పండుగ పర్వం - పుస్తక సమీక్ష



"చిన్నప్పటినుంచి నాకు పుస్తకాలు చదవడమన్నా, తాతయ్యలు, బామ్మల కబుర్లు వినడమన్నా ఆసక్తి. అదే నాలో విషయఙ్ఞానం - ముఖ్యంగా పౌరాణిక ఙ్ఞానం పెరిగేందుకు బాటలు వేసింది. మా నాన్నగారి దగ్గర, బాబాయి దగ్గర ఉన్న రామాయణ భారత భాగవతాల వంటి ఉద్గ్రంథాలు, మా నాన్నగారి మేనత్తల దగ్గర స్త్రీల వ్రతకథలు, శ్రీశైల క్షేత్ర మహత్యం, శ్రీ వెంకటేశ్వర మహత్యం, వినాయక విజయం వంటి పుస్తకాలు, వీటితో పాటే మా మామ్మ చదివే ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి వారపత్రికలు, అపరాధ పరిశోధన నవలలు, జానపద సాహిత్యం.. ఇలా ఏ ఒక్కదానినీ విడిచిపెట్టకుండా చిన్నప్పటినుంచి చదివి అప్పటి అవగాహన మేరకు అంతో ఇంతో ఆకళింపు చేసుకున్నాను.." అని 'నామాట'లో చెప్పుకున్నారు రచయిత డి.వి.ఆర్.భాస్కర్ గారు.

సాహితీ వాతావరణంలో పెరిగటం, మొదట చేరిన 'ప్రజాశక్తి'లో పుస్తకాలతో ఉన్న అనుబంధం మరింత బలపడటం, ఆ తరువాత 'నవ్య' వీక్లీలో పుస్తక సమీక్ష పేజీలో దాదాపు ఆరువందల పుస్తకాలను చదివి సమీక్షలు రాయడం, అందులోనే ఆధ్యాత్మిక రచనలు మొదలుపెట్టి, అందులో పట్టు సాధించి గుర్తింపు తెచ్చుకోవడం, అటు పిమ్మట 'సాక్షి'లో భక్తి, ఆధ్యాత్మిక శీర్షిక 'సన్నిధి' పేజీ బాధ్యుడిగా చేస్తూనే వీలున్నప్పుడల్లా ఆ శీర్షికలో భక్తి వ్యాసాలు రాస్తూ పాఠకలోకంలో చాలా మంచి గుర్తింపును తెచ్చుకోవడం క్లుప్తంగా రచయిత డి.వి.ఆర్. భాస్కర్ గారి పరిచయం. 'సాక్షి'లో ఆయన రాసిన వ్యాసాల సంకలనమే ఈ "పండుగ పర్వము".

ఈ పుస్తకానికి ఉన్న మొదటి సౌందర్యం - క్లిష్టమైన ఆధ్యాత్మిక విశేషాలను అందరికి అర్థమయ్యేలా చిన్న పదాలతో, తేలిక భాషలో ఉండటం అయితే రెండవ సౌందర్యం - నిత్యజీవితంలో ఉపయోగించే హిందూమత సమాచారాన్ని కూడా ఇందులో పొందుపరచడం.

"వినాయకుడినే మొదట ఎందుకు పూజించాలి?" అంటూ ఈ పుస్తకంలో మొదటి పూజ వినాయకుడికి ఈ వ్యాసంతో చేసి, అందుకు పురాణోక్తంగా సమధానమిచ్చారు. ఆ ఒక్క వ్యాసం చాలు రచయితలోని విషయఙ్ఞానం మనకు తెలియజేయడానికి.

బోనం అంటే ఏమిటి? బోనం ఎలా తయారు చేస్తారు? పంచాంగం ఎందుకు చూడాలి? ఆలయానికి ఎందుకు వెళ్లాలి? కుజదోషానికి నివారణ ఏమిటి? కార్తీకంలో సోమవారానికి ఎందుకంత ప్రాధాన్యత? వంటి స్వతహాగా మనిషి మేధస్సులో జిజ్ఞాసకొద్ది జనించే, ఆసక్తి గొలిపే ప్రశ్నలకు శాస్త్రోక్తంగా సమధానాలిచ్చారు.

