.

"మధ్యలో అంబర్‌పేట్‌లో స్మశానవాటికుంది. ఎవరైనా ప్రముఖ నాయకులు చనిపోయినా.. లేక చనిపోయినవాడి శవానికి రాజకీయ రంగు అదిమి ఆ శవయాత్రని ప్రముఖంగా మార్చినా.. ఆ శవం, దాంతో పాటు అక్కడికి వందల్లో జనాలు, వాళ్ళ అరుపులు, నినాదాలు, వాళ్ళతో సమానంగా పోలీసులు, మీడియా వాళ్ళు అక్కడికి చేరుకుని దహన కార్యక్రమం జరిగాక మళ్ళీ ఆ జనాల్ని, మీడియాని పోలీసులు పంపించేసరికి రెండు మూడు గంటలైనా పట్టొచ్చు" అన్నాడు.

"అలాకాకుండా.. ఏ వాహనం మీదైనా, ఏ పరిస్థితుల్లోనైనా, ఏ సమయంలోనైనా కోఠి నుంచి ఉప్పల్ వెళ్ళాలంటే ఎంత సమయం పడుతుందంటారు?" అనడిగాడు కొత్త వ్యక్తి.

నగర పౌరుడికి ఒళ్ళు మండింది. కాని అతని ఒంటి మీద నదలా పారుతున్న చెమటతో మంట చల్లారిన భావనలో, అమాయకంగా కనిపిస్తున్న కొత్త వ్యక్తి వంక విచారంగా చూసతూ " నీకు మాయలు, మంత్రాలు వస్తే ఇక్కడ మాయమై అక్క ప్రత్యక్షమవడానికి ఒకటి రెండు సెకన్లు పట్టచ్చ.. లేదా సి.ఎం.లా హెలికాప్టర్‌లో వెళితే ఒకటి రెండు`నిమిషాల్లో వెళ్ళొచ్చు. ఈ పరిస్థితుల్లో కాకుండ మరే పరిస్థితుల్లోనైనా ఎంత సమయంలో వెళ్ళొచ్చో చప్పే తెలివితేటలు ఆ బ్రహ్మ దేవుడు నాకివ్వలేదు" ని దీనంగా చెప్పాడు.

"బస్సెక్కి అరగంటైనా ఉ్పల్ ఇంకా రాకపోతేనూ..!" అంటూ చేతి రుమాలుతో మొహం పై ఊరుతోన్న చెమటను తుడవలేక అవస్థపడుతూ, సంజాయిషీ ఇచ్చుకుంటున్నట్టు అన్నాడు కొత్త వ్యక్త.

నగర పౌరుడు వేదంతిలా ఓ నవ్వు నవ్వి "నువ్వ ఈ నగరానికి కొత్త కదా నాయనా..! మొదట్లో అలాగే ఉంటుది, మెల్లిగా అదే అలవాటవుతుంది" అని కాస్త ధైర్యా్ని నూరి అతని చెవిలో పోశాడు.

వీళ్ళ సంభాషని వింటున్న మరో ఉడుకు రక్తపు యువకుడు " 'షో'నియా వ్చి అక్కడ షో చేస్తోంది కదా! బస్సులన్నిటిని అక్కడికి పంపించారు. రెండు గంటల తర్వాత వచ్చిన ఈ బస్సులో లెక్కపెట్టలేనంత మంది ఎక్కారు కదా.. అందుకే ఇంత`మెల్లిగా వెళ్తూ అంత సమయం తీసుకుంటోంది!" అని అర్ం వచ్చేలా అందమైన భూతుల భాషలో ఆవేశంగా చెప్పాడు.

"ఆవిడ సభకు ప్రైవేటు వాహనాల్ని ఏర్పాటు చేసుకోవాలి కాని ఇలా ఆర్.టి.సి. బస్సుల్ని అక్కడకు పంపి మనల్ని ఇబ్బందులకు గురిచెయ్యడమెందుకు?!" ఆశ్చర్యం, విచారం కలగలిసిన స్వరంలో అన్నాడా కొత్త వ్యక్తి.

ఇంతలో డ్రైవర్ బస్సాపాడు. కండక్టర్ మామూలు కంటే నాలుగు రెట్లు వేగంగా టికెట్లిచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎప్పటిలా ఐదునిముషాలు ఓపిక పట్టారు జనాలు. ఆ తర్వాత "డ్రైవర్‌గారు.. బస్సుని కొంచెం మెల్లిగా అయినా నడపండి, ఉక్కపోతని భరించలేకపొతున్నాం" అంటూ విన్నవించుకున్నారు.

డ్రైవర్ నుంచి స్పందన రాలేదు.

