నా తొట్టతొలి కథ - పిల్లి పోయి ఎలుక వచ్చె డాం డాం డాం



పిల్లి పోయి ఎలుక వచ్చె డాం డాం డాం
- అరుణ్ కుమార్ ఆలూరి

నా పేరు వెంకటేశం. ఓ ప్రభుత్వ కార్యాలయంలో చిరుద్యోగిని. ఈ మధ్య ఎడతెరపిలేకుండా కురిసిన వర్షాలని కూడా లెక్కచేయకుండా ఆఫీస్‌కి వెళ్లేసరికి, నాకు జ్వరమొచ్చింది. మామూలే అంటారా! నాకు మాత్రం కాదండీ! ఎందుకంటే, గత నాలుగు సంవత్సరాలుగా అలాంటిదేమీ రాలేదు. అదేమిటి, దగ్గు, జలుబు, తలనొప్పి వంటి చిన్న చిన్న రోగాలు కూడా రాలేదంటే నమ్మండి. అంతటి గట్టి శరీరం నాది. కానీ ఈ జ్వరమెందుకొచ్చిందో అర్థం కావడం లేదు. డాక్టరుగారు ఓ నాలుగురోజులు కచ్చితంగా విశ్రాంతి తీసుకోమన్నారు. అక్కడే చిక్కొచ్చి పడింది. నా నిఘంటువులో లేని పదం విశ్రాంతి తీసుకోవడం.

ఆదివారాలు కూడా ఆఫీస్‌కెళ్లి, సాయంత్రం దాకా ఫైళ్లు ముందేసుకుని ఆ తర్వాత క్లబ్బుకి చేరి దేశ కాలమాన వైపరిత్యాల గురించి చీకటి పడే వరకు చర్చించి ఇంటికి చేుకోవడం నా దినచర్య. ఇక పండగలూ, పబ్బాలూ అంటారా ..! వటిమీద నాకంత ఆసక్తి లేదు. పెళ్లి అవక ముందు ఉండేద. పెళ్లయ్యక వాటి మీదే కాదూ అన్నింటి మీదా ఆసక్తి డుగంటి పోయింది. పిల్లలు పుట్టాక పూర్తిగా అణగారిపోయింది. ఇక పెళ్లిళ్లూ, ఇతర శుభకార్యాలూ అంటారా.n.! సెలవు రోజుల్లో ఉంటేనే వాటికి హాజరవుతాను, లేకపతే వాటి బాధ్యత మా శ్రీమతిదే! ఈ విషయంలో తరచు మా ఆవిడకీ, నాకు గొడవలు జరుగుతాయనుకోండి - అది వేరే విషయం.


నాతో మాట్లడటానికి చాలామంది భయపడతారు. కొంతమంది వితండవాదం అంటారు. ఇంకొంత మంది మొండితనం అంటారు. ఎవరేమనుకుంటే నాకేంటటా! నాకు నచ్చింది చెప్పడం, నచ్చని దాన్ని తిట్టడం జన్మతః వచ్చిన సుగుణం. దాన్ని మార్చుకోమంటే ఎలా?

***

ఈ నాలుగు రోజుల విశ్రాంతిలో నాకు జ్వరం తగ్గకపోగా, కొత్తగా తలనొప్పి కూడా అంటుకుంది. దానికో పెద్ద కథే ఉంది లేండి. నాలుగు రోజులు వెనక్కి వెళ్తే..

డాక్టరుగారు నిర్భంధ విశ్రాంతిని శిక్షగా విధించడంతో, ఆ నాలుగు రోజులూ పని చేయకుండా ఎలా ఉండాలా? అని దిగులు పట్టుకుంది. టీవీ ముందు కూర్చున్నాను. రాత్రుళ్లు ఏదైనా మంచి పౌరాణిక సినిమా వస్తే తప్ప టీవీ ముందు కూర్చోవడం అసలే లేదు. పెళ్లవక ముందు కూర్చునే వాణ్ణి. పెళ్లయ్యాక మా ఆవిడ టీవీ సీరియళ్లు చూడటనికే టైము చాలకపోతే, ఇంక నేనెక్కడ చూడాలి? ఆ సీరియళ్లేమో మనకు పడి చావవు. 

