నాగవల్లి - సమీక్ష

నాగవల్లి - చంద్రముఖికి కొనసాగింపుగా చెబుతూ, ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ చిత్రం కాస్త నిరాశనే మిగిల్చిందని చెప్పాలి. జీర్ణించుకోలేని విషయం ఏంటంటే , ఈ చిత్రం చంద్రముఖికి కొనసాగింపు కాదు, పునర్నిర్మిణం మాత్రమే..! 

కొంత మంది తెలుగు నటీనటులతో పాత చంద్రముఖి చిత్రాన్ని తెలుగులో పునర్నిర్మించినట్టుగా కనిపిస్తుంది. కొత్తగా ఏమి లేదు 10% తప్ప! చిత్రంలోని పాత్రలు, వారి స్వభావాలలో ఏ మాత్రం మార్పు కనిపించదు, చంద్రముఖి చిత్రంలోని పాత్రలు గుర్తుకు వస్తుంటాయి. వెంకటేష్‌, రజినీకాంత్ పాత్రని కప్పుకుని "నటించాడు". 

 "వెనక్కు వెనక్కు" అని వచ్చే పరిచయపు పాట చంద్రముఖిలోని "దేవుడ దేవుడ" పాట అర్థానికి సరిసమానంగా ఉంటుంది. అయితే వెంకటేష్ నటన నాగభైరవ పాత్రలో సరిపోకపోగా, ముసలి నాగభైరవ పాత్రలో కొన్నిసార్లు నవ్వు తెప్పిస్తుంది. కథలో కొత్తదనం ఏమీ లేదు. చిన్న చిన్న మలుపులు ఫర్వాలేదనిపిస్తాయి. విశ్రాంతి తరువాత వచ్చే ఫ్లాష్‌బ్యాక్ మరియు నాగభైరవ పాత్ర ఎక్కువ సేపు సాగి విసుగు తెప్పిస్తుంది.

దర్శకుడు వాసు ఈ చిత్రంలో 5గురు కథానాయికలు అవసరం అని ముందు నుంచీ చెబుతున్నారు. కాని అందులో అనుష్క, రీచ గంగోపాధ్యాయ, కమలిని ముఖర్జి తప్ప మిగితా ఇద్దరు అవసరం లేదనిపిస్తుంది. శ్రధ్ధ దాస్ పాత్ర కేవలం మనల్ని తప్పుదోవ పట్టించడానికే తప్ప మరెందుకూ అవసరం ఉండదని చిన్నపిల్లాడు కూడా చెప్తాడు. ఎప్పుడూ మాములుగా ఉండే ఆవిడ అప్పుడప్పుడు విచిత్రంగా ప్రవర్తిస్తుంది, సగటు ఉత్కంఠ+భయనక చిత్రాల్లోలా! ఇక పూనం కౌర్ ఎందుకుందో వాసుకే తెలియాలి. వీళ్లు కాకుండా మరో అమ్మాయుంది, ఆవిడ కూడా కథానాయికో, లేక సహాయ నటో తెలీదు. పూనం కౌర్ కన్నా కాస్త ఎక్కువ సన్నివేశాల్లో నటించింది. అయితే వెంకటేష్ ఎవరితోనూ ఆడి పాడకపోవడం విశేషం.

ఇకపోతే ఈ చిత్రంలో లోపాలు, వెతికితే దొరికేన్ని ఉన్నాయి. మచ్చుకి కొన్ని.. చంద్రముఖి తమిళ అమ్మాయి కాబట్టి ఆమె ఆత్మ కూడా తమిళ్‌లోనే మాట్లాడుతుంది. తెలుగు కాని మరే భాషకాని రాదు, మాట్లాడదు. కాని ఆత్మకు మెదడు ఉండదు కదా భాషని నిక్షిప్తం చేసుకోడానికి, అలాంటప్పుడు ఆవహించిన వ్యక్తి మెదడులో నిక్షిప్తమైన భాషలోనే మాట్లడాలి కదా! పోని ఆవహించినప్పుడు కూడా తమిళ్‌లోనే మాట్లాడుతుంది అనుకుందాం, అలాంటప్పుడు “కరక్టే కరక్టే” అని ఆంగ్లంలో ఎందుకు కూస్తుంది – అప్పుడు ఆవహించిన వ్యక్తి మెదడు ఉపయోగించుకోవచ్చా..?

పదిమందిని ఒకే సారి కొట్టే వెంకటేష్ నూటముప్పై యేళ్ల నాగభైరవని ఏం చేయలేకపోతాడు. నాగభైరవకు అంతకు మునుపు లేని శక్తులు ఆ వయసులో ఎక్కడినుంచి వచ్చాయో తెలియదు పైగా రాజు ఈ తరం బ్లాక్ లెదర్ షూ వెసుకుంటాదు. 

