చైత్ర నవల పరిచయం


        కొత్తతరం రచయితల్ని చూస్తే ఈర్ష్యగా ఉంటోంది, కథలో నవలో రాసేసి, సంప్రదాయ పద్ధతిలో పత్రికల వైపు చూడకుండా నేరుగా ముద్రించేస్తున్నారు. ఆ ధైర్యం కూడా మెచ్చుకోవాలి. ఫేస్ బుక్ తెరిస్తే నా స్నేహితుల్లో దాదాపు అందరూ వాళ్ళే కనిపిస్తున్నారు. ఇదొక మంచి పరిణామం. వాళ్ళలో ఒకరు Spoorthy Kandivanam గారు. తను చైత్ర నవల రాసేసి నేరుగా అచ్చు వేసుకున్నారు. అయితే దానికన్నా ముందు ఒక సెల్ఫ్ పబ్లిషింగ్ ప్లాట్ ఫాంలో దాన్ని సీరియల్ గా పెట్టి, పాఠకుల స్పందన తెలుసుకొని సంతృప్తి చెంది, ఆ తర్వాత అక్కడ తీసేసి, ఇప్పుడు నవలగా తీసుకువచ్చారు. ఆ ప్రయోగం బాగా నచ్చింది నాకు.

        ఈ నవల రెండు వారాల క్రితం నా దగ్గరికి వచ్చింది, చదవటం ఇప్పుడు పూర్తయ్యింది. చైత్ర పాత్ర తీరుతెన్నులు, ఆమె నేపథ్యం నవలకు ఆయువుపట్టు. నవల చదువుతూ ఉంటే మనకు అనుభవంలోకి వచ్చిన ఎందరో చైత్రలు మనకు గుర్తుకువస్తూ ఉంటారు. పది పదిహేను పేజీలు చదవటం కూడా పూర్తి కాగానే కథలోకి వెళ్ళిపోయి, తరువాత ఏం జరుగుతుందో అన్న ఉత్సుకత నెలకొంటుంది. సెంటిమెంట్ ప్రధానంగా సాగే ఈ నవల ముఖ్యంగా ఆడవారికి చాలా బాగా నచ్చుతుంది. తండ్రి యాదయ్యను ఎదిరించి పడిలేచిన కెరటం చైత్ర.

        ఈ నవలలో నచ్చిన మరో అంశం, శైలి - నా దృష్టిలో స్క్రీన్ ప్లే అంటాను. ఒక్క సన్నివేశం కూడా తీసిపారేసేలా లేదు, అలా చేస్తే కంటిన్యుటి దెబ్బతిని, తరువాతి సీన్ అర్థం కాకుండా ఉండే ప్రమాదం ఉంది. అంత పకడ్బందీగా మొదటి నవలను రాయగలగటం నాకు ఒకింత ఆశ్చర్యంగానే అనిపించింది. అందుకు స్పూర్తి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.
        
        పాలమూరు మాండలికంలో రాసిన మాటలు మట్టి పరిమళాన్ని వెదజల్లుతాయి. అయితే మొదటి నవల కావటం మూలాన చిన్న చిన్న పంక్చుయేషన్ ఎర్రర్స్ కనిపిస్తాయి, డి.టి.పి. చేసినప్పుడు కూడా ఆ ఎర్రర్స్ వచ్చే అవకాశం లేకపోలేదు, అయితే అవి నవల చదవటంలో అడ్డుపడవు.

        స్ఫూర్తి కందివనం గారు ఇది వరకే ఈనాడు, నమస్తే తెలంగాణ, ఇంకా ఒకటి రెండు కథల పోటీల్లో బహుమతులు గెలుచుకోవడం, పాలమూరు భాషలో వాటిని రాయటం, అవి బాగుంటడం నాకు గుర్తుంది. భవిష్యత్తులో మరిన్ని మంచి రచనలు ఆశిస్తూ, స్ఫూర్తి గారికి శుభాభినందనలు. చైత్ర విడుదలైన రెండు వారాల్లోనే కేవలం మౌత్ టాక్ ద్వారా 50 పుస్తకాలు అమ్ముడుపోయినందుకు డబుల్ కంగ్రాట్స్.

        ఈ చైత్ర నవల కావాల్సిన వారు Spoorthy Kandivanam గారిని ఫేస్ బుక్ మెసెంజర్ ద్వారా సంప్రదించవచ్చు. ఒకవేళ మీరు హైదరాబాద్ బుక్ ఫెయిర్ కి గనక వెళితే, అక్కడ 'అచ్చంగా తెలుగు' వారి స్టాల్ నం. 184 లో దొరుకుతుంది. 260 పేజీల నవల, ప్రస్తుతానికి 220 రూపాయలకే (పోస్టల్ చార్జీలు అధనం) లభిస్తోంది. ఈ పుస్తకం ఇప్పుడు అమేజాన్ ప్రైమ్‌లో కూడా అందుబాటులో ఉంది. కింద ఉన్న క్లిక్ క్లిక్ చేసి ఆర్డర్ చెయ్యొచ్చు

https://amzn.to/3uR4I8g

జై భీమ్ - సినిమా సమీక్ష

                

జై భీమ్.. తప్పకుండా చూడాల్సిన మంచి సినిమా. అన్నీ అద్భుతంగా కుదిరిన సినిమా, ముఖ్యంగా రైటింగ్ క్వాలిటీ, బాగా నచ్చింది. ఆ తర్వాత కాస్టింగ్, నటీనటుల ఎంపిక చాలా బాగా కుదిరింది. ఇలాంటి సినిమాని నిర్మించడం ఒకెత్తయితే, స్వయంగా నటించడం మరో ఎత్తు. అవి చేసిన సూర్య చాలా ఎత్తుకు ఎదిగాడు. నిజ జీవితంలో మానవ హక్కుల కేసులకు ఒక్క రూపాయి కూడా ఫీజు తీసుకోకుండా వాదిస్తూ, జడ్జ్ గా మారాక ఆరేళ్లలో తొంబై ఆరువేల కేసుల్ని పరిష్కరించిన చంద్రు గారికి హాట్సాఫ్! 

                సినిమా ప్రారంభంలో కులాల పేర్లు అడుగుతూ, కొన్ని కులాల వారిని మరో నేరం మోపటానికి అటు వైపు నిలబెడుతూ, ఇంకొన్ని కులాల వారిని విడుదల చేస్తూ ఉన్న సన్నివేశంలో, అలా విడుదల అవుతున్న ఒక వ్యక్తి యొక్క కులం పేరు ఉన్నదున్నట్లు కాకుండా కాస్త మార్చి పరోక్షంగా చెప్పించారు. ఇది తమిళంలో కూడా ఉందా, లేక తెలుగు డబ్బింగ్ లో మాత్రమే అలా చేశారా అనేది అర్థం కాలేదు. అవి స్పష్టంగా ఉంటేనే కదా అక్కడ కుల వివక్ష గురించి అర్థం అయ్యేది.

                ఇక నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాని, కమర్షియల్ సినిమాలా కాకుండా, వరల్డ్ సినిమాలా తెరకెక్కించడం బాగా నచ్చింది. అయితే నేరం చేసిన పోలీసుల ప్రవర్తన ముందు నుంచి కూడా ఎక్కడా తొట్రపాటు లేకుండా, కాన్ఫిడెంట్ గా, ఆ ముగ్గురూ తప్పిపోయారు అన్నట్టుగానే ప్రవర్తిస్తూ ఉంటారు. ఇదొక్కటీ నచ్చలేదు. ఒక వేళ ఆ పోలీసులు అలాంటి నేరాలు చేసి చేసి ఆరితేరి పోయారు అని చెప్పాలి అనుకుంటే, వాటిని బలపరిచే సన్నివేశాలు ముందే ప్లాంట్ చేసి ఉండాలి, అవి లేవు. కమర్షియల్ సినిమాల్లో ఉన్నట్టుగా, కథలో సస్పెన్స్ కోసం వాళ్ళని ఏమీ ఎరుగని అమాయకుల్లా నటింపజేయడం మింగుడుపడదు. 

                వ్యక్తిగతంగా ఈ రెండు చిన్న పాయింట్లు నచ్చలేదు, అవి పక్కన పెడితే సినిమా అద్భుతం! మీరు కనక విసరనై (తెలుగులో విచారణ పేరుతో విడుదల అయ్యింది) చూసుంటే, ఈ సినిమా చూస్తున్నప్పుడు అది అక్కడక్కడ గుర్తొస్తుంది, చదివిన వాళ్ళకి డా. కేశవ రెడ్డి గారి నవల ఒకటి (చివరి గుడిసె అనుకుంటా - ఎలుకలు పట్టే వృత్తి యానాదుల గురించి, వాళ్ల నైపుణ్యం గురించి ఉంటుంది) గుర్తొస్తుంది. అలాగే కొంతమందికి అంకురం సినిమా కూడా గుర్తొచ్చింది. అలా అని కాపీ అని చెప్పటానికి లేదు, ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు, లేదా యాదృచ్ఛికంగా కూడా జరిగి ఉండవచ్చు!

                ఏదేమైనా వరల్డ్ సినిమాని ఇష్టపడే వారు అస్సలు మిస్ అవకండి, ప్రైమ్ లో ఉంది!


నా పదవ కథ - తనకు మాలిన ధర్మం (హాస్య కథ)

తనకు మాలిన ధర్మం

-     అరుణ్ కుమార్ ఆలూరి


            సుబ్బారావు తన గదిలో సెల్ ఫోన్ ని ఒకచోట దాచి పెట్టి వీడియో రికార్డింగ్ ఆన్ చేసి ఉంచాడు. ఈ తతంగం అంతా తెలియని అతని భార్య మంగతాయారు, భర్త గది వద్దకు వచ్చి, “ఊ, ప్లేట్ పట్టండి.” అంది. సుబ్బు గది బయట వేసున్న స్టూల్ మీద కంచం పెట్టి, వెనక్కి మల్లి దీనంగా కెమెరాకేసి చూసి, మళ్లీ మంగకేసి చూశాడు. మంగ తీసుకువచ్చిన అన్నాన్ని పైనుంచి సుబ్బు కంచంలో పడేసింది, అచ్చం భిక్షానికి వచ్చే యాచకుల పళ్లెంకి తగలకుండా ఎలా వేస్తారో అలా! అన్నం వేశాక ఉడకబెట్టిన గుడ్డు, కాస్త కూర, పై నుంచి సాంబారు పోసి, “పెరుగు గిన్నె ఏది? రోజూ చెప్పాలా?” అని అసెంబ్లీలో స్పీకర్ లా విసుక్కుంది. మళ్లీ దీనంగా మొహం పెట్టి, లోపలికి వచ్చి గిన్నె తీసుకుని ఒకసారి కెమెరాకేసి జాలిగా చూసెళ్లి పళ్లెంలో పెట్టాడు. పెరుగు కూడా పైనుంచే పోసింది. “వేడిగా ఉన్నప్పుడే మొత్తం తినండి, ఏం మిగల్చద్దు!” అని హోంవర్క్ ఎగ్గొట్టే స్టూడెంట్ కి చెప్పినట్టు, వార్నింగ్ లాంటి కంఠంతో చెప్పి వెళ్ళబోతున్న తరుణంలో, “సకినాలు, కారప్పూసవంటివేమీ లేవా నంజుకోవటానికి?” అన్నాడు సుబ్బు కాస్త ధైర్యం తెచ్చుకొని!

