నా తొమ్మిదవ కథ - నందనవనం రెసిడెన్సి

 

నందనవనం రెసిడెన్సి

-      అరుణ్ కుమార్ ఆలూరి

షాప్ తెరిచి, లోపలికెవరూ రాకుండా ఒక తాడు అడ్డంగా కట్టాను. నేను చేసిన పనికి నాకే నవ్వొచ్చింది. కస్టమర్‌ని  లోపలికి రాకుండా ఆపుతున్నపుడు, అసలు షాప్ తెరవడం ఎందుకూ దండగ అని! పక్కనున్న కిరాణా షాపుని చూస్తే జనం సామజిక దూరం పాటిస్తూ ఓపిగ్గా నిలబడ్డారు. రెండు నిమిషాలు సరుకులు ఇవ్వడం లేటయితే విసుక్కొని వేరే షాపుకి వెళ్లిపోయే జనాలు, ఇలా క్యూలో నిలబడే రోజొస్తుందని కలలో కూడా ఊహించి ఉండరు!

“గుడ్లు లేవమ్మ.. ఐపోయినయి. పోయి తీస్కరాదల్గి టైం దొరుక్తలేదు” అని ఒకావిడతో చెప్తూ నన్ను చూసి చేయి పైకెత్తాడు కిరాణాషాపతను. ప్రతిగా నేనూ చెయ్యి ఊపి లోపలికెళ్ళి కూర్చున్నాను. ఇటు వైపున్న పాల షాపతనికి కూడా కరోనా ఏమాత్రం ప్రభావం చూపలేదు. కారణం వాళ్ళు నిత్యవసర సరుకులు అమ్ముతుండటం, అంటే తినడానికి కావలసినవి!

నాదేమో ట్రావెల్స్ వ్యాపారం, అంటే తిన్నది అరిగాక సరదాగా షికారుకు వెళ్లేందుకు పనికొచ్చేది. టూర్ ప్యాకేజ్‌లు బుక్ చేయడం, దాంతో పాటు ఫ్లైట్ టికెట్లు, విసా ప్రాసెసింగ్, విదేశాల నుండి డబ్బులు వస్తే ఇవ్వడం మొదలైనవి చేస్తాను. చాలామంది ఉద్యోగాలు పోగొట్టుకొని విదేశాల నుండి, హైదరాబాద్ నుండి ఇల్లు ఖాళీ చేసి మరీ ఊళ్ళకి శాశ్వతంగా తిరిగి వచ్చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నా వ్యాపారం ఎలా సాగుతుంది? పోనీ షాప్ తీసేద్దామంటే ట్రావెల్స్.కి అడ్డా అయిన ఈ ఏరియాలో, పరిస్థితులు కుదుట పడ్డాక మనకు మళ్లీ అద్దెకు దొరుకుతుందా? అని ఆలోచిస్తూ అయోమయంలో ఉండగా శిరీష్ ఫోన్ చేశాడు. గతంలో నందనవనం రెసిడెన్సి అపార్ట్.మెంట్.లో ఉన్నప్పుడు పరిచయం అయ్యాడు. ఈ కరోనా టైంలో ఏంటో విషయం అనుకుంటూ టచ్.ఫోన్.లో ఆకుపచ్చ గుర్తుని పైకి లాగాను.

“అన్నా.. నాటుకోడి వండి హోం డెలివరీ చేసే బిజినెస్ పెట్టిన, ఇప్పుడు హోటళ్లు, రెస్టారెంట్లు బందున్నయి కదా. నువ్వు కొంచెం నీ సర్కిల్లో చెప్పు” అన్నాడు.

“తప్పకుండా శిరీష్. మంచి ఆలోచనే వచ్చింది” అన్నాను.




