కార్టూన్: దొంగ



 

పత్రికలో ప్రచురింపబడిన నా మొట్టమొదటి కార్టూన్ 💐 🙏 😀
My First Published Cartoon in Print Media ☺️
అక్టోబర్ 8, 2014లో నా మొదటి కార్టూన్‌ని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసినప్పుడు అనూహ్య స్పందన లభించింది. 178 షేర్లు, 600 పైచిలుకు లైకులతో చాలా ప్రోత్సాహకరంగా అనిపించింది. ఆ తర్వాత నా కార్టూన్ల కోసం ప్రత్యేకంగా ఫేస్‌బుక్‌లో పేజ్ క్రియేట్ చేశాను కానీ వ్యక్తిగత కారణాల వల్ల మరియు సమయం అనుకూలించక ఎక్కువగా కార్టూన్లు వేయలేకపోయాను.
ఈ మధ్యే మళ్లీ మొదలుపెట్టి ఫిబ్రవరిలో ఒక కార్టూన్ గీసి ఈ పేజ్‌లోనే పోస్ట్ చేస్తే మళ్లీ 480 పైచిలుకు లైకులతో స్పందన లభించడం సంతోషాన్నిచ్చింది. ఆ తర్వాత అనూహ్యంగా వచ్చిన కరోనా మరియు లాక్‌డౌన్‌లతో ప్రపంచంతో పాటూ నేనూ స్తంభించిపోయాను.
పరిస్థితులు సాధారణమవుతున్నట్టుగా అనిపించాక, మళ్ళీ కార్టూన్ వైపు మనసు మల్లి ఈ కార్టూన్ గీసి వార్త దినపత్రికకు పంపిస్తే, యాదృచ్చికంగా మొదటి కార్టూన్ వేసి ఆరేళ్లు పూర్తైన ఈ అక్టోబర్ నెలలోనే పదవ తారీఖునాటి వార్త దినపత్రిక యొక్క ఆదివారం అనుబంధంలో అది అచ్చయి మరింత సంతోషాన్ని కలిగించింది.
ఈ సంతోషానికి కారణాభూతులైన అందరికి ధన్యవాదాలు..!! 🙏 💐 😊
కార్టూన్ లింక్ (కంప్యూటర్‌లో చూడటానికి): https://epaper.vaartha.com/2855493/Sunday-Magazine/11-10-2020/#page/21/1

కార్టూన్ లింక్ (మొబైల్‌ఫోన్‌లో చూడటానికి): https://epaper.vaartha.com/m5/2855493/Sunday-Magazine/11-10-2020#issue/21/1

డా|| వాసా ప్రభావతి స్మారాక కథల పోటీ ఫలితాలు

వాసా ఫౌండేషన్ మరియు సాహితీ కిరణం మాస పత్రిక 'సమాజంలో ప్రస్తుత స్త్రీ సమస్యలు - పరిష్కారాలు' అన్న అంశం మీద సంయుక్తంగా నిర్వహించిన డా|| వాసా ప్రభావతి స్మారక కథలపోటీలో, నేను రాసిన "రక్షణ" కథకి ప్రత్యేక బహుమతి లభించింది. ఈ పోటీ ఫలితాల్లో, గెలుపొందిన కథల యొక్క కథాంశాన్ని కూడా పేర్కొనడం చాలా బాగా నచ్చింది. న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన డా|| ముక్తేవిభారతి గారికి ఫోన్ చేసి నాగురించి చెప్పగానే, కథ పేరు ఏంటీ? అనడిగారు. సమాధానం ఇవ్వగానే కథలో ఉన్న సారాంశాన్ని మరోసారి ఉటంకిస్తూ అదే కథ కదా? అని అడిగేసరికి ఆశ్చర్యపోయాను, ఆ తర్వత మాటల మధ్యలో ఆవిడ వయసు చెప్పగానే దాదాపు షాక్ అయ్యను. ఈ వయసులో ఇంత ఓపికా జ్ఞాపక శక్తి ఉండటం గొప్ప వరం, దాదాపు వంద వరకు వచ్చిన కథలన్నిటినీ క్షుణ్ణంగా చదివి పారదర్శకంగా నిర్ణయాన్ని వెలువరించడం ముదావహం. కథ బాగుందని, మంచి కథలు రాస్తూ ఉండండని ప్రోత్సాహకంగా మాట్లాడుతూ ఆశీర్వదించారు. ధన్యోస్మి 🙏💐😊

ఈ సంవత్సరంలోనే సహరి ఆన్ లైన్ వార పత్రిక నిర్వహించిన వినాయక చవితి కథల పోటీలో, నేను రాసిన "నందనవనం రెసిడెన్సీ" కథ & స్వేరో టైమ్స్ నిర్వహించిన కథల పోటీలో "ఆయుధాలు" కథ సాధారణ ప్రచురణకు ఎంపికయ్యాయి. ఇది వరకే ప్రకటించిన కణిక సాహితీ సంస్థ కథల పోటీలో ద్వితీయ బహుమతి సొంతం చేసుకున్న "పొదుగు" కథతో కలిపి, ఈ సంవత్సరం 4 కథలు ప్రచురణకు ఎంపికవడం సంతోషం కలిగించే విషయం. 2007,8,9 ల్లో సంవత్సరానికి 2కి మించి కథలు ప్రచురింపబడలేదు, అందుకు చాలా కారణాలు ఉన్నాయి అనుకోండి. నా 2007 రికార్డ్ ని, 2020లోని నేను బ్రేక్ చేయడం చాలా సంతోషంగా ఉంది.😃😄

- అరుణ్ కుమార్ ఆలూరి



కణిక కథల పోటీ ఫలితాలు




కణిక (సాహిత్యం, సామాజిక సేవ, విద్యారంగ వేదిక) సంస్థ, మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలు అనే అంశంపై "దిశ - దుర్దశ"  పేరుతో జనవరి 2020లో నిర్వహించిన కథల పోటీ ఫలితాలను, ఈ నెలలో (జులై 2020) జరిగిన కణిక మొదటి వార్షికోత్సవం సందర్భంగా, కణిక అధ్యక్షురాలు రమాదేవి కులకర్ణి గారు ప్రకటించారు. ఈ కథల పోటీలలో మొదటి స్థానం శ్రీ డా|| యం. సుగుణా రావు గారు, రెండవ స్థానం శ్రీ ఆలూరి అరుణ్ కుమార్ గారు, మూడవ స్థానం శ్రీ విమన్ శర్మ గారు  పొందారు.

కోవిడ్ కారణంగా ఈ వార్షికోత్సవాన్ని యూ ట్యూబ్ వేదికగా నిర్వహించారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ డా|| నందిని సిద్ధారెడ్డి గారు, కార్యదర్శి డా|| ఏనుగు నరసింహా రెడ్డి గారు, తెలుగు రక్షణ వేదిక జాతీయ అధ్యక్షులు పొట్లూరి హరికృష్ణ గారు, నేషనల్ బుక్ ట్రస్ట్ సంపాదకులు డా|| పత్తిపాక మోహన్ గారు, తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షులు డా|| నాళేశ్వరం శంకర్ గారు, ప్రముఖ కవి విమర్శకులు దాస్యం సేనాధిపతి గారు, నేటి నిజం సంపాదకులు బైసా దేవదాస్ గారు, ఆల్ ఇండియా రేడియో సీనియర్ అనౌన్సర్ ఐనంపూడి శ్రీలక్ష్మి గారు, సినీ గీత రచయిత మౌన శ్రీ మల్లిక్ గారు మరియు మరికొంత మంది సాహిత్య సామాజిక విద్యా రంగ ప్రముఖులు పాల్గొని తమ తమ వీడియోల ద్వారా ఆశీస్సులు, అభినందనలు తెలియజేశారు.

ఆ వార్షికోత్సవ వేడుకల వీడియోని ఇక్కడ చూడవచ్చు: https://youtu.be/W6aktcVKOgE

నానీలు

1)
ఊళ్ళో
బావి ఇంకిపోయింది..
ఇంట్లో
కన్నీళ్ళు ఊరుతున్నాయి..!

2)
మనసు బావిలోని
ఆప్యాయత ఊటని
డబ్బు పంపు
వేగంగా తోడేస్తోంది..!

3)
హలో
నమస్కారమే ఐతే..
తెలుగుకి
పురస్కారమే..!

4)
అమ్మానాన్నకు లేని
అదృష్టం..
ఆయమ్మకు
సొంతం!

5)
బాల్యం ఎదురైంది
సందు చివరలో..
యవ్వనం నిలబెట్టింది
చౌరస్తాలో!

6)
వెన్నెల్లో ఆడపిల్లని
చదివానే..
వెన్నెలంటి నిన్ను
చదివేస్తూ ఉన్నానే!

7)
లంగోటాల్లో నిండుకుంటున్న
బాల్యం..
కబ్జా అయిపోతున్న
కొత్తదండెం!

8)
ఆడ మగ సమానమని
నేర్పి ఉంటే..
నిర్భయ దిశలు
ఆగేవేమో!

9)
కలుసుకో మనసుని
తొలిరేయిన..
కలుపుకో తనని
ఏరాతిరైనా!

10)
చెడ్డీదోస్తు కలిశాడు
ఎర్రబస్సులో..
ముచ్చట్లను ఆపాము
రాజధానిలో!

-

ప్రతిలిపి వెబ్సైట్ చూసినప్పుడు నానీల పోటీ కనిపించింది. చూస్తే ఆ రోజే చివరి రోజు. ప్రచురితమైన నానీలను కూడా వాళ్ళు అనుమతిస్తుండంటంతో, ఇది వరకే చతురలో ప్రచురితమయిన 4 నానీలను కలుపుకుని ఎన్ని వీలైతే అన్ని రాద్దాం అని రెండు మూడు గంటల్లో ఇంకో ఆరు రాసి, మొత్తం కలిపి పది నానీలు పోస్ట్ చేశాను. (ఇందులోని మొదటి నాలుగు నానీలు 2010లో చతురలో కొత్తగాలి శీర్షికన వచ్చాయి.) ప్రతిలిపిలో‌ నా రచనలు ఏవీ లేని కారణంగా, నానీలనైనా ఉంచుదాం అని అనుకోవడం కూడా ఒక కారణం.

ఇవే నానీలు ప్రతిలిపిలో ఉండే చోటు:

https://telugu.pratilipi.com/story/TpR2nyOjL8xX


(పైన లింక్ క్లిక్/టచ్ చేశాక, "చదవండి" అన్న దగ్గర క్లిక్ చేయండి .. ఆ తర్వాత "తదుపరి అధ్యాయం" క్లిక్ చేస్తే, తరువాతి నానీ కనిపిస్తుంది.)

పంచాయత్ (హిందీ) వెబ్ సీరీస్ - సమీక్ష

పంచాయత్ వెబ్ సిరీస్ - సరళమైన హాస్యం, సహజత్వానికి దగ్గరగా ఉండే పాత్రల రూపకల్పన,
అసభ్యత, అశ్లీలానికి తావు లేకుండా ఒక్కో ఎపిసోడ్ కోసం ఎంచుకున్న చిన్న పాటి కథనం, అందులో ఇరికించిన నాటకీయత బాగా నచ్చాయి.

ప్రధాన్ (మనవైపు సర్పంచ్), ఆమె భర్త పాత్రలు వాటి మధ్య ఉండే కెమిస్ట్రీతో మనం ప్రేమలో పడతాము. ఈ సీజన్లో నన్ను అలరించింది ఈ రెండు పాత్రలే, కథానాయకుడు అతని కథ కన్నా కూడా..!

ఇకపోతే గ్రామాల్లో ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యల్ని ఒక్కటి కూడా ప్రస్తావించక పోవడం (ఎన్నికల్లో గెలిచిన మహిళల భర్తలు అధికారం చలాయించడం మినహా) నిరాశ పరిచింది. అలాంటి సమస్యల్ని ప్రస్తావిస్తూ, కొత్తగా వెళ్ళిన కథానాయకుడు ఎలా పరిష్కరిస్తాడు అనేది ఉంటుందని వెబ్ సిరీస్ కి ఉన్న నేపథ్యం దృష్ట్యా ఊహించుకున్నాను. అలా ఊహించుకోవడం నా తప్పేనేమో!

మొదట్నుంచీ ప్రధాన్ కూతురుని చూపించక పోవడంతో, ఆమెని చూపించకుండానే సీజన్ ముగిస్తారు అనుకున్నాను. సీజన్ అయిపోయే సమయంలో ఆమెని చూపించి, రెండో సీజన్లో కథానాయకుడి లక్ష్యాన్ని పరోక్షంగా చెప్పినట్టు అయ్యింది. ఈ ముగింపు కాస్త ఊరటనిచ్చింది.

ఆరవ ఎపిసోడ్ కేవలం ఎపిసోడ్ల సంఖ్యను పెంచేందుకు మాత్రమే ఉపయోగపడింది. ఆ ఎపిసోడ్ ఉన్నా, లేకున్నా కథ - కథనం పరంగా వచ్చే లాభం కానీ, నష్టం కానీ ఏమీ లేదు. అలాగే 1వ ఎపిసోడ్లో కూడా పెద్దగా ఏమీ ఉండదు.

తప్పక చూడండి అని చెప్పలేను.. టైం ఉంటే చూడండి.. కుదరకపోతే 1వ ఎపిసోడ్ & 6వ ఎపిసోడ్ స్కిప్ చేసినా సరే..! మిగితా ఎపిసోడ్లు బాగా నచ్చితే ఈ రెండు ఎపిసోడ్లు చివరికి చూసుకోవచ్చు..!

ఈ పంచాయత్ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో ఉంది.

(మొదటి ఎపిసోడ్ స్కిప్ చేసి చూద్దాం అనుకునేవారికి మాత్రమే: మొదటి ఎపిసోడ్లో పట్టణం నుంచి గ్రామానికి వచ్చి అయిష్టంగానే పంచాయితీ సెక్రెటరీ ఉద్యోగంలో చేరతాడు కథానాయకుడు. ఆ ప్రహసనంలో అతను ఎదుర్కొన్న చిన్న ఇబ్బంది వల్ల మరింత విసుగు చెందుతాడు.)

జోక్: ఫోటో చాలా బాగుందిరా

చాలా రోజుల తర్వాత స్నేహితుడు ఒకడు వాట్సప్‌లో చాటింగ్‌కి వచ్చాడు.. వాడి డీ.పీ. చూశాను..

"ఫోటోలాబ్ లో ఎడిట్ చేసిన ఫోటో చాలా బాగుందిరా" అన్నాను.

అంతే.. ఆఫ్‌లైన్‌లోకి వెళ్ళిపోయాడు..

చాలాసేపైంది.. ఇంకా ఆన్‌లైన్‌లోకి రావట్లేదు..

ఎందుకైనా మంచిదని "బయట ఇంకా బాగుంటావురా" అని టైప్ చేసుకొని పెట్టుకున్నాను, వాడు ఆన్‌లైన్‌లోకి రాగానే పంపిద్దామని ఎదురుచూస్తూ..!!

ప్చ్..

ఇప్పట్లో వస్తాడో.. రాడో.. అని అనుమానంగా ఉంది.! మీక్కానీ ఆన్‌లైన్‌లో కనపడితే చెప్పండి, ఇలా టైప్ చేసి పెట్టుకున్నాను అని..!

😄😃😂

- అరుణ్ కుమార్ ఆలూరి
.

#FreshThought #JustAJoke #FeelingSilly

మా సినిమా సూపర్ హిట్ - రాగిణి కార్టూన్



నా అర్థాంగి తన ఫేస్‌బుక్ పేజ్‌ రాగిణి కార్టూన్స్‌లో ఫిబ్రవరి 21న పోస్ట్ చేయబడ్డ ఈ కార్టూన్, ఇప్పటి వరకు దాదాపు 500 లైకులు సొంతం చేసుకోవడం విశేషం..!!