టీవీ ముందు మోకరిల్లగానే.. మా ఆవిడ రిమోట్ నా చేతికిచ్చింది, జాలిగా చూస్తూ! ఎంత చూసినా నాలుగు రోజులే కదా అన్నట్టు ఒక చూపు విసిరింది. మొదట న్యూస్ ఛానల్ పెట్టాను. 24 గంటల న్యూస్ ఛానల్ అని మా ఆవిడ చెప్పింది. టీవీలో ఓ గ్రామాన్ని చూపిస్తున్నారు. ఆ ఛానల్ ప్రతినిధి హడావిడిగా వివరాలందించసాగింది ఫుల్‌స్టాప్‌లు, కామాలూ లేకుందా! అంతే స్పీడ్‌గా న్యూస్ సెంటర్‌లో వ్యాఖ్యాత ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. పది నిమిషాలు శ్రధ్ధగా గమనించాక అప్పుడర్థమైంది.. అక్కడ రోడ్డు ప్రమాదం జరిగిందని, ఒకరికి గాయాలయ్యాయని. అయితే ఆ గాయపడిన వారెవరో నాకు కనిపించలేదు. చుట్టూ జనాలు గుమికూడారు. ఆంబులెన్స్ వచ్చేవరకు ఆమె అలా వివరాలందిస్తూనే ఉంది. ఆంబులెన్స్ లోకి ఎక్కించేటప్పుడు కూడా ఆ గాయపడిన వ్యక్తిని చూడలేకపోయాను. ఆంబులెన్స్‌ని ఫాలో చేస్తూ వెళ్లి వెళ్లి చివరికి ఆసుపత్రిలో అర్థగంట గడిచాక, ఆ వ్యక్తిని చూపించారు. సారీ, అది వ్యక్తి కాదు, జీవి. మేక. ఏడుకొండలూ కాలినడకన ఎక్కి వెంకన్నని దర్శించుకున్నంత ఆనందం కలిగింది. కాని వెంటనే దిగ్భ్రాంతి కలిగింది. కేవలం మేకకు గాయాలయ్యాయని ముప్పావుగంట సేపు సస్పెన్స్‌తో చంపారు. అసలే జ్వరంతో బాధపడుతూ నా మానన నేను మూలుగుతూ కూర్చుంటే, అనవసరంగా బి.పి. పెంచారు. పైగా మద్యలో ఆ ప్రాణి బ్రతుకుతుందా? లేదా? అని ఎస్.ఎం.ఎస్. చేయమన్నారు. చేతి దూల కదా, వెంటనే చేశాను. ఆ వెంటనే బ్యాలెన్స్‌లో మూడ్రూపాయలు ఫట్టన్నాయి. అదో బొక్క. అయినా మేక ప్రాణి కాదా అనిపించింది. ఎంత ప్రాణి అయినా కేవలం మేక కోసం ముప్పావుగంట విలువైన సమయాన్ని వృథా చేయడం నాకు సుతరామూ నచ్చలేదు. పాపం ఏ న్యూసూ దొరక్క ఇలా చేశారేమో అని జాలిపడి సరిపెటుకున్నాను.

ఛానల్ మార్చాను. ఇది కూడా ఇరవై నాలుగ్గంటల నిరంతర ప్రసార సాధనమట. ఇందులో పాటలు వేస్తున్నారు. ప్రేక్షకులు ఫోన్ చేసి డిగిన పాటను ప్రసారం చేస్తారట. మా ఆవిడ చెప్పింద. ఆ న్యూస్ ఛానల్ కంటే ఈ పాటలే నయమనుకుని అలాగే గుడ్లప్పగించి చూస్తున్నాను. ఇంతలో పాట పూర్తికాగానే ఒకావిడ ఫోన్ చేసింది. ఆవిడ "హలో" అనగానే, ఇక్కడ వ్యాఖ్యాత 'హలో' అన్నాడు. ఆ తర్వాత సంభాషణ ఇలా కొనసాింది..
"హలో రాంబాబుగారు"
'ఆఁ చెప్పండి మేడం'
"గుర్తుపట్టారా అండి"


పాపం ఈ ప్రశ్నతో సదరు వయాఖ్యాత గతుక్కుమన్నాడు. ఆయన గుర్తుపట్టలేదని స్పష్టంగా అర్థమవుతోంది. పచ్చి వెలక్కాయ నోట్లో పడ్డట్టు మొహం పెట్టి, నవ్వు పులుముకుని అడగసాగాడు.

"లేదు మేడం గుర్తుపట్టలేదు"
'ఇంకా గుర్తు పట్టలేదా?'
"లేదండీ? ఏదైనా క్లూ ఇస్తారా కొంచెం!"
'నేను మాట్లాదినప్పుడు బయట కుక్క అరిచింది..'
"ఆఁ గుర్తొచ్చింది. మీరు మాట్లాడటం మొదలు పెట్టగానే అది అరవడం స్టార్ట్ చేసింది కదా!"
'అవునండీ'
"ఎలా ఉన్నారండీ? ఆ కుక్కెలా ఉంది? మళ్లీ అరుస్తోందా? మానేసిందా?"
'లేదండీ అరవడం లేదు. నేను పాడటం మానేశాను.'
"అయినా మీరు చాలా బాగా పాడతారండి. ఆ రోజు దానికేదో ప్రాబ్లం వచ్చి అరిచుంటుంది. మళ్లీ ఓ సారి పాడండీ"
'అయ్యో! వద్దండీ'
"ఫర్వాలేదు పాడండి. మీరు చాలా బాగా పాడుతారు."
'అయితే ఒక్క నిముషం. కుక్కుందో లేదో చూసొస్తా'

ఆ మాట వినగానే ఆయనగారి మొహంలో ఎక్స్‌ప్రెషన్స్ మారిపోయాయి. కోరి కోరి కొరివితో తలగోక్కవడమంటే ఇదేనేమో! ఇంతసేపు మాట్లాడటమెందుకు? లైన్ కట్ చేసి పాటవేస్తే అయిపోతుంది కదా! అనుకున్నాను. నాభార్య నాలాగే మహా ఘటికురాలు. నా ముఖకవళికలు ఇట్టే పట్టేసింది. నా అనుమానాన్ని నివృత్తి చేస్తూ.. "మొదట్లో పది సెకన్ల కన్నా మాట్లాడే వారే కాదు. కాని ఈ మధ్య ఫోన్లు రావడం తగ్గిపోయేసరికి, ఫోన్ చేసిన వారిని, మినిమం పదినిమిషాలు మాట్లాడకుండా వదిలి పెట్టట్లేదు." అంది.
ఇంతలో అనుమానం వచ్చి అడిగాను ..
"నువ్వు గానీ ఈ ఛానల్‌కి ఫోన్ చేసి సోది పెడుతున్నావా?"
"అబ్బే లేదండీ" అంది.
ఈ మధ్య ఫోన్ బిల్లు మోగిపోతోంది. నాకు తెలియకుండా చేసే ఉంటుందిలే అనుకున్నాను. చేసినా చెబుతుందా ఏంటి నా పిచ్చి కాకపోతే.

ఇంతలో ఆవిడ రానే వచ్చింది.
"బయట కుక్క లేదండి"
'అయితే స్టార్ట్ చేయండి '

పాడటం మొదలు పెట్టింది. చిన్నప్పుడు డొక్కు రేడియోలో మంచి పాట గనుక రాకుంటే, స్టేషన్ మార్చే వాణ్ణి. అది ఓ పట్టాన కలిసేది కాదు! ఆ స్టేషన్ మార్చే క్రమంలో వచ్చే వింత శబ్దంలా వినిపిస్తోంది ఆమె గొంతు. ఇంతలో కుక్క అరుపులు వినిపించసాగాయి. కంగారు పడి అటూ ఇటూ చూశాను. అసలే కుక్కంటే చచ్చేంత భయం నాకు. ఇంతలో మా ఆవిడ ఫక్కున నవ్వి "అది టీవీలో శబ్దం అండీ" అంది.

మళ్లీ టీవీ వైపు చూశాను. కుక్క అరుపులు వినిపిస్తూనే ఉన్నాయి. ఓ ఐదు సెకన్ల తరువాత ఈవిడ పాటపాడటం మానేసింది. కుక్క అరవడం ఆపేసింది. ఆ వెంటనే కెవ్వున కేకేసినట్టు శబ్దం వినిపించింది. ఇక్కడ వ్యాఖ్యాత కంగారు పడిపోయి "ఏమైంది మేడం" అనడిగాడు.

"దొంగముండ కరిచేసిందండీ"
'సారీ మేడం ఇలా జరుగుతుందని ఎక్స్‌పెక్ట్ చేయలేదు '
"అమ్మా! ఫర్వాలేదు లెండి. దానికి మీరెం చేస్తారు. మీకు నచ్చింది కాని, ఆ కుక్కకే నా గొంతు నచ్చినట్టు లేదు. ఇది వరకు ఓ సారి ఇలాగే కరిచింది లెండి"
'సరేలెండి! ముందు మీరు హాస్పిటల్‌కి వెళ్లి, ఇంజక్షన్ చేయించుకోండి. మీరు కోరిన పాట వేస్తాం. మీరు చూడలేకపోతున్నందుకు బాధపడకండి. మళ్లీ రేపు ఫోన్ చేసి మీ ఆరోగ్యం ఎలా ఉందో చెప్పి, మీకిష్టమైన పాట అడగండి. ఉంటాను.' అని పెట్టేశాడు ఆ వ్యాఖ్యాత. ఇదేం గోలరా నాయనా అనుకుని ఛానల్ మార్చాను.

మా ఆవిడ మట్టుకు ఒకింత కోపంగానే చూస్తోంది. తను చూడబోయే ఆ దిక్కుమాలిన సీరియల్స్‌ని మిస్ అవుతున్నందుకు.

ఈ మధ్యలో మరో ఛానల్ పెట్టి చూద్దును గదా.. అందులో దాదాపు అరగంట నుంచీ వాణిజ్య ప్రకటనలు వస్తూనే ఉన్నాయి. ఏవేవో కొత్త కొత్త వస్తువుల గురించి చెప్తోంది. డబ్బింగ్ సినిమాలు చూశాను కానీ, డబ్బింగ్ ప్రకటనలు చూడటం మాత్రం ఇదే ప్రథమం. ఫోన్ చేసి చెప్తే చాలట. అంతా బాగానే ఉంది కాని, టీవీలో అంత సేపు ఆపకుండా ప్రకటనివ్వడానికి ఎంత డబ్బు ఖర్చవుతుందో అని అనుమానం వచ్చింది. అంత డబ్బు ఎక్కడ నుంచి వచ్చిందా అని మరో అనుమానం. అంటే వాళ్లు మనకు అమ్మే సరుకుల మీద ఎంత లాభం తీసుకుంటున్నారో అని మరో చిన్ని అనుమానం. అలా ఆపకుండా వచ్చే ప్రకటనల్ని ఎంత మంది మాత్రం చూస్తారని మరో బుల్లి అనుమానం వచ్చింది.. ఆ అనుమానాలు నివృత్తి కాకముందే మా ఆవిడ వచ్చి ఛానల్ మార్చింది.


నేను నోరెళ్ల అలా ఆ టీవీ వంక ఇటు మా ఆవిడ వంకా చూస్తుండి పోయాను. తను పెట్టింది న్యూస్ ఛానల్ మరి! నా ఊహలో తను అంతకు ముందు ఎప్పుడూ న్యూస్ ఛానల్ పెట్టినట్టు లీలగా కూడా గుర్తు రావడం లేదు. నోట్లో దోమలు దూరతాయని కంగారు పడ్డట్టుంది మా ఆవిడ. వచ్చి నా నోరు మూసింది.

కొత్తగా వచ్చిన సినిమా బంపర్ హిట్ అంటూ చెప్తున్నారు టీవీలో. న్యూస్ ఛానల్‌లో సినిమా గురించి చెప్పడమేంటో అర్థమయి చావలేదు నా మట్టి బుర్రకి. అయినా విడుదలై ఒక రోజు గడవక ముందే సినిమా హిట్ అని ఎలా తెలుస్తుందండీ విడ్డూరం కాకపోతే! ఆ ఛానల్‌లో ప్రకటనలు చూస్తే మరీ తక్కువగా ఉన్నాయి. మరి ఆ వ్యాఖ్యాతలకి, విలేఖరులకి జీతాలెలా ఇస్తున్నారో అర్థమయి చావలేదు. బుర్ర వేడెక్కి పొగలు వస్తున్నట్టుగా అనిపించింది. వెంటనే కాఫీ తెమ్మని కేకేసాను. జ్వరమొచ్చిందని జాలి కాబోలు ఈసారి ఆట్టే ఆలస్యం చేయకుండా అరగంటకే తీసుకొచ్చింది. తనకి నేనంటే ఎంత ప్రేమో అని మురిసిపోయాను. మురవడం పూర్తవగానే మళ్లీ టీవీకి కళ్లప్పగించాను. హాస్పిటల్స్ యొక్క అడ్వర్‌టైజ్‌మెంట్స్ వస్తున్నాయి. ఇదేంటి? చోద్యం కాకపోతే! ఆ రోజుల్లో ఆసుపత్రుల్ని, విద్యాలయాల్ని గుడులతో సమానంగా చూసేవారు. కేవలం వాటి పేరు ప్రఖ్యాతల మీదే అవి నడిచేవి. అలాంటిది, మా ఆసుపత్రికే రండి బాబూ అంటూ బతిమాలుకునే హీనస్థితికి చేరుకున్నామా అనిపించింది. ఇంతలో విద్యా సంస్థల ప్రకటనలు మొదలయ్యాయి. హారి దేవుడా? అనుకుంటుండగా, ఒక ఆసుపత్రికి ఒక పేరు మోసిన దర్శకుడు అంబాసిడర్‌గా రావడంతో నాకు పిచ్చెక్కడం, తలనొప్పి నషాళానికెక్కడం రెండూ ఒకేసారి జరిగిపోయాయి. ఇహ ఇలాగైతే కష్టమని టీవీ కట్టేసి, రేడియో ఆన్ చేశాను.

రేడియో ఆన్ చేయగానే మా ఆవిడ ఫక్కున నవ్వింది. ఆ నవ్వులోని అంతరార్థం తర్వాత తెలిసింది. తెలుగు, హిందీ, ఇంగ్లీషు ఏ భాషా సరిగ్గా రాని అభాగ్యులు అతికష్టమ్మీద అవస్థపడుతూ, ఆయాసపడుతూ మాట్లాడుతున్నట్టు అనిపించింది. ఈ మధ్యే కొత్తగా ప్రారంభమైన రేడియో ఛానల్‌కి ట్యూన్ చేశాను. బయట పెద్ద పెద్ద హోర్డింగులతో ప్రకటనలిచ్చారు కదా, అదైనా బాగుంటుందన్న నమ్మకంతో! ఏదో కొత్త ప్రోగ్రాం అంట. కోడలు అత్తగారిమీద ఏ విధంగా కసి తీర్చుకుందో ఫోన్ చేసి బహుచక్కగా వర్ణించి వర్ణించి చెప్పింది. ఆ కోడలుగారు కసి తీర్చుకోవడం మీకు కరక్ట్ అనిపిస్తే ఒక నంబర్‌కి, లేకుంటే ఇంకో నంబర్‌కి, ఏం చెప్పలేకపోతే మరో నంబర్‌కి ఎస్.ఎం.ఎస్. చేయమన్నారు. హతవిధీ! రేడియోని కనిపెట్టిన మహానుభావుడు కనక బతికుంటే, ఈ పాటికి ఉరేసుకుని చచ్చుండేవాడే అనిపించింది. గుడ్డిలో మెల్లలా రేడియో కన్నా టీవీనే మెరుగనుకుంటా. టీవీలో వాళ్లు చెప్పేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రేడియోలో ఆ ఛాన్స్ కూడా లేదు.

***

నాలుగు రోజులు పూర్తవడతో డాక్టరుగారు వచ్చి మళ్లీ నా ఆరోగ్య పరిస్థితి సమీక్షించారు. జ్వరం తగ్గకపోగా, బీపీ, తలనొప్పి, కుగుడ్లు లాగేయ్యడం వంటి రోగాలు కూడా తోడుగా వచ్చయని చెప్పారు. విశ్రాంతి తీసుకొమ్మంటే ఒత్తిడి పెంచే బరువు పనులు ఎందుకు చేశావని చీవాట్లేసి, మరో నాలుగు రోజులు కచ్చితమైన విశ్రాంతి తీసుకోమని చెప్పి చక్కాపోయారు. ఈ నాలుగురోజులూ ఏం చేయాలా అని అవిశ్రాంతంగా ఆలోచించడం మొదలుపెట్టింది నా బుర్ర.|br />
***      ***     ***
నవ్య వార పత్రిలో 31-జనవరి-2007 న ప్రచురితం.






17 కామెంట్‌లు:

  1. first katha la ledu experience tho rasi nattu ga undi, usage of words kaani, concept kaani.

    రిప్లయితొలగించండి
  2. Nee saili naaku nachindhi.. It's simple and easy to read. 'Pilli poyi elaka vache..' baagundhi. It's good. 'Mali Sandhya' kothaga anipinchaledhu! Iinka better gaa raayalsindhi anipinchindi!

    రిప్లయితొలగించండి
  3. Swathi9/12/2010

    saralamaina hasyam to raasaaru. caalaa baagundi

    రిప్లయితొలగించండి
  4. Baagundi.kaani, komchem klupta parachaalsidi.meeku kadha wraayadamlo anubhavagnulanipinchindi.

    రిప్లయితొలగించండి
  5. chaalaa baagundi. kadhalo sagam varaku naa kadhenemonani doubt vachindi.

    రిప్లయితొలగించండి
  6. బాగుంది, నిరంజన్ గారిలానే నేనూ ఫీలయ్యా.. మంచి కథలు మీనుండి ఆశిస్తూ...

    రిప్లయితొలగించండి
  7. నమస్కారం ఆలూరి గారూ!
    కథ బాగుంది.ఇది టివీ మాధ్యమం మీద వుంగ్యం అనుకుంటా! హాస్యం సహజతలోని అతిదనాన్ని ఎత్తి చూపిస్తే, వ్యంగ్యం అతిదనం లోని సహజతను చూపిస్తుందని పెద్దలంటారు.ఇది ఏ తరగతికి చెందిందో స్పష్టమయిన విభజన లేదు.
    ఏమైనా మొదటి కథనే ఇంత వైభవంగా రాసినందుకు మిమ్మల్ని అభినందించాల్సిందే!

    రిప్లయితొలగించండి
  8. arun garu mee blog is more attractive, stories bagunnayi,abhinandanalu

    రిప్లయితొలగించండి
  9. మొదటి కథనే సునిశితమైన హాస్యంతో చదివించే బిగువు తో బాగా రాసారు ఆలూరి అరుణ్ కుమార్ గారూ. రాబోయే దినాల్లో మీరు మరో మొక్కపాటీ, మునిమాణిక్యం కావాలని కాంక్షిస్తూ ...

    రిప్లయితొలగించండి
  10. I don't think this is your 1st work .you have lot of experiance i feel.

    రిప్లయితొలగించండి
  11. బాగుంది.. ఇలాగే మరిన్ని మంచి కథలాశిస్తూ..

    రిప్లయితొలగించండి
  12. నీ శైలి బావుంది,వాడిన భాష కూడా బావుంది. ’అదో బొక్క’ బదులుగా ’అదో ఆవదం’ (ఆముదం)లాంటి పదాలు వాడొచ్చేమో ఆలోచించండి. టైటిల్ బావుంది. మొదటి కధే అని మీరు చెపితేనే తెలుస్తుంది. చాలా మంది పెద్ద రచయితలు కూడా ఒళ్ళు పొగరెక్కి ఘోరంగా రాస్తున్నారు. వాళ్ళతో పోలిస్తే నీ కధ నాకు బాగా నచ్చింది. సెలవు

    రిప్లయితొలగించండి
  13. Swaroopa1/12/2011

    story is good aaloori gaaru, but all the incidents seem familiar, whatever you have mentioned are known facts. Hope you can make story more interesting in your later works.

    All the best

    రిప్లయితొలగించండి
  14. పిల్లి పోయి ఎలాకవచ్చే .. కద చదివాను శైలి ఫీలింగ్స్ బావున్నాయి. కామెడీ బావుంది. కానీ ఎక్కువ లెంగ్త్ అయ్యింది.

    రిప్లయితొలగించండి
  15. కథ బాగుందండీ.వ్యంగ్యం హాస్యం కలగలిపి నవ్వించారు...

    రిప్లయితొలగించండి