“ఆ, మీ అమ్మ అన్ని చేసిపెట్టి వెళ్లిందని ఉంటాయ్ మరి! అసలే పనమ్మాయిని వద్దని ఇంట్లో పనంతా ఒక్కదాన్ని చెయ్యలేక  నేను చచ్చిపోతుంటే నీకు నంజుకోవటానికి కావాలా? దా, నన్నుతిను!” అంటూ అధికారం కోల్పోయిన నాయకుడిలా కయ్యుమని లేచింది. ఇంతలో లోపల్నుంచి ఒక్కగానొక్క ఆరేళ్ల కూతురు “అమ్మా” అని అరవడంతో సుబ్బు వంక, పై నుంచి కింది దాకా ఒక చూపు చూసి వెళ్లిపోయింది. ఆ చూపులో మళ్లీ మధ్యాహ్నం వరకు ఏమీ అడక్కూడదన్న అర్థం సుబ్బుకి గోచరించింది. మంగ వెళ్లిపోగానే, ఆ వీడియో రికార్డింగ్ ఆఫ్ చేసి, దానికి హృదయం ద్రవించే నేపథ్య సంగీతాన్ని జోడించి ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి, వాట్సప్ లోని అన్ని గ్రూపులకు పంపించాడు. అయితే మంగకు కానీ, మంగ తరఫు బంధువులు స్నేహితులకు కానీ అవి కనిపించకుండా సెట్టింగ్స్ మార్చి జాగ్రత్త పడ్డాడు.

-0-

సుబ్బారావుకి రెండుగంటల ప్రయాణ దూరంలో ఉంటున్న స్నేహితుడు అప్పారావ్ ఆ వీడియో చూసి చలించిపోయాడు. వెంటనే సుబ్బుకి ఫోన్ చేశాడు. సుబ్బు అన్నం తింటూ ఆ ఇన్ కమింగ్ కాల్ ని చూడగానే నవ్వాపుకున్నాడు, కానీ ఆ కాల్ అటెండ్ చేయలేదు! సుబ్బు ఫోన్ ఎత్తకపోయేసరికి అప్పారావ్, “పాపం, వాడే పరిస్థితుల్లో ఉన్నాడో? వాడి భార్య ఎంత హింస పెడుతుందో?” అని బాధ పడ్డాడు.

-0-

సుబ్బు ఉండేది ఒక చిన్న ఇంట్లో. ఆ ఇంటి యజమాని అదే ఊర్లో ఇంకో ఇల్లు కట్టుకొని అక్కడికి మారడంతో దీన్ని అద్దెకిచ్చాడు. సుబ్బు ఆ ఊరికి ట్రాన్స్ ఫర్ అయినప్పుడు వెతగ్గా వెతగ్గా ఆ ఇల్లు దొరికింది. సుబ్బు అమ్మగారు అతనితోనే ఉంటుంది కాబట్టి, ఇల్లు ఎలా ఉన్నా దానికి రెండు బాత్రూములు ఉండటం అనేది కచ్చితమైన అవసరంగా గోచరించింది. దాంతో ఇరవై ఏళ్ల క్రితం చిన్న అగ్గిపెట్టెల్లాంటి రూములతో కట్టిన ఆ ఇంట్లోకి దిగాడు. అయితే ఇంటి ఆవరణలో రెండు కార్లు పార్క్ చేసుకునేంత విశాలమైన స్థలం ఉండటంతో అక్కడ మొక్కలు పెంచుకుంటు, వాటితో సగం సమయం బయటే గడుపుతూ ఉంటుంది మంగ.

అయితే కొత్త ఇంటి దగ్గర, మున్సిపాలిటీ వాళ్లు కొత్త డ్రైనేజీలు కట్టే ఉద్దేశ్యంతో, పాతవాటిని తవ్వేశారు. దాంతో అప్పటివరకు కబ్జా చేసిన డ్రైనేజీ పైన పెట్టిన ఇనుప రేకుల షట్టర్ ని ఎక్కడ పెట్టాలో తెలియక తీసుకొచ్చి పాత ఇంట్లో పెట్టాడు ఇంటి యజమాని. “ఇబ్బంది అవుతుంది సార్!” అని సుబ్బారావ్ చేతులు పిసుక్కుంటూ చెప్పాడు. “మీకు కార్ లేదు కదమ్మా, అందుకే ఆ ప్లేస్ లో పెట్టా! మహా అయితే నెలరోజుల్లో కొత్త డ్రైనేజీలు కట్టిస్తారు. అలా వాళ్ళు కట్టడం ఆలస్యం, మళ్లీ దాని మీద స్లాబ్ వేయించి దీన్నితీసుకెళ్లనూ. ఇదిక్కడే ఉంటే నాకే రెంట్ లాస్ కదా!” అని చెప్పేసి గేటు దాకా వెళ్లిన వ్యక్తి సుబ్బుని ఒకసారి చూసి వెనక్కి వచ్చి, తెగ పిసుక్కుంటున్న అతని చేతుల్ని విడదీసి, భుజంతట్టి పోయాడు. ప్రస్తుతానికి నీడపట్టున ఉన్న అదే ఇనుప రేకుల డబ్బాలో, షట్టర్ పైకనేసి లోపల పాత మడత మంచం వేసుకొని, గాలి కోసం బయట ఒక టేబుల్ ఫ్యాన్ పెట్టుకొని కాలం వెళ్లదీస్తున్నాడు సుబ్బారావ్!

-0-

“మంగా, మంచినీళ్లు అయిపోయాయి.” అంటూ అరిచాడు సుబ్బు. ఐదు నిమిషాల తర్వాత, అక్కడ స్టూల్ మీద పెట్టిన స్టీల్ బాటిల్ లో వేడి వేడి మంచినీళ్లు పోసి, “ట్యాబ్లెట్స్ అన్నీ వేసుకుంటున్నారా?” అంది. తల అడ్డంగా ఊపాడు సుబ్బు. మంగ కళ్ళు పెద్దవయ్యాయి. దాంతో తాను చేసిన తప్పు గుర్తొచ్చి నిలువునా ఊపాడు. అయినా ఆ కళ్ళు చిన్నగా అవలేదు. దాంతో భయపడి అన్ని కోణాల్లో తల తిప్పాడు. మళ్లీ ఎగాదిగా చూసి వెళ్లిపోయింది. మంగ అలా వెళ్లిపోగానే, ఆ వేడి నీళ్లు తాగలేక తాగుతున్నట్టు ఊపుకుంటూ తాగి, అప్పటి వరకు రికార్డ్ అయిన వీడియోకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ జోడించి సమాజిక మాధ్యమాల్లో  పోస్ట్ చేశాడు.

కాసేపటికి ఆ వీడియోని చూసిన అప్పారావ్ మళ్లీ సుబ్బుకి ఫోన్ చేశాడు. ఆ సమయంలో ఎవరూ డిస్టర్బ్ చేయకూడదని సుబ్బు ఫోన్ సైలెంట్ లో పెట్టి గురకపెట్టి నిద్రపోతున్నాడు. దాంతో ఆ కాల్ కూడా అటెండ్ చేయకపోయేసరికి, అప్పారావ్ కి భయం పట్టుకుంది. ఎలాగైనా సుబ్బుని కలిసి ధైర్యం చెప్పాలని నిర్ణయించుకున్నాడు.

-0-

మరునాడు సుబ్బు తన బట్టలు బయట ఉన్న బాత్రూంలోనే ఉతుక్కొని, తరువాత స్నానం చేసి, ఆ తర్వాత వాటిని మేడమీద ఆరేసి మెట్లు దిగుతుండగా మాస్క్ పెట్టుకున్న మంగ, గది దగ్గర ప్రత్యక్షమై ఎదురుచూస్తోంది. ఆమెను చూడగానే శిలా విగ్రహంలా నిలబడిపోయాడు సుబ్బు.

“నేను స్నానానికి వెళ్తున్నా, లోపల పాప టీవీ చూస్తోంది. ఫోన్లో మునిగిపోకుండా ఒక చెవి అటు వేసి ఉంచండి.” అని చెప్పింది.

“సరే మంగ.” అన్నాడు అమాయకంగా!

“ఈ వేషాలకేమీ తక్కువ లేదు. ఇటు బోళ్లు తోమి మూడు పూటలా వేడివేడిగా వంట చేయటం, అటు ఇల్లంతా ఊడ్చి బయట కడగటం, అటు చెట్లని ఇటు ఇంట్లో పిల్లని చూసుకోవటం, ఇవి చాలవన్నట్టు కూరగాయలు కిరాణా సమాను అంతా నేనే తేలేక చచ్చిపోతున్నాను. ఇదంతా అయ్యాక మీకుంటుంది నా చేతిలో..!” అని గొణడానికి అరవడానికి మధ్యలో ఉన్న శృతిలో పాడుకుంటూ వెళ్ళిపోయింది.

-0-

తల స్నానం చేసొచ్చిన మంగ, జుట్టు ఆరబెట్టుకుందామని బయటకొచ్చి చూసేసరికి సుబ్బు పక్కనే స్టూల్ వేసుకొని అప్పారావ్ కూర్చొని ఉండటం చూసి ఆశ్చర్యపోయింది. వెంటనే తేరుకొని లోపలికెళ్లి ముక్కుకి మాస్క్, జుట్టుకి టవల్ తగిలించుకొని వచ్చి, “మీదన్నయ్య నిజమైన స్నేహిమంటే! ఈ పరిస్థితుల్లో మీ ఫ్రెండుకి ధైర్యం చెప్పడానికి ఆయన పక్కన కూర్చోవడం చాలా గ్రేట్.” అంది భావోద్వేగంతో!

రాయిని ఆలిగ చేసిన రాముడివా అన్న పాట మదిలో మెదులుతుంటే సిగ్గుపడిపోయాడు అప్పారావ్!

“మరి అప్పిగాడంటే ఏమనుకున్నావ్? నన్ను చూడ్డానికి ఎవరూ రారనుకున్నావ్ కదు! చూడు బైక్ మీద గుంటూరు నుంచి వచ్చాడు నాకోసం!” అన్నాడు సుబ్బు.

“అవును నిజమే!” అని ఒప్పుకుంది మంగ. లోపలికెళ్ళి వేడివేడిగా టీ చేసి తీసుకొచ్చింది. ట్రేలో ఉన్న పేపర్ గ్లాసు అందుకోబోయాడు అప్పి ఉరఫ్ అప్పారావ్. “అది మీక్కాదు అన్నయ్య. ఆయనకి, మసలా టీ!” అని చెప్పడంతో కప్పు అందుకున్నాడు. టీ తాగుతూ యోగక్షేమాలు తెలుసుకున్నారు.

“ఎంత మీ ఫ్రెండ్ మీద అభిమానం ఉంటే మాత్రం, మాస్క్ లేకుండా కూర్చోవడం అంటే..?” అంటూ అర్థోక్తిలో ఆగిపోయింది.

“హ..హా..హా” అంటూ బిగ్గరగా నవ్వాడు అప్పి. “ఇంకా కరోనా గురించి భయపడితే ఎలా అమ్మా! అదెప్పుడో మనకు వచ్చి వెళ్లిపోయుంటుంది.” అన్నాడు జ్ఞానిలా!

“నేనూ అదే చెప్పి ఊరెళ్లానురా, ఒక చిన్న ఫంక్షన్ కి! తనేమో ఒకటే కంగారు పడి, ఈ టైంలో వద్దండి అంది. కరోనా మొదటి వేవ్ లోనే మనకేం కాలేదు, సెకండ్ వేవ్ లో ఏం చేస్తుందే పిచ్చిమొహమా అనేసి వెళ్లొచ్చాను. అక్కడే అంతా తలకిందులయ్యింది. దాంతో అమ్మ అక్కడ అలా, నేనేమో ఇక్కడ ఇలా...” అని చెబుతున్న సుబ్బు మాటలకు అడ్డుతగులుతూ, “తలకిందులంటే గుర్తొచ్చింది, మీరు చూస్తే ఇంత సంతోషంగా ఉన్నారు. మరి ఈ రూంలో వీడిని ఉంచడం ఏంటి? అన్నం బెగ్గర్ కు వేసినట్టు పెట్టడమేంటి? తాగటానికి వేడి వేడి నీళ్లు ఇవ్వటమేంటి? కొంపదీసి ప్రాంక్ వీడియోలు ఏమైనా చేస్తున్నారా?” అన్నాడు అప్పి నవ్వుతూ!

కాస్త బిత్తరపోయి చూస్తూ, “ఏ వీడియోల గురించి అన్నయ్య మీరు మాట్లాడేది?” అంది మంగ.

ఫిలమెంట్ ఎగిరిపోయిన బల్బులా అయిపోయింది అప్పి మొహం. ఒకసారి మంగని, సుబ్బుని నోరెళ్లబెట్టి చూసి, లాభం లేదని తన ఫోన్ తీసి ఆ వీడియోలు మంగకు చూపించాడు. వాటిని చూస్తూనే పళ్లు పటపటా కొరుకుతూ ఒరకంట సుబ్బుని చూసింది మంగ. సుబ్బు తలదించి పరోక్షంగా ఓటమిని అంగీకరించి తెల్లజండా ఎగరేశాడు.

“మళ్ళీ నాకు కరోనా అంటుకోకుండా, అలా దూరం నుంచి వేశాను అన్నయ్య.” అని చెప్పింది.

“ఏ ఏ ఏంటి? అ అ అర్థం కాలేదు. క క కరోనా ఏంటి? ఎ ఎ ఎవరికి?” అంటూ కరెంట్ షాక్ కొట్టిన కాకిలా విలవిలలాడుతూ అడిగాడు అప్పి. అప్పటికే అతని కాళ్లు చేతులు వణకడం మొదలయ్యాయి!

“మీ ఫ్రెండుకే అన్నయ్య.” అని సుబ్బు వైపు తిరిగి “ఏంటండీ చెప్పలేదా మీరు?” అంది.

“ఆ వీడియోలో కింద రాశాను కదా” అని, అప్పి వైపు తిరిగి “ఏరా చూడలేదా?” అన్నాడు.

నొరెళ్లబెట్టి “ఆ..!” అన్నాడు.

అప్పి ఫోన్ తీసుకొని, ఆ వీడియో కింద పోస్ట్ చేసిన పదాలు చూపించాడు. “వెన్ యు హావ్ సీప్లస్, యు షుడ్ బీ బీప్లస్” అని ఆ షాక్ నుండి తేరుకోకుండా మెల్లిగా చదివాడు అప్పి.

“అది సీప్లస్, బీప్లస్ కాదురా, సీ పాజిటివ్ అంటే కరోనా పాజిటివ్, ఇంకోటి బీ పాజిటివ్. అంటే దానర్థం మీకు కరోనా పాజిటివ్ అని తెలిసినప్పుడు, మీరు సానుకూల దృక్పథంతో ఉండాలి అని!” అంటూ ఐ.ఏ.యస్. ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పిన భావిభారత కలెక్టర్ లా ఫీలైపోయాడు సుబ్బు.

“ఒరేయ్ నువ్వనుకుంటే సరిపోయిందా? ఎదుటివాడికి అర్థం కావద్దూ?” దాదాపు ఏడుస్తున్న గొంతుతో అనేశాడు అప్పి.

“నాకేం తెల్సురా నీకు అర్థం కాదని?” అమాయకంగా అన్నాడు సుబ్బు.

“అంటే ఆయనకి కరోనా అని తెలియకుండా ఇక్కడొచ్చి కూర్చున్నారా అన్నయ్య?” అంది మంగ.

పరిస్థితి చెయ్యిదాటిపోయిందని అర్థమై, “వా, ఇప్పుడేంటి నా పరిస్థితి?” అని ఏడునొక్కరాగం అందుకున్నాడు.

“టెన్షన్ పడకండి అన్నయ్య. ఎవర్నీ ముట్టుకోకుండా బైక్ పై ఇంటికెళ్ళి అటాచ్డ్ బాత్రూం ఉన్న రూంలో ఐసొలేషన్ లో ఉండండి. ఇంట్లో కిటికీన్నీ తెరిచి ఉంచండి, గాలి వెలుతురు మీరున్న గదిలోకి బాగా రావాలి. రెండు మూడు రోజులతర్వాత టెస్ట్ చేయించుకోండి. నెగెటివ్ వస్తే మళ్లీ మూడు నాలుగు రోజులు ఐసొలేషన్ లో ఉండి ఇంకోసారి టెస్ట్ చేయించుకోండి. అప్పుడు కూడా నెగిటివ్ వస్తే మీరు సేఫ్ అన్నట్టు!”

“ఒకవేళ పాజిటివ్ వస్తే?”

“అయినా సరే టెన్షన్ అక్కర్లేదన్నయ్యా! వాళ్లు ఐదు రోజులకు ట్యాబ్లెట్లు ఇస్తారు, టైం ప్రకారం వేసుకోండి. ఆయుష్ వాళ్ళు చెప్పిన కషాయం తాగండి లేదా దాంతో మసలా టీ చేసుకోండి, జ్వరం తగ్గిన తర్వాత రోజుకు రెండు ఉడకబెట్టిన గుడ్లు తినండి, రాత్రికి పసుపు కలిపిన పాలుతాగి పడుకోండి. అన్నిటికన్నాముఖ్యమైంది రోజూ పసుపు నీళ్లతో ఐదారుసార్లు ఆవిరి పట్టుకోవడం. ఆ ఆవిరి నీళ్లల్లో పసుపు తప్ప వేరే ఏ మందులు వేయకండి. బరువులు ఎత్తకండి, శ్వాస సంబంధిత ఇబ్బందులు వస్తాయి. ఛాతిలో ఊపిరిని ఇరవై సెకండ్లకు మించి ఆపగలిగితే ఊపిరితిత్తులు బాగా పనిచేస్తున్నట్టు అర్థం. కాస్త తక్కువగా అనిపిస్తే ఖాళీ కడుపుతో ఉన్న సమయంలో ప్రాణాయామం చెయ్యండి. వేడి వేడి అన్నమే తినండి, గోరు వెచ్చటి నీళ్లే తాగండి. వేరే సమస్యలేమైనా ఉంటే హాస్పిటల్ కి వెళితే సరిపోతుంది.

మంగ అనుభవపూర్వకంగా ఇచ్చిన భరోసాతో, కరోనా వచ్చినప్పటికీ హాయిగా ఉన్న సుబ్బుని చూసి కాస్త స్థిమితపడ్డాడు అప్పి. “ఒరేయ్, ఒక్క మాట నీకు కరోనా వచ్చింది కాబట్టి ఇలా మా ఆవిడ చేస్తోంది అని తెలుగులో పెడితే నీ సొమ్మేం పోయేదిరా? నిజం చెప్పు పాత కక్షలేవో మనసులో పెట్టుకున్నావ్ కదు? నాలుగో తరగతిలో లెక్కల మాస్టారు నువ్వు తప్పుడు లెక్క చెప్పావని కర్ర తీసుకురమ్మంటే రూల్ కర్ర తీసుకొచ్చానని కోపమా?” అన్నాడు.

“మరెందుకు తెచ్చావ్ రా?” అన్నాడు సుబ్బు.

“అప్పుడే చెప్పా కదరా, కర్ర కోసం వెళ్తుంటే గ్రౌండ్ లో ఉన్న మన ప్రిన్సిపాల్ ఆపి, రూల్ కర్ర ఇచ్చి పంపించాడని!”

“అది సరే కాని, తొమ్మిదో తరగతిలో సంధ్యని చెంప మీద ముద్దుపెట్టుకున్నట్టు పుకారు లేపితే, నిజంగా వచ్చి పెట్టుకుంటుంది అన్నావ్! కానీ ఆమె వాళ్ళ నాన్నని తీసుకొచ్చి ప్రిన్సిపాల్ కి చెప్పి మడతపెట్టిన కరెంట్ సర్వీస్ వైర్ తో వీపులో కొట్టించింది తెలుసా?” అన్నాడు సుబ్బు పాతగాయం గుర్తుకువచ్చి!

తలబాదుకుంటూ సుబ్బుని ఎగాదిగా చూస్తూ ఒకసారి మంగ వంక చూశాడు అప్పి. కళ్ళళ్ళో కారాలు మిరియాలతో పాటు గరం మసాలా మొత్తం వేసుకొని, బిర్యానీ వండగలిగేంత మంటతో సుబ్బు వంక చూస్తోంది. “హిహిహి” అంటూ పళ్ళు కనిపించేలా నవ్వుతూ “జోక్ చేశా అంతే, లోల్ అన్నమాట!” అంటూ కవర్ చేశాడు.

“వీడెంటమ్మా, సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడు?” అన్నాడు అప్పి వాతావరణాన్ని తేలిక పరుస్తూ!

“ఆయనకు కొంచెం తిక్కుందని తెల్సు కదా అన్నయ్య! ఆరు నెలల క్రితం చిన్న ఆక్సిడెంట్ అయి తలకి దెబ్బ తగిలి ఆ తిక్క కాస్త ముదిరింది!” కన్నీళ్ళు రాకపోయినా, బాగోదని కొంగుని కళ్లకేసి ఒత్తుకుంటూ అంది మంగ!

సుబ్బు ఇదేమీ పట్టించుకోకుండా ఫోన్ కేసి చూస్తూ, “రేయ్, నువ్వు నన్ను చూడటానికి వచ్చావని మన వాట్సప్ గ్రూప్ లో పెట్టగానే, అందరూ కలిసి కుంభమేళకి వచ్చినట్టు రేపొద్దామని ప్లాన్ చేసుకుంటున్నార్రా!” అంటూ సంతోషంగా చెప్పాడు.

సుబ్బు వంక జాలిగా చూసిన అప్పి, మంగ వైపు తిరిగి, “నీకేం ఇబ్బంది పెట్టట్లేదు కదమ్మా వీడు?” అన్నాడు.

“లేదన్నయ్య, పాపం ఇంట్లో చెప్పినట్టు వింటాడు. ఆ ఫంక్షన్ ఒక్కదానికే వెళ్లొద్దు అన్నా వినకుండా వెళ్లి ఈ కరోనా తెచ్చుకున్నాడు. గుడ్ న్యూస్ ఏంటంటే అత్తయ్యకి మాత్రం కరోనా రాలేదు. దాంతో ఈయనకు తగ్గే వరకు అత్తయ్యని అక్కడే ఉండమన్నాం.” అని చెప్పి, మెల్లిగా అప్పారావ్ కి మాత్రమే వినిపించేలా, “మీ ఫ్రెండ్స్ వేసుకున్న కుంభమేళా ప్లాన్ నువ్వే ఆపెయ్యాలి అన్నయ్య.” అంది.

“అందరికీ పర్సనల్ గా నేను మెసేజ్ పెడతాలే. సరేనమ్మా వెళ్ళొస్తాను! బై రా” అంటూ సెలవు తీసుకున్నాడు అప్పి.

అతను అలా వెళ్ళిన మరుక్షణం, సుబ్బు చేతిలోని ఫోన్ లాక్కుంది మంగ. “ఐసొలేషన్ పీరియడ్ ఐపోయి నెగిటివ్ వచ్చేంత వరకు ఫోన్ లేదు, ఏం లేదు. డాక్టరేమో పడుకొని పూర్తిగా విశ్రాంతి తీసుకొమ్మంటే, మీరిలా ఫోన్ తో టైంపాస్ చేస్తారా?” అంటూ కోప్పడి ఫోన్ ని, చేతుల్ని సానిటైజ్ చేసుకోడానికి లోపలికి వెళ్ళిపోయింది మంగ.

మంగ చెప్పినట్టుగా పడుకొని, ఖాళీగా ఉండలేక ఆ ఇనుప రేకుల డబ్బాకి ఎన్ని నొక్కులున్నాయని లెక్కపెట్టసాగాడు సుబ్బు!

-     అయిపోయింది -

( తపస్వి మనోహరం అంతర్జాల సాహిత్య పత్రికలో జూన్ 20, 2021న ప్రచురితం  https://thapasvimanoharam.com/weekly-magazines/weekly-magazine-20-06-2021/ )



తెలుగుతల్లి కెనడా మరియు విశాలాక్షి మాసపత్రికల పోటీల్లో గెలుపొందిన నా కథలు

        కెనడా డే‌ సందర్భంగా కథల పోటీ అని తపన గ్రూప్ లో చూడగానే, "అదేంటబ్బా?" అని గూగుల్ ని అడిగితే, వికీపీడియాకి పొమ్మంది. "ఆ మాత్రం మాకు తెలియదా, దాని సెర్చ్ సరిగ్గా ఉండకే కదా నీ దగ్గరికొచ్చింది" అని సర్ది చెప్పి అటునుంచి వికీకి పోయా. జులై 1న కెనడా డే జరుపుకుంటారట, ఆ రోజు వాళ్లకి జాతీయ దినం, అంటే మన భాషలో హాలీడే అన్నమాట! అది చాలు కదా మనకి ఆరోజు గొప్పతనం తెలుసుకోవడానికి! మొత్తానికి ఆరోజు సందర్భంగా కెనడాలో ఉండే తెలుగు వాళ్లు, ప్రపంచం నలుమూలలా ఉన్న తెలుగు వాళ్ల కోసం కథల కవితల పోటీ పెట్టటం పుణ్యం పురుషార్థం తరహాలో బాగా నచ్చింది.


        పోయిన సంవత్సరం 4 కథల పోటీల్లో చాలా ఆసక్తితో పాల్గొన్నాను. వాటిల్లో 2 కథలకి బహుమతలు, మరో రెండు కథలు సాధారణ ప్రచురణకు ఎంపికవడం జరిగాయి. అయితే పోటీల్లో అంశాన్ని ఇచ్చి కథ రాయమనటం లేదా ఇన్ని పేజీల్లోనే కథ ఉండాలన్న నియమం వల్ల అప్పటికప్పుడు కథ వండటం అనే ప్రక్రియ సంతృప్తిని ఇవ్వలేదు, ఏదో చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో 5 నిముషాల్లో చేసిచ్చే ఫ్రైడ్ రైస్ లా అనిపించింది. దాంతో నాలోని బిర్యానీ ప్రియుడు "5 నిముషాల్లో వండే ఫ్రైడ్ రైస్ లో వేసే ఉప్పు కారంతో సహా ఎలా ఉడుకుతాయిరా? అది తిన్నవాళ్లకి అజీర్తి చేసినట్టు, అలా రాసిన నీకథలు చదివిన వారికి కడుపులో తిప్పితే ఎవరిదిరా రెస్పాన్సిబిలిటీ?" అంటూ బ్రహ్మీలా ప్రశ్నించాడు. అవును కదా! బిర్యానీ వండాలంటే ఎంత ఓపిక ఉండాలి, ఎంత టైం వెచ్చించాలి! పైగా అందులో వాడే ప్రతీ దినుసు ఏదోరకంగా ఇమ్యూనిటీని పెంచేవే! ఇక రుచి విషయంలో పేరు పెట్టగలమా? దాంతో సహజంగానే ఫ్రైడ్ రైస్ మీద విరక్తి పుట్టింది.

    ఇదే విషయాన్ని మా బుజ్జి రచయితల/త్రులతో డిస్కస్ చేస్తే, వాళ్ళు అదే అసంతృప్తిని వ్యక్తం చేశారు. దాంతో ఇక నుంచి కథలు రాసి పెట్టుకొని, ఆ కథకి సూట్ అయ్యే పోటీ వస్తే దానికి పంపించడం, లేదా సాధారణ ప్రచురణకు పత్రికలకు లేదా ఆన్లైన్ మ్యాగజైన్లకు పంపించాలని గట్టిగా తీర్మానించుకున్నాం. మన భాషలో చెప్పాలంటే చైనీస్ కరోనా ప్రైడ్ రైస్ కన్నా, హైదరాబాదీ కోవాక్సిన్ బిర్యానీనే ఉత్తమోత్తమని నిర్ణయించుకున్నాం అన్నమాట.

    ఆ నిర్ణయం తర్వాత వచ్చిన కథల పోటీనే ఇది. దాంతో నా దగ్గర ఇది వరకే రాసి పెట్టుకున్న "చిన్ని మనసులు" కథని దీనికి పంపగా, బహుమతి లభించడం, నా సంతోషానికి సంతృప్తికీ కారణమై ఇంత పెద్ద పోస్టు రాయటానికి తద్వారా మీ‌ సహనానికి పరీక్ష పెట్టడానికి పురిగొల్పింది. మొత్తం 120 కథలు వస్తే, ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అని కాకుండా, అన్ని కథల్ని సమానంగా చూసి 30 కథల్ని బహుమతికి ఎన్నుకొని, అందరికీ సమానంగా $21 CAD అనగా కెనడియన్ డాలర్లు ప్రకటించడం కూడా బాగా నచ్చింది. అలాగే 117 కవితల్లోంచి 25 కవితల్ని సెలక్ట్ చేశారు. ఆ ఫలితాలు తెలుగుతల్లి కెనడా పత్రిక వెబ్ సైట్ http://telugutalli.ca/ లో చూడొచ్చు.

    అలాగే విశాలాక్షి మాస పత్రిక ఏటా నిర్వహించే కథల పోటీలో గెలుపొందిన బహుమతి కథలతో ప్రత్యేకంగా ఒక పుస్తకం అచ్చువేయించి బహిరంగ విపణిలో అందుబాటులో ఉంచడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సారి పోటీలో ఆదర్శవివాహాల నేపథ్యంలో రాసిన నా కథ "సుబ్బయ్యతాత పెళ్లి" బహుమతిని గెలుచుకున్నదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.

    "చిన్ని మనసులు" కథ తెలుగుతల్లి కెనడా పత్రికలో వచ్చినప్పుడు, "సుబ్బయ్యతాత పెళ్లి" కథతో విశాలాక్షి వాళ్ళు వెలువరించే సంపుటిలో వచ్చినప్పుడు తెలియజేస్తాను.

    అందరికీ ధన్యవాదాలు..!!