ఆ తర్వాత కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకుంటుండగా, అపార్ట్.మెంట్.లో 107లో ఉండే వృద్ధ దంపతులకి కరోనా వచ్చిందని చెప్పాడు. ఆ ముసలావిడ వాళ్ల అమ్మ చనిపోవడంతో తప్పనిసరై ఊరికి వెళ్లి అంత్యక్రియలకు హాజరై వచ్చారని, అప్పటి నుండి సిక్ అయ్యారని అన్నాడు. సిటీలో ఇద్దరు కొడుకులున్నా, “పనులున్నాయని, రాలేమని” తేల్చిచెప్పడంతో, ఇక్కడే ఉండే వాళ్ళ కూతురు రోజూ క్యారియర్, మందులు ఫ్లాట్ బయట పెట్టి వస్తోందట. డాక్టర్ల సలహా మేరకు ఫోన్లో వాటిని ఎలా వేసుకోవాలో చెప్తోందట. సమస్య ఏంటంటే ఆ వృద్ధ దంపతులు భయపడతారని కరోనా వచ్చిన విషయం వాళ్ళకి ఇంకా చెప్పలేదంట. దాంతో వాళ్ళు చెత్త పారేయడానికి, ఏవైనా వస్తువులు కొనుక్కోవడానికి బయటకి వస్తుండటంతో నందనవనం.లో అందరూ భయపడుతున్నారని చెప్పాడు. అపార్ట్.మెంట్ ప్రెసిడెంట్ ఆ దంపతుల కూతురిని పిలిచి, “ఇక్కడ్నే ఉండి చూసుకోండి. లేకపోతే మీ వెంట తీస్కెళ్ళండి” అని ఖరాఖండిగా చెప్పాడట. సింగిల్ బెడ్.రూమ్ ఇంట్లో వృద్ధులైన అత్తామామలు, ఇద్దరు పిల్లలు, భర్త ఉండటంతో, “ఇక్కడ నేనుండలేను. అక్కడికి తీసుకెళ్లలేను. మా అమ్మానాన్నలకు ఎలాగోలా నేను నచ్చచెప్తాను” అని వెళ్ళిపోయిందని శిరీష్ చెప్పాడు.

“నెక్స్ట్ మీటింగ్.లో నువ్వు చెప్పు శిరీష్, భవిష్యత్తులో కరోనా అందరికీ వస్తుంది. ఎవ్వర్నీ వదలదు. అప్పుడేం చేస్తారు? కొంచెం మానవత్వంతో మెలుగుదాం అని చెప్పు” అన్నాను.

“సరే అన్న. నేను చెప్పి చూస్తా, కానీ ఆ ప్రెసిడెంట్ వింటాడ? అతని సంగతి నీకు తెలుసు కదా!” అన్నాడు.

“ఎవరూ?” అన్నాను.

“నువ్వున్నప్పుడు ఉన్నోడే” అన్నాడు.

ఆలోచనలో పడిపోయాను. “అన్నా.. నా బిజినెస్ బ్రోచర్ నీకు పంపిస్తా.. వాట్సప్ స్టేటస్.లో పెట్టు” అన్నాడు.

నేను అన్యమనస్కంగా “సరే” అన్నాను.

ఒక్కసారిగా ఐదు సంవత్సరాల క్రితం నేను నందనవనం రెసిడెన్సి.లోకి వెళ్ళిన క్షణం నుంచి, అక్కడి నుంచి ఖాళీ చేసి వచ్చిన క్షణం వరకు కాలం గిర్రున వెనక్కి తిరిగి అంతా గుర్తుచేసింది.

-౦-

మా ఆవిడ గర్భం దాల్చిందని తెలిసిన మరుక్షణం నేను చేసిన మొదటి పని నందనవనం రెసిడెన్సిలోకి మారడం. అమ్మ మోకాళ్ళ నొప్పులు, భద్రత బాగుండటం కూడా ఇతర కారణాలు. అప్పటివరకు ఒక ఇంట్లో రెండో అంతస్తులో ఉండే వాళ్ళం.

కొత్తగా అపార్ట్.మెంట్.లోకి మారాక, పాలుపోసే అతను వచ్చి కాలింగ్ బెల్ నొక్కేంత వరకు మెలుకువ రావట్లేదు. ఈ కాలనీలో ఇప్పుడిప్పుడే ఇల్లు కడుతుండటం వల్లను, మేముండేది నాలుగో అంతస్తు అవడం వల్లనూ, చుట్టూ పచ్చని చెట్లతో మా బాల్కనీలోంచి సూర్యోదయాలు చాలా అద్భుతంగా కనిపిస్తాయి. ఇక చల్లని హాయిగొలిపే సాయంకాలాలు మా ఆవిడకే సొంతం. ఎందుకంటే నేను షాప్ మూసి ఇంటికి వచ్చే సరికి రాత్రి తొమ్మిది దాటుతుంది మరి!

ఈ అపార్ట్.మెంట్.కి వచ్చాక తెలిసింది ఏంటంటే, మన ఊర్లో పండుగలన్నీ వీధిలోని వాళ్ళందరం కలిసి ఎలా జరుపుకుంటామో, వీళ్ళు కూడా అందరూ కలిసి అలాగే జరుపుకుంటారు అని! ఒక్కో అంతస్తుకి తొమ్మిది పోర్షన్ల చొప్పున మొత్తం ఐదు అంతస్తుల్లో నలభై ఐదు కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. మాతో కలిపి ఓ ఐదు కుటుంబాలు అద్దె పోర్షన్లు కాగా, మిగితావన్నీ సొంత పోర్షన్లే! ఎవరు ఏ ఫంక్షన్ చేసినా, గ్రౌండ్.ఫ్లోర్.లోని పార్కింగ్ ప్లేస్.లో జరుపుకుంటారు. ఆ రోజు వాహనాలన్నీ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో పార్క్ చేస్తారు. వాచ్.మెన్.తో చెప్పించడం కాకుండా, ఫంక్షన్ చేస్తున్న వాళ్ళే ప్రతి ఫ్లాట్.కి వెళ్లి ఆప్యాయంగా పిలుస్తారు. బయట చుట్టాలు కాకుండా, నందనవనం వాళ్ళే కనీసం వంద మంది వస్తారు కాబట్టి ప్రతి ఫంక్షన్ కళకళలాడుతుండేది.  కిరాయిదారులం కదా అని మొదట్లో ఏ ఫంక్షన్లకి వెళ్లకపోయినా, ఆ తర్వాత పరిచయమైన అపార్ట్.మెంట్ అసోసియేషన్ సెక్రెటరి చంద్రశేఖర్ ప్రోద్భలంతో మెల్లిగా వాటికి కూడా వెళ్ళడం అలవాటైంది.

-౦-

ట్రావెల్స్ వ్యాపారంలో స్థిరత్వం వచ్చాక ఆదివారాలు స్వర్గతుల్యం అవుతున్నాయి. ఆ రోజు నా షెడ్యూల్ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. పదకొండింటికి లేవడం మొదలై, అన్ని పనులు నిదానంగా చేసుకుంటూ సాధ్యమైనంత మట్టుకు ఇంటివద్దనే ఉండి ఏ టీ.వీ. చూస్తూనో, లేకపోతే లైబ్రరీ నుంచి తెచ్చిన ఏ పుస్తకాన్ని చదువుతూనో గడిపేస్తాను. అలా గడుపుతున్న వేళ, కాలింగ్ బెల్ మోగింది. తీసి చూస్తే వాచ్.మెన్. “సెక్రెట్రి సార్ మిమ్ముల్ని రమ్మంటున్నడు. వినాయిక చవితి ఎట్ల చెయ్యాల అని మీటింగ్ నడుస్తుంది” అని చెప్పి, నాలాంటి బద్ధకస్తున్ని మరొకర్ని పిలవడానికి వెళ్లిపోయాడు.  రాత్రి లిఫ్ట్ ఆగిపోతే మెట్లెక్కి పైకోచ్చేటప్పుడు నోటీస్.బోర్డ్.లో దీని గురించి చదివినప్పటికీ “ఏం వెళ్తాంలే”  అనుకున్నాను. ఒక ఫ్లైట్ టికెట్ విషయంలో సెక్రెటరి షాప్.కి వచ్చినప్పటి నుంచి నాతో బాగా కలిసిపోయి, చనువుతో ఇబ్బంది పెట్టేస్తున్నాడు.

కిందకి వెళ్ళగానే, నన్ను చూసి నవ్వుతూ “నీకోసమే వాచ్.మెన్.ని స్పెషల్.గా పంపించాను” అన్నాడు చంద్రశేఖర్. నేను నవ్వి కూర్చున్నాను. ఇంతలో అపార్ట్.మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వచ్చాడు. వాతావరణం గంభీరంగా మారిపోయింది. అతని పేరు మీద రౌడీషీట్ కూడా తెరిచారని ఒక పుకారు చక్కర్లు కొడుతుంటుంది. నిజం మాత్రం ఎవ్వరికీ తెలియదు.