"రైట్ రైట్" అని అర్థం స్ఫురించేలా చేత్తో బస్ పైభాగాన్ని కొట్టసాగారు.

డ్రైవర్ ఉలుకూ పలుకూ లేకుండా ఉన్నాడు.

కాస్త గట్టిగా కొట్టారు.

అయినా స్పందన రాలేదు.
ఓ పావుగంట కొట్టి కొట్టి చివరికి విసుగొచ్చి ఆపేశారు. కండక్టర్ కిమ్మనకుండా తన పని తాను చేసుకుపోతున్నాడు. అలా అనడం కన్నా, కిమ్మనే తీరిక లేక అలా టికెట్లు ఇస్తూ జనారణ్యాన్ని దాటుకుంటు వెళ్తున్నాడు అనడం కరెక్టేమో! పొద్దంతా పనిచేసొచ్చి నీరసంగా ఉన్న శరీరాలతో బస్‌లో నిలబడి ఆ ఉక్కపోతని భరించలేక ఆ అసహన్నాన్ని డ్రైవర్ మీద చూపిస్తూ కోప్పడసాగారు. పాపం! ఆయన మాత్రం ఏం చేస్తాడు.. టికెట్స్ తీసుకునేంత వరకూ బస్ ఆగుండాల్సిందేనని కండక్టర్ హుకుం జారీ చేశాడు.. ఈ రోజు చెకింగ్ అధికారులు విస్తృతంగా తనిఖీ చేస్తున్నారని కండక్టర్‌కి కబురందింది మరి! ఆయన బాధ ఆయనది! డ్రైవర్ బాధ డ్రైవర్‌ది! జనాల తిప్పలు జనాలవి!

ఇంతలో ఒక ప్రయాణికుడు "అమ్మ రాకతో పెరేడ్ గ్రౌండ్స్ పులకరింత-బస్సులు లేక ప్రజలు గుడ్లు మిటకరింత" అన్న హెడ్‌లైన్‌తో రేపు పేపర్లో న్యూసొస్తుంది" అన్నాడు.

తమ మీద తామే విసురుకున్న చలోక్తిని విన్న వారందరూ హాయిగా నవ్వుకున్నారు.

గడచిన ఐదేళ్ళని అవలోకనం చేసుకుంటూ "వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని గెలిపించొద్దు" అన్నాడు మరో వ్యక్తి కాస్త బాధతోనే!

బస్‌లోపల్నించి ఓ వ్యక్తి వెంటనే స్పందించాడు "ఏం తక్కువ చేశాడండీ రాజశేఖర్ రెడ్డి గారు?" అని అరిచాడు.

ఇంతలో బస్సు కదిలింది.. కిటికీల్లోంచి చల్లగాలి వీయసాగింది.. దాంతో ఆ చల్లటి గాలికి ఓ పావుగంట అందరూ అలా మౌనంగా ఉండిపోయి సేదతీరారు.

"ఎవరికి ఓటెయ్యాలన్నది ఓటేసేంతవరకు ఆలోచించవచ్చు! కాని దాని కన్నా ముందు అందరూ ఓటేసేందుకు బయలుదేరడానికి ఇప్పట్నుంచే ఏర్పాట్లు చేసుకోండి" అన్నాడు కొత్త వ్యక్తి.

"ఏప్రిల్‌లో పెట్టారు కదండీ ఎలక్షన్లు.! అప్పుడు ఎండలు బాగ ఎక్కువవుతాయి. ఆ ఎండలో ఆడాళ్ళని, పిల్లల్ని తీసుకెళ్ళాళంటే.. పైగా ఇప్పుడున్న పరిస్థితుల్లో వందలు వందలు ఖర్చు పెట్టుకుని తీసుకెళ్ళాలంటే కొంచెం కష్టమే మరి!" అన్నాడు ఓ వ్యక్తి.

"ఐదేళ్ళ జీవిత గమనాన్ని శాసించే ఓటును వేసేందుకు తీరిక ఉండదు.. కాని ఆ ఐదేళ్ళు ఎంత ఇబ్బందికి గురైనా సర్దుకుపోయే ఓపిక మాత్రం ఉంటుంది" అన్నాడు లోపల్నుంచి ఓ వ్యక్తి.. కొత్త వ్యక్తి మనసు పొరల్లోంచి..!

ఇంతలో గంట ప్రయాణం తర్వాత ఉప్పల్ వచ్చింది. అందరూ దిగేసి ఎవరిళ్ళకి వారు చేరుకున్నారు. తిని హాయిగా నిద్దురపోయారు. లేచాక నిన్న జరిగింది మర్చిపోయారు. హుషారుగా తయారవసాగారు.. ఈ రోజైనా బస్‌లో సీటు దొరకబుచ్చుకోవాలన్న ఆశతో!

స్లండాగ్ మిలియనీర్ సినిమా సమీక్ష


ఈ సినిమా గురించి అమితాబ్, అరిందం చౌదరి వంటి కొంత మంది విమర్శలు చేస్తే, మిగితా చాలా మంది మాత్రం పొగిడారు.. ఇంతకీ ఈ సినిమాలో ఏముంది..?
నేను సినిమా చూశాక వాళ్ళు ఎందుకు విమర్శించారో నాకర్థం కాలేదు.. ఎందుకంటే లేనిది వున్నట్టుగా ఆ సినిమాలో ఏం చూపించలేదు.. వున్నది వున్నట్టుగానే చూపించారు. అప్పట్లో పిల్లలను కిడ్నాప్ చేసి బిక్షాటన చేయించారు అన్నది.. ఇప్పటికీ మురికి వాడల్లో వారి జీవితం అలాగే వుంది అన్నది.. ఒక వర్గం పై మరో వర్గం దాడి చేసింది అన్నది జీర్నించుకోలేని చేదు నిజాలు.. కాని అవి నిజాలే..!
ఇక సినిమాకు ఆయువు పట్టు కథనం.. అత్యద్భుతమైన స్క్రీన్ ప్లే .. దానికి తోడు మంచి సంగీతం..! సినిమాని ఆసక్తికరంగా మలిచేందుకు కథనాన్ని ( స్క్రీన్ ప్లే ) ఉపయోగించుకోవడంలో దర్శకులు విజయవంతమయ్యారు.. నటీనటులందరు చాలా బాగా నటించారు.. ముఖ్యంగా హీరో పాత్రధారులు..! అయితే ఈ సినిమాలో కథ శూన్యం..సినిమా మొత్తం కథనం పై ఆధారపడి తీశారు.. కథనానికి, సంగీతానికి, దర్శకత్వానికి ఆస్కార్ వచ్చే అవకాశాలు పుశ్కలంగా వున్నాయి..

ఇక సినిమా మన వాళ్ళకు అంతగా నచ్చకపోవచ్చు.. ఎందుకంటే అది హాలీవుడ్ సినిమాలా కాకుండా భారతీయ సినిమాలా తీశా
రు.. అందుకే మనకు అంతలా నచ్చట్లేదు..వాళ్ళకి తీసిన విధానం కొత్తగా అనిపిస్తోంది.. అందుకే అంతలా నచ్చుతోంది.. సినిమా చూసేటపుడు ఓం ప్రకాశ్ మెహ్రా, రాం గోపాల్ వర్మ శైలి కనిపిస్తుంటుంది.. భారత దేశపు కథతో ఆస్కార్‌కి నామినేట్ అయిన ఈ సినిమా మన దేశ కీర్తి ప్రతిష్ఠలు, గౌరవం ఇనుమడించేదిగా లేకపోవడం విచారించదగ్గ విషయం..


సినిమా మొదట్లో కానిస్టేబుల్ హీరోని కొట్టగానే, ఫ్లాష్ బాక్ లో కె.బి.సి లో ఆడుతున్న హీరోకి ఆ దెబ్బ గుర్తుకు వచ్చినట్టు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో చూపించారు.. కాని ముందు ఆ షో అవుతుంది.. ఆ తర్వాత చివరి ప్రశ్న వేసేముందర టైం అయిపోయిన హార్న్ వస్తుంది.. అప్పుడు అనిల్ కపూర్ అతన్ని పోలీసులకి అప్పగిస్తాడు.. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ లో అతన్ని కానిస్టేబుల్ కొడతాడు..!

నిజానికి ఏ.ఆర్.రెహమాన్ ఇంతకంటే అద్భుతమైన సంగీతాన్ని అంతకంటే ముందు ఎన్నో సార్లు మనకందించాడు.. కాని హాలీవుడ్ సినిమాకి పనిచేయడంతోనే అతను ఆస్కార్ కి నామినేట్ అవడం అనేది దౌర్భాగ్యం. ఇక ఈ సినిమాలోని నేపథ్య సంగీతానికి రెహమాన్ ని ఎంత పొగిడినా తక్కువే..! ఏదేమైనా ఈ రకంగానైనా అతనికి ఆస్కార్ వస్తే అది భారతీయులందరి కల నెరవేరిన రోజవుతుంది.. ఆస్కార్ పొగరు అణచి, ఆ ప్రతిమని సగర్వంగా రెహమాన్ తీసుకురావాలని మనందరం మనస్ఫూర్తిగా ఆశిద్దాం..!

జై హో!

నా సలహా: తప్పక చూడండి