Bashu, the Little Stranger (1989) {Persian: باشو غریبه کوچک‎‎} సినిమా పరిచయం

 Bashu, the Little Stranger (1989) సినిమా ఇరాన్-ఇరాక్ యుద్ధం నేపథ్యంలో, యుద్ధం తాలూకు వినాశనం ఒక పసి హృదయం పై ఎంతటి ప్రభావం చూపిందో మనవీయ కోణంలో ఎండగడుతూ సాగుతుంది. ఒక పర్శియన్ సినిమా పత్రిక, విమర్శకులు & సినీ పండితుల మధ్య 1999లో నిర్వహించిన సర్వేలో “Best Iranian Film of all time” గా ఎన్నుకోబడింది ఈ చిత్రం. సినిమాలోని ప్రతి సన్నివేశం జరుగుతున్నప్పుడు & ఆ సన్నివేశం పూర్తయ్యాక ఆలోచించుకోవడానికి  మనకు కావలసినంత ‘స్పేస్’ దొరుకుతుంది. ఆ ‘స్పేస్’లో మన మనస్సు ఒక చోట నిలవక ఎన్నో ఆలోచనలతో పరుగెత్తిస్తూనే ఉంటుంది. అనుభూతి ప్రధానంగా సాగే కథనం మంత్రం ముగ్ధుల్ని చేస్తుంది. సినిమా చూస్తున్ననంత సేపు అక్కడక్కడా సత్యజిత్ రే దర్శకత్వ శైలి గుర్తుకొస్తుంది.

కథ: బాంబుల వర్షంతో కథ మొదలవుతుంది. అందులో ఒక ఇల్లు తునాతునకలవడం, నిప్పు అంటుకొని ఒక మహిళ బెమ్బేలెత్తిపోవడం, భయంతో ఓ బాలిక పరుగెత్తడం కనిపిస్తాయి. ఇవేవి లెక్క చేయకుండా పేలుళ్ళ మధ్యలోంచి ఒక ట్రక్ వెళ్లిపోతూ ఉండగా, కొద్ది దూరం వెళ్ళాక టైర్ దెబ్బతిన్నదేమో అన్న అనుమానంతో ట్రక్ఆపి చూస్తాడు డ్రైవర్. ఆ రోడ్డు పక్కనే ఎండిపోయిన పంటలోంచి తొంగిచూస్తాడు Bashu(వయసు దాదాపు పన్నెండేళ్ళు). పరుగెత్తుకుంటూ వచ్చి డ్రైవర్ కి తెలియకుండా ఆ ట్రక్ ఎక్కుతాడు. అది పగలు, రాత్రి ప్రయాణిస్తూనే ఉంటుంది. ఉదయం Bashu లేచి చూసే సరికి ఒక చోట ఆగి ఉంటుంది. ఆ కొత్త ప్రాంతాన్ని తెరిపార చూస్తుండగా మళ్ళీ బాంబు పెలిన శబ్ధం వినపడటంతో, భయపడి ట్రక్కు లోంచి దూకి పరుగెత్తుతాడు. అయితే అక్కడ యుద్ధం జరగటం లేదు. టన్నెల్ నిర్మాణంలో భాగంగా బాంబులు పేల్చుతుండటంతో, యుద్ధం ఇక్కడ కూడా జరుగుతుందేమో అనుకొని Bashu, ఆగకుండా పరుగెత్తుతూ, చెట్లలోంచి వెళుతూ చివరికి పంట పొలాల్లో పడి వెళ్ళిపోతాడు.

ఓ ఇద్దరు అన్నా చెల్లెల్లు తమ పొలంలో ఉన్న Bashu ని చూసి, తల్లి Naii తో చెప్తారు. మొదట్లో Naii, Bashu ని దూరంగా పెట్టినా తర్వాత జాలేసి చేరదీస్తుంది. Bashu కూడా Naii ని నమ్మడానికి కాస్త సమయం తీసుకుంటాడు. ఆ తర్వాత ఆ కుటుంబంలో ఒకడిగా కలిసిపోతాడు. కాని Bashu అసలు మాట్లాడకపోవడంతో అతను చెవిటి లేదా మూగవాడు అయివుంటాడు అనుకుంటారు. కాని ఒకనొక సందర్భంలో పిల్లల పుస్తకాలు కిందపడటంతో వాటిని తీసిస్తూ అక్కడ ఉన్నది చదవడంతో అతనికి Persian భాష మాట్లాడటం, చదవడం వచ్చునని తెలుస్తుంది. కాని Bashu మాట్లాడేది Arabic భాష కాగా, Naii మాట్లాడేది Gilaki భాష (మరో Iranian భాష). దాంతో ఇద్దరికీ మాట్లాడుకోవడం ఇబ్బందిగా మారుతుంది. అయితే ఆ మాటలతోనే Bashu ఇంటిమీద బాంబు పడటంతో అమ్మా, నాన్న, చెల్లి చనిపోయారని చెబుతాడు (సినిమా ప్రారంభంలో చూపించిన సన్నివేశాలు అవే).

ఊళ్ళో వాల్లందరూ  “Bashu ని చేరదీయవద్దు” అని Naii ఇంటికి వచ్చి పంచాయితీ పెట్టి మరీ సలహా ఇస్తారు. అందుకు అతని శరీర ఛాయ వాళ్ళలా తెల్లగా కాకుండా నల్లగా ఉండటం కూడా ఒక కారణం అవుతుంది. కాని Naii  అవేవి పట్టించుకోదు. తల్లిలా లాలిస్తుంది. Naii భర్త కుటుంబానికి దూరంగా ఉంటూ కాస్తో కూస్తో సంపాదిస్తూ ఉంటాడు. అతనికి ఉత్తరాల ద్వారా Bashu ఉంటున్న విషయం చెబుతుంది. అయితే అతని నుంచి స్పందన కరువవుతుంది.