నా పదవ కథ - రక్షణ

రక్షణ

-                     అరుణ్ కుమార్ ఆలూరి 

(వాసా ఫౌండేషన్  సాహితీ కిరణం సంయుక్త నిర్వహణలో "సమాజంలో ప్రస్తుత స్త్రీ సమస్యలు  పరిష్కారాలు"  అన్న అంశంపై సెప్టెంబరు 2020లో నిర్వహించిన డా|| వాసా ప్రభావతి స్మారక కథల పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కథ)

హైదరాబాద్‌కి కాస్త దూరంగా ఉండే ప్రైవేట్ కళాశాలలో సాధన లెక్చరర్.గా పని చేస్తోంది. సిటీ బస్సులు ఆ రూట్.లో ఎక్కువగా తిరగకపోవడం వల్ల రోజూ తన ఆక్టివా మీద వెళ్లి వస్తుంటు౦ది. గ్రైండర్‌లో ఏదో రుబ్బుతున్న అమ్మకి, టీ.వీ. చూస్తున్న నాన్న ప్రభాకర్ కి కలిపి “వెళ్లొస్తాను” అని చెప్పి కాలేజ్.కి బయలుదేరింది. కూతురు బండిని స్టార్ట్ చేసిన శబ్ధం విని లోకంలోకి వచ్చిన ప్రభాకర్ “జాగ్రత్తమ్మా” అని అరుస్తూ, బయటవరకు వచ్చి ఎలా నడుపుకుంటూ వెళ్తోందో అని గమనించసాగాడు. వాలంటరీ రిటైర్.మెంట్ తీసుకొన్న ప్రభాకర్, ఇన్నేళ్ళూ ఆర్.టీ.సి. డ్రైవర్.గా ఒళ్లు హూనం చేసుకొని పని చేసినందువల్ల, ప్రస్తుతం ఇంటిపట్టునే ఉంటూ పూర్తి విశ్రాంతి తీసుకుంటున్నాడు. సాధన వీధి మలుపు తిరిగాక, లోపలికి వచ్చి మళ్లీ టీ.వీ. చూడసాగాడు. ఏదో వార్తా ఛానెల్.లో చర్చాగోష్టి జరుగుతోంది. టీ.వీ.లో కనిపిస్తున్న వాళ్ళందరి మొహాలు చాలా గంభీరంగా ఉన్నాయి.

“అసలు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టిన వాళ్ళకి నిర్భయ చట్టం గురించి తెలుసా? లేదా? అని అనుమానం వస్తోంది. ఈ చట్టాల గురించి అవగాహన కల్పించేకుందుకు, ఆయా పరిధిలోని పోలీసులు వెళ్లి, ఎలాంటి నేరాలకు ఎలాంటి శిక్షలు పడతాయో అని సంవత్సరానికి ఒకసారైనా ప్రజలందరికీ కౌన్సిలింగ్ ఇచ్చేలా ఏర్పాటు చేయాలి” అన్నాడు ఒక సీనియర్ న్యాయవాది. 

అసలేం జరిగిందో అర్థం కాక మరో ఛానల్ పెట్టి చూశాడు ప్రభాకర్. హన్మకొండ, షాద్ నగర్ మరియు  శంషాబాద్ ప్రాంతాల్లో యాదృచ్చికమో, దౌర్భాగ్యమో కానీ ఒకే రోజు ముగ్గురు మహిళలను అత్యాచారం చేసిన కామాంధులు ఆ తర్వాత వాళ్ళను చంపేసి పారిపోయారు అన్న విషయం అర్థం చేసుకొని నిశ్చేష్టుడైపోయాడు. అతని మదిలో ఏవేవో ఆలోచనలు చెలరేగి ఒక పట్టాన ఉండనీయట్లేదు. ఉన్నపళంగా సాధనకి ఫోన్ కలిపాడు. కాసేపు రింగ్ అయ్యాక కాల్ కట్ అయిoది. ఆ తర్వాత ఎస్.ఏం.ఎస్. వచ్చింది, “క్లాస్ లో ఉన్నాను, అయ్యాక చేస్తాను” అని. వంటింట్లో ఏదో సర్దుతున్న తన భార్య వంక చూశాడు. ఇవన్నీ తనకేమీ తెలియవు. తెలిస్తే? తెలియకపోవడమే మంచిది అనుకున్నాడు.

ఈ సందర్భంలోనే జరిగిన చర్చాగోష్టిలో వివిధ రంగాల్లో రాణిస్తున్నవారు వచ్చి తమ అభిప్రాయాలను పంచుకు౦టున్నారని అర్థమై మళ్లీ అదే టీ.వీ. ఛానల్ పెట్టాడు. ఎవరో రచయిత్రి గొంతు సవరించుకొని, మైక్ అందుకుని “ప్రతి అమ్మాయికి కరాటే వంటి యుద్ధకళల్ని నేర్పించాలి. అసలు అమ్మాయిల్ని అందానికి ప్రతీకలుగా సుకుమారంగా కాకుండా అబ్బాయిల్ని పెంచినట్టు, ఏదైనా ఉపద్రవం వస్తే కనీసం నలుగురిని మట్టికరిపించేలా పెంచాలి. ఆడది భోగ వస్తువు కాదు, మగవాడు అధికుడు కాదు అనేలా కథలు, కవితలు, పుస్తకాల్లో వచ్చేలా రచనలు తీసుకురావాలి” అన్నది. అక్కడున్న చాలా మంది ఆమెతో ఏకీభవించారు.

వ్యాఖ్యాత ఆ కార్యక్రమంలో పాల్గొనే ఇంకెవరి కోసమో ఎదురు చూస్తూ, వాళ్ళు రాకపోవడంతో చర్చకి ముగింపు పలుకుతూ, చివరగా మైక్.ని గాయనికి అందించింది. ఆవిడ మాట్లాడుతూ, “వరంగల్.లో తొమ్మిదేళ్ల చిన్నారిని పాడుచేసి చంపినోడికి ఉరిశిక్ష వేస్తే, వాడు గతంలో దొంగతనం మినహా పెద్ద నేరాలేమీ చేయని కారణంగా ఆ ఉరిశిక్షని జీవిత ఖైదుగా మార్చారు. దేశ రాజధానిలో జరిగిన నిర్భయ ఘటనలో కూడా ఒక నేరస్థుడు మైనర్ అని శిక్షించకుండా వదిలిపెట్టారు. ఇలా దోషులు తప్పించుకోకుండా చట్టాల్ని సవరించాలి” అన్నది.

ఇంతలో ఆ కార్యక్రమానికి కాస్త ఆలస్యంగా వచ్చిన ప్రముఖ సైకాలజిస్ట్.ను మాట్లాడవలసిందిగా కోరుతూ మైక్.ని అందించింది వ్యాఖ్యాత. ఆయన అందరి వైపు చూసి గొంతు సవరించుకొని, “ఇది చాలా పెద్ద మహమ్మారి. మానసిక స్థిరత్వం లేనివారే ఇలాంటి దారుణానికి పాల్పడతారని నికోలస్ గ్రోత్ అనే సైకాలజిస్టు 1976లో రాసిన “మెన్ హూ రేప్” అనే పుస్తకంలో రాశారు. ఇటువంటి నేరం చేసిన వారందరి పైనా సైకాలజిస్టులు, సైకియాట్రిస్టుల నేతృత్వంలో విస్తృతంగా పరిశోధనలు జరపాలి. వాళ్ళు పుట్టి పెరిగిన వాతావరణం, చదువుకున్న పరిస్థితులు, ఎదుర్కొన్న వివక్ష, ఇలా ప్రతి చిన్న అంశాన్ని విశ్లేషించాలి. వాళ్ళ హృదయం అంత కర్కశంగా మారడానికి గల కారణాలు కనిపెట్టాలి. ఆ ఫలితాలతో దీర్ఘకాలికంగా ప్రణాళికలు అమలు చేయాలి.”

“ఉన్నపళంగా వాటికి అడ్డుకట్ట వేయాలంటే మీ సూచన ఏంటి?” అని అడిగంది వ్యాఖ్యాత.

“అధిక జనాభా ఉన్న మనలాంటి దేశాల్లో అది సాధ్యం కాకపోవచ్చు. ఎవరికి ఎప్పుడు ఎటువంటి పాడు ఆలోచన వస్తుందో ఊహించలేంకదా! నేరస్థులకి మరణ శిక్ష విధించడం వల్లో, ప్రజల్లో భయాన్ని సృష్టించడం వల్లో తాత్కాలికంగా ఆపవచ్చేమో కానీ శాశ్వతంగా రూపుమాపలేం! అయితే..” అంటూ ఏదో చెప్పబోతుండగా సమయం మించి పోవడంతో, కార్యక్రమాన్ని ముగిస్తున్నట్టు వ్యాఖ్యాత ప్రకటించడం, ఆ వెంటనే ప్రకటనలు రావడం జరిగిపోయాయి.

టీ.వీ.ని ఆపేసిన ప్రభాకర్ గట్టిగా నిట్టూర్చి మళ్లీ ఫోన్ అందుకుని సాధనకి కలిపాడు. ఆమె ఫోన్ కలవడం లేదు. కాస్త కంగారు పడ్డాడు. మళ్లీ మళ్లీ ప్రయత్నించగా, స్విచ్ ఆఫ్ అని వచ్చిది. కాలేజీకి చెందిన ఇతర వ్యక్తుల ఫోన్ నంబర్లు ఏవీ లేకపోవడంతో కంగారు కాస్త పెరిగింది. పోలీసులకి ఫోన్ చేద్దామా? అని ఆలోచించాడు కానీ అసలేం జరిగిందో తెలియకుండా చేస్తే తొందరపాటు చర్య అవుతుందేమో అని ఆగిపోయాడు.

బట్టలు మార్చుకొని, వంటింట్లో ఉన్న భార్యతో “నాక్కొంచెం పనుంది. బయటకెళ్లొస్తా. నువ్వు గడియపెట్టుకొని ఉండు. నా గొంతు కాని, అమ్మాయి గొంతు కాని వినిపిస్తేనే తలుపు తియ్యు” అని చెప్పాడు. ప్రభాకర్ భార్య మొదట ఆశ్చర్యపోయినా పరిస్థితిని కొంత ఆకళింపు చేసుకొని “సరే” అంది.

సాధన పనిచేస్తోన్న కాలేజ్.కి వెళ్ళాడు ప్రభాకర్. ఆఫీస్.లో తను ఫలానా అని చెప్పడంతో, రెండవ అంతస్థులో ఉన్న స్టాఫ్ రూంలో చూడవలసిందిగా సూచించారు. అక్కడికి వెళ్ళాక సాధన కనబడడంతో హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు.  సాధన చూసి “ఏంటి నాన్న ఇలా వచ్చారు?” అంది.

“నీ ఫోను స్విచ్ ఆఫ్ అని వస్తోందమ్మా” అంటూ కంగారుగా చెప్పాడు.

“స్పెషల్ క్లాస్ వల్ల లేట్ అయింది నాన్న” అంది సంజాయిషీ ఇస్తున్నట్టుగా!

“పరిస్థితులేం బాగలేవు కదమ్మా, కొంచెం టెన్షన్ పడి వచ్చేశాను” అన్నాడు, అక్కడి నుండి బయలుదేరుతూ!

“ఫోన్ చార్జింగ్ అయిపోయినట్టుంది, చూసుకోలేదు.. సారీ నాన్న” అంది నాన్న వెనకే నడుస్తూ!