ఎంతో బలం ఉండే చంద్రముఖి, ముగింపు సన్నివేశంలో నలుగురు పట్టుకునే సరికి బలహీనురాలైపోతుంది.

నాగభైరవ జీవిత చరిత్రని అతని అనుచరుడు(సమీర్) రాస్తాడు, పుస్తకం పై అతని ఫోటో బ్లాక్ & వైట్‌లో ఉంటుంది, అప్పటికి కెమెరా ఎక్కడిదో? ఆ ఫోటోని పెయింటింగానైనా చూపించలేదు. నాగభైరవ జీవితంలోని కొన్ని సంఘటనలు ఆ పుస్తకంలో పెయింటింగ్ రూపంలో ఉంటాయి – అవి ఫోటోని సాఫ్ట్‌వేర్‌తో పెయింటింగ్‌గా మార్చినవే తప్ప నిజంగా వేసిన పెయింటింగ్స్ కావు.

అనిష్క పెట్టెలో కూర్చుంటే, అందులోని కాంతి వెంకటేష్ మొహం పై పడుతుంది - మూసి ఉన్న పెట్టేలోకి కాంతి ఎక్కడినుంచి వస్తుంది - పైగా వెంకటేష్ మోకాలి వరకు ఉండే పెట్టేలోని కాంతి అతని ముఖంపై పడాటం భౌతిక సూత్రాల ప్రకారం ఏకోణంలో సాధ్యపడదు. చెబుతూ వెళితే ఇంకా చాలా ఉన్నాయి - ఇప్పటికివి చాలు.

రజినీకాంత్‌ని ఊహించుకుని తమిళ్‌లో సినిమాని తీయడనికి స్క్రిప్ట్ పూర్తి చేసుకున్నారేమో అనిపిస్తుంది. అది సాధ్యం కాదని తెలిసి, తెలుగులో మొదలుపెట్టారు - కాని దాన్ని తెలుగు వాతావరణానికి తగ్గట్టు మార్చే ప్రక్రియని గాలికొదిలేశారు. – ఉదా: హీరోని పొగుడుతూ సాగే పాట, అలాగే  రీచా  “నే తప్పు చేశాను, క్షమించండి” అంటుంది, అచ్చు చంద్రముఖిలో జ్యోతికల – ఆవిడ ఎందుకంటుందో, ఏం తప్పు చేసిందో అర్థం అవక బుర్ర గోక్కోవాలి – ఆ సన్నివేశాలు తమిళ వాసనతో గుప్పుమంటాయి.

పాత్రల పరిచయంతో దర్శకుడు విఫలమవడం మొదలైంది. ఆది చాలా చోట్ల వెంటాడింది. చివరికి ముగింపులో ఘోరంగా విఫలమవడం దానికి పరాకాష్ఠ. చంద్రముఖి ఎవర్ని ఆవహించిందో చెప్పే ఘట్టం అయితే అచ్చు డాక్యుమెంటరిలా ఉంటుంది. ముగింపులో  వెంకటేష్ చూస్తుండటం తప్ప చేసేదేం ఉండదు. దానికి తోడు అప్పుడు వచ్చే నాణ్యతలేని గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాయి. చంద్రముఖిలోని భారితనం ఈ నాగవల్లిలో కనిపించదు.
అనుష్క నృత్యం భరించడం కష్టమే. సంగీతం, రీరికార్డింగ్, శ్రధ్ధ దాస్, వెంకటేష్‌ల నటన సరిపోలేదు. ఛాయగ్రహణం ఫర్వాలేదు. టైటిల్స్‌లో తప్ప పరచూరి బ్రదర్స్(మాటలు) ఎక్కడా గుర్తుకు రారు. కళ (ఆర్ట్), స్క్రీన్‌ప్లే, కమలిని, రీచాల నటన ఈ చిత్రానికి కలిసొచ్చే అంశాలు.

చంద్రముఖి చిత్రం ఘన విజయం సాధించడానికి ముఖ్యమైన అంశాన్ని, నాగవల్లిలో విస్మరించడమే ఈ చిత్రం ఇంత పేలవం అవడానికి కారణం అయింది - అది - చంద్రముఖిలో ఆమెను కాని, రాజుని కాని చూపించకపోవడం. దాని వల్ల చంద్రముఖి ప్రేక్షకుల ఊహల్లో ఉండిపోయి, ఆమె ఆగ్రహాన్ని జ్యోతికలో చూడటం వల్ల ఒక రకమైన భయాన్ని సృష్టించింది. నాగవల్లిలో రాజుని, చంద్రముఖిని కూడా చూపించడం, వాళ్లిద్దరూ ప్రత్యక్ష్యంగా కలబడటం వల్ల నాగవల్లి చివరికి సగటు దెయ్యాల చిత్రంగా మిగిలిపోయింది.

నా సలహా: వెంకటేష్ వీరాభిమానులైతే థియేటర్‌లో చూడండి.

నానీలు

చతుర మాసపత్రికలో కొత్తగాలి శీర్షికలో ప్రచురితమైన నా నానీలు (చిన్ని కవితలు)





హలో
నమస్కారమైతే
తెలుగుకి
పురస్కారమే..!
(సెప్టెంబర్)








మనస్సు బావుల్లోని
అనురాగపు ఊటల్ని
డబ్బు పంపు
వేగంగా తోడేస్తోంది..!
(జూన్)







ఆయమ్మెంత అదృష్టవంతురాలు
డబ్బులతో పాటు
పాపాయి బోసినవ్వులు
కావలసినంత ఉచితం
(ఆగస్టు)







ఊళ్ళో
బావి ఇంకిపోయింది..
ఇంట్లో
కన్నీళ్ళు ఊరుతున్నాయి..!
(జులై)


ఆమె - ఆవిడ

ఆమె చేస్తోంది.
ఆవిడ చేయిస్తోంది.
ఇలా కొన్నేళ్లుగా సాగుతోంది.
రోజు రోజుకూ భారమవుతున్న దేహంతో కదలకుండా చెప్తుంటుంది ఆవిడ.
లేడి పిల్లలా పరుగులు తీస్తూ చకచక చేస్తుంది ఆమె.

ఆవిడ పత్రిక తిరగేస్తూ ఆమెని ఓ సారి చూసింది... "నాకెన్ని జబ్బులొచ్చినా ఆరోగ్యాన్ని కొనుక్కోగలను. పాపం! దీనికేదైనా అయితే?" అని జాలిపడింది. పండంటి బిడ్డని కన్న మరునాడే ఆమె పనిలోకొచ్చిందని గుర్తురాలేదావిడకి.

పది రకాల వంటలతో నాలుగు పూటలు తిన్నా, సగం కడుపుకే తింటుంది ఆవిడ.. అదీ మందులు, సూదులతో కలిపి..!
పప్పుతో రెండు పూటలే తిన్నా మనసు నిండేలా తింటుంది ఆమె.

కూనిరాగాలు తీస్తూ హుషారుగా చేసేస్తోన్న ఆమెని చూసి, "దీనికెన్ని అవసరాలున్నాయో?" అనుకుంది. కాని ఆమెకు ఆస్తి ఉందన్న సంగతి ఆవిడకి తెలియదు. ఆవిడకే కాదు చాలా మందికి తెలియదు.

ఆమెకు పనంటే ప్రాణం.
అది చేయకపోతే ఏమీ తోచదు.
అందుకే ఇష్టంగా చేస్తుంది.

ఇంతలో ఆవిడ మొహంలో చిన్ని వెన్నెల, పత్రికలో ప్రకటన చూసి..! నెలరోజుల్లో ముప్పై కిలోలు తగ్గిస్తారట.. నమ్మండని ముందు, తరువాత ఫోటోలని కూడా వేశారు. "దీన్ని కూడా ప్రయత్నిద్దాం..!" అనుకుని ఫోన్ దగ్గరికి వెళ్లేందుకు మెల్లిగా లేవసాగింది.

పని చేయిస్తున్నంత కాలం ఆవిడ ఆస్తి తెల్లకోటు కళ్లకి ఆనుతూనే ఉంటుంది.
పని చేస్తున్నంత కాలం ఆమె ఆస్తి మాత్రం ఎవ్వరికీ కనబడదు.. ఆమె ఒంట్లోనే భద్రంగా గూడుకట్టుకొని ఉంటుంది.

నా ఆరవ కథ - పుత్రోత్సాహము వలదు...

పుత్రోత్సాహము వలదు...
- అరుణ్ కుమార్ ఆలూరి
 
పంతులుగారు విషయం చెప్పినప్పటినుంచి కేశవ్, సంహితల మదిలో అదే పదేపదే తిరుగుతూ మనశ్శాంతిని మైళ్లదూరం తరిమి ఎక్కడో విశ్వాంతరాల్లో వదిలింది. ఒక్క కొడుకే చాలనుకుని చైనా క్యాలెండరు చూసి ప్రణాళికలు వేసుకునిమరీ కన్నారు. మొదటి కాన్పులోనే కొడుకు పుట్టడంతో రెండో బిడ్డకి ఆలోచన కూడా చేయలేదు. ఇద్దరు, ముగ్గురిని కని ఎవరికీ పరిపూర్ణమైన ఉన్నత చదువు చదివించలేకపోవడంకన్నా ఒక్కడితోనే సరిపెట్టి వాణ్ణి ఉన్నత స్థితికి తీసుకెళ్లాలనే తాపత్రయమే ఆ నిర్ణయానికి కారణం! అలా ఆశలన్నీ వాడిపైనే పెట్టుకుని పట్టణంలోని పేరుమోసిన పాఠశాలలో లక్షలు కట్టి చదివిస్తున్నారు. కాని అలాంటి కొడుకువల్లే భవిష్యత్తులో కష్టాలు ఎదురవుతాయి అని పంతులుగారు చెప్పినప్పటినుంచి ఇద్దరికీ మతిపోతోంది. వాళ్ల హృదయాలు ఆలోచించడం మానేసి మెదళ్లు మాత్రమే ఆలోచిస్తున్నాయి. తమ భవిష్యత్తు ఉనికినే ప్రశ్నిస్తున్న సమస్యను తేలిగ్గా తీసుకోలేకపోయారు. పంతులుగారు చెప్పినట్టు చేద్దామనుకున్నారు. దాంతోపాటు మరో సంతానాన్ని కందామని కూడా నిశ్చయించుకున్నారు.


పంతులుగారితో మాట్లాడి ఓ ముహూర్తాన్ని ఖరారుచేసుకుని, దానిక్కావలసిన సరంజామను సిద్ధంచేసుకోసాగారు. ప్రతిదీ ఆర్భాటంగానే చేయడం అలవాటుచేసుకున్న ఆ దంపతులు ఆ కార్యక్రమానికీ భారీ సంఖ్యలో బంధుమిత్రులందరినీ సకుటుంబ సపరివార సమేతంగా ఆహ్వానించారు. ఆ వరుసక్రమంలో చివరికి మిగిలింది కేశవ్ నాన్న ఆదిశేషు పేరు. అందుకు సంహిత అనుమతి తప్పనిసరి!
‘‘నాన్నగారిని పిలవమంటావా?’’ అడిగాడు కేశవ్.
‘‘ఆయనెందుకూ?’’ చీదరించుకుంటూ అంది సంహిత.
ఇంతలో వాళ్లబ్బాయి ప్రద్యుమ్న వచ్చాడు. కాని వాడ్ని పట్టించుకోకుండా వీరు మాట్లాడుకోసాగారు. దాంతో ప్రద్యుమ్న తన రూంలోకెళ్లిపోయాడు. పంతులుగారి దగ్గరికి వెళ్లి వచ్చినప్పటినుంచి తనను సరిగ్గా చూడకపోవటం ప్రద్యుమ్న గమనిస్తూనే ఉన్నాడు. తను చేసిన తప్పేంటో ఆ ఆరో తరగతి హృదయానికి అర్థంకావట్లేదు.


ఇంత ఆర్భాటంగాచేస్తున్న ఫంక్షన్‌లో ఆయన కనబడకపోతే, వచ్చిన వాళ్లందరూ అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేక సతమతమవ్వాల్సొస్తుందని తన తర్కబుద్ధితో ఆలోచించి, చివరికి ‘‘సరే పిలవండి! కాని ఒక్కడినే రమ్మనండి’’ అన్న ఆజ్ను జారీచేసింది ‘ఒక్కడినే’ అన్న పదాన్ని ఒత్తిపుకుతూ...! కాటికి కాలుచాపే వయసులో కూతురు వయసున్న సుబ్బమ్మని ఆదిశేషు పెళ్లిచేసుకోడం సంహితకు ఆయనపై చులకన భావాన్ని కలిగించింది.
ఆ పట్టణానికి యాభై కిలోమీటర్ల దూరంలోవున్న ఆదిశషుకి ఫోన్ కలిపాడు కేశవ్.
‘‘హలో నాన్నగారు! వచ్చే సోమవారం మీరు ఇక్కడికి రావాల్సి ఉంటుంది’’ అననాడు.
‘‘ఏమిటీ విశేషం?’’ అన్నాడు ఆదిశేషు ప్రశంతంగా...!
‘‘ప్రద్యుమ్న పేరు మారస్తున్నాం నాన్నగారు! ఆ కార్యక్రమానికి రావాలి’’ అన్నాడు.
‘‘ఏ? ఎందుకూ? ఇప్పుడా అవసరమేమొచ్చింది?’’ ఆదుర్దాగా అడిగాడు.
‘‘ఆ పేరుతో పిలవడంవల్ల చివరి దశలో వాడు మమ్మల్ని సరిగ్గా చూసుకోకపోయే అవకాశం ఉందని పంతులుగారు చెప్పారు. పేరు మారిస్తే బాగుంటుందన్నారు. అందుకని వాడి జాతకానికి సరిపోయేట్టుగా వింధ్యేశ్వర్‌గా మారుస్తున్నాం!’’ అన్నాడు. కొడుకు చోద్యానికి నోరెళ్లబెట్టాడు ఆదిశేషు.
‘‘మీరు వచ్చేటపుడు...’’అంటూ అర్థోక్తిలో ఆగిపోయాడు పక్కనే కూర్చున్న సంహిత చేతులతో నోటితో శబ్దం బయటకి రాకుండా సంజ్ఞలు చేస్తూ ఒక్కడినే రమ్మనమన్న విషయం కేశవ్‌ని గుర్తుచేయసాగింది.
ఆదిశేషు అర్థంచేసుకుని ఒక చిన్న నవ్వు నవ్వి ‘‘ఒక్కడినే వస్తాలే!’’ అని పెట్టేశాడు.
తన కొడుకు పేరు మార్చే కార్యక్రమం గురించి కేశవ్ చెప్పడంతో, ఆదిశేషుకి కేశవ్ చిన్ననాటి సంగతులు గుర్తొచ్చాయి.
* * *
అక్షరాభ్యాసానికి బంధువర్గంతో బాసరకు వచ్చారు ఆదిశేషు- ప్రసూనాంబ దంపతులు. పంతులు కేశవ్ చిట్టిపొట్టి చేతులతో బియ్యంపై ‘‘శ్రీ’’అన్న పదాన్ని రాయించి పలకమన్నాడు. పిల్లిని అదిల్చేందుకు వాడే పదంగా భావించిన కేశవ్ ‘‘స్రీ, స్రీ’’ అంటూ చేతిని అదిలిస్తూ కేకలేయడంతో పంతులుతో సహా అందరూ నవ్వారు. పెళ్లైన పది సంవత్సరాలకు ఎన్నో నోములు, వ్రతాల ఫలితంగా జన్మించాడు కేశవ్. ఒకే ఒక్క సంతానం కావడంతో చాలా గారాబంగా పెంచసాగారు. ప్రసూనాంబ గారాబం చూసి ఊర్లో వారందరూ ముక్కున వేలేసుకునేవారు. ఆ తల్లి ప్రేమకు కొంతమంది ఈర్ష్యపడేవారు. కొంతమంది నవ్వుకునేవారు. కేశవ్‌ని అందరిలా ప్రభుత్వ పాఠశాలకు పంపకుండా ప్రైవేటు స్కూల్లో ఇంగ్లీషు మీడియంలో చేర్పించాడు ఆదిశేషు. చదువులో అందరికన్నా ముందుండేవాడు కేశవ్. ఇంటర్‌నుంచి కేశవ్‌ని హాస్టల్‌లో ఉంచి మరీ చదివించాడు. దానికి తగ్గట్టు పోటీపడి చదివేవాడు కేశవ్. అలా వెళుతూ వెళుతూ చివరికి ఇంజనీరింగ్ పూర్తిచేసి, ్రాన్స్‌కోలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా ఉద్యోగాన్ని సంపాదించాడు. కేశవ్‌తో ఆదిశేషు`పోటీపడి పదెకరాల పొలాన్ని యాభై ఎకరాలు చేశాడు.

చదువుకన్న పిల్లైతే పిల్లవాణ్ణి అర్థంచేసుకుంటుందని న్నో సంబంధాలు చూసి చివరికి సంహితైతే అన్నివిధా సరిపోతుందని భావించి కేశవ్‌కు ఆమెతో పెళ్లి జరిించారు. రోజూ ఊరునుంచి పట్నానికి వెళ్లిరావాలంట ఇబ్బందవుతోందని పట్నంలో కాపురం పెట్టాడు కేశవ్. సెలవుదినాల్లో, పండగలప్పుడు ఇంటికి వచ్చి వెళ్తూ ఉండేవారు. కొన్నాళ్లకి మెల్లిగా తగ్గించారు. దాంతో ఆదిశేషు- ప్రసూనాంబలే కేశవ్ దగ్గరికి వెళ్లేవారు. వాళ్లు రాగానే సంహిత ఏదో రకంగా కేశవ్‌తో గొడవ పెట్టుకునేది. పొమ్మనలేక పొగపెట్టేది. మొదట్లో కోడలి ప్రవర్తన ఇద్దరికీ అర్థమయ్యేది కాదు. తర్వాతర్వాత అర్థమైంది. కాని అలాంటి స్థితిని వారెప్పుడూ ఊహించలేదు. ఊర్లోకూడా ఎక్కడా చూడలేదు. ఆ స్థితిని ఆకళింపు చేసుకోవడానికి చాలారోజులే పట్టింది. రోజులు కాదు సంవత్సరాలు...! ఆదిశేషు అర్థంచేసుకున్నా ప్రసూనాంబవల్ల కాలేదు. కొడుకు మారతాడన్న ఆశ, కాని మారట్లేదంటూ సంకేతం వచ్చేలా ఇంటికి రాకపోవడంతో నిరాశ. అలా ఆశ నిరాశల మధ్య ఊగులాడుతూ మానసికంగా ఎంతో దెబ్బతిన్నది.


ఇంతలో కోడలు నెల తప్పిందన్న వార్తతో అన్నీ మర్చిపోయి ఆమెని ఆశీర్వదించి వచ్చారు. ఆ తర్వాత కొన్ని నెలలకి ఇద్దరిని ఇంటికి రప్పించి, కోడలికి శ్రీమంతం జరిపారు. ఆ తర్వాత కోడలు తన తల్లిగారింటికి వెళ్లిపోయింది. ‘‘ఒక్కడివే ఆ పట్నంలో ఎలా ఉంటావ’’ని ప్రసూనాంబ అనడంతో మళ్లీ ఇంటికే మకాం మార్చాడు కేశవ్. ఊరినుంచే పట్నంకి వెళ్లిరావడం మొదలుపెట్టాడు. చాలా సంవత్సరాల తరువాత అమ్మ ప్రేమని గోరుముద్దల్లో అందిస్తుంటే చిన్నపిల్లాడిలా మారిపోయి ఆరగించేవాడు. ఈ జన్మకు ఇది చాలు అనుకునేది ప్రసూనాంబ.


కొడుకుమీద ద్వేషం లేకపోయినా తమని నిర్లక్ష్యం చేశాడన్న కోపం మాత్రం ఆదిశేషుకుండేది. కొన్ని నెలల తరువాత సంహిత పండంటి కొడుకుని కన్నది. ప్రసూనాంబ మనసు ఆకాశానికెగిరింది. ఊర్లో వారందరూ పిల్లాడిని చూసి వెళుతూ ‘‘అచ్చం తాత పోలికే’’ అంటుంటే ప్రసూనాంబ మురిసిపోయేది. పాపలా మారి బాబుని ఆడించేది. ముద్దులతో ముంచెత్తేది...! మనుమడి మురిపాలతో కొడుకు మీదున్న కోపతాపాలు ఆదిశేషు మనసులోకూడా నీటి బుడగల్లా మాయమయ్యాయి.


అలా రెండు నెలలు గడిచాయో లేదో, మనుమడి పాల నవ్వులను పూర్తిగా ఆస్వాదించారో లేదో, మళ్లీ పట్నంకు మకాం మార్చింది సంహిత. ప్రసూనాంబ గుండె ఆగినంతపనైంది. కోడలు ఎందుకలా ప్రవర్తిస్తున్నదో ఇద్దరికీ అర్థంకాలేకపోయింది. కేశవ్ సంహితతో గొడవ పెట్టుకున్నాడు. తన తల్లిదండ్రులు తనతోనే ఉండాలని గతంలో చాలాసార్లు సంహితకు నచ్చజెప్పాడు. కాని సంహిత ఒప్పుకునేది కాదు. ఎక్కువగా మాట్లాడితే వీధంతా వినిపించేలా అరిచేది, ఏడిచేది. దాంతో నిస్సహాయంగా ఉండిపోయేవాడు కేశవ్. కాని ఈసారి గొడవ తీవ్రస్థాయికి చేరింది. దాంతో సంహిత ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. పిల్లాడిని కూడా చంపుతానంది. దాంతో కేశవ్ సంహితపై చేయి చేసుకున్నాడు. ‘‘కొట్టండి, చంపండి. కాని ఆ ముసలివాళ్లకు నేను వండి పెడుతూ సేవచేస్తూ కూర్చోలేను’’అని తెగేసి చెప్పింది.