పిల్లలతో ఒంటరిగా ఉంటున్న Naii కి భర్త నుండి ఎటువంటి ఆర్థిక సహకారం లభించకపోవడం, తనే ఒంటరిగా పొలం పనులు చూసుకుంటూ, సొంత డబ్బులతో కుటుంబాన్ని సాకడం ఇబ్బందిగా ఉన్నప్పటికీ Bashu ని ఆదరిస్తుంది. అటువంటి సమయంలో Bashu చేదోడు వాదోడుగా మారతాడు. కోళ్లు, గుడ్లు అమ్మటానికి వెళ్లినప్పుడు లెక్కల్లో దొర్లిన తప్పును చెప్పి Naii నష్టపోకుండా చూస్తాడు. అయితే ఎందుకనో Bashu అక్కడి నుండి పారిపోతాడు. సంత అయ్యాక కూడా చాలా సేపు వెతికి చివరికి ఇంటికి వస్తుంది Naii. విషయం తెలిసి మరునాడు ఊళ్ళో వాల్లందరూ మళ్ళీ ఆమె ఇంటికి వచ్చి తలో మాట అంటుండగా Bashu తిరిగి వస్తాడు.

Naii రోజు అర్థరాత్రి లేచి అడవి పంది పొలంలో పడి పంట నాశనం చేయకుండా శబ్దాలు చేస్తూ అది వెళ్ళాక వచ్చి పడుకుంటూ ఉంటుంది. దాంతో ఆవిడకు రోజు సగం నిద్రే అవుతుంది. దాంతో ఆమెకి జ్వరం వస్తుంది. ఆ సమయంలో వైద్యుడు కూడా ఊళ్ళో లేకపోవడంతో ఏం చేయలో తోచక బిగ్గరగా ఏడుస్తూ, డప్పు వాయిస్తూ ప్రార్థిస్తాడు Bashu. ఆమె కోలుకుంటుంది. అప్పటినుండి రాత్రుల్లు పొలం కాపు కాసే పనిని Bashu తన నెత్తిన వేసుకుంటాడు.

ఇలా రోజులు గడుస్తుండగా Naii భర్త దగ్గరి నుంచి ఉత్తరం వస్తుంది. మనకే తినడానికి తిండి లేనప్పుడు అతన్ని సాకడం దేనికి అని నిలదీస్తాడు. ఆ ఉత్తరం Bashu కంట పడకుండా దాచినప్పటికీ, దొంగతనంగా చదివిన Bashu  బాధతో మళ్ళీ ఇల్లు విడిచి వెళ్ళిపోతాడు. దూరంగా ఉన్న ఒక గుడిసేలోకి వెళ్ళిపోతాడు. ఈ సారి Naii ఊరుకోదు. జోరున వర్షం పడుతున్నా లెక్కచేయకుండా Bashu ని వెతికి పట్టుకొని కన్న తల్లిలా కోపంతో కొట్టుకుంటూ ఇంటికి తీసుకువస్తుంది. మరునాడు Bashuతో ఉత్తరం రాయిస్తూ, అతను ముమ్మటికీ ఇక్కడే ఉంటాడని చెబుతూ, “ఈ ఉత్తరం నా కొడుకు Bashu రాసింది” అని ముగించమంటుంది.

చివరికి Naii భర్త వస్తాడు. ఒక చేతిని పోగొట్టుకొని, డబ్బులేమి సంపదించుకు రాకుండా, ఉద్యోగం లేకుండా, ఒట్టి చేతులతో వస్తాడు. Naii  తో అతను ఎంతగా వాదించినప్పటికీ, ఆమె Bashu మాత్రం ఇక్కడే ఉంటాడని ఖరాఖండిగా చెబుతుంది. విషయం తెలుసుకున్న Bashu అక్కడికి వచ్చి, అతన్ని చూసి “ఎవరు ఇతను?” అంటాడు. “మీ నాన్నని” అని అతను సమాధానం ఇవ్వడంతో అతన్ని హత్తుకొని భోరున ఏడుస్తాడు Bashu. ఇంతలో అడవి పంది మళ్ళీ పంటపొలాల్లోకి వచ్చిన శబ్ధం రావడంతో చిన్న పిల్లలతో సహా ఆ కుటుంబం మొత్తం దాన్ని తరమడానికి అరుస్తూ పరుగెత్తుకుంటూ వెళతారు. ఆ సన్నివేశంతో సినిమా ముగుస్తుంది.


కొసమెరుపు(లు):
  • కథనంలో Bashu తల్లితండ్రులు చనిపోయినప్పటికీ ఆత్మ రూపంలో అతని వెంటే ఉన్నారు అన్న విషయాన్ని సిమ్బాలిక్ గా దర్శకుడు చెప్పే తీరు బాగుంటుంది.
  • సినిమాలో అసలు నేపథ్య సంగీతం వాడలేదు. అదైతే నిజంగా సహాసమే!! ఒక మూడు నాలుగు సన్నివేశాల్లో సంగీతం వినిపించినా అది సందర్భానుసారమే! ఆయా సందర్భాల్లో అక్కడ పాత్రధారులు నిజంగా ఆ సన్నివేశాల్లో ఆయా పరికరాలను వాయించడం వల్ల వచ్చిన సంగీతమే అది. నూటికి నూరు శాతం నేపథ్య సంగీతం లేకపోవడంతో ఒక కళాత్మక డాక్యుమెంటరీ చూసిన భావన కలుగుతుంది.
  • సినిమా ఇలా తీయాలి అన్న నియమాలేవి పాటించకుండా తీసిన సినిమాగా దీన్ని చెప్పవచ్చు.
  • ఇదే సినిమాని కమర్షియల్ సినిమాలు తీసే మనవాళ్ళకు ఇస్తే ఈ 120 నిమిషాల నిడివిని 30 నిమిషాలకు క్షణాల్లో మర్చేయిస్తారు. ఈ సినిమా దర్శకుడు  Bahram Beizai ఏమనుకున్నాడో తెలీదు కాని అతని సినిమని అతనే ఎడిట్ చేసుకున్నాడు.
  • ఈ సినిమా చూస్తున్నంత సేపు ఇది ఇరానియన్ సినిమా అన్న సంగతి దాదాపు మర్చిపోతాం, అందుకు కారణం సినిమాలో కనిపించే విసుర్రాయి, వరి పంట, డప్పు, వేణువు, సంత, దేశీ కోళ్లు, వెల్లుల్లి, మనుషుల మనస్తత్వాలు మనకు చాలా దగ్గరగా ఉండటమే!

Bashu, the Little Stranger సినిమాని ఇక్కడ చూడండి:
మొదటి భాగం:

రెండవ భాగం:

(ఈ సినిమాని అధికారికంగా యూట్యూబ్ లో పెట్టినట్టు కనిపించడం లేదు, ఏ క్షణమైనా తొలగించే అవకాశం ఉంది)


A Separation (2011) {Persian: جدایی نادر از سیمین‎‎ } సినిమా పరిచయం

Best Foreign Language Film కేటగిరిలో అకాడమీ అవార్డ్(2011)తో సహా మొత్తం 47 అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న సినిమా A Separation(2011). About Elly తరువాత Asghar Farhadi దర్శకత్వంలో వచ్చిన మరో ఆణిముత్యం ఈ చిత్రం.

కథ: ఒక జంట విడాకులు కావాలని జడ్జ్ ముందుకు వాదనలు వినిపించేందుకు రావడంతో కథ మొదలవుతుంది. Simin తమ దేశం (Iran)ను భర్త, కూతురు(11ఏళ్ళు)తో వదిలి వేల్లాలనుకుంటుంది. కాని అందుకు ఆమె భర్త Nader అంగీకరించడు. కారణం అల్జీమర్ వ్యాధితో పోరాడుతున్న అరవైయేళ్ళ అతని తండ్రి. సహేతుకమైన కారణాలు లేనందున విడాకుల అర్జీని కోర్టు కొట్టివేస్తుంది. దాంతో Simin ఆ ఇంటిని వదిలి అమ్మ దగ్గరికి వెళ్తుంది. కూతురు Termeh మాత్రం తండ్రి వద్దే ఉంటానంటుంది. అయితే భార్య సలహా మేరకు తను బ్యాంకులో ఉద్యోగానికి వెళ్ళిన తరువాత తన తండ్రిని చూసుకునేందుకు ఒక ఆవిడ(Razieh )ని నియమిస్తాడు Nader. అక్కడి సంప్రదాయం ప్రకారం భర్త అనుమతి తీసుకోవాల్సి ఉన్నా ఆమె తీసుకోకుండా వచ్చేస్తుంది, అందుకు కారణం పేదరికం మరియు భర్త నాలుగు నెలలుగా ఉద్యోగం లేకుండా ఉండటం. ఒకవేళ అడిగినప్పటికీ ఆమె భర్త ఒప్పుకునే రకం కాకపోవడం, పైగా అతనికి క్షణాల్లోనే విపరీతమైన కోపం రావడం వంటి ఇబ్బందులతో అతనికి చెప్పకుండా తన ఐదేళ్ళ కూతురిని వెంటబెట్టుకొని వస్తుంది. అయితే ఒక రోజు పనికే విపరీతంగా అలసిపోయి మరునాడు రాను అని చెబుతుంది. ఒక వేళ మా ఆయన వస్తానంటే పంపిస్తాను అని చెబుతుంది. ఆమె భర్త కూడా Nader పనిచేసే బ్యాంకుకు వెళ్లి మాట్లాడతాడు. కానీ మరునాడు అతను రాకుండా ఆమే వస్తుంది.

ఒకరోజు Nader వచ్చే సరికి తండ్రి మంచం పక్కన నేల మీద పడిపోయి కనిపిస్తాడు. అతని చేయి మంచానికి కట్టివేసి ఉంటుంది. ఓ పది నిముషాలు ఆలస్యమైతే అతను చనిపోయేవాడే. కాసేపటికి Razieh వస్తుంది. ఆమెని ఇంట్లోంచి వెళ్లి పొమ్మంటాడు. ఆమె వినకపోవడంతో నెట్టేస్తాడు. మెట్లపై పడిపోతుంది ఆవిడ.

