అమ్మ ఇంటి ముంగటున్న సౌతరి మీద కూసొని మల్లా ఓల్లకో ఫోన్ జేశింది, స్పీకర్ చాల్ జేస్కొని. "యాడైతదక్క, నాకే శిన్న బాదైతలేదు. ఆకు సక్కగస్తలేదు. దొడ్డు, ముక్క ముక్క అస్తున్నది. మల్ల అవి జోకెటప్పుడు ఆ ముండకొడుకు దండె కొడ్తున్నడు, అజార్ బీడీలకు ఐదునూర్లే ఎల్తున్నయి. బయట దొర్కక ఆడి దగ్గర్నే వంద వెట్టి కొనుడైతున్నది" అని ఫోన్లకెంచి మాటలు ఇన్పిచ్చినయి.
"అయ్.. గా ఆకుకు వందనా? యే కంపిన్ల లేదిట్ల. లవ్ కడ్లు జమైండ్రు ఈ దాదలు"
అనుకుంట తోడెంసేపు మాట్లాడి ఫోన్ పెట్టేశింది.
ఈ ఐదు రోజులల్ల ఇది పదోసారో ఇర్వయోసారో, తనతోటి కార్కాన్ల పన్జేస్తున్న ఓల్లకో ఒకల్లకు ఫోన్ జేశి అడగుడవట్టి! కారణం
తెల్వదిగని, ఎవ్వలు గుడ ముందటికస్తలేరు.
అమ్మ దగ్గరికివొయి, “అమ్మా, ఇడ్సవెట్టు! ఈ
పరిస్తితులల్ల ఈ నెత్తినొప్పి ఎందుకు వెట్టుకునుడు. అన్ని మనం అనుకున్నట్టు ఐతయా?” అని, బుడ్డదానికి ఎండ తగ్లాల అని అమ్మ పక్కకు కూసున్న.
అమ్మ సప్పుడు జెయ్యలేదు, చేతికున్న పట్టిని సూస్కుంట సోంచాయిస్తున్నది. ఇంకో రెండేండ్లు ఐనంక రాజీనామ
వెడ్తె, నెలకు కమస్కం మూడెయిల
పెన్శన్ అస్తదట, అదే ఇప్పుడు వెడ్తె పగ్నాలు
వందలు అస్తున్నదట. దీని ఎన్క ఉన్నలెక్కలు నాకు, అమ్మకు గుడ తెల్వయి. బీడీల రేటు, పెన్శను ఎక్కజెయ్యాలని కంపినిని గట్టిగ అడుగుతున్నరట యూనియన్
లీడర్లు. అయ్యి పెరిగితె రాజీనామ వెట్టొచ్చని సూస్తున్నది.
ఇంతట్లనే మామ ఎంబట అత్త బయటకు అచ్చి, బుడ్డదాన్ని సూస్కుంట, “ఓయ్, ఏం జేత్తున్నవ్? పొలంకు వొయత్తం. మంచిగ ఆడుకో” అని చెప్పి ఉరుక్కుంట వొయి మామను అందుకున్నది.
ఆళ్లు పొయిన దిక్కు సూస్కుంట, “నేను బీడీల్ జేసుడు మొదలువెట్టినప్పుడు తొమ్మిదేండ్లు ఉండె. అప్పుడు అజార్ బీడీలకు
నాల్గు రూపాల్ ఇస్తుండె. అర్తాల్లు జేశి, కార్కాన్లు బందు వెట్టి, రోడ్ల మీదికెక్కి కొట్లాడుకుంట ఉంటె పెంచుకుంట అచ్చిండ్రు.
ఇప్పుడు రెన్నూర్లయ్యింది” అన్నది అమ్మ. అప్పుడే అంత కష్టవడ్డప్పుడు, ఇప్పుడెట్ల ఇడ్సవెడ్తది అన్పిచ్చింది.
***
ఇంటిమైశవ్వకు దీపాలు ముట్టిస్తుండంగ అత్తామామ అచ్చిండ్రు, చేతుల రవాట పట్టుకొని, ఏటికాల్వలకెంచి పొలాలకు కొట్టుకచ్చిందట. మేం పొయి దగ్గరుంటె మామ బుడ్డదాని
పక్కకు కుసుంటడు, సన్నం చెద్దరి దాని కాళ్ల
మీద ఏస్తడు, అదేమొ దాన్ని తండేసుకుంట నగుతది. తినేటిదాక అదొక ఆట ఆళ్లకు.