రాగిణి కార్టూన్స్ పేజ్ లింక్: https://www.facebook.com/RaginiCartoons

పాతాళ్ లోక్ (హిందీ) వెబ్ సీరీస్ - సమీక్ష

పాతాళ్ లోక్ (హిందీ) వెబ్ సీరీస్ - అనుమానం లేకుండా చాలా బాగుంది అని చెప్పొచ్చు.. నిరభ్యంతరంగా చూడొచ్చు కూడా..! నా సమస్యంతా నిడివి గురించి మాత్రమే.. ఒక్కో ఎపిసోడ్ దాదాపు 40 నిమిషాలు.. అలా 9 ఎపిసోడ్స్.. అంటే 6 గంటలు.. కాస్త గట్టిగా కూర్చుంటే ఇందులోంచి కనీసం ఒక పావు భాగానికి పైగానే తీసేయ్యొచ్చు, దాని వల్ల కథకు వచ్చే నష్టం ఏమీ ఉండదు..! ఉదాహరణకు హీరో కొడుకు పాత్ర తాలూకు కథ.. అది ఇదివరకే ఇదే అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన "ది ఫ్యామిలీ మ్యాన్" వెబ్ సిరీస్ లో హీరో కొడుకు కథలాగే ఉంటుంది.. అందులో కొడుకు చిన్నపిల్లాడు, వీడు కాస్త పెద్దవాడు.. వయసు మార్పు దృష్ట్యా కొన్ని ఊహించగలిగే సన్నివేశాలు ఉంటాయి, అవి మినహాయిస్తే ఆసాంతం ఇది చూస్తున్నప్పుడల్లా అదే గుర్తొస్తుంది..! అలాగే హీరో బావమరిది తాలూకు కథ.. అది కూడా తీసెయ్యొచ్చు..! వాటితో పాటు ఇంకొన్ని సన్నివేశాలు ఉన్నాయి, కేవలం సాగతీయడానికే పెట్టినట్టు అనిపిస్తుంది..!

వెబ్ సిరీస్ కి ఉన్న అడ్వాంటేజ్ ని ఉపయోగించుకొని స్క్రీన్ ప్లే రాసుకున్నారు.. బాగున్నప్పటికీ కొంచెం కన్ఫ్యూషన్ కి గురిచేస్తుంది. కొన్ని శృతి మించిన సన్నివేశాలు - హద్దుల్లో పెట్టి తీసినా బాగానే ఉండేది కదా అనిపిస్తుంది..!

కులాలు, మతాల పేర్లని ఉన్నదున్నట్టుగా వాడుకోవడం ధైర్యం, తెగింపు అనుకోవచ్చు.. ఇక్కడే వాళ్ళు ఘన విజయం సాధించారు అని చెప్పవచ్చు.. మనిషిలోని రాక్షసత్వాన్ని ఉన్నదునట్టుగా చూపించారు.. ఈ వెబ్ సిరీస్ చూస్తున్నంత సేపు మనం ఇదివరకే విన్న, చదివిన కథనాలు గుర్తుకువచ్చి మనం ఎటువంటి సమాజంలో బ్రతుకుతున్నామో అని మరోసారి గుర్తుచేసి ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తుంది.. అఫ్ కోర్స్ ఈ కరోనా వచ్చి చిన్న గీత పక్కన పెద్ద గీత గీసింది.. చూసే దృక్పథంలో ఇప్పుడు మార్పు ఉండవచ్చు.. ఈ కరోనా క్రైసిస్ తరువాతనైనా మనుషులందరూ సమానమనే దిశగా వెళతారా లేక మరిన్ని అసమానతలవైపు పయనిస్తారా అన్నది అతిపెద్ద ప్రశ్న..!!

కథ, దర్శకత్వం, ఛాయాగ్రహణం, కళ, సంగీతం, నటన - ఇవి అద్భుతంగా ఉన్నాయి..!

ఇవన్నీ పక్కన పెడితే, 6 గంటలు వెచ్చించే సహనం మీకుంటే, క్రైం థ్రిల్లర్ లు ఎంజాయ్ చేసే వాళ్లైతే తప్పకుండా చూడండి..!
అమెజాన్ ప్రైమ్ లో ఉంది..!!

కాపీ కొట్టడంలోనూ క్రియేటివిటీ

సత్యానంద్ గారి ఫ్రెండ్‌లాంటి స్నేహితుడు నాక్కూడా ఒకడున్నాడు. సాయంత్రం మా ఇంటికొచ్చాడు. "వాడికి తెలియంది ఏముంటుంది?" అని భావించి ఫేస్బుక్లోని నా సాధకబాధకాలు  చెప్పుకోవడం మొదలు పెట్టాను.

నేను: 
"కాపీ కొట్టడంలోనూ క్రియేటివిటీ చూపించే వాళ్లు ఉంటారని ఈ రోజే తెలిసింది."

ఫ్రెండ్: 
'అవునా అదెలాగా?'

నే: 
"నిన్న చిరంజీవి గారి మీద ఒక పోస్ట్ పెట్టాను.‌ ఆ తర్వాత ఫేస్బుక్ ఓపెన్ చేస్తే, ఆ పోస్ట్‌లో నేను పెట్టిన ఫోటోనే నాకు కనిపించేసరికి ఆశ్చర్యపోయాను, ఎందుకంటే ఫేస్బుక్లో మామూలుగా మనం పెట్టిన పోస్టులు మనకు కనిపించవు కదా!"

ఫ్రె:
'నువ్వు ఫేస్బుక్ దేంట్లో వాడతావు?'

"మొబైల్‌లో, ఆప్ ద్వారా"

ఏదో నిధి దొరికిన వాడిలాగా మొహం పెట్టి 'ఇంతకీ ఆ ఫోటో నువ్వు పెట్టిందే అని ఎలా గుర్తు పట్టావ్?' అన్నాడు.

"ఆ ఫోటోలో వాళ్లు మాత్రమే ఫోకస్ అయ్యేలా చుట్టూ బ్లర్ చేశాను. ఎక్కడెక్కడ బ్లర్ చేశానో నాకు మాత్రమే తెలుసు కాబట్టి!" 

'తర్వాత' కాఫీ అందుకుంటూ అన్నాడు. 

"ఈ క్రియేటివ్ కాపీ రైటర్ ఏం చేశాడంటే నేను 56 పదాల్లో రాసింది, అతను మూడు పదాల్లో రాశాడు."

'అతను ఏ పత్రికలోనైనా ఎడిటర్ గా పని చేస్తున్నాడేమో! అంతా లెంత్ అక్కర్లేదని కత్తిరించి పాడేసినట్టున్నాడు.'

నేను కోపంగా చూశాను.

'సర్లే.. ఇంతకీ క్రియేటివ్ కాపీ అని ఎందుకు అన్నావ్?'

"నేను ఇంగ్లీషులో రాసింది అతను తెలుగులో రాశాడు,  నేను తెలుగులో రాసింది అతను వదిలేశాడు. పైగా నా ఫోటోని  డౌన్లోడ్ చేసి అతని పోస్టులో వాడుకున్నాడు. నా పోస్టు నచ్చితే షేర్ చేసుకోవాలి, ఆ ఆప్షన్ కూడా ఇచ్చాను. కానీ అతను షేర్ చేసుకోలేదు సరి కదా కనీసం లైక్  కూడా కొట్టలేదు." 

'లైక్ కొడితే అతని ఫ్రెండ్స్ లిస్టులో ఉన్న వాళ్లందరికీ నీ పోస్ట్ కనిపించే ఛాన్స్ ఉంది. అప్పుడు అతను కాపీ రైటర్ అని తెలిసిపోతుంది కదా! ఇంతకీ నీ బాధేంటి?'

"కాపీ కొట్టడం తప్పు కదా" 

'నువ్వు పోస్ట్ పెట్టిన టైంలోనే అతనికీ అదే ఐడియా వచ్చి ఉండొచ్చు కదా?'

దాంతో అతని ప్రొఫైల్ ఒకసారి ఓపెన్ చేసి మా వాడికి చూపించాను.‌ దొంగ దొరికిపోయాడు, నేను పోస్ట్ పెట్టిన ఆరు నిమిషాలకి అతను కాపీ కొట్టినట్టు తెలిసిపోతోంది. పైగా అతని టైంలైన్‌పై అన్నీ ఇలాంటి పోస్టులే! వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చిన ఫార్వర్డ్ మెసేజ్లను కూడా వదలకుండా ఫోటోలతో సహా ఫేస్బుక్లో సొంతంగా రాసుకున్నట్లు పోస్ట్ చేసుకున్నాడు. 

'ఇలా ఎందుకు కాపీ కొట్టావని నిలదీస్తావా?'

"వాడు చేసింది తర్జుమా కదా! అది కాపీ కిందకు ఎలా వస్తుంది? ప్రూవ్ చేయలేం!" అన్నాను.

'అయితే ఒక పని చెయ్.. అతన్ని బ్లాక్ చేయకుండా, అతని ఫ్రెండ్ లిస్టులో ఉన్న వాళ్లందరికీ నువ్వు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టేసెయ్. నెక్స్ట్ టైం నుంచి నువ్వు రాసిన పోస్ట్‌ని వాడు కాపీ కొడితే వాళ్లందరికీ తెలిసిపోతుంది. ఎలా ఉంది నా ఐడియా' అంటూ కళ్లెగరేశాడు.

అతని ఫ్రెండ్స్ అందరికీ నేను రిక్వెస్ట్ పెట్టడం ఏంటి చెండాళంగా.. దానికన్నా అతన్ని బ్లాక్ చేయడం ఉత్తమం అని బ్లాక్ చేసేశాను.

'నా ఐడియా  వాడునుకున్నావ్‌గా.. మరి నాకేంటీ?' అన్నాడు ఖాళీ కప్పు అక్కడుంచుతూ!

"నీ ఐడియా నేనెక్కడ వాడాను? దానికి రివర్స్లో కదా నేను చేసింది"

'ఏదేమైనా నా ఐడియా లోంచే కదా నీకు ఐడియా వచ్చింది.. కాబట్టి క్రెడిట్ నాకే దక్కాలి'

"సరే ఇప్పుడు ఏం కావాలో చెప్పు"

'ఒకసారి నీ ఫోన్ ఇలా ఇవ్వు చాలు'

ఇచ్చాను 

'పాస్వర్డ్ ఏంటి?'

"నా మొహం"

నా వైపు గుర్రుగా చూశాడు. ఆ తర్వాత నాలిక్కరుచుకొని, నా మొహం ముందు ఫోన్ పెట్టి అన్లాక్ చేసుకున్నాడు. ఫేస్బుక్ ఓపెన్ చేసి, వాడి ప్రొఫైల్‌లోకి వెళ్ళి చూసుకోసాగాడు.

వాడ్ని ఫాలో అవుతున్నానా? లేదా? అని అనుమానం వచ్చినట్టుంది వెధవకి! "నిన్ను ఫాలో అవకుండా ఎలా ఉంటానురా?!" అన్నాను భరోసానిస్తూ!

మావాడు విలన్‌లా నవ్వాడు నావైపు చూస్తూ!

నాక్కొంచెం భయమేసింది.

గత నెల రోజులుగా వాడు పెట్టిన పోస్టులన్నిటికీ లైకులు, లవ్‌లు,  స్మైలీలు ఎలా పడితే అలా కొట్టేసుకొని ఫోన్ నా చేతిలో పెట్టాడు.

'వాటిని కానీ మళ్ళీ తీసేశావ్ అనుకో, మన ఫ్రెండ్‌షిప్ మీద ఒట్టే' అంటూ వెళ్లిపోయాడు.

అసలేం జరిగిందో రెండ్నిమిషాలక్కాని అర్థం కాలేదు. ఇన్‌బాక్స్‌లోకి మెసేజ్‌లు పోటెత్తసాగాయి, "అతని పోస్టుల్లో ఏముందని లైకులు కొట్టావ్?" అంటూ!!!