మరునాడు ఉదయం ఆవిడ నాలుగు నెలల గర్భిణి అని, నిన్న జరిగిన సంఘటనలో ఆమె గర్భం కోల్పోయిందని తెలిసి పరామర్శించేందుకు Simin & Nader కలిసి ఆసుపత్రికి వెళతారు. అసలు భార్య పనికి వెళ్తోంది అని తెలియని Razieh భర్త, అప్పటివరకు ఒక ఆక్సిడెంట్ లో గర్భం పోయిందనుకున్న అతనికి అసలు కారణం Nader అని తెలుసుకొని కోపంతో ఊగిపోయి అతన్ని కొడతాడు. పెనుగులాటలో Simin ముక్కుకి కూడా బలమైన దెబ్బ తగులుతుంది.

ఆ తర్వాత న్యాయం కోసం కేసు వేస్తాడు Razieh భర్త. కోర్టులో వాదనలు మొదలవుతాయి. అసలు ఆమె గర్భవతి అన్న విషయం తనకు తెలియదని అంటాడు Nader.  ఆ తరువాతి వాదనలో Termeh తండ్రి వాదనకు అబద్ధపు సాక్ష్యం చెబుతుంది. తర్వాత Termeh పదే పదే అడగడంతో ఆమె గర్భవతి అని తెలుసు కాని ఆ క్షణంలో గుర్తురాలేదని వివరిస్తాడు.

ఒక దశలో Simin భర్తతో కలిసి ఉండేందుకు వస్తుంది కాని భార్యాభర్తల మధ్య వాదనలు పెరగడంతో కూతురిని కూడా తనతో పాటు తీసుకొని మళ్ళీ అమ్మ వద్దకు వెళ్తుంది. అంతకు ముందు తల్లి వెళ్ళిపోయినా, Termeh తండ్రి వద్దే ఉండటానికి కారణం తన కోసమైనా అమ్మ దేశం విడిచి వెళ్ళదు అని. కాని కోర్టులో తండ్రి అబద్ధపు వాదనతో తల్లితో కలిసి వెళ్ళిపోతుంది.

Razieh భర్త, Termeh స్కూలు వద్ద కనిపిస్తుండటం, అంతకు మునుపు ఇదే కేసు విషయంలో Termeh టీచర్ ని బెదిరించడంతో భయపడిన తల్లి Simin అతనితో మాట్లాడి కొంత డబ్బుతో ఒప్పందం చేసుకొని కేసు ఉపసంహరించుకునేందుకు ఒప్పిస్తుంది. భర్త Nader కి కూడా ఎలాగోలా ఒప్పిస్తుంది. పెద్దల సమక్షంలో చెక్కులు ఇచ్చే ముందు ఒక్క సారి ఖురాన్ మీద ఒట్టేసి ఆమె గర్భం పోవడానికి తనే కారణం అని చెప్పాల్సిందిగా Nader, Raziehని కోరతాడు. అయితే అంతకు ముందు రోజే తన గర్భం పోవడానికి కారణం మీ భర్త కాదు అని, దానికన్నా ఒకరోజు ముందు కారు డీకొట్టడం అసలు కారణం అని, నా కూతురుకి ఏమైనా అవుతుందేమో అన్న భయంతో నిజం చెప్పేస్తున్నానని, మీ డబ్బు కూడా వద్దు అని Razieh, Siminతో చెబుతుంది. ఈ విషయాలేవీ తెలియని Nader తన కూతురి ముందు దోషిగా నిలబడలేక ఖురాన్ మీద ఒట్టు వేయమనడంతో Razieh భర్త ఆగ్రహంతో బయటకి వెళ్ళిపోతాడు, వెళ్తూ వెళ్తూ Nader కారు అద్దాలు ద్వంసం చేసి వెళతాడు. ఆ కేసు అంతటితో ముగుస్తుంది.

Simin & Nader విడాకుల కేసు మళ్ళీ వస్తుంది. తల్లితండ్రుల్లో ఎవరివద్ద ఉంటావు అని జడ్జి Termehని అడుగుతాడు. తను ఎవరి వద్ద ఉండాలో నిర్ణయించుకున్నాను అని జడ్జితో చెబుతుంది కాని అది ఎవరు అని చెప్పలేక రోదిస్తుంది. జడ్జి వాళ్ళిద్దరిని బయటకు వెళ్ళమంటాడు.

Simin & Nader జడ్జి గది బయట ఎదురెదురుగా, ఒక గ్లాస్ తలుపుకి అటుఇటుగా కూర్చుంటారు. వాళ్ళిద్దరినీ ఆ గ్లాస్ విడదీసి ఉంచుతుంది. Termeh కోసం వాళ్ళు ఎదురుచూస్తూ ఉంటారు. సినిమా అక్కడికే అయిపోతుంది. Termeh నిర్ణయం మన ఊహకే వదిలేశాడు దర్శకుడు.

కొసమెరుపు: Asghar Farhadi కూతురు Sarina Farhadi, Termeh పాత్రలో చాలా అద్భుతంగా సహజసిద్ధంగా నటించింది.

A Separation సినిమా ట్రైలర్ ఇక్కడ చూడండి:


About Elly (2009) {Persian: درباره الی‎‎} సినిమా పరిచయం

About Elly (2009) సైకలాజికల్ డ్రామా లో సాగే ఇరాన్ సినిమా. మధ్యతరగతి జీవితాల మానసిక స్థితిగతులపై అద్భుతంగా పరిశోధన చేసినట్టు ఉండే కథ, కథనం ఈ సినిమాకి ఆయువుపట్టు. సినిమాలా కాకుండా నిజంగా జరుగుతున్న భావనను మనలో రేకెత్తించిన దర్శకుడి (Asghar Farhadi) ప్రతిభకి బెర్లిన్ ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో Silver Bear for Best Director అవార్డు దక్కింది. ఇతర అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో దాదాపు 10 అవార్డులని దక్కించుకోవడమే కాకుండా 82వ అకాడమీ అవార్డులకి, Foreign Film section లో, ఇరాన్ తరఫున అధికారికంగా పంపబడిందీ చిత్రం. అందరూ బాగా నటించినా ముఖ్య భూమిక పోషించిన Golshifteh Farahani నటన మెస్మరైజ్ చేస్తుంది. సినిమాటోగ్రఫీ ఫీల్ ని నిలబెట్టేలా సాగుతూ ఉంటుంది.

కథ: మూడురోజుల విహారయాత్రకు ఎనిమిది మంది పెద్దలు, వారి పిల్లలతో సహా Caspian Sea కి రావడంతో కథ మొదలవుతుంది. వీళ్ళంతా లా యూనివర్సిటి పూర్వ విద్యార్థులు. Sepideh & Amir జంటకి ఒక కూతురు(సుమారుగా ఆరేళ్ళు). Shohreh & Peyman జంటకి ఒక బాబు (Arash)(సుమారుగా  ఐదేళ్ళు) & ఒక పాప (సుమారుగా మూడేళ్ళు). Nazy & Manuchehr మూడో జంట. Sepideh కూతురి టీచరైన Ellyని, Ahmadకి పరిచయం చేసేందుకు Sepideh ఆహ్వానిస్తుంది. Ahmad భార్యకు విడాకులిచ్చి ఒంటరిగా జర్మనీలో ఉంటున్నాడు.

Sepideh ముందుగా బుక్ చేసిన మాన్షన్ కు, ఆ యజమానులు తరువాతి రోజు వస్తుండటంతో ఒక్క రాత్రి కొరకైతేనే ఇస్తాను అని ఆ మాన్షన్ ను చూసుకునే ఆవిడ అనడంతో, కొత్తగా పెళ్ళైన జంట వచ్చారని, ఇది వాళ్ళకు హనీమూన్ అని అబద్ధం ఆడడంతో బీచ్ కు దగ్గరగా ఉన్న మరో విల్లాను ఇవ్వడానికి ఒప్పుకుంటుంది. విల్లా ఉన్న ప్రాంతంలో సెల్ ఫోన్ సిగ్నల్స్ లేకపోవడంతో ఫోన్స్ చేసుకోవడానికి ఈమె వద్దకే రావాల్సి ఉంటుంది. అయితే Sepideh అబద్ధం ఆడటానికి మరో కారణం, పెళ్లవ్వని జంట ఇరాన్ చట్టం ప్రకారం కలిసి ప్రయాణం చేయడం నిషిద్ధం అవడం.

విల్లా చాలా రోజులుగా వాడకుండా ఉండటం వల్ల దుమ్ము పట్టి ఉంటుంది. తలో చెయ్యి వేసి శుభ్రం చేసుకుంటారు. Elly సంకోచిస్తూనే మెల్లి మెల్లిగా Ahmad పట్ల ఆకర్షితురాలు అవుతుంది, అలాగే Ahmad కూడా. అయితే Elly ఇంట్లో తన విహారయాత్ర గురించి చెప్పకుండా, సహోద్యోగులతో కలిసి సముద్రం వైపు ఉన్న రిసార్ట్ కి వచ్చానని, మరునాడు ఉదయం Tehranకి అనుకున్నట్టుగానే వెళ్ళిపోతానని చెబుతుంది. తన తల్లికి గుండె ఆపరేషన్ జరిగి పక్షం రోజులు కూడా కాలేదని, అందుకే అలా చెప్పానని Ahmadకు
సమాధానం ఇస్తుంది. Sepidehకు Elly వెళ్ళడం ఇష్టం లేక ఆమె లగేజ్ ని దాచేస్తుంది. మాతో పాటు వెళ్ళొచ్చు అని బలవంత పెడుతుంది. Elly అయిష్టంగానే ఒప్పుకుంటుంది. మగాళ్ళంతా వాలీబాల్ ఆడుతూ ఉండగా, Sepideh & Shohreh సామాను తీసుకురావడానికి బజారుకు వెళ్తూ, బీచ్ లో ఆడుకుంటున్న పిల్లల్ని చూస్తుండమని Nazyకి పురమాయిస్తారు. కాసేపయ్యాక అక్కడే మెట్లపై కూర్చున్న Ellyని పిల్లల్ని చూడమని చెప్పి, క్లీన్ చేయడానికి లోపలి వెళ్తుంది
Nazy. Arash సముద్రపు నీళ్ళల్లో ఆడుకుంటూ ఉండగా, మిగితా ఇద్దరు పిల్లలు పతంగిని ఎగరేయలేక పోతుండడంతో Elly పరుగెత్తుకుంటూ ఎగరేస్తూ వాళ్ళని ఆడిస్తుంది. కాసేపయ్యాక ఆ ఇద్దరు పిల్లలు తండ్రుల వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చి Arash నీళ్ళలో కొట్టుకుపోయాడని కంగారుగా చెబుతారు. మగాళ్ళంతా వెళ్లి సముద్రంలో దూకి వెతకగా వెతకగా నీళ్ళలో తేలియాడుతున్న Arash కనిపిస్తాడు. ఒడ్డుకు తీసుకొస్తారు. కాసేపటికి నీళ్ళు కక్కుతూ Arash లేచి కూర్చోవడంతో అంతా ఊపిరి పీల్చుకుంటారు. కాస్త స్థిమిత పడ్డాక Elly కనిపించడం లేదని గుర్తిస్తారు. అయితే Elly, Arashని రక్షించే ప్రయత్నంలో సముద్రంలో కొట్టుకు వెళ్ళిందా? లేక ఎవరికీ చెప్పకుండా Tehranకి
వెళ్లిపోయిందా? అనేది ప్రశ్నగానే మిగిలిపోతుంది. పోలీసులకి సమాచారం ఇస్తారు, ఒక టీం సముద్రంలో గాలిస్తుంది కానీ దొరక్కపోవడంతో, ఒక వేళ నిజంగా సముద్రంలో కొట్టుకొని వెళ్ళిపోతే, మరునాడు ఉదయం తీరానికి శవం కొట్టుకు వస్తుంది అని, చెప్పి వెళ్ళిపోతారు. ఈ పరిస్థితికి కారణం నువ్వంటే నువ్వు అని ఒకరి పై ఒకరు నిందలు వేసుకుంటారు. ఈ క్రమంలో Elly కొన్ని అబద్ధాలు చెప్పిందని తెలుస్తుంది. Sepideh కూడా Elly విషయాలు కొన్ని దాచిపెట్టిందని తెలుస్తుంది. ఒక దశలో Elly క్యారెక్టర్ పై అనుమానం కలుగుతుంది. Sepideh దాచిపెట్టిన Elly బ్యాగ్ లోంచి సెల్ ఫోన్ తీసి వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి ఆమె వచ్చిందేమో అని కనుక్కోగా ఆమె అన్నయ్య సమాధానం ఇచ్చాడని Ahmad
చెబుతాడు. అతను అన్నయ్య కాదని, కాబోయే భర్త Ali Reza అని Sepideh చెబుతుంది. మూడేళ్ళ కిందటే వాళ్ళకి వివాహం నిశ్చయమైందని, కాని ఆ పెళ్లి అంటే ఇష్టం లేదని, ఆ విషయం అతనికి చెప్పిన తనని వదిలి పెట్టటం లేదని, అందుకే Ahmadను కలిసేందుకు వచ్చిందని, Sepideh చెప్పడంతో అందరూ షాక్ అవుతారు, ఎందుకంటే ఆ విషయాలు Sepideh కు తప్ప ఎవరికీ తెలియవు.

Elly కి కాబోయే భర్త Ali Reza రావడం, అతను వచ్చాక వీళ్ళంతా ఎంత మేనేజ్ చేసినా చివరికి విల్లా ఇచ్చిన ఆవిడ వద్దకు, ఫోన్ చేసుకోవడానికి వచ్చిన Ali Reza తో మాటలమధ్యలో కొత్త పెళ్ళికూతురు అంటూ మాట్లాడటంతో విషయం మొత్తం అర్థమై Ahmadని కొడతాడు. అప్పటికే Sepideh ఒక నిర్ణయానికి వచ్చేస్తుంది. బతికుందో లేదో తెలియని Elly క్యారెక్టర్ ని, స్వార్థ స్వప్రయోజనాల కోసం చంపలేను అని చెప్పేసి అతనితో పూర్తిగా నిజం చెప్పేస్తానని అందరితో చెబుతుంది. కాని Ali Reza ఆ విషయాలేవీ అడగడు, ఒకే ఒక్క ప్రశ్న అడుగుతాడు. “మీరు ఇక్కడికి మీ ఫ్రెండ్ ని
కలవడానికి రమ్మన్నప్పుడు తను ఏమి అనలేదా? రాను అని కాని, నాకో ఫియన్సే ఉన్నాడని కాని, ఇంకేదైనా కాని చెప్పిందా?” అని హృద్యంగా అడుగుతాడు. దానికి ముందు Elly గురించి కాస్త చెబుతాను అని Sepideh అనబోతుంటే వద్దని వారించి యస్ ఆర్ నో అని మాత్రమే చెప్పమంటాడు. Sepideh “నో, నా ప్రతిపాదనని తను తిరస్కరించలేదు” అని చెప్పగానే అతనిలోని మూడేళ్ళ ఆ భగ్న ప్రేమికుడు ఆ క్షణంలోనే మరణిస్తాడు. జరిగిన సంఘటనలకి Sepideh  కుమిలి
కుమిలి ఏడుస్తుంది. ఇంతలో Elly శవం దొరికిందని, గుర్తించడానికి రమ్మన్నారని అనడంతో అక్కడికి వెళ్ళిన Ali Reza ఆమె శవం చూసి విలపిస్తాడు. తిరిగి వెళ్తుండగా Ahmad తలదించుకొని కనిపిస్తాడు. “Elly మరణించిన విషయం వాళ్ళింట్లో మీరు చెబుతారా?” అని Ali Reza ని వాళ్ళు అడగ్గా, అతను “మీరే చెప్పండి” అంటాడు. దానికి “మీరు చెబితేనే బాగుంటుంది” అని అనడంతో, “సగం చచ్చిపోయి ఉన్న నాపై మోయలేని భారం వేసి పూర్తిగా చంపేస్తారా” అన్నట్టుగా వాళ్ళవైపు చూసి వెళ్ళిపోతాడు. వెళ్తూ వెళ్తూ Elly బ్యాగ్ ని ఆమె జ్జ్ఞాపకాలుగా తీసుకొని వెళ్తాడు.  Sepideh ఇంకా అలాగే కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. మిగితా వారంతా బీచ్ లో ఇరుక్కుపోయిన కార్ ను లాగేందుకు ప్రయత్నిస్తుంటారు.

సినిమా అంతా అయ్యాక Ali Reza పై మనకు జాలి కలుగుతుంది. Elly నిలకడలేని మనస్తత్వంపై బాధ వేస్తుంది. మిగితా ఏడుగురి ప్రవర్తనకు కోపం వస్తుంది.

మనిషిలోని స్వార్థం, నిజాయితీల మధ్య ఘర్షణని అత్యద్భుతంగా చూపించారు దర్శకులు. అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు మనిషి సేఫ్ జోన్ లో ఉండటానికి పడే తాపత్రయం, తప్పుల్ని ఇతరులపైకి నెట్టివేసే స్వార్థం, చివరికి నిజాయితీగా అంగీకరించే మానవత్వం ఇవే సినిమాని శిఖరాగ్రం పై నిలబెట్టాయి.

ఏడు పాత్రల స్వభావాల్ని డిజైన్ చేసుకున్న తీరు గొప్పగా ఉంటుంది. వేటికవే భిన్నంగా ఉండటం, ప్రవర్తించడం అత్యద్భుతం.
Sepideh: అందరిలో తొందరగా కలిసిపోయే మనస్తత్వం. సమస్య వచ్చినప్పుడు అందరికన్నా ముందుండే నాయకత్వ లక్షణాలు కలిగి సమస్య నుండి పారిపోకుండా పోరాడే తత్త్వం.
Amir: కోపం వస్తే అగ్ని పర్వతంలా బద్దలవడం లేదా సైలెంట్ అయిపోయి దూరంగా వెళ్లి నిల్చోవడం.
Shohreh: తనదాక వస్తే ఎంతటికైనా తెగించే ధీరగుణం.
Peyman: సమస్యని లోతుగా విశ్లేషించి, తప్పు మనదా కాదా అని శోధించి, మనది కాదు అని తెలిపేందుకు ప్రయత్నించడం.
Nazy: సమస్య వస్తే భయపడిపోవడం. 
Manuchehr: నొప్పివ్వక తానొవ్వక అనే మనస్తత్వం.

Ahmad: ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండే మనస్తత్వం.

About Elly సినిమా ట్రైలర్ ఇక్కడ చూడండి:

The Jungle Book (2016) Vs The Jungle Book(1967)




డిస్నీ వారి The Jungle Book (2016)  సినిమా అద్భుతం.. 1967లో వచ్చిన The Jungle Book సినిమాకి ఇది రిమేక్ అయినప్పటికీ కథ, స్క్రీన్ ప్లే తో పాటు మరికొన్ని కొన్ని తేడాలని గమనించాను.. అవేంటంటే..








1) 
The Jungle Book (1967) : ఈ సినిమా “The Jungle Book” అనే టైటిల్ గల ఒక పుస్తకం తెరుచుకొని పేజీలు  తిరగేసినట్టు మొదలవుతుంది.






The Jungle Book (2016) : ఈ సినిమా టైటిల్ సరాసరి జంగిల్ లోనే మొదలవుతుంది.




2) 
TJB(1967): ఇక్కడ మోగ్లీ, భగీరా(బ్లాక్ పాంథర్)కి దొరికేటప్పటికి అతను కేవలం నెలల బాలుడు.








TJB(2016): ఇక్కడ మోగ్లీ, చిన్నవాడే అయినప్పటికీ తనకు తానుగా నడిచేంత పెద్దవాడు.







3) 
1967: ఒక నదీ తీరం వెంబడి, ఒక పడవ గుద్దుకొని పాడైపోయి ఉండగా, అందులో ఒక బుట్టలో ఉన్న మోగ్లీ భగీరాకి దొరుకుతాడు.

2016: మోగ్లీ నాన్నని షేర్ ఖాన్(బెంగాల్ టైగర్) చంపేసి వెళ్ళిపోతుంది. మోగ్లీని గమనించక పోవడం వల్ల అతను ప్రాణాలతో బయటపడి, భగీరా కంట పడటం వల్ల అతనికి దొరుకుతాడు.



4) 
1967: ఇది కార్టూన్/ఆనిమేటెడ్ సినిమా, కావున సినిమా మొత్తం కామెడీ కోణంలోనే సాగింది.

2016: ఇది లైవ్ ఆక్షన్ ఆనిమేటెడ్ సినిమా - కల్పిత సాహస గాథల సాగింది.




5) 
1967: కా (పైతాన్) మోగ్లీని తినేందుకు రెండు సార్లు ప్రయత్నిస్తుంది, తన కళ్ళతో హిప్నటైస్ చేసి!






2016: కా మోగ్లీని తినేందుకు ఒకే సారి ప్రయత్నిస్తుంది, అప్పుడు హిప్నాటైస్ చేస్తున్న క్రమంలోనే అతను భగీరాకి ఎలా దొరికాడో చెబుతుంది.
(స్క్రీన్ ప్లే పరంగా ఈ మార్పు నాకు బాగా నచ్చింది)







6) 
1967: కోతులు కూడా మిగితా జంతువుల్లా మాట్లాడుతాయి. కింగ్ లూయి (రాజు కోతి) మిగితా కోతులకన్నా కాస్త పెద్ద సైజు శరీరం మాత్రమే కలిగి ఉంటుంది.






2016: కింగ్ లూయి మాత్రమే మాట్లాడగలుగుతుంది, మిగితా కోతులకి భాష రాదు. పైగా కింగ్ లూయి, కింగ్ కాంగ్ సైజులో చాలా పెద్దగా ఉంటుంది. 