రాత్రికి బుడ్డదాని బాపు వీడియో కాల్ చేశిండు. బిడ్డెతోని కొంచెం సేపు ముచ్చట
వెట్టి, మల్లా పొద్దున లెవ్వాల అని
పెట్టేశిండు. ఇప్పుడంటె ఇంత సౌలత్ ఉన్నదిగని, శిన్నప్పుడు మా ఇంటిపక్కకు ఉండె కర్రెన్న తాత దుబాయ్ వోతె, భూలచ్చిమాయి ఒక క్యాసెట్ కొనుక్కచ్చి
టెప్ రికార్డుల మాట్లాడి నింపి పంపిస్తె, అది ముట్టే సరికి నెలైతుండె. రోజులెంత గమ్మతుగ మారుతున్నయో!
***
అత్తామామ పొలంకు వోంగనె, బుడ్డదాని మాడమీద నూనె సుక్కలేశి రాక్కుంట అర్రాల కూసున్న. అమ్మ ఆకిట్ల నిలవడి మల్లా ఓల్లకో ఫోన్ జేశి, ఫస్టుకెంచి చెప్పుకస్తున్నది.
“ఇగో నా బిడ్డె నిండు మనిషుండె, పిల్లగాడేమో మస్కట్ ల ఉన్నడు, కాన్పుకు తీస్కవోతె నా ఒక్కదాంతోని యాడైతదని
నన్నే ఇటు రమ్మన్నరు. నా అంతుకు బీడీల్ వెట్టుమని నా కారటి నర్సవ్వకు ఇచ్చచ్చిన. మంచిగ
ఆడివిల్ల పుట్టి నాన్నెల్లు దాటింది. ఒకరోజు గాచారం మంచిగ లేక ఆకిట్ల నడంగ కాల్ జారి కిందవడవోతి, ఆపుకుందమని శేతిని అడ్డం వెడితె పుటుక్కుమని ఇరిగె. అప్పట్సంది ఊరి మొకం
సూసుడైతలేదు. గిసుంటి టైంల, అది నా కారటి బందు వెట్టి, వేరోల్ల కారటి మీద చేస్తున్నదట.. గిదేమన్న నియ్యతేనా? అడుగుదమంటె ఫోను లేప్తలేదు” అని అంటున్నది.
అవతలోల్లు ఏమన్నరో తెల్వది, చెవులల్ల రొద వెట్టినట్టు అనిపించిందో ఏమో, ఫోన్ల స్పీకర్ చాల్ జేశి మల్లా అమ్మనే, “అదే గద.. ఆ నల్లికుంట్ల మొకందానికి
కారటే లేదు. ఇప్పుడు వేరోల్లదైన నాదైనా గదే కారటి, గదే పైసలు. మరి చెప్పకచెయ్యక నాదేంటికి
ఆపాల? ఇప్పటికి నెల పదిగేను
రోజులాయెనట, వేరోల్లు చెప్తె తెలిశింది.
మూడు నెల్లు కాడలైతె రాజీనామ వెట్టుమంటరు, అట్లైతె పించను దగ్గర నుక్సానయితది. అదొక్కసారి చాల్ అయ్యిందంటె, మల్ల పదేండ్ల దాక ముట్టుకోరు, బయటెంత పెరిగినా సంబదం ఉండది” అన్నది.
“ఇసాబ్ ఎట్ల కట్టిత్తున్నవ్ నర్సవ్వకు” అన్నది అవతలామె.
"మాపులు పెట్టిన కాడికి ఆడ్నే కార్కాన్ల తీస్కుంటది. దాంట్ల కట్ అయిన పించను
పైసలు, దావకాన కోసం కట్ అయిన యాబై రూపాలు, మీటింగులకు నిజాంబాద్ వోతె కైకిలి బస్ కిరాయిలు, యూనియనోల్లకి యాడాదికి వంద ఇవన్ని నేనే కట్టిత్తున్న"
అన్నది.
"మరి దాదలకిచ్చే పదిరూపాలు ఇత్తున్నవ?" అన్నది అవతలామె.
అమ్మ సల్లవడ్డది. అవతలామె ఇంట్లకి ఓళ్లో సుట్టాలు అచ్చినట్టు ఉన్నరు, "ఆ ఉన్న, అత్తున్న" అనుకుంట పెట్టేశిందామె.
లంగోట తడ్పిందని బయటకచ్చి దండెం మీదికెంచి కొత్తది తీస్కొని, బుడ్డదాన్ని కాళ్ల మీద పండ వెట్టుకొని మారుస్తున్న. నన్ను సూశి, “అయ్.. ఇదేం నసీబైపాయె, మన్మరాలికి తానం గుడ చేపిచ్చుడు ఐతలేదు” అన్నది.
“పట్టి తీశేశినంక చేపిద్దువే!” అన్న.
అమ్మని జూస్తె ఇప్పట్ల రాజీనామ వెట్టెటట్టు కొడ్తలేదు. అమ్మ ఆల్ల అమ్మని యాజ్జేస్కున్నది.
అమ్మమ్మ రెండు వేల రెండుల రాజీనామ వెడ్తె, అప్పుడు హజార్ బీడీలకు తొంబై రూపాలున్న టైంల, రెన్నూర్ల యాభై రూపాల పెన్శన్ కూసున్నది. రోజురోజుకు రేట్లు పెరుగుతుంటె, అంతతక్క పెన్శన్ తోని ఎట్ల ఎల్లదియ్యాల్నో అమ్మకు సమజైతలేదు.
నాకు ఐదేండ్లప్పుడు బాపును ఏదో బండి టక్కరిచ్చి తీస్కవోతె, బీడీలు చేస్కుంటనే కడ్పుల పెట్టుకొని సాదింది. రోజుండేటి
ఇంట్ల పనులు చేస్కుంటనే, పద్నాల్గు పదిగేను గంటలు బీడీల మీద కూసుంటుండె. అమ్మ
నాయంత ఉన్నప్పుడు రోజుకు మూడు శేర్లు చేస్తుండెనట. ఒక శేరు బీడీలు తన కార్డు మీద మాపు
పెట్టుకుంటె, కడుమయి తక్కవడ్డోల్లకు కట్టల సొప్పున ఇస్తుండెనట.
“ఎన్కటి ముచ్చట, అప్పట్ల పొలం పనికి కైకిలి మొగోళ్లకు రూపాయి, ఆడోళ్లకు ఆటాన ఉండెనట. శేరు బీడీలగ్గుడ గంతేనట. అప్పుడు మా అమ్మ రోజుకి రెండు
శేర్లు చేస్తుండెనట, దాంతోని మొగోళ్ళ కైకిలి
పడ్తున్నదని బీడీల మీదనే ఉంచిందట మా అమ్మమ్మ. అదే ఆడోళ్లకు మొగోళ్లకు సమానం కైకిలి
ఇస్తె గీ బీడీలు ఓళ్లు జేస్తుండే” అన్నది అమ్మ.
అమ్మమ్మతోని కలిపి ఊరు మొత్తంకు ఐదుగురు బీడీలు చేశెటోళ్లు ఉండెనట. పక్కకున్న మండలంల
కార్కాన ఉంటుండెనట. తర్వాత ఈళ్లని సూశి, ఒకటి తెచ్చి ఊళ్లె పెట్టిండ్రట. ఇప్పుడు ఇదే ఊర్ల ఆరువందల మంది బీడీలు
చేశెటోళ్లు, ఐదు కార్కాన్లు అయినయి. వర్షాలు పడని కరువు
కాలంల వ్యవసాయం లేక గీ బీడీలే ఆదుకున్నయి అని నెమరేసుకున్నది అమ్మ.
***
అమ్మ పట్టి తీపిచ్చుకుందమని ఇందూరుకి వొయింది. ఎక్స్ రే తీపిచ్చి సూశి, నీ బొక్కలు గట్టిగ లేవు, ఇంకొక నెలరోజులు ఉంచుకో అన్నడట డాక్టరు. ఇంటికచ్చి “ఇదేం కతైపాయె” అనుకుంట ముచ్చటంత
చెప్పింది.
ఒక నిముషం కూసున్నదో లేదో, ఫోన్ తీసుకొని మల్లా ఓల్లకో చేశింది.
"దాదకు ఇచ్చే గా పది రూపాల్ నేనే ఇస్త. ఏమంటవు?" అన్నది.
“లేదక్క. నాకు చేసుడు ఐతలేదని రాజీనామ వెడ్దమని సూశిన కని నాపేరు తప్పు వడ్డదట.
నా బ్యాంకు పాసుబుక్కు, ఆదారు కారటి ఇచ్చినంక ఎట్ల తప్పు వడ్తది శెప్పు. ఆపీసుల గా కంపూటరి ముంగట
కూసుండెటోడు కావలనే అందరియి తప్పు గొట్టినట్టు అన్పిస్తున్నది. ఇప్పుడు సరి
జెయ్యాలంటే రెండువేలు ఐతయంటున్నడు"
“రెండు వేలేంటికియ్యాల ఆ మూతగండ్లమొకపోడికి. ఆంత జమైండ్రు మనల్ని దోస్కునదల్గి.
నువ్వు గదేదో నెట్టు సెంటర్కు ఓళ్లనన్న పట్కవోయి ఆనులైన్ల మార్పిచ్చుకో. నాకట్లనే
అయితే మా అల్లుడు ఆల్ల దోస్తుకు చెప్పి చేపిచ్చిండు. యాభయ్యొ వందనో తీస్కుంటరు
గంతే. అది మారిందాక బీడీలు బందు వెట్టకు” అని ఇగురం చెప్పి పెట్టేశింది.
నేను అడిగిన, "ఈ పది రూపాల సంగతేంది?" అని.
"ఏ.. ఏంలే.. బీడీలు ఇచ్చెటప్పుడు కారట్ ఉన్నోళ్లు ఉండాల కద. ఆల్లు లేకుండ వేరెటోళ్లు
మాపులు పెట్ట వోతె ఆ దాదలు అజార్ బీడీలకు ఐదురూపాల్ అడుగుతుండె పాపం. కొత్త
దాదలచ్చిండ్రట. దాన్నిప్పుడు పదిరూపాల్ చేశిండ్రటా"
అన్నది.
"నువ్వు లేకున్నామాపులు తీస్కుంటున్నందుకు పాపం ఐపోయిండ్రు కద?" అన్న నగుకుంట.
“తక్వ జీతంకు
పెండ్లాంపిల్లల్ని ఇడ్సవెట్టి పడమటకెంచి అచ్చి ఉంటరు, మామీద వడి బత్కుడికి సై
మరిగిండ్రు, ఏం జేద్దం మరి” అనుకుంట లోపట్లకు వోయింది.
***
మాపటికి చాయ తాగినంక, అమ్మ నర్సవ్వకి మల్లా ఫోన్ జేస్తె, ఈసారి ఎట్లెట్లనో లేపింది. "గిట్లెట్ల చేస్తివే? గిదేమన్న పద్దతేనా?" అన్నది అమ్మ.
“నేనెమన్న రెండేండ్లు చేస్తా అని నీకు మాటిచ్చిన్నా అక్క? నువ్వు ఎప్పుడు రాజినామ వేడ్తవో అని నా భయం నాకుంటది కదా? ఇంకో కారటి దొర్కింది, మూడేండ్లు చేసుకోమన్నరు, అందుకే నీదిడ్సవెట్టిన" అని చెప్పింది.
“అట్లంటప్పుడు ఒక నెల ముందు చెప్తె నేను వేరోల్లని సూస్కుంట గద? ఇదేం లెక్క అన్నట్టు?"
“ఏమన్ననుకో నాకైతె చేసుడు కాదు" అని కట్ చేసింది నర్సవ్వ.
“బౌరూపులమొకంది” అని గునుక్కుంట నా దిక్కు తిరిగి,
"ఒక పన్జేస్తె?" అన్నది.
“ఏందమ్మ?"
“నేను ఇంటికి వొయి కొన్ని రోజులు ఆడ్నె ఉండి, ఓల్లనన్న ఒకోల్లకు కారటిచ్చి అస్త. ఏమంటవ్?"
నాకు కోపం పాము పడగోలె సర్రున లేశింది.
"అమ్మా ఏం మాట్లాడుతున్నవే? నువ్వసలే క్యాన్సర్ పేషెంటువి. గా బీడిలతోనే రొమ్ముకచ్చింది. అదృష్టం మంచి
గుండి గా ఆరోగ్యశ్రీ స్కీము ఉండవట్టి ఆపరేషన్ చేశిండ్రు, లేకపోతె ఉన్న పొలం అమ్ముడైతుండె. గప్పుడు చేశ్న రేడియేషన్ కి బొక్కలన్ని పల్సవడి, గిట్ల కిందవడంగనె చేతిరిగె. అంతకుముందు ఎన్నిసార్ల వడలేదు, ఎప్పుడన్న ఇరిగింద?” అన్న.
అమ్మ అటీటు సూస్తున్నది.
“అదిగాక బీడీలకోసం గంటలు గంటలు కూసుండుడుకి బీపి షుగర్ ఎప్పుడో అచ్చినయి.
నువ్వు ఈ పరిస్తితిల ఇంటికివొయి, తుంటి చేత్తొని వంట జేస్కుంట, బీడీలు పెట్టేటామెని లెంకుకుంట కూసుంటవ? అసలే కేసులెక్కయితున్నయి, అందరు మల్లా లాకుడౌను పెట్టమంటున్నరు. నువ్వు అటు పోంగనె ఇటు పెట్టిండ్రనుకో..
ఎట్ల జేద్దం" అన్న.
ఉలుకులేదు పలుకులేదు.
లోపట్లకు వొయి కొంచెం నీళ్లుతాగచ్చి, "నేను నీ అల్లుడుతోని మాట్లడిపెట్టిన. నువ్వు రాజీనామ
చేశినంక మాతోని ఈడ్నే ఉంటవు. అత్తమ్మ నువ్వు ఒకోల్లకొకల్లు సోపతి లెక్క ఉంటరు" అన్న నిమ్మలంగ.
అమ్మ నమ్మనట్టె సూశింది. “పిల్లగాడు మంచోడె కని కూతురింట్ల ఉండుడు, అల్లుడు సంపాదించుకస్తె తినుడు మంచిగుండది. నాకు నెలకు మూడువేలు పించిని అస్తె
నా పూర్త పొట్టకు, నెలనెల మందులకు పనికొస్తయి” అని అంటుండగనే అత్త, మామ అచ్చిండ్రు.
మామ, అమ్మ మాటలు ఇన్నట్టున్నడు,
"బిడ్డే కొడుకు అందరు సమానమే. ఆస్తిపాస్తులు అందరికి సమానంగ
పంచియ్యాల, అట్లనే ఆళ్లు గుడ అయ్యవ్వల్ని ముసలైనంక సమానంగ సూస్కోవాల. నీకున్నది ఒకటె బిడ్డె, మాకున్నది ఒకడే కొడుకు. ఇగ నువ్వో జాగల మేమో జాగల ఏందమ్మ? చేశిన కాడికి సాలు, రాజీనామ వెట్టెయ్యు" అన్నడు మామ.
అమ్మ కండ్లల్ల నీళ్లు తిరిగినయి. నిన్ను ఉండదల్గి అల్లుడు ఒప్పుకున్నడు అంటె
అంత నమ్మకం కనిపియ్యలె, ఇప్పుడు ఇంటి పెద్ద చెప్పంగనె నమ్మింది.
"నా బిడ్డె కిస్మత్ మంచిగున్నది, మారాజులున్న ఇంట్ల వడ్డది. నేను ఒక్కదాన్ని ఆడ ఉండుడెందుకు అంటున్నరు, మరి పిల్లగాడు ఆడ, పిల్ల ఈడ ఉంటె ఏం మంచిగుంటదన్న? అల్లుడిని కుడ రమ్మందం. పెట్టువడికి పైసలు ఇస్తున్నది సర్కారు. కాల్వల నీళ్ళు మొక్కల్గ
అస్తున్నయి. ఆడున్న రెండెకరాల పొలం అమ్మేద్దం, ఆ పైసల్తోని ఈడ్నే తీస్కుందం. అందరం ఒక జాగలుండి నూనె కారం తిన్న కమ్మగనే ఉంటది!" అన్నది.
"భూమిని అమ్మద్దు, అదట్లనె ఉండని. కౌలుకియ్యచ్చు లేకపోతె ఇంకేమన్న చెయ్యచ్చు.
నువ్వన్న మాట కుడ కరెక్టె. బిడ్డె పుట్టినంక గుడ ఆడెందుకు ఉండాల? మాట్లాడ్త ఒకసారి" అన్నడు మామ.
***
రాత్రి తినుడు అయినంక మామ, కొడుక్కు ఫోన్ చేసుకుంట బయటకు నడిశిండు. అద్దగంటకు
ఇంట్లకు అచ్చి, "ఇంక నాల్గు నెల్లు ఐతె దసరత్తది, ఆ టైంకు అచ్చేత్త. ఇప్పుడు
రాజీనామ వెడ్తె అచ్చేటి పైసలు అప్పటికి కరెక్ట్ అస్తయి. టికెట్ అయితె ఇప్పుడే బుక్
చేసుకుంట అని పోయిండు" అన్నడు మామ.
నాకన్న ఎక్క అమ్మకు సంతోషం అయ్యింది. బాపు లేకున్న ఒంటరిగ ఉండి, వేరే ఆలోచన లేకుండ బీడీల పని మీదనే పెయి పిండి పిండి
చేస్కొని నన్ను వెంచింది. అసలు నేను ఎట్ల పెరిగిన అని కుడ అమ్మకు సక్కగ గుర్తు
లేదు. ఇప్పుడన్న మా బుడ్డదాని పెరుగుడు సూస్కుంటనన్న సంతోష పడ్తది అనుకున్న.
***
పొద్దుగూకినంక అమ్మకు ఫోన్ అచ్చింది, మీది వాడకట్టుకు ఉండే సాయమ్మ దగ్గర్నుంచి. మస్తు సేపు
మాట్లాడింది. "అవ్.. అవన్ని పైసలిస్త, మీదికెంచి దాదలకు ఇచ్చె పదిరూపాలు కుడ ఇస్త"
అన్నది.
ఆమె ఏమన్నదో తెల్వది గని, ఫోన్ పెట్టేశి నాబిడ్డె దగ్గరికచ్చి,
"ఆమె నా కారటి మీద చెయ్యదల్గి ఒప్పుకున్నది. రాజీనామ
వెట్టినంక అచ్చిన పైసలతోని నీకు బంగారం గొలుసు చేపిత్త. ఇదంత నీతోనె అయ్యిందే నా
లచ్చిమితల్లి" అని బుగ్గ మీద ముద్దు
వెట్టుకున్నది.
బుడ్డది అమ్మని సూస్కుంట కిలకిల నవ్వె. అమ్మకున్న టెన్శన్ పోయినందుకు నాగ్గుడ
మంచిగనిపిచ్చింది. ఇంతట్లనే యాదికచ్చి, "నువ్వు రాజీనామ పెడ్తలేవానె" అని అడిగిన.
"లేదు.. నా సోపతిది గా సాయమ్మ నా కారటి మీద చెయ్యదల్గి ఒప్పుకున్నది"
"ఎట్లొప్పుకున్నదే?"
"ఐదురూపాలకు శేరు చేశినోళ్లం, దాదలకు ఇచ్చే పదిరూపాలు గుడ ఇస్త అనేసరికి ఒప్పుకున్నది. మీకు పదిరూపాలంటె
లెక్క లేదుగని, మాకు ఎన్బై కట్టల బీడీలతోని
సమానం. పాపం దానిగ్గుడ వేరె ఆదారం లేకుంట వోయింది, సర్కార్ ఇస్తున్న గా దోఅజార్ లకెంచి ఓల్లకు తెలకుండ ఎన్నో కొన్ని చేత్ల వెట్టస్త" అన్నది.
"ఇస్తె మంచిదే కని, మామకు రాజీనామ వెడ్తా అని చెప్తివి గదనే"
"ఆడికి వొయి చేత్తలేను కద"
"మంచిగుండదే"
"ఊకో, ఏం తెల్వది నీకు. అది అయిన కాడికి చేస్తది.
కాని రోజు రాజీనామ వెడ్త. పైసలెమన్న పుక్కెంకు అస్తున్నయ? నేను మింగే మందులకు శిన్న పైసల్
అయితున్నయ! నువ్వు సప్పుడుదాక కూసో, అన్న అడిగితె నేను సంజాయిస్తా" అన్నది.
“ఇదింతే, అస్సలు చెప్తె ఇనది, మల్లొక కత వెట్టింది” అనుకున్న మనసుల.
నా బిడ్డెకు ఏమర్థమయ్యిందో ఏమో, నన్ను సూస్కుంట నగవట్టె. నగుతుంటె ఒక పన్ను అచ్చినట్టు కన్పిచ్చె. "అమ్మా.. నీ మన్మరాలికి పన్ను అచ్చిందే" అన్న.
"నిజంగన?" అనుకుంట అచ్చి సూశింది.
మమ్మల్ని సూస్కుంట కాల్లు ఎగిరేసుకుంట ముస్కురాయిస్తున్నది. ఆనంద్ కలర్ కుల్ల
కట్టుకున్న బుడ్డది ఒక పన్నుతోని నగితె ఇంకింత మంచిగ కనిపిస్తున్నది.
“పారపూస కట్టాల, జిట్టి కాకుండ” అన్నం ఇద్దరం ఒకటేసారి.
*** అయిపోయింది ***
(నమస్తే తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధం బతుకమ్మలో ఆ కథ జులై 10, 2022 న ప్రచురితం)