ఏదో ఆలోచిస్తూ బండి దగ్గరికి వచ్చిన ప్రభాకర్, ఒక నిర్ణయానికి వచ్చినవాడిలా కూతురి దగ్గర నుండి ఆక్టివా తాళంచెవులు  తీసుకున్నాడు. బండిని పోనిస్తూ, “మీ నాన్న బస్సు డ్రైవింగ్ చేసినప్పుడు నువ్వు ఎప్పుడూ చూడలేదు కదమ్మా.. ఇప్పుటి నుంచి చూద్దువు.. ఎందుకంటే ఇక నుంచి మీ నాన్నే నీకు డ్రైవర్” అన్నాడు.

నాన్నతో ఈ విషయం ఎప్పటినుంచో అడగాలనుకుంది కానీ, ఈ వయసులో ఆయనని కష్టపెట్టడం ఎందుకులే అని ఊరుకుంది. ప్రభాకర్ మాటతో ఎన్నో సంవత్సరాల నుంచి నెత్తిన మోస్తున్న భారం ఒక్కసారిగా దించినట్టు అనిపించింది ఆమెకి.

ఆ మరుసటి రోజు నుంచి సాధనతో పాటు ఆ కాలనీలో ఉన్న మిగితా మహిళలకి ఒక నిపుణుడితో సాయంత్రం పూట కరాటేలో శిక్షణ ఇప్పించసాగాడు ప్రభాకర్. ఆ తరువాత ఒక పెప్పర్ స్ప్రే బాటిల్ కొని సాధన బ్యాగులో ఉంచాడు. కొత్త టచ్ స్క్రీన్ మొబైల్ ఫోన్లు కొనిచ్చి, పోలీసుల వారి “హాక్ ఐ” ఆప్‌ని డౌన్లోడ్ చేసి, ఎలా ఉపయోగించాలో భార్యకీ, కూతురికీ వివరించి చెప్పాడు. ఇంటర్నెట్ లేకపోతే పోలీసుల టోల్ ఫ్రీ నంబరు 100కి ఫోన్ చేసి ఎలా కంప్లైంట్ చేయాలో కూడా వివరించాడు.

అయినప్పటికీ ఏదో వెలతి! కూతురుని దిగబెట్టి వచ్చిన తరువాత ప్రభాకర్ ఆలోచనల్లో పడిపోసాగాడు. టీ.వీ.ల్లో సినిమాల్లో మహిళలను కించపరుస్తూ వచ్చే సన్నివేశాలను నిరసించని తనకు, తాను పనిచేసిన చోట మహిళలపై చూపులతోనూ మాటలతోనూ జరిగిన లైంగిక దాడిని ఆపలేని తనకు, భార్యను వంటింటికే పరిమితం చేసిన తనకు, వాళ్ళు నేరస్థులుగా మారడంలో సమాజంలో ఒకడిగా తనకూ భాగస్వామ్యముందా? అని ఆలోచిస్తూ దిగంతాల్లోకి వెళ్లిపోసాగాడు.

ఇలా ఉంటే కష్టమని, ఎవరైనా మహిళలు అసౌకర్యానికి గురైనట్టు కనిపిస్తే, వాళ్ళూ నావాళ్ళే అనుకుంటూ ఇబ్బంది పెడుతున్న వాళ్ళని ఎదిరించడం మొదలుపెట్టాడు. చాలా మంది మెల్లిగా అక్కడి నుంచి నిష్క్రమించడం ప్రభాకర్‌కి ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది. సమాజంలో మార్పు తీసుకురావడం ఇంత తేలికా అనుకున్నాడు. అలా కాకుండా గొడవకు దిగిన వారిపై వెంటనే పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయడం వల్ల అతనిపై అతనికే గౌరవం పెరగసాగింది. ఆ గౌరవంలోంచి ఒక ప్రశాంతత, ఈ సమాజం పట్ల ఒక నమ్మకం ఏర్పడుతూ, అతని మనసులో గూడుకట్టుకున్న గుబులు మంచు ముద్దలా కరగడం మొదలుపెట్టింది.

-              అయిపోయింది –

(సాహితీ కిరణం మాస పత్రిక జూన్ 2021 సంచికలో ప్రచురితం)






A: Ad Infinitum - తెలుగు సినిమా సమీక్ష

                ఈ మధ్య కాలంలో చూసిన సినిమాల్లో బాగా నచ్చిన సినిమా A: Ad Infinitum. మొదటి ఫ్రేమ్ నుంచే దర్శకుడు Ugandhar Muni నాలోని ప్రేక్షకున్ని తన ఆధీనంలోకి తీసుకున్నాడు. పాత్రల రూపకల్పనలో శ్రద్ధ తీసుకోవటం వల్ల, ఇన్ని సినిమాలు చూసిన అనుభవంతో, కొన్ని రెగ్యులర్ పాత్రలు (ఉదా: డాక్టర్, పోలీస్) రాగానే, ఈ పాత్ర అలా /లేకపోతే/ ఇలా ప్రవర్తిస్తుంది అని అనుకోవడం, ఎక్కువ భాగం సినిమాల్లో అలా ఊహించుకున్నట్టు జరగటం పరిపాటి. కానీ ఈ సినిమా విషయంలో అలా జరగలేదు. ప్రతి పాత్ర ఆ ఊహను చెరిపేస్తూ ఇంకోలా ప్రవర్తించడం ముచ్చటగా అనిపించింది.

                ఇక హీరో హీరోయిన్ ల నటన, వారి మధ్య కెమిస్ట్రీ, సన్నివేశాలు, చాలా ఆహ్లాదంగా కనిపిస్తాయి. సినిమా లో అందరూ బాగా నటిస్తే హీరోయిన్ Preethi Asrani ఇంకా బాగా నటించింది. సినిమా హీరో Nithin Prasanna మూడు పాత్రల్లో (పోస్టర్ మీద మూడు పాత్రలు కనిపిస్తున్నాయి కాబట్టి అలా రాశాను, ఎన్ని పాత్రలో చెబితే థ్రిల్ పోతుంది, కాబట్టి సినిమా చూసి మీరే తెలుసుకోండి) చాలా అద్భుతంగా నటించాడు. వందల కోట్లు పెట్టి తీసిన సినిమాల్లో హీరో ద్విపాత్రాభినయం చేసినా, అతని ఆహార్యాన్ని బట్టి ఏ పాత్ర అని కనిపెట్టాలి తప్ప నటనలో పెద్ద తేడా ఉండదు (ఆ హీరో అన్నా, దర్శకుడు అన్నా నాకూ ఇష్టమే కానీ ఇది నిజం). కానీ ఈ సినిమాలో నితిన్ ప్రసన్న పోషించిన మూడు పాత్రల్లో ఆహార్యంతోపాటు నటనలో కూడా మూడు పాత్రలకు వేరియేషన్స్ చూపిస్తూ, చక్కని క్వాలిటీతో నటించాడు.

                సినిమాలోని సంగీతం (Vijay Kurakula), పాటలు (Anantha Sriram), ఛాయాగ్రహణం (Praveen K Bangari), కళ (Nani), స్క్రీన్ ప్లే, దర్శకత్వం చాలా అద్భుతంగా ఉన్నాయి!


                హీరో హీరోయిన్లు బైక్ మీద వాళ్ళ పని చేసే ప్రదేశానికి రావడం, అక్కడ పార్క్ చేయడం లోపలికి వెళ్లడం - ఈ షాట్ సినిమాలో ప్లస్ పాటల్లో కలిపి దాదాపు పది నుంచి ఇరవై సార్ల వరకు రావచ్చు. ఆ సన్నివేశం వచ్చిన ప్రతిసారి వారిద్దరి మధ్య కెమిస్ట్రీలో కానీ, లేదా వాళ్ళు ఉంటున్న మానసిక స్థితిలో కానీ లేదా కథలో జరిగిన మార్పు వల్ల వారు మరోలా ప్రవర్తిస్తూ ఉండటం కానీ, ఇలా ఏదో ఓ మార్పు కచ్చితంగా ఉంటుంది. మొత్తానికి ఆ షాట్ అన్ని సార్లు వచ్చినా, కెమెరా యాంగిల్లో, కనిపించే దృశ్యంలో మార్పు లేకపోయినా పైన చెప్పిన వాటిలో ఏదో ఒక మార్పు/ డిఫరెన్స్ కనిపిస్తూ దర్శకుడి ప్రతిభ మనకు గుర్తుకు వచ్చేలా చేస్తుంది. (ఇక్కడ అప్రస్తుతం అయినా ఈ విషయంలో ఒక సీనియర్ దర్శకుడు గుర్తొచ్చాడు. నదీ ఒడ్డున సాగే ఓ సినిమాలో, ఒక పాటలో హీరో ఒక చెట్టు చుట్టూ కట్టిన దిమ్మ మీద కూర్చుంటాడు. చెట్టు కొమ్మ దగ్గర ఉన్న కెమెరా కిందకి దిగుతూ హీరో దగ్గరికి వస్తుంది. నాలుగు వైపుల నుంచి సాగదీసినట్లుగా కనిపించే లెన్స్ వాడి ఆ షాట్ తీశారు. ఆ దృశ్యం వరుసగా మూడుసార్లు నాన్-స్టాప్ గా ఆ పాటలో వస్తుంది. ఒకే షాట్ ని రిపీట్ చేయలేదు, మూడు సార్లు షూట్ చేశారు. బ్యాక్ గ్రౌండ్ లో చిన్న చిన్న మార్పులు కనిపిస్తాయి తప్ప హీరో పొజిషన్లో, కెమెరా మూమెంట్లో తేడా ఉండదు.‌ ఆ సినిమా థియేటర్లో చూసినప్పుడు ఆ షాట్ నా సహనానికి పరీక్ష పెట్టింది)


                నాకు నచ్చిన కొన్ని డౌట్స్ ని దర్శకుడిని అడిగినప్పుడు, వారు ఇచ్చిన సమాధానాన్ని బట్టి సినిమా స్క్రిప్ట్ సినిమాకన్నా పకడ్బందీగా అద్భుతంగా రాసుకున్నారు కానీ బడ్జెట్ సమస్యల వల్ల కొన్ని సన్నివేశాలు రాసుకున్నట్టుగా తీయలేకపోయారు అని తెలిసింది.

                అలాగే, చిత్రం యూనిట్ ముందు అనుకున్న టైటిల్ అశ్వత్థామ (Ad Infinitum అనేది ట్యాగ్ లైన్). కానీ కొన్ని అనుకోని కారణాలవల్ల టైటిల్ మార్చవలసి రావటం, అప్పుడున్న పరిస్థితుల్లో ఆ సమయానికి ఉన్న వాటిల్లో A: Ad Infinitum అనే టైటిల్ ఉత్తమం అనిపించి పెట్టినట్టుగా తెలిసింది.