అవే కాకుండా తులసీ కళ్యాణం, వరలక్ష్మీ వ్రతం, అయ్యప్ప దీక్ష ఒక్కటేమిటీ దాదాపు అన్ని పండుగలు, వ్రతాలు, నోములు, దీక్షలు, శుభమాసాల సమయాలలో పాటించవలసిన నియమాలు, పూజా చేసే విధానాలను చక్కగా వివరించారు. సందేహాలను నివృత్తి చేసే క్రమంలో రచయిత చూపించిన శ్రద్ధ, ఆయన పరిశీలనా ఙ్ఞానానికి జోహార్లనిపించేలా చేస్తుంది.

దిష్టి తగిలితే ఏం చేయాలి? అసలు దిష్టి తగలకుండా ఉండాలంటే ఏం చేయాలి? అని 'దిష్టి తీసేయండిలా' అనే వ్యాసంలో వివరిస్తే, పెళ్లి చేసేటప్పుడు శాస్త్రోక్తంగా తీసుకోవల్సిన జాగ్రత్తల్ని 'పెళ్లికి... సుముహూర్తం' వ్యాసంలో వివరించారు. రచయిత ఎక్కడా మూఢ నమ్మకాలను ప్రోత్సహించలేదు, ఊహాజనితమైన విషయాలను పాఠకుల మీద రుద్దే ప్రయత్నమూ చేయలేదు. పైన ప్రస్తావించిన రెండు వ్యాసాలు అందుకు నిదర్శనం. రచయిత చేసిన పరిశోధన, పరిశీలన ప్రతి వ్యాసంలో ప్రస్త్ఫుటంగా కనిపిస్తుంది.

వాసు గారు ఎప్పట్లాగే గీసే అందమైన బొమ్మలు ఈ ముఖచిత్రంపై మరింత అందంగా ఒదిగిపోయాయి. చిత్రకారుడు వాసు గారికి అభినందనలు.

సరళమైన భాష, ఆసక్తిని రేకెత్తించేలా రచన, మధ్య మధ్యలో మీకు తెలుసా అంటూ కొత్త విషయాలను పరిచయం చేసే క్రమం, అన్నిటికీ మించి సమయం లేదంటూ తప్పించుకునే వాళ్ల కోసమేనా అన్నట్టు పదాలను తూచి వాడటం వల్ల పుస్తకాన్ని ఏకబిగిన చదివేయగలం. అందువల్లే 66 వ్యాసాలను కేవలం 206 పేజీలలో
వివరించడం సాధ్యపడింది. భవిష్యత్తులో ఆయా శుభ సమయాల్లో పుస్తకాన్ని మళ్లీ ఓ సారి తిరగేసి, అన్ని పద్ధతి ప్రకారం చేస్తున్నామా లేదా అని మనల్ని మనం పరీక్షించుకునేలా చేస్తుంది ఈ "పండుగ పర్వము".

యువత తప్పక చదవాల్సిన మంచి పుస్తకం. విదేశాల్లో ఉన్న తెలుగు దంపతులు తమ వెంట తీసుకెళ్లదగ్గ చక్కని పుస్తకం. ఉద్యోగ రీత్య ఇంటికి దూరంగా ఉండే ప్రతి ఒక్కరికి, వాళ్ల ఇంట్లో వాళ్లు గనక ఈ పుస్తకాన్ని బహుకరిస్తే చాలా బాగుంటుందేమో! మంచి పుస్తకాన్ని అందించిన రచయిత డి.వి.ఆర్.భాస్కర్ గారికి అభినందనలు, కృతఙ్ఞతలు.

పండుగ - పర్వం
ఆచారాలు - సంప్రదాయాలు
రచయిత: డి.వి.ఆర్. భాస్కర్
వెల: రూ. 125
ప్రతులకు: డి. వరలక్ష్మి, ప్లాట్ నం: 103,
వివేకానంద ఎన్‌క్లేవ్, శాంతినగర్ కాలనీ,
బాగ్ అమీర్, కూకట్‌పల్లి, హైదరాబాద్ - 72
ఫోన్: (డి.వి.ఆర్. భాస్కర్) 99121 99394, 90523 95740
ఈ-మెయిల్: dvrbhaskar@gmail.com

నవయుగ, నవోదయ, విశాలాంధ్ర, ప్రజాశక్తి బుక్ హౌస్‌ అన్ని బ్రాంచిలతో సహా అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు.