ఔనా..! (నవల) సమీక్ష


"నేను డాక్టర్ని కనక మనిషికి ఉన్న మూడవ కోణం - ఆరోగ్యం - అతని శరీరంలోని వ్యాధులు, అవయవ నిర్మాణం, వాటికి అతని జీవితం మీద ఉండే ప్రభావం - ఇవి ముఖ్యమైనవని చాలా గట్టి నమ్మకం. అంటే ఆ పాత్రల మానసిక, సాంఘీక , ఆర్థిక పరిస్థితులనే కాకుండా శారీరక, ఆరోగ్య పరిస్థితులని కూడా వర్ణిస్తూ - వీటి మధ్య జరిగే సంఘర్షణని  వర్ణిస్తూ సాహిత్యాన్ని సృష్టించాలని నా ఆశ" అని రచయిత ముందుగా చెప్పుకున్నారు.

రచయిత అభిలాషకు అనుగుణంగా రాసినా ఈ "ఔనా..!" నవల వైవిధ్యంగా ఉండి ఆకట్టుకుంటుంది. నిషాద్ వినీలలు ఆలుమగలు. వినీలకి మధుమేహం(షుగర్). అతను ఆశించే ప్రేమను భార్య నుండి పొందలేకపోయినా, ఆమెను పిచ్చిగా ప్రేమించే పాత్ర అతనిది. నిషాద్‌ని పెళ్లి చేసుకోలేకపోయినప్పటికీ, అతనిపై రోజురోజుకి ప్రేమను పెంచుకుంటూ, జీవితాంతం ఒంటరిగా ఉండాలనుకునే పాత్ర డాక్టర్ మేఘనది. ఒక విచిత్రమైన జుగుప్సాకరమైన మానసిక, శారీరక వ్యాధితో బాధ పడే పాత్ర విజయ చంద్ర. తన వ్యాధి లక్షణాలతో హత్యలు చేస్తుందీ పాత్ర. విజయ చంద్ర అసలు స్వరూపం తెలియక, తన వ్యాధి గురించి అతని దగ్గర దాస్తూ, నిషాద్‌తో పెళ్లైనప్పటికీ విజయ చంద్రని ప్రేమిస్తుంటుంది. శైలజని పెళ్లిచేసుకోవాలని ఆశపడే వ్యక్తి యాదగిరి. ఇతను ఇతరుల లైంగిక కార్యకలాపాలను రహస్యంగా చూసి ఆనందించే "వాయురిజం" అనబడే వ్యాధితో పోరాటం చేస్తుంటాడు. ఇతని జబ్బు వల్ల మిగితా పాత్రలు ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు? వినీలకి విజయ చంద్ర అసలు స్వరూపం తెలిసిందా? విజయ చంద్ర, వినీల, నిషాద్, మేఘనల్లో చివరికి ఎవరు ఎవరికి తోడుగా నిలిచారు? వంటి విషయాలను ఒక్కొక్కటిగా విడమరుస్తూ నవల ముగింపుకు వస్తుంది.

నవలని ఉత్కంఠభరితంగా రాయడంలో రచయిత సఫలీకృతులయ్యారు. జుగుప్సాకరమైన మానసిక వ్యాధులను, వాటి లక్షణాలను కళ్లకు కట్టినట్టు వర్ణించారు. జబ్బు అంటే ఎయిడ్స్ తప్ప మరోటి లేదన్నట్టు రాయబడ్డ నవలలతో పోలిస్తే ఈ నవల భిన్నమైనదిగా నిలుస్తుంది.

మధ్యలో రచయిత కంఫ్యూజన్‌కి గురయ్యారు. 104వ పేజిలో మేఘన నిషాద్‌కి ఫోన్ చేసి వినీల, విజయచంద్రల ప్రేమ వ్యవహారం చెబుతుంది. మళ్లీ 123వ పేజిలో అదే ప్రేమ వ్యవహారం నిషాద్‌కి కొత్తగా చెబుతుంది. నిషాద్ కూడా అప్పుడే ఆ విషయం వింటున్నట్టు ప్రవర్తిస్తాడు. అలాగే 98వ పేజిలో వినీల ఉండే అపార్ట్‌మెంట్‌లోనే విజయచంద్ర ఉంటున్నట్టు ఆమెతో చెబుతాడు. మళ్లీ 138వ పేజిలో ఆ విషయం నిషాద్ చెప్తే తెలిసినట్టు, అప్పటి వరకు తెలియనట్టు ఆమె షాక్‌కి గురికావడం పాఠకుడికి మింగుడు పడవు.

మధుమేహం వ్యాధి గురించి విపులంగా చర్చంచారు రచయిత. అయితే వినీలకి మధుమేహం అన్న విషయం దాదాపు ఆమె ఉన్న ప్రతి సన్నివేశంలోనూ గుర్తు చేశారు. 

సరళమైన భాషలో ఉత్కంఠభరితంగా సాగింది నవల. నవలకి అందం కథనం. కథని నడిపించిన తీరు హాయిగా, ఆసక్తికరంగా సాగుతుంది. విజయ చంద్ర మానసిక వ్యాధిని వర్ణించడంలో రచయిత విజయవంతం అయ్యారు.

పైకి కనిపించని మానసిక వ్యాధులున్నా, మంచి వ్యక్తుల్లా నటించే వాళ్లు ఈ సమాజంలో ఉంటారని, మంచిగా కనిపించే వారందరిని గుడ్డిగా నమ్మి హద్దులు దాటి ప్రవర్తించకూడదని ఈ నవల చదివిన తరువాత పాఠకుడికి హితభోదలా, ముఖ్యంగా యువతీ యువకులకి ఓ చిన్నపాటి హెచ్చరికలా అవగతమవుతుంది.

భార్యాభర్తల మధ్య రొమాన్స్‌ని నగ్నంగా వర్ణించారు. వర్ణించిన తీరు, శైలి ఆకట్టుకుంటాయి. అన్నిటికన్నా హాయిగొలిపే విషయం అచ్చు తప్పులు లేకపోవడం. బాలి గారి కవర్ డిజైన్, ముఖ్యంగా కరుణాకర్ గారి బొమ్మలు నవలకు మరింత అందం తెచ్చిపెట్టాయి. వైవిధ్యమైన నవలలు చదవాలనుకునే వారికి "ఔనా..!" మంచి కాలక్షేపం. రచయిత డా.చిత్తర్వు మధు గారికి అభినందనలు.

ఔనా..! (నవల)
రచయిత: డా.చిత్తర్వు మధు
పబ్లిషర్: వాహిని బుక్ ట్రస్ట్
ఫస్ట్ ఎడిషన్: ఫిబ్రవరి, 2006
వెల(ఫస్ట్ ఎడిషన్): రూ.80/-
కాపీల కొరకు: వాహిని బుక్ ట్రస్ట్, విశాలంధ్ర, నవోదయ, నవయుగ బుక్ హౌస్, నవోదయ పబ్లిషర్స్.