                ఏదేమైనా పెద్ద పెద్ద దర్శకుల మొదటి సినిమాలు గమనించినప్పుడు, యుగంధర్ ముని గారి ఈ సినిమా గమనిస్తే భవిష్యత్తులో అద్భుతమైన సినిమాలు వీరి నుంచి మనం ఆశించవచ్చు అని స్పష్టంగా అర్థమవుతోంది.

            Kudos to the entire team of A: Ad Infinium ❤️👏 & All the best for your next 👍💐

Note: ఈ సినిమా కోసం IMDB వెబ్ సైట్ కి వెళ్ళి, మొదటి సారి అకౌంట్ ఓపెన్ చేసి 10/10 రేటింగ్ ఇవ్వకుండా ఉండలేకపోయాను. The movie deserves it

❤️

                Amazon Prime లో ఉంది.





సంచికలో నా పరిచయం

 

                    తెలుగులో తొలి డైనమిక్ వెబ్ పత్రిక "సంచిక" గురించి 2018లో తెలిసిందిమిత్రుడు రాసిన కథ అందులో వచ్చిందని చెప్పడం ద్వారా! ఆ కథ చదివాక, "సంచిక" నిజంగానే డైనమిక్ అనిపించిందిఎందుకంటే భయానక (హార్రర్) జానర్ లో సాగే ఆ కథని అప్పటికి (నాకు తెలిసి ఇప్పటికీ) ఏ తెలుగు పత్రికవెబ్ పత్రిక ప్రింట్ చేసే ధైర్యం చేయలేవు.

                    ఆ తర్వాత తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో వచ్చిన "ముచ్చట@కథస్క్రీన్ ప్లే" వర్క్ షాప్ లో కస్తూరి మురళీ కృష్ణ గారు 'హిందీ సినిమాల గురించిమాట్లాడిన సెషన్ విన్నాను. సినిమా మరియు సాహిత్యం పట్ల వారికున్న పట్టు అమోఘం.

                    ఇదంతా ఇప్పుడెందుకు చెబుతున్నానంటేకస్తూరి మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం వెలువడుతున్న "సంచిక" మ్యాగజైన్ లో "ఇది నా కలం" పేరుతో సరికొత్త శీర్షిక ప్రారంభించారు. ఈ శీర్షికలో రచయితలు తమ రచనల వివరాలుతామెందుకు రచనలు చేస్తున్నారుతమ లక్ష్యం ఏమిటి వంటి విషయాలను వివరిస్తూ తమని తాము పరిచయం చేసుకుంటారు. తోడి రచయిత మిత్రులు ఒకరు (వారికి ఇష్టం లేదు కాబట్టి పేరు ప్రస్తావించడం లేదుతప్పుగా అనుకోవద్దు) నా వివరాలు అడిగితేపంపించాను. అయితే ఈ శీర్షికలో ఫస్ట్ నా గురించే వేస్తారు అని ఊహించలేదుఇలా రావటం నా అదృష్టం.

                    కథలునానీల్లో నాపేరు పత్రికల్లో రావటమే కానీ ఇలా నా గురించి పరిచయం మాత్రం ఎక్కడా రాలేదుఇదే ప్రథమం! చాలా సంతోషంగాహాయిగా ఉంది. మన పనిని మనం చేసుకుంటూ వెళ్ళినప్పుడుమన ప్రమేయం లేకుండా మనం గుర్తింపబడడం సంతృప్తినిచ్చే‌ అంశమే కదా!

                    నా ఫేస్ బుక్ స్నేహితుల్లో సగం మంది ఆర్కుట్ నుంచి ఉన్నవాళ్లు ఉన్నారు. వారికి కొంత నా గురించి తెలుసుఇక్కడే fbలో పరిచయమైన వారికిముఖ్యంగా ఈ మధ్యే పరిచయమైన వారికి నా గురించి తెలిసే అవకాశం తక్కువ కాబట్టిఈ శీర్షిక ద్వారా నన్ను తెలుసుకుంటారు అని ఆశిస్తున్నాను.

లింక్: https://sanchika.com/idi-naa-kalam-1/

                    నోట్: మొన్న జులై 1న వెలువడిన తెలుగు తల్లి కెనడా కథల పోటీల ఫలితాల కన్నా ముందే నా వివరాలు పంపి ఉండటం వల్ల, "చిన్ని మనసులు" కథ గురించిన ప్రస్థావనఅది బహుమతి గెలుచుకున్న విషయం ఇందులో ఉండదు అని గమనించగలరు.

                    ఇలా నా పరిచయం రావడానికి ప్రత్యక్షంగాపరోక్షంగా కారణమైన అందరికీ మనఃపూర్వక ధన్యవాదాలు!

థాంక్యూ ఆల్ 

🙏💐😊

 


                                                                            ముచ్చట కథ, స్క్రీన్ ప్లే వర్క్ షాప్ గ్రూప్ ఫోటో

నా ఎనిమిదవ కథ - పొదుగు

పొదుగు

-        అరుణ్ కుమార్ ఆలూరి

(కణిక వేదిక జనవరి 2020లో “మహిళలపైన జరుగుతున్న ఆకృత్యాలు” అనే అంశం పై నిర్వహించిన కథల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కథ)


        రాత్రి వరకు వచ్చిన వార్తలు కంపోస్ చేయడం పూర్తయ్యాక, ప్రెస్ నుంచి నేరుగా  ఇంటికి వచ్చి హాల్లో ఉన్న సోఫాలో అసహనంగా కూలబడ్డాడు రాఘవ.

అతన్ని చూస్తూనే “నాన్నా” అంటూ అతని ఆరేళ్ళ కూతురు వచ్చి అల్లుకుపోయింది. అతి కష్టం మీద నవ్వు తెచ్చుకొని పాపని దగ్గరికి తీసుకున్నాడు.

“అమ్మా.. నాన్న వచ్చాడు” అంటూ సమాచారాన్ని చేరవేశాడు, హోం వర్క్ చేసుకుంటున్న ఐదో తరగతి కొడుకు.

వంటగది నుంచి వచ్చిన శైలజ, రాఘవ మూడ్‌ని గమనించి, పాపని అతని దగ్గరి నుంచి తీసుకుంటూ, “నాన్న స్నానం చేసి వచ్చాక మళ్లీ వెళుదువులే” అని పరోక్షంగా భర్తతో చెప్పి అతని భుజం మీద తట్టింది “లోపలికి వెళ్ళమన్నట్టుగా!”

-౦-

దిశ నిందితుల ఎన్‌కౌంటర్ తర్వాత సమాజంలో ఒక మార్పు వస్తుందని ఆశ పడ్డ వ్యక్తుల్లో రాఘవ కూడా ఒకడు. కానీ, కొన్ని రోజుల  క్రితం నారాయణపేట జిల్లాకు చెందిన ఒక స్కూల్ విద్యార్థినిని, కొంత మంది దుర్మార్గపు యువకులు నిత్యం ఏడిపిస్తుండటంతో,  మనస్థాపం చెంది ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందన్న వార్త చదివి కలవరపడ్డాడు. గుంటూరుజిల్లా యువతిపై ముగ్గురు రాక్షసుల సామూహిక దమనకాండని విని భయపడ్డాడు. రెండు రోజుల క్రితం అనంతపురం జిల్లాలో  ఓ నాలుగేళ్ల  చిన్నారిపై 70 ఏళ్ల  వృద్ధుడు చేసిన అఘాయిత్యానికి క్షోభకు గురైయ్యాడు. బాగా కలిచివేసిన విషయం ఏంట౦టే, అదే ముసలివాడు, అదే స్థలంలో ఏడేళ్ల క్రితం ఇలాంటి మరో నాలుగేళ్ళ  చిన్నారిపై అత్యాచారం చేస్తే, ఆ కేసును కోర్టు ఇటీవలే కొట్టివేయడం.

న్యాయస్థానాల్లో తీర్పులు వచ్చేందుకు ఏళ్ళు పట్టడం, ఈలోపు సాక్ష్యాలు తారుమారై కేసులు కొట్టేయడం విరివిగా జరిగే మనలాంటి దేశాల్లో, ఎన్‌కౌంటర్ చేయడమే సరైన మార్గమని నమ్మాడు. కానీ దిశ ని౦దితుల ఎన్‌కౌంటర్ సమాజంలో ఎటువంటి మార్పును చూపకపోవడం ఆశ్చర్యానికి, బాధకు గురిచేసింది. అసలు అలా౦టి ఎన్‌కౌంటర్ అనేది ఏదీ జరగనట్టుగా, తప్పు చేయాలనుకునే వ్యక్తుల మెదళ్ళలో ఎటువంటి భయం లేకుండా, ఆడవారిపై రోజుకో దౌర్జన్యం ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంది. ఎటుతిరిగీ కొన్ని సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి, కొన్ని రావట్లేదు, అంతే!

-౦-

వంట ముగించి డైనింగ్ టేబుల్‌పై వాటిని ఉంచసాగింది శైలజ. ప్రభుత్వ బ్యాoకులో పనిచేస్తున్న ఆమెకి సమయం సరిపోకపోవడం వల్ల, ఉదయం మధ్యాహ్నం వంటమనిషి చేసిందే తినక తప్పని పరిస్థితి! ఒక్క పూటైన తన చేతి రుచి చూపించాలని, రాత్రిపూట మాత్రం లేని ఓపిక తెచ్చుకొని వండుతుంది. అన్నింటినీ అమర్చి, రమ్మని కేకేసింది. పిల్లలతో పాటు వచ్చి మూభావంగా కూర్చున్నాడు రాఘవ. పిల్లలు తలలు ఎత్తకుండా తింటున్న సమయం చూసి, రాఘవ వంక చూస్తూ “ఏంటి విషయం?” అన్నట్టుగా సైగ చేసింది శైలజ. తల అడ్డంగా ఊపాడు రాఘవ, కొత్తగా ఏమీ లేదన్నట్టుగా! దాంతో అతను దేని గురించి ఆలోచిస్తున్నాడో ఊహించగలిగింది. నిర్భయ ఘటన జరిగిన దగ్గరి నుంచి భర్తలో వచ్చిన మార్పు ఆమెను మనఃశ్శాంతిగా ఉండనీయట్లేదు.

తినడం పూర్తయ్యాక, పిల్లల్ని చెరో మంచం మీద పడుకోబెట్టి హాల్లోకి వచ్చింది. తిన్నాక కాసేపు పచార్లు చేయడం అలవాటున్న రాఘవ, శైలజని చూసి నడక ఆపేశాడు. భర్తని తీక్షణంగా గమనిస్తూ సోఫాలో కూర్చుంది.