మీటింగ్ మొదలుపెట్టారు. గంట తర్వాత తేల్చిన విషయం ఏంటంటే, పోయినసారిలా కాకుండా ఈసారి ప్రతి కుటుంబానికి గణపతి చందా కనీసం రెండువేలకు తక్కువ కాకుండా ఇవ్వాలని, ఆ తొమ్మిది రోజులూ పూజకి తప్పకుండా రావాలని, పూజ అయ్యాక ప్రతిరాత్రి అక్కడే అల్పాహారం ఉంటుందని, నందనవనం రెసిడెన్సిలో గణపతి నవరాత్రుల వేడుకలు గొప్పగా జరుగుతున్నాయన్న కీర్తిపతాకాన్ని ఈ ఏడాది కూడా రేపపలాడించాలని తేల్చారు. ఒకరిద్దరు “రెండు వేలు చాలా ఎక్కువ” అని అనడంతో, ప్రెసిడెంట్ వారి వయసుకి కూడా గౌరవం ఇవ్వకుండా పరుషంగా మాట్లాడి వాళ్ళ నోళ్ళు మూయించి, అక్కడి నుండి వెళ్ళిపోయాడు. దాంతో వాళ్లకి సపోర్ట్ చేసేవాళ్లు కూడా మిన్నకుండిపోయారు.

 రాత్రికి పెట్టే అల్పాహారాలని కూడా రోజువారీగా స్పాన్సర్ చేసేవాళ్లు ముందుగానే పేర్లు నమోదు చేసుకోవాలని చెప్పగానే, అప్పటికప్పుడు “మేమంటే మేం రెడీ” ఓ పదిమంది పోగయ్యారు. “ఆ రెండువేలు ఎక్కడి నుంచి సర్దాలి?” అని నాలాగే ప్రశ్నార్థకపు మొహాలతో నలుగురైదుగురు కనిపించారు. అంతకు ముందు ఉన్న ఇంటి దగ్గర ఐదు వందలు చందా రాస్తే ఎంతో గౌరవంగా చూశారు. ఇక్కడ ఆ నోటుకి విలువ కూడా లేదు!

-౦-

ఇంతలో ఆగస్టు పదిహేను శుక్రవారం రావడంతో, శనివారం సెలవు పెట్టి పట్నంలో ఉన్న వాళ్ళందరూ పిల్లాపాపలతో నందనవనం చేరుకున్నారు. దాంతో అపార్ట్.మెంట్ అంతా సందడి సందడిగా, వసంత ఋతువులో నిండా విరగబూసిన మల్లెపూల చెట్టులా మారిపోయింది. కారిడార్.లో, లిఫ్ట్.లో, పార్కింగ్.లో తెలిసిన వాళ్ళ పలకరింపులు, చిరునవ్వుల చూపులతో మూడురోజులు కన్నుల పండువగా గడిచిపోయాయి.

సోమవారం ఉదయం ఐదింటికే మెలుకవ వచ్చింది. కరెంటు పోవడంతో దోమల దాడికి పడుకోలేక, లేవలేక బెడ్.పై దొర్లుతుంటే కింద నుండి అందరి మాటలు పెద్ద శబ్దంతో వినిపించసాగాయి. అందరూ ఒకేసారి తిరుగు ప్రయాణానికి రెడీ అవుతున్నారా అనిపించింది.

-౦-




షాప్ తాళాలు తీస్తుంటే, పక్కనున్న కిరాణా షాప్ అతను చాలా నీరసంగా కనిపించాడు.

“ఏమైంది సార్ అలా ఉన్నారు?” అన్నాను.

“రాత్రంతా నిద్ర లేదు సార్. భూకంపం వస్తుందని ఫోన్లు వస్తే రాత్రి రెండిటి నుంచి ఐదింటి దాక బయటనే కూర్చున్నాం. ఏం లేదని తెలిశినంక పండుకుందామని పోతే కరెంటు తీశేశిండ్రు. అందుకే..!” అని ఆపేశాడు.