ప్రసూనాంబకి మనసు మనసులో లేదు. నిద్దట్లో కలవరించడం ఎక్కువైంది. దాంతో అభిమానం చంపుకుని కొడుకు దగ్గరికెళ్లి ‘‘వచ్చి ఇంట్లో ఉండమం’’టూ బతిమాలాడు ఆదిశేషు. ర్తతో చెప్పిన మాటలే మామతోను చెప్పి పంపించింది సంహిత. దిగ్భ్రాంతికిలోనై ఇంటికి ేరుకున్నాడు. ఏమైందంటూ ప్రసూనాంబ నిలదీయడంతో ఆదశేషుకు చెప్పక తప్పలేదు. మనుమడి మీద మమకారం చంపుోలేక, కొడుకుమీద కోపం తెచ్చుకోలేక చివరికి ఆ బలహీన హృదయం నిద్దట్లోనే ఆగిపోయింది.
దహన సంస్కారానికి వచ్చిన కశవ్‌ని పట్టుకుని విలపిస్తూ ప్రసూనాంబ గొప్పతనం`గురించి రోదనలోనే కవితాత్మకంగా చెప్పసాగరు ఊర్లోని ఆడవాళ్లందరూ. ఆ రోదనలన్నీ కేశవ్‌ని నిలదీస్తున్నట్టుగా అనిపించినా సంితకు చీమకుట్టినట్టుకూడా అనిపింలేదు. ఆదిశేషు మొహంలో ఏ భావంలేకుండా ప్రసూనాంబ ప్కనే కూర్చుని ఆకాశంవైపే చూస్తూ ఉన్నాడు. అతని కంటినుండి ఒక్క నీటిబొట్టూ రాకపోవడం కేశవ్‌కి కోపాన్ని తెప్పించింది. తన తండ్రికి తనకున్న ప్రేమ కూా లేదనుకున్నాడు. కాని ఆదిశేషు కళ్ల వెనకాల కన్నటి అలలు ఎగసిపడుతున్నాయని అతనికి తెలియదు. ఒక్కసారి ఆ నీరు బయటకు చిప్పిల్లిందంటే, ఆ ఊట ఆగేందుకు ఆదిశేషు జీవితం సరిపోదు. అందుకే ఏ భావం లేకుండా ఆకాశంవైపు చూస్తున్నాడు. ప్రసూనాంబ పిలుస్తుందేమోనని ఆశగా చూస్తున్నాడు.
* * *
కొన్ని నెలలు కాలగర్భంలో సమాధయ్యాయి. సంహిత మాటల ప్రభావంతో మెల్లగా తనకు తెలియకుండానే తనూ సంహితలా ఆలోచిస్తూ తండ్రికి దూరంగా ఉండసాగాడు కేశవ్. ఊర్లో ఒక్కడే వంట చేసుకు తినడం ఆదిశేషుకు నరకంగా అనిపిస్తోంది. అలవాటు లేని పని... ఒకరోజు వేలు తెగుతోంది, ఒకరోజు చేయి కాలుతోంది...! మొదట్లో ఇరుగుపొరుగు ఎవరో ఒకళ్లు వచ్చి వంట చేసిచ్చి వెళ్లేవారు. ఆ తర్వాత వారు వండుకున్న దాంట్లోంచే కొంత పెట్టి వెళ్లేవారు. కాని అలా ఎంతకాలం చేయగలరు? అందుకే ఆదిశేషుకి ఆ వయసులో వంట చేసుకోవడం తప్పలేదు. వండి పెట్టడానికి, అతనికి సాయంగా ఉండటానికి పెళ్లిచేసుకోమని అందరూ బలవంతపెట్టారు. ఆదిశేషుకి కూడా అది తప్ప వేరే మార్గం కనిపించలేదు. కాని తన సౌలభ్యంకోసం మరో ఆడదాని జీవితంతో ఆడుకోవడం అతనికిష్టంలేదు.


ఇంతలో సుబ్బమ్మ గురించి ఆదిశేషుకి ఎవరో చెప్పారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉండే సుబ్బమ్మకి పది సంవత్సరాల కొడుకున్నాడు. ఉద్యమాలంటూ అడవుల్లో తిరిగి ఐదు సంవత్సరాల క్రితం భర్త చనిపోయాడు. ఊళ్లోవాళ్లు పోలీసులకు భయపడి చేరదీయకపోవడంతో దిక్కుమొక్కులేని అనాథయింది. ఆ కసితో మొదటి కొడుకు సంవత్సరం క్రితం తండ్రిలాగే అడవుల్లోకెళ్లాడు. పదిహేను సంవత్సరాల వయసులో తుపాకీ చేతబట్టి చివరికి రెండునెలల క్రితం ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు. దాంతో సుబ్బమ్మకు భయం పట్టుకుంది. ఈ కొడుకూ అలాగే మారితే తన గతేంటి అనుకుంటూ భయపడుతూ, కూలీ నాలీ చేసుకుంటూ కాలం వెళ్లదీయసాగింది.


సుబ్బమ్ గురించి విన్న ఆదిశేషు ఆమెను పెళ్లిచేసుకునేందకు అంగీకరించాడు. తనకు వండి పెట్టేందుకు, తన బాగోులు చూసుకునేందుకు మాత్రమే తనని పెళ్లిచేసుకుంున్నానని సుబ్బమ్మతో వివరించాడు. ఆమె కొడుకుని ఉద్యమాల వాసన సోకని ప్రాంతంలో ఉన్న చదువు చెప్పిస్తానని మాటిచ్చాడు. సుబ్బమ్మకి ఆదిశేషు దేవుడిలా కనిపించాడు. ఏ దిక్కూలేని ఆడదానిి ఓ నీడనిచ్చే మొగాడు దేవుడైనా, ఏ అనుబంధం లేకుండ ఆ నీడనివ్వడం కూడా ఈ సభ్యసమాజంలో తప్పే అవుతుందని సుబ్బమ్మకు తెలుసు గనకనే ఆదిశేషుతో తాళి కట్టిచుకుంది.


నుదుట బొట్టు పెట్టించుకుని నిండు ముత్తయిదువులా మారి, ఆదిశేషుని కన్నతల్లిలా చూసుకుంటోంది. సుబ్బమ్మ కొడుకుని పట్నంలో ఉన్న మంచి పాఠశాలలో హాస్టల్‌లో ఉంచి చదివిస్తున్నాడు ఆదిశేషు. తనని ‘నాన్న’అని పిలవాలని ఆదిశేషు ఆ పిల్లడిని ఇబ్బంది పెట్టలేదు. కేవలం తన స్వార్థంకోసం భార్యాపిల్లల్ని గాలికొదిలేసి చివరికి అనాథల్నిచేసి కన్నుమూసి, ‘నాన్న’అన్న పిలుపునకు మచ్చతెచ్చిన వ్యక్తిని పిలిచిన పిలుపుతో ఆదిశేషుని పిలవడం సుబ్బమ్మకు, ఆమె కొడుకుకి కూడా ఇష్టంలేదు. అందుకే ‘అయ్యగారు’అని ఆప్యాయంగానూ, గౌరవంగానూ పిలుస్తాడు.


సుబ్బమ్మ-ఆదిశేషుల అనురాగ బంధం మెదడుతో ఆలోచించే సంహిత లాంటి వ్యక్తులకు భార్యాభర్తల సంబంధంలా కనిపించినా, హృదయంతో ఆలోచించే ఊళ్లోని వ్యక్తులకు తల్లీకొడుకుల అనుబంధంలా కనిపిస్తుంది.


ఆ పెళ్లితో తండ్రి మీద కేశవ్‌కున్న కొద్దిపాటి భావాల్నికూడా పూర్తిగా తుడిచివేయడంలో సంహిత సఫలీకృతురాలైంది. అప్పటినుంచి కేశవ్ ఆ ఇంటి గడప తొక్కింది లేదు. కాని అప్పుడప్పుడు ప్రద్యుమ్నకి సంబంధించిన చిన్న చిన్న ఫంక్షన్లకి ఆదిశేషుని పిలుస్తూ ఉంటారు. అతను చనిపోయాక ఆస్తిలో వచ్చే వాటాకోసమే ఆ నామమాత్రపు బంధాన్ని కొనసాగిస్తున్నారని ఆదిశేషుకు తెలుసన్న సంగతి కేశవ్- సంహితలకు తెలియదు. ఆ రకంగానైనా మనుమడిని చూసి రావచ్చని ఆ రాతి మనస్సుల ఇంటికి వెళ్లి, అసహజమైన నవ్వుల్ని భరిస్తూ, మనుమడితో కాసేపు గడిపి వస్తూ ఉంటాడు.
* * *
ఇంతలో సోమవారం వచ్చింది. ఆ కార్యక్రమానికి ఆదిశేషుతో సహా బంధుమిత్రులందరూ వచ్చారు. చాలామంది ఆదిశేషుని పలకరించారు. కొంతమంది అతని ఛాయలకు కూడా వెళ్లలేదు. పంతులుగారు కేశవ్- సంహితలతో చేయవలసిన కార్యక్రమాలు చేయించి, ాస్త్రోక్తంగా ప్రద్యుమ్న పేరును వింధ్యేశ్వర్గా మార్చారు. ఆ పేరు ఆ బాలుడికి అస్సలు నచ్చలేదు. దిశేషుని చూసి పరుగెత్తుకుంటూ వెళ్లి అతని కాళ్కి అల్లుకుపోయాడు. ‘‘నా ఫ్రెండ్స్‌కి ఈ కొత్త పేరు చెబితే ఏడిపిస్తారు తాతయ్య’’. అన్నాడు ఒకింత బాగా. ఆదిశేషు స్పందించలేదు. సుబ్బమ్మ పంపిన బొబ్బ్లు ఇచ్చాడు. వాటినందుకుంటూ ‘‘తాతయ్యా! నువ్వు కూడా నాన్న పేరు మారిస్తే ఎంచక్కా ఇక్కడే ఉండేవాడిేమో!’’ అన్నాడు. ఆ మాటలు సంహిత చెవిన పడ్డాయి. అందరున్నారని కూడా చూడకుండా గట్టిగా చెంపమీద కొట్టింది. కంట్లోంచి రాలేందుకు సిద్ధమైన కన్నీటిని ఆపుకుంటూ ‘‘సారీ మమ్మీ!’’ అన్నాడు వింధ్యేశ్వర్. చిన్నప్పటినుంచి అతడలాగే పెంచబడ్డాడు. ఆదిశేషు వింధ్యేశ్వర్‌ని ఓదార్చేందుకు ప్రయత్నించలేదు. చిన్నబోయిన వాడి మొహాన్ని చూడలేక అక్కడినుంచి వెళ్లిపోయాడు ఆదిశేషు... అదే ఊర్లో హాస్టల్లో చదువుకుంటున్న కొడుకు కాని కొడుకు దగ్గరికి...!

 - అయిపోయింది -

ఆంధ్రభూమి ఆదివారం అనుబంధం 03-జనవరి-2010 నాడు ప్రచురితం.