నాగవల్లి - సమీక్ష

నాగవల్లి - చంద్రముఖికి కొనసాగింపుగా చెబుతూ, ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ చిత్రం కాస్త నిరాశనే మిగిల్చిందని చెప్పాలి. జీర్ణించుకోలేని విషయం ఏంటంటే , ఈ చిత్రం చంద్రముఖికి కొనసాగింపు కాదు, పునర్నిర్మిణం మాత్రమే..! 

కొంత మంది తెలుగు నటీనటులతో పాత చంద్రముఖి చిత్రాన్ని తెలుగులో పునర్నిర్మించినట్టుగా కనిపిస్తుంది. కొత్తగా ఏమి లేదు 10% తప్ప! చిత్రంలోని పాత్రలు, వారి స్వభావాలలో ఏ మాత్రం మార్పు కనిపించదు, చంద్రముఖి చిత్రంలోని పాత్రలు గుర్తుకు వస్తుంటాయి. వెంకటేష్‌, రజినీకాంత్ పాత్రని కప్పుకుని "నటించాడు". 

 "వెనక్కు వెనక్కు" అని వచ్చే పరిచయపు పాట చంద్రముఖిలోని "దేవుడ దేవుడ" పాట అర్థానికి సరిసమానంగా ఉంటుంది. అయితే వెంకటేష్ నటన నాగభైరవ పాత్రలో సరిపోకపోగా, ముసలి నాగభైరవ పాత్రలో కొన్నిసార్లు నవ్వు తెప్పిస్తుంది. కథలో కొత్తదనం ఏమీ లేదు. చిన్న చిన్న మలుపులు ఫర్వాలేదనిపిస్తాయి. విశ్రాంతి తరువాత వచ్చే ఫ్లాష్‌బ్యాక్ మరియు నాగభైరవ పాత్ర ఎక్కువ సేపు సాగి విసుగు తెప్పిస్తుంది.

దర్శకుడు వాసు ఈ చిత్రంలో 5గురు కథానాయికలు అవసరం అని ముందు నుంచీ చెబుతున్నారు. కాని అందులో అనుష్క, రీచ గంగోపాధ్యాయ, కమలిని ముఖర్జి తప్ప మిగితా ఇద్దరు అవసరం లేదనిపిస్తుంది. శ్రధ్ధ దాస్ పాత్ర కేవలం మనల్ని తప్పుదోవ పట్టించడానికే తప్ప మరెందుకూ అవసరం ఉండదని చిన్నపిల్లాడు కూడా చెప్తాడు. ఎప్పుడూ మాములుగా ఉండే ఆవిడ అప్పుడప్పుడు విచిత్రంగా ప్రవర్తిస్తుంది, సగటు ఉత్కంఠ+భయనక చిత్రాల్లోలా! ఇక పూనం కౌర్ ఎందుకుందో వాసుకే తెలియాలి. వీళ్లు కాకుండా మరో అమ్మాయుంది, ఆవిడ కూడా కథానాయికో, లేక సహాయ నటో తెలీదు. పూనం కౌర్ కన్నా కాస్త ఎక్కువ సన్నివేశాల్లో నటించింది. అయితే వెంకటేష్ ఎవరితోనూ ఆడి పాడకపోవడం విశేషం.

ఇకపోతే ఈ చిత్రంలో లోపాలు, వెతికితే దొరికేన్ని ఉన్నాయి. మచ్చుకి కొన్ని.. చంద్రముఖి తమిళ అమ్మాయి కాబట్టి ఆమె ఆత్మ కూడా తమిళ్‌లోనే మాట్లాడుతుంది. తెలుగు కాని మరే భాషకాని రాదు, మాట్లాడదు. కాని ఆత్మకు మెదడు ఉండదు కదా భాషని నిక్షిప్తం చేసుకోడానికి, అలాంటప్పుడు ఆవహించిన వ్యక్తి మెదడులో నిక్షిప్తమైన భాషలోనే మాట్లడాలి కదా! పోని ఆవహించినప్పుడు కూడా తమిళ్‌లోనే మాట్లాడుతుంది అనుకుందాం, అలాంటప్పుడు “కరక్టే కరక్టే” అని ఆంగ్లంలో ఎందుకు కూస్తుంది – అప్పుడు ఆవహించిన వ్యక్తి మెదడు ఉపయోగించుకోవచ్చా..?

పదిమందిని ఒకే సారి కొట్టే వెంకటేష్ నూటముప్పై యేళ్ల నాగభైరవని ఏం చేయలేకపోతాడు. నాగభైరవకు అంతకు మునుపు లేని శక్తులు ఆ వయసులో ఎక్కడినుంచి వచ్చాయో తెలియదు పైగా రాజు ఈ తరం బ్లాక్ లెదర్ షూ వెసుకుంటాదు. 

ఎంతో బలం ఉండే చంద్రముఖి, ముగింపు సన్నివేశంలో నలుగురు పట్టుకునే సరికి బలహీనురాలైపోతుంది.

నాగభైరవ జీవిత చరిత్రని అతని అనుచరుడు(సమీర్) రాస్తాడు, పుస్తకం పై అతని ఫోటో బ్లాక్ & వైట్‌లో ఉంటుంది, అప్పటికి కెమెరా ఎక్కడిదో? ఆ ఫోటోని పెయింటింగానైనా చూపించలేదు. నాగభైరవ జీవితంలోని కొన్ని సంఘటనలు ఆ పుస్తకంలో పెయింటింగ్ రూపంలో ఉంటాయి – అవి ఫోటోని సాఫ్ట్‌వేర్‌తో పెయింటింగ్‌గా మార్చినవే తప్ప నిజంగా వేసిన పెయింటింగ్స్ కావు.

అనిష్క పెట్టెలో కూర్చుంటే, అందులోని కాంతి వెంకటేష్ మొహం పై పడుతుంది - మూసి ఉన్న పెట్టేలోకి కాంతి ఎక్కడినుంచి వస్తుంది - పైగా వెంకటేష్ మోకాలి వరకు ఉండే పెట్టేలోని కాంతి అతని ముఖంపై పడాటం భౌతిక సూత్రాల ప్రకారం ఏకోణంలో సాధ్యపడదు. చెబుతూ వెళితే ఇంకా చాలా ఉన్నాయి - ఇప్పటికివి చాలు.

రజినీకాంత్‌ని ఊహించుకుని తమిళ్‌లో సినిమాని తీయడనికి స్క్రిప్ట్ పూర్తి చేసుకున్నారేమో అనిపిస్తుంది. అది సాధ్యం కాదని తెలిసి, తెలుగులో మొదలుపెట్టారు - కాని దాన్ని తెలుగు వాతావరణానికి తగ్గట్టు మార్చే ప్రక్రియని గాలికొదిలేశారు. – ఉదా: హీరోని పొగుడుతూ సాగే పాట, అలాగే  రీచా  “నే తప్పు చేశాను, క్షమించండి” అంటుంది, అచ్చు చంద్రముఖిలో జ్యోతికల – ఆవిడ ఎందుకంటుందో, ఏం తప్పు చేసిందో అర్థం అవక బుర్ర గోక్కోవాలి – ఆ సన్నివేశాలు తమిళ వాసనతో గుప్పుమంటాయి.

పాత్రల పరిచయంతో దర్శకుడు విఫలమవడం మొదలైంది. ఆది చాలా చోట్ల వెంటాడింది. చివరికి ముగింపులో ఘోరంగా విఫలమవడం దానికి పరాకాష్ఠ. చంద్రముఖి ఎవర్ని ఆవహించిందో చెప్పే ఘట్టం అయితే అచ్చు డాక్యుమెంటరిలా ఉంటుంది. ముగింపులో  వెంకటేష్ చూస్తుండటం తప్ప చేసేదేం ఉండదు. దానికి తోడు అప్పుడు వచ్చే నాణ్యతలేని గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాయి. చంద్రముఖిలోని భారితనం ఈ నాగవల్లిలో కనిపించదు.
అనుష్క నృత్యం భరించడం కష్టమే. సంగీతం, రీరికార్డింగ్, శ్రధ్ధ దాస్, వెంకటేష్‌ల నటన సరిపోలేదు. ఛాయగ్రహణం ఫర్వాలేదు. టైటిల్స్‌లో తప్ప పరచూరి బ్రదర్స్(మాటలు) ఎక్కడా గుర్తుకు రారు. కళ (ఆర్ట్), స్క్రీన్‌ప్లే, కమలిని, రీచాల నటన ఈ చిత్రానికి కలిసొచ్చే అంశాలు.

చంద్రముఖి చిత్రం ఘన విజయం సాధించడానికి ముఖ్యమైన అంశాన్ని, నాగవల్లిలో విస్మరించడమే ఈ చిత్రం ఇంత పేలవం అవడానికి కారణం అయింది - అది - చంద్రముఖిలో ఆమెను కాని, రాజుని కాని చూపించకపోవడం. దాని వల్ల చంద్రముఖి ప్రేక్షకుల ఊహల్లో ఉండిపోయి, ఆమె ఆగ్రహాన్ని జ్యోతికలో చూడటం వల్ల ఒక రకమైన భయాన్ని సృష్టించింది. నాగవల్లిలో రాజుని, చంద్రముఖిని కూడా చూపించడం, వాళ్లిద్దరూ ప్రత్యక్ష్యంగా కలబడటం వల్ల నాగవల్లి చివరికి సగటు దెయ్యాల చిత్రంగా మిగిలిపోయింది.

నా సలహా: వెంకటేష్ వీరాభిమానులైతే థియేటర్‌లో చూడండి.