“భూకంపమా? మాకేం తెల్వదే మరీ!” అని ఆశ్చర్యపోయాను.

“అయ్యో ఏం చెప్పాల సార్! రాత్రంతా అందరు గల్లీలోళ్ళు బయటకొచ్చి నిల్సున్నరు. ఎట్ల తెల్సిందో? ఎవరు చెప్పిండ్రో? తెల్వదుకని ఒకళ్ళను చూసి ఒకళ్లు తెల్సినోల్లకు ఫోన్లు చేస్కుంట కుసున్నం, భూకంపం వస్తున్నదని! అంత వట్టిదని తెల్లారినంక తెల్శింది” అన్నాడు.

ఇంతలో కస్టమర్ రావడంతో ఆ సంగతి మర్చిపోయి పనిలో పడ్డాను.

-౦-

రాత్రి భోజనాలయ్యాక పడుకునేవేళ, మా ఆవిడ చాలా ఆందోళనలో కనిపించింది. అసలే తను నిండు మనిషి!

“అమ్మ ఏమైనా అందా?” అడిగాను అనుమానంగా!

“అదేం లేదు. రాత్రి భూకంపం వస్తుందని ఫోన్లు వచ్చాయంట! మనకు ఒక్కళ్ళు కూడా ఫోన్లు చేయలేదు. సరే ఇదే ఊర్లో దూరంగా ఉన్న చుట్టాలు, స్నేహితులు ఎవరి టెన్షన్లలో వాళ్లుండి మర్చిపోయారు అనుకోవచ్చు. కానీ ఈ అపార్ట్.మెంట్ వాళ్ళకేమైంది? అందరూ అర్థరాత్రి నుంచి ఐదింటి దాకా ముందున్న ఖాళీ స్థలంలో కుర్చీలు వేసుకొని కూర్చున్నారంట. ఎవరి ఫ్లోర్ వాళ్ళు, వాళ్ల ఫ్లాట్స్ వాళ్ళని లేపి కిందికి వెళ్లారంటా! ఒక్కరన్నా మన ఫ్లోర్.కి వచ్చి చెప్పలేదు! కనీసం ఫోన్ కూడా చేయలేదు! రెండొందల మందిలో మన ఫ్లోర్.లో ఉన్న మనుషులు ఒక్కళ్ళకి కూడా గుర్తు రాలేదు. నిజంగా ఏదైనా జరిగితే ఏం చేసేవారు. లైవ్.లో చూసి ఆనందించే వాళ్లా? సెల్.ఫోన్.లో రికార్డ్ చేసి అందరికీ పంపించేవారా?” అంది ఆవేశంగా!

నా గుండె కలుక్కుమంది. సెక్రెటరీకి ఏమైంది? ప్రతి అడ్డమైన మీటింగ్.కి వాచ్.మెన్.ని పంపి అందరినీ రమ్మంటాడు. నైట్ డ్యూటీ చేసే వాచ్.మెన్ ఎలాగో ఉన్నాడుగా! నా నంబరైతే ఉంది, ఒక్క సారి ఫోన్ చేసి అందరినీ లేపమని చెప్పొచ్చుగా! నిజంగా జరక్కూడనిది ఏదన్నా జరిగితే, అప్పటికప్పుడు నాలుగో అంతస్తు నుండి కిందికి ఎలా రాగలము? ఆ సమయంలో లిఫ్ట్ పనిచేయకపోతే మా ఆవిడ పరిస్థితేంటి? తను అన్ని మెట్లు దిగగలదా? 402లో ఉన్న రెండు నెలల పాప, 408లో ఉండే ముసలావిడ, 409లో ఉండే నాలుగేళ్ల పంటూ, 403లో జ్వరంతో బాధపడుతూ రెండ్రోజుల నుంచి బయటకు రాని ఆరేళ్ల శాలిని మరియు వాళ్ళందరి ఇంట్లో వాళ్ళు  ఒక్కసారిగా కళ్ళముందు మెదిలారు.

“పోన్లే.. దేవుడి దయ వల్ల ఏం జరగలేదు కదా!” అని మా ఆవిడని సముదాయించి పడుకోబెట్టినా, భయం, కోపం, ఏహ్యం, బాధ కలగలిపి నన్ను నైరాశ్యంలోకి నెట్టేశాయి. ఆ రాత్రంతా నాకు నిద్దరే పట్టలేదు. ఏవేవో ఆలోచనలు.. ఎక్కడెక్కడికో తీసుకెళ్లసాగాయి. నందనవనం ఒక ముళ్ళకంపలా కనిపించసాగింది మదిలో!

మరునాడు అదంతా గాలివార్త అని చలోక్తులు విసురుకుంటూ, రాత్రిపూట పరుగెత్తుకుంటూ జాగారం చేసిన వారి వీడియోని టీ.వీ.ల్లో చూపించారు. ఆ కామెడీ వార్తల ప్రోగ్రాం చూసిన మాకెవ్వరికీ నవ్వురాలేదు!  ఆ తర్వాత రెండు నెలలకి ఆ ఫ్లాట్ నుంచి వేరే ఇంటికి మారాం!

-౦-

గిర్రున బొంగరంలా తిరిగిన గతం, వర్తమానం దగ్గర ఆగిపోయింది. ఆ అపార్ట్.మెంట్.లో కరోనా సోకిన వృద్ధ దంపతులకు మద్దతుగా ఏం చేయాలా? అని ఆలోచించాను. ఆ ప్రెసిడెంట్.కు ఫోన్ చేసినా, మెసేజ్ చేసినా నాకే ప్రమాదం అని గుర్తొచ్చి, లెటర్ రాయడం ఉత్తమం అనిపించి మొదలుపెట్టాను. “నీకు కానీ మీ ఇంట్లో వాళ్లకి కానీ కరోనా వస్తే, మిమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళమంటే మీకు ఎలా ఉంటుంది? డాక్టర్లు కూడా ఇంట్లో ఉండే మందులు వేసుకోమంటున్నారు కదా! రౌడీ షీటర్.లా కాకుండా కాస్త మనిషిలా ఆలోచించు” అని రాశాను. వాడు కరిగే రకం కాదు అని గుర్తొచ్చి, “అయినా వినకుండా వాళ్ళని పంపడం లేదా వాళ్ళ కూతురిని వాళ్ళతో ఉండమని బలవంతం చేయడం చేస్తే, నేనొచ్చి నీకు కరోనా అంటించి వెళతాను. పరిస్థితి అంతవరకు తెచ్చుకోవద్దు!” అని రాసి, ఒక కవర్ మీద అతని పేరు రాసి, మాస్క్ పెట్టుకొని, నేరుగా నడుచుకుంటూ నందనవనం అపార్ట్.మెంట్.కి వెళ్లి వాచ్.మెన్.కి ఇచ్చేసి వచ్చాను. మాస్క్ పెట్టుకున్నాను కాబట్టి సి.సి. కెమెరాల్లో చూసినా పట్టుకోలేరన్న ధీమాతో వేగంగా తిరిగి వచ్చేసి ఆటో ఎక్కాను.

మరుసటిరోజు  కిరాణా షాప్ అతని పర్మిషన్.తో, పెద్ద మొత్తంలో గుడ్లు తీసుకువచ్చి నాషాప్.లో పెట్టుకొని అమ్మసాగాను, కనీసం షాప్.కి కట్టే రెంట్ అయినా సంపాదిద్దామని! అలాగే షాప్ ముందరున్న ఖాళీ స్థలంలో ఒకమూలన టీకొట్టు పెట్టుకోవడానికి  ఒక మాస్టర్.కి రోజుకింత అని మాట్లాడుకొని అద్దెకిచ్చాను. అతను మామూలు టీతో పాటు, కషాయంతో చేసే “యాంటీ-కరోనా టీ” తయారుచేయసాగాడు. జనం ఆ టీ కోసం క్యూలో నిలుచోవడం మొదలుపెట్టారు.

-       అయిపోయింది -

* సహరి (తొలి తెలుగ్ ఆన్లైన్ వీక్లీ)లో 08-01-2021న ప్రచురితం *

http://sahari.in/website/weekly/08-01-2021/index.php?#p=68