“ఈ దేశంలో ఎం.ఎల్.ఏ.లకీ, ఎం.పీ.లకీ పోలీసుల రక్షణ ఉంది కానీ సామాన్య ప్రజలకి మాత్రం లేదు. ఆడపిల్లల రక్షణ గురించి ఆలోచిస్తుంటేనే..” అంటుండగానే ఎక్కడో మూలన దాక్కున భయం అతని మొహంలో ప్రత్యక్షమయ్యింది.

రాఘవ అనవసరoగా ఎక్కువ ఆలోచిస్తాడు అనుకునే శైలజ,  “పోనీ ఇలాంటి సంఘటనలు జరగని ఒక దేశం పేరు చెప్పు, అక్కడికి పారిపోయి బతుకుదాం!” అంది కాస్త కోపంగా.

నిస్సహాయంగా చూశాడు, ఎందుకంటే అలాంటి దేశమేదీ లేదని అతనికీ తెలుసు.

“నూట ముప్పై ఎనిమిది కోట్ల జనాభా ఉన్న దేశంలో, కేవలం డెబ్భై శాతం మంది మాత్రమే చదువుకుంటున్న పరిస్థితుల్లో, అందులో ఆడ మగ సమానమేనన్న విచక్షణా జ్ఞానo ఎంతమందికుందో చెప్పలేని దౌర్భాగ్య స్థితిలో జరిగే ఇలాంటి ఘోరాలను ఎన్‌కౌంటర్‌లు, మరణ శిక్షల వల్ల నిరోధించలనుకోవడం అసాధ్యం.” అంది ప్రాక్టికల్‌గా ఆలోచిస్తూ!

ఆలోచనలో పడిపోయిన రాఘవ, “వీలైనంత మంది ఎక్కువ పోలీసులను నియమిస్తే ...” అన్నాడు తనలో తాను అనుకుంటున్నట్టుగా.

“అలా నియమించాలంటే, ముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించాలి. ఆ స్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళ్ళే సత్తా ఉన్న  నాయకుణ్ణి ఎన్నుకోవాలి. కేవలం వంద కోట్ల టర్నోవర్ వున్న కంపెనీకి సి.ఈ.ఓ.ని నియమించాలంటే, కొన్ని నెలల పాటు వడపోసి నిర్ణయం తీసుకుంటారు. పది నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు ఆ కంపెనీలో పనిచేసిన వ్యక్తిని ఎన్నుకుంటారు. కానీ ఎనిమిది, తొమ్మిది లక్షల కోట్ల జీ.డీ.పీ. ఉన్న మనలాంటి రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో, వార్డ్ మెంబర్‌గా కూడా పోటీ చేయలేని వ్యక్తులు, సినిమా అవకాశాలు తగ్గిన కథానాయకులు నిలబడుతున్నారు. ప్రజలేమో ఎన్నికల ముందు పది రోజులు కూడా ఆలోచించకుండా, చర్చించకుండా నిర్ణయం తీసుకుంటున్నారు.” ఆవేదనగా చెప్పింది శైలజ.

ఆమె చెప్పింది వింటుంటే రాఘవ మదిలో మరో ఆలోచన మెదిలింది. “అంటే యాభై శాతానికి దగ్గరగా ఉన్న మహిళా ఓటర్లoదరూ తలుచుకుంటే నాయకత్వ మార్పు సాధ్యమే! వారి రక్షణ కోసం ఒక తీర్మానాన్ని చేసుకొని, దాన్ని అమలు పరిచే పార్టీకి మద్దతు ఇవ్వడమో లేక వారే ఒక పార్టీని స్థాపించడమో జరగాలి!” అన్నాడు సాలోచనగా.

అలసిపోయిన శరీరంతో ఆ రాత్రి వేళ అంతకు మించి చర్చించే ఓపిక లేక, “అవన్నీ మన చేతుల్లో లేని విషయాలండీ.. ప్రతిరోజూ మీరిలా టెన్షన్ పడటం నేను చూడలేను.. మన పిల్లల కోసం మనం ఏం చేయగలమో అది చెప్పండి.” అంది.

“ఇరవై నాలుగ్గంటలూ ప్రైవేటు సెక్యురిటీ అందించే స్థోమత మనకు ఎలాగో లేదు.”

“అయితే”

“ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు, తోడుగా ఎవరో ఒకరు వెళ్ళడం వల్ల ఇలాంటి దారుణాలు చాలా వరకు జరిగేవి కావు. కానీ ఇప్పుడు ఉద్యోగాల పేరుతో ఊళ్లు వదిలి, బతకడానికి ఒక స్థాయిని నిర్ణయించుకొని అందుకు తగ్గట్టు సంపాదించడానికి ఇద్దరం ఉద్యోగాలు చేయల్సివస్తోంది. నిజానికి మనం ఇప్పుడు అద్దెకు ఉంటున్న ఈ ఇల్లు, ఈ క్వాలిటీ ఆఫ్ లివింగ్ మనకు అవసరమా?”

కాస్త అలోచించి, “నిజానికైతే అక్కర్లేదు.. వాళ్ళనీ, వీళ్ళనీ చూసి ఆచరిస్తున్నదే కదా!” అంది.

“అందుకే ఇద్దర్లో ఒకరమే ఉద్యోగం చేద్దాం.. ఇంకొకరం పూర్తిగా పిల్లల బాధ్యత తీసుకుందాం. పక్షులు, జంతువులు ఎలాగైతే పిల్లల్ని పొదుగుతూ సాకుతాయో మనం కూడా అలాగే రక్షణ కల్పిద్దాం. సంపాదన తగ్గుతుంది కాబట్టి ఖర్చులు తగ్గిద్దాం. ఏదైనా బస్తీలో ఇల్లు తీసుకుందాం. అబ్బాయిలపై కూడా సామూహిక అరాచకాలు జరుగుతున్న ఈ పరిస్థితుల్లో అన్నిటికన్నా ముఖ్యమైంది పిల్లలు క్షేమంగా ఉండటమే అనిపిస్తోంది.” అన్నాడు రాఘవ.

క్షణాలు నిమిషాలయ్యేంత వరకు ఆలోచించింది శైలజ. భర్త చెప్పింది అక్షరాల నిజం. ఒక దశ దాటిన తర్వాత డబ్బుకన్నా మనఃశ్శాంతి మాత్రమే తృప్తిని ఇస్తుందని ఆమె నమ్మకం. “సరే, అలాగే చేద్దాం! మరి ఇద్దర్లో ఎవరు ఉద్యోగం మానేస్తే మంచిది అని అనుకుంటున్నారు?”

“పెద్దగా ఆలోచించేది ఏముంది? నీది ప్రభుత్వ బ్యాంకులో ఉద్యోగం కాబట్టి నువ్వు దాన్ని వదులుకోవడం మూర్ఖత్వం అవుతుంది. పైగా బయటి విషయాలు చూసుకోవాలంటే శారీరకంగా ఆడవారికన్నా ధృఢంగా ఉండేది మగవాళ్ళే కాబట్టి ఆ బాధ్యత నేను తీసుకుంటాను.”

భర్త నిర్ణయానికి ఆశ్చర్యపోయింది. “మరి తెలిసినవాళ్ళు నువ్వు ఉద్యోగం చేయడం లేదని చులకనగా చూస్తారేమో? ఆలోచించావా?”

“ఎవరో ఏదో అనుకుంటారని మన పిల్లల్ని గాలికొదిలేసి బిక్కుబిక్కుమంటూ బతుకుదామా? ఇప్పుడు వాళ్ళ సేఫ్టీ కన్నా నాకేదీ ముఖ్యం కాదు. అయినా పిల్లల్ని స్కూల్లో దింపి వచ్చాక సాయంత్రం వరకు టైం ఉంటుంది కాబట్టి, ఇంట్లోనే ఉండి చేసుకునే చిన్న వ్యాపారం ఏదైనా ఉంటే ట్రై చెయ్యొచ్చు. రోజంతా ఖాళీగా ఉండలేను కదా! కాకపోతే వ్యాపారం అనేది కేవలం టైం కిల్లింగ్ కోసం, పిల్లలు నా హై ప్రయారిటీ!”


“అలా అయితే నాకేం అభ్యంతరం లేదు. గో ఎహెడ్!” అంటూ మనఃస్ఫూర్తిగా అభినందించింది.

-౦- 


పొద్దున్నే లేవబోతున్న కొడుకు వంక చూస్తూ, “ఈ రోజు నుంచి నువ్వు ఇంకో గంట ఎక్కువ సేపు పడుకోవచ్చు నాన్న.” అంది శైలజ.

“అలా అయితే ఆటో వెళ్ళిపోతుంది కదమ్మా!” అంటూ అమాయకంగా అడిగాడు వాళ్లబ్బాయి.

“ఈ రోజు నుంచి ఆటోలో కాదు, మీ నాన్నే మిమ్మల్ని దిగబెట్టి వస్తాడు. సాయంత్రం స్కూల్ నుంచి వచ్చాక మా కోసం ఎదురుచూసే అవసరం కూడా లేదు. మీ నాన్నే స్కూల్ నుంచి తీసుకొచ్చి మీకు తోడుగా ఉంటారు.” అంది.

నమ్మలేని ఆ పిల్లాడు, హాల్లో ఉన్న రాఘవ దగ్గరికి పరుగెత్తుకుంటూ వచ్చి“నాన్నా.. నిజంగానా?” అన్నాడు. ఎప్పుడు విన్నదో తెలియదు కానీ, అన్నయ్య వెనకాలే చిన్ని చిన్ని పాదాలతో పరుగెత్తుకుంటూ వచ్చి నాన్న ఒళ్లో కూర్చొని సమాధానం కోసం ఎదురుచూడసాగింది వాళ్ల పాప.

“అవును.. ఇప్పట్నుండి నేనే మీకు ఫ్రెండ్‌ని, నాన్నని, పోలీస్‌ని కూడా!” నవ్వుతూ అన్నాడు రాఘవ.

“హేయ్” అంటూ చప్పట్లు కొడుతూ గంతులేసి రాఘవని గట్టిగా హత్తుకున్నారు పిల్లలిద్దరూ!

ఆ కేరింతల్లో ఆ పసిమనసులు ఇన్నాళ్లూ పడ్డ, ఆ చెప్పుకోలేని కాస్త ఇబ్బందిని అంచనా వేయసాగారు ఆ దంపతులు! 

-          అయిపోయింది

(సంచిక ఆన్లైన్ వీక్లీలో ఆగస్టు 15, 2021న ప్రచురితం. లింక్: https://sanchika.com/podugu-story/)

(Image Courtesy: Charan Parimi)