7)
1967: పాటలు ఎక్కువ

2016: పాటలు తక్కువ



8) 
1967: మోగ్లీ చిన్నపిల్లాడు & అతని చేష్టలు, మనస్తత్వం చిన్నపిల్లడిలానే ఉంటాయి.

2016: మోగ్లీ చిన్నవాడైనా, 1967 మోగ్లీ తో పోలిస్తే రెండు మూడేళ్ళు పెద్దవాడిలా ఉంటాడు. పైగా ఇక్కడ మోగ్లీ తెలివైనవాడు, అతనంత అమాయకుడు కాదు.



9) 
1967: షేర్ ఖాన్, అకేలా(వోల్ఫ్) ని చంపడు. మోగ్లీ నాన్నకి కూడా చంపడు. అసలు మోగ్లీ నాన్నని చూపించరు.

2016: షేర్ ఖాన్, అకేలాని & మోగ్లీ నాన్నని చంపుతాడు. మోగ్లీ నాన్నని చూపిస్తారు కూడా. 




10) 
1967: షేర్ ఖాన్ పాత్ర సినిమా మధ్యలో నుండి మొదలవుతుంది. రెండు మూడు సార్లు మోగ్లీని నేరుగా హెచ్చరిస్తాడు.

2016: షేర్ ఖాన్ పాత్ర సినిమా మొదలైనప్పటి నుండి కనపడుతుంది. క్లైమాక్స్ లో మాత్రమే మోగ్లీ తో షేర్ ఖాన్ నేరుగా మాట్లాడతాడు.



11) 
1967: కరువు రావటం కాని, జంతువులన్నీ ఒకే చోటుకి వచ్చి నీళ్ళు తాగటం కాని, పీస్ రాక్ కాని ఉండవు.

2016: అవన్నీ ఉంటాయి.






12) 
1967: ఏనుగులన్నీ మార్చ్ ఫాస్ట్ లా నడుస్తాయి. అవి మాట్లాడుకుంటాయి. చిన్న ఏనుగుకి ఎటువంటి అపాయం రాదు.






2016: ఏనుగులకు ఎనలేని గౌరవం ఇస్తారు. అవి అసలు మాట్లాడవు. చిన్న ఏనుగుకి అపాయం ఎదురైతే మోగ్లీ వెళ్లి రక్షిస్తాడు. 






13) 

1967: భాలూ(బియర్) తేనె తినడు.

2016: భాలూకి తేనె అంటే చాలా ఇష్టం, అది పొందడం కోసం మోగ్లీ సహాయం తీసుకుంటాడు, మోగ్లీ తన మానవ మేధస్సుని ఉపయోగించి సులువుగా తేనె తీస్తాడు.



14) 
1967: చివర్లో ఆకాశం నుండి పిడుగు పడి, చెట్టు కాలి, నిప్పు పుడుతుంది.

2016: మోగ్లీ ఊరికి వెళ్లి నిప్పును తీసుకువస్తాడు.




15)
1967: మోగ్లీ కాలుతున్న చెట్టు కొమ్మను, షేర్ ఖాన్ తోకకి కట్టడంతో అది భయపడి పారిపోతుంది.

2016: నిప్పుని జంగిల్ కి తీసుకువస్తున్న క్రమంలో అది కిందపడి మంటలు మెల్లిగా వ్యాపిస్తాయి. మోగ్లీ తెలివిగా షేర్ ఖాన్ ని ఆ మంటల్లో పడేలా చేసి చచ్చేలా చేస్తాడు. ఆ మంటల్ని ఏనుగులు ఆర్పి కృతజ్ఞతను చూపిస్తాయి. 


16) 
1967: చివరగా మోగ్లీ తన ఈడు ఉన్న పాపతో మాట్లాడుకుంటూ ఊరిలోకి వెళ్ళిపోయినట్టుగా మిగించారు. దాంతో భాలు & భగీరా వాళ్ళ బాధ్యత తీరినట్టు పాట పాడుకుంటూ జంగిల్ లోకి వెళ్ళిపోతారు.

2016: మోగ్లీ జంగిల్ కి తిరిగి వచ్చి అక్కడే ఉన్నట్టుగా ముగించారు.
(1967 అనగా దాదాపు యాభై సంవత్సరాల క్రితం అప్పటి రచయితలు, దర్శకులు మోగ్లీ ఊరిలో ఉండటమే సమంజసం అని భావించారు. కాని 2016 వచ్చే సరికి మనిషి క్రూర మృగాలకన్నా దారుణంగా తయారయ్యాడు కాబట్టి అతను జంగిల్ లో ఉండటమే కరెక్ట్ అని భావించి ఉంటారు.)

17) 
1967: జంగిల్ లోనే సినిమా పూర్తవుతుంది అంటే The End టైటిల్ పడుతుంది (మొదలు మాత్రం “The Jungle Book” అన్న ఒక పుస్తకం పేజీలు  తిరగేసినట్టు మొదలయ్యింది)

2016: “The Jungle Book” అన్న పుస్తకం చివరి పేజి పూర్తయినట్టు ముగిసాక, The End టైటిల్ పడుతుంది (మొదలు మాత్రం నేరుగా జంగిల్ లోనే మొదలవుతుంది, పుస్తకం పేజీలు  తిరగేసినట్టు మొదలు కాదు – అదే విచిత్రం)

వీలయితే The Jungle Book(1967) సినిమా చూడండి – హాయిగా ఉంటుంది.

- అరుణ్ కుమార్ ఆలూరి