A Separation (2011) {Persian: جدایی نادر از سیمین‎‎ } సినిమా పరిచయం

Best Foreign Language Film కేటగిరిలో అకాడమీ అవార్డ్(2011)తో సహా మొత్తం 47 అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న సినిమా A Separation(2011). About Elly తరువాత Asghar Farhadi దర్శకత్వంలో వచ్చిన మరో ఆణిముత్యం ఈ చిత్రం.

కథ: ఒక జంట విడాకులు కావాలని జడ్జ్ ముందుకు వాదనలు వినిపించేందుకు రావడంతో కథ మొదలవుతుంది. Simin తమ దేశం (Iran)ను భర్త, కూతురు(11ఏళ్ళు)తో వదిలి వేల్లాలనుకుంటుంది. కాని అందుకు ఆమె భర్త Nader అంగీకరించడు. కారణం అల్జీమర్ వ్యాధితో పోరాడుతున్న అరవైయేళ్ళ అతని తండ్రి. సహేతుకమైన కారణాలు లేనందున విడాకుల అర్జీని కోర్టు కొట్టివేస్తుంది. దాంతో Simin ఆ ఇంటిని వదిలి అమ్మ దగ్గరికి వెళ్తుంది. కూతురు Termeh మాత్రం తండ్రి వద్దే ఉంటానంటుంది. అయితే భార్య సలహా మేరకు తను బ్యాంకులో ఉద్యోగానికి వెళ్ళిన తరువాత తన తండ్రిని చూసుకునేందుకు ఒక ఆవిడ(Razieh )ని నియమిస్తాడు Nader. అక్కడి సంప్రదాయం ప్రకారం భర్త అనుమతి తీసుకోవాల్సి ఉన్నా ఆమె తీసుకోకుండా వచ్చేస్తుంది, అందుకు కారణం పేదరికం మరియు భర్త నాలుగు నెలలుగా ఉద్యోగం లేకుండా ఉండటం. ఒకవేళ అడిగినప్పటికీ ఆమె భర్త ఒప్పుకునే రకం కాకపోవడం, పైగా అతనికి క్షణాల్లోనే విపరీతమైన కోపం రావడం వంటి ఇబ్బందులతో అతనికి చెప్పకుండా తన ఐదేళ్ళ కూతురిని వెంటబెట్టుకొని వస్తుంది. అయితే ఒక రోజు పనికే విపరీతంగా అలసిపోయి మరునాడు రాను అని చెబుతుంది. ఒక వేళ మా ఆయన వస్తానంటే పంపిస్తాను అని చెబుతుంది. ఆమె భర్త కూడా Nader పనిచేసే బ్యాంకుకు వెళ్లి మాట్లాడతాడు. కానీ మరునాడు అతను రాకుండా ఆమే వస్తుంది.

ఒకరోజు Nader వచ్చే సరికి తండ్రి మంచం పక్కన నేల మీద పడిపోయి కనిపిస్తాడు. అతని చేయి మంచానికి కట్టివేసి ఉంటుంది. ఓ పది నిముషాలు ఆలస్యమైతే అతను చనిపోయేవాడే. కాసేపటికి Razieh వస్తుంది. ఆమెని ఇంట్లోంచి వెళ్లి పొమ్మంటాడు. ఆమె వినకపోవడంతో నెట్టేస్తాడు. మెట్లపై పడిపోతుంది ఆవిడ.

మరునాడు ఉదయం ఆవిడ నాలుగు నెలల గర్భిణి అని, నిన్న జరిగిన సంఘటనలో ఆమె గర్భం కోల్పోయిందని తెలిసి పరామర్శించేందుకు Simin & Nader కలిసి ఆసుపత్రికి వెళతారు. అసలు భార్య పనికి వెళ్తోంది అని తెలియని Razieh భర్త, అప్పటివరకు ఒక ఆక్సిడెంట్ లో గర్భం పోయిందనుకున్న అతనికి అసలు కారణం Nader అని తెలుసుకొని కోపంతో ఊగిపోయి అతన్ని కొడతాడు. పెనుగులాటలో Simin ముక్కుకి కూడా బలమైన దెబ్బ తగులుతుంది.

ఆ తర్వాత న్యాయం కోసం కేసు వేస్తాడు Razieh భర్త. కోర్టులో వాదనలు మొదలవుతాయి. అసలు ఆమె గర్భవతి అన్న విషయం తనకు తెలియదని అంటాడు Nader.  ఆ తరువాతి వాదనలో Termeh తండ్రి వాదనకు అబద్ధపు సాక్ష్యం చెబుతుంది. తర్వాత Termeh పదే పదే అడగడంతో ఆమె గర్భవతి అని తెలుసు కాని ఆ క్షణంలో గుర్తురాలేదని వివరిస్తాడు.

ఒక దశలో Simin భర్తతో కలిసి ఉండేందుకు వస్తుంది కాని భార్యాభర్తల మధ్య వాదనలు పెరగడంతో కూతురిని కూడా తనతో పాటు తీసుకొని మళ్ళీ అమ్మ వద్దకు వెళ్తుంది. అంతకు ముందు తల్లి వెళ్ళిపోయినా, Termeh తండ్రి వద్దే ఉండటానికి కారణం తన కోసమైనా అమ్మ దేశం విడిచి వెళ్ళదు అని. కాని కోర్టులో తండ్రి అబద్ధపు వాదనతో తల్లితో కలిసి వెళ్ళిపోతుంది.

Razieh భర్త, Termeh స్కూలు వద్ద కనిపిస్తుండటం, అంతకు మునుపు ఇదే కేసు విషయంలో Termeh టీచర్ ని బెదిరించడంతో భయపడిన తల్లి Simin అతనితో మాట్లాడి కొంత డబ్బుతో ఒప్పందం చేసుకొని కేసు ఉపసంహరించుకునేందుకు ఒప్పిస్తుంది. భర్త Nader కి కూడా ఎలాగోలా ఒప్పిస్తుంది. పెద్దల సమక్షంలో చెక్కులు ఇచ్చే ముందు ఒక్క సారి ఖురాన్ మీద ఒట్టేసి ఆమె గర్భం పోవడానికి తనే కారణం అని చెప్పాల్సిందిగా Nader, Raziehని కోరతాడు. అయితే అంతకు ముందు రోజే తన గర్భం పోవడానికి కారణం మీ భర్త కాదు అని, దానికన్నా ఒకరోజు ముందు కారు డీకొట్టడం అసలు కారణం అని, నా కూతురుకి ఏమైనా అవుతుందేమో అన్న భయంతో నిజం చెప్పేస్తున్నానని, మీ డబ్బు కూడా వద్దు అని Razieh, Siminతో చెబుతుంది. ఈ విషయాలేవీ తెలియని Nader తన కూతురి ముందు దోషిగా నిలబడలేక ఖురాన్ మీద ఒట్టు వేయమనడంతో Razieh భర్త ఆగ్రహంతో బయటకి వెళ్ళిపోతాడు, వెళ్తూ వెళ్తూ Nader కారు అద్దాలు ద్వంసం చేసి వెళతాడు. ఆ కేసు అంతటితో ముగుస్తుంది.

Simin & Nader విడాకుల కేసు మళ్ళీ వస్తుంది. తల్లితండ్రుల్లో ఎవరివద్ద ఉంటావు అని జడ్జి Termehని అడుగుతాడు. తను ఎవరి వద్ద ఉండాలో నిర్ణయించుకున్నాను అని జడ్జితో చెబుతుంది కాని అది ఎవరు అని చెప్పలేక రోదిస్తుంది. జడ్జి వాళ్ళిద్దరిని బయటకు వెళ్ళమంటాడు.

Simin & Nader జడ్జి గది బయట ఎదురెదురుగా, ఒక గ్లాస్ తలుపుకి అటుఇటుగా కూర్చుంటారు. వాళ్ళిద్దరినీ ఆ గ్లాస్ విడదీసి ఉంచుతుంది. Termeh కోసం వాళ్ళు ఎదురుచూస్తూ ఉంటారు. సినిమా అక్కడికే అయిపోతుంది. Termeh నిర్ణయం మన ఊహకే వదిలేశాడు దర్శకుడు.

కొసమెరుపు: Asghar Farhadi కూతురు Sarina Farhadi, Termeh పాత్రలో చాలా అద్భుతంగా సహజసిద్ధంగా నటించింది.

A Separation సినిమా ట్రైలర్ ఇక్కడ చూడండి:


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి