రైటర్స్ మీట్ - శీతాకాల కథాఉత్సవం - నా అనుభవం

 
రైటర్స్ మీట్ - శీతాకాల కథాఉత్సవం గత డిసెంబరు 11, 12 తేదీలలో జరిగింది. అనగా ఆరు నెలలు పూర్తైన సందర్భంగా, అప్పుడు నా అనుభవాలు ఇక్కడ నా బ్లాగ్‌లో పంచుకోలేదు కాబట్టి ఇప్పుడు పంచుకుంటున్నాను.

****

"ఇప్పుడు అరుణ్ మాట్లాడుతాడు" అని ఖదీర్ బాబు గారు అనగానే, ఆ తర్వాత ఆయనేం మాట్లాడారో, దేని గురించి మాట్లాడమన్నారో కూడా గుర్తులేనంతగా బ్లాంక్ అయిపోయాను.
మెల్లిగా లేచి వెళ్తుంటే, "సమయం లేదు, తొందరగా రావాలి" అంటుంటే, నాతోపాటు పిలిచిన శ్రీనివాస్ సూఫీ గారు స్టేజీకి నాకన్నా దగ్గరగా ఉన్నా, ఆయన కన్నా ముందుగా నేను చేరుకోవాల్సి వచ్చింది. నేను మెల్లిగా వెళ్ళాలి అనుకోవటానికి కారణం, నాకన్నా ముందు శ్రీనివాస్ గారు వెళితే, ఆయన మాట్లాడాక, ఆలోపు ఆలోచించుకొని, నేను మాట్లాడదాం అని అనుకోవటం, చిన్నప్పటి స్కూల్ తెలివితేటలు అలా బయటకొచ్చాయి.
అక్కడ నిజంగానే టైం లేదు. పిలిచిన వాళ్లందరినీ మాట్లాడిస్తారు అని నేనైతే అనుకోలేదు. మొదటి సారి వెళ్తున్నా కాబట్టి, టైం సరిపోక, నన్ను స్కిప్ చేస్తారు అన్న కాన్ఫిడెన్స్ తో ఉన్నా మొదటి నుంచి. ఆ పప్పులేమీ ఉడకలేదు. 
దాంతో అసలు విషయం చెప్పడం ఉత్తమం అని ఇలా మొదలుపెట్టాను, "నేను 9th క్లాస్ లో ఉన్నపుడు, ఉపన్యాస పోటీల్లో పాల్గొన్నాను. పై నుంచి కింది వరకు ఒకటే వణుకు. అయినప్పటికీ ఎలాగోలా పూర్తి చేసి వచ్చాను." అని చెప్పాను. "అప్పుడు మైక్ పట్టుకున్నాక, మళ్లీ ఇప్పుడే" అన్న విషయం చెప్పలేకపోయాను, 
లోపల అప్పటికే మొదలైన వణుకు వల్ల. ఒకవేళ మళ్లీ ఎప్పుడైనా పిలిస్తే, నాకిచ్చిన సమయాన్ని పూర్తిగా వాడుకొని మాట్లాడగలను అనుకుంటున్నా. కాసేపు నా గురించి, ఈమధ్యే విశాలాక్షి కథల సంకలనంలో వచ్చిన "సుబ్బయ్య తాత పెళ్లి" కథ గురించి చెప్పాక, నాకిచ్చిన అంశం "కథా వస్తువు ఎంపిక" పై అక్కడ కొంత మాట్లాడాను, కొంత లోపలే ఉండిపోయింది. 
ఇందులో చాలా విషయాలు అందరికీ తెలిసినవే అయినా, ఇక్కడ పూర్తిగా ఇస్తున్నాను. "కథా వస్తువు ఎంపికలో నాకైతే ఎప్పుడూ సమస్య ఎదురుకాలేదు. ఎందుకంటే నాకు మాత్రమే తెలిసిన కథలను, అంటే నా చుట్టు పక్కల లేదా నాకు తెలిసిన వాళ్ళు చెప్పినవి రాసేందుకు ప్రయత్నిస్తాను. అలాగే ఊహా లోంచి వచ్చినవి రాసేందుకు ఎక్కువ ఇష్టపడతాను, స్వేచ్చ ఎక్కువ ఉంటుంది నా భావన. ఇక స్ఫురణకు వచ్చిన చాలా అంశాలను 'ఇదివరకే ఎవరైనా రాసి ఉండవచ్చా?' అని ఆలోచిస్తాను. అవును అనిపిస్తే నేను రాయను. ఒకవేళ రెగ్యులర్ కథైతే నాకు మాత్రమే కనిపించే కొత్త కోణం ఏదైనా ఉంటే అప్పుడు రాస్తాను.

అయితే దిశ సంఘటనల వంటివి జరిగినప్పుడు, అందరూ రాస్తారు అని తెలిసినా, రాయకుండా ఉండలేక రాశాను. కరోనా వచ్చాక ఆ కష్టాల గురించి రాయాలి అనిపించలేదు. అది ఏ ఒక్కరికో వచ్చిన కష్టం కాకపోవడం ఒకటైతే, ఆ సమయంలో లాక్ డౌన్ లో అందరం ఇళ్లల్లో ఉండటం, ప్రతి రోజూ టీవీల్లో పేపర్లలో ఆ కష్టాల గురించి వరుస కథనాలు అందరం చూస్తుండటం వల్ల, అందరికీ తెలిసిన అనుభవమైన సమస్య మీద రాయాలి అనిపించలేదు.

ఇక ఈ మధ్య వస్తున్న ఎక్కువ కథల్లో వార్తలకు ఎమోషన్స్ చేర్చి కథలుగా మార్చి రావటం గమనిస్తున్నాను. అలా రాయకూడదు అని నా ఉద్దేశ్యం కాదు, కానీ అందులో ఎవరికీ తెలియని కొత్త కోణం లేకపోతే ఆ రచన ఆకట్టుకోదు. కథ రాసే ముందు అందులో కొత్త కథా వస్తువు ఏమైనా ఉందా లేదా అని ఆలోచించండి. వీలైనంత మట్టుకు కొత్త వస్తువు అయితేనే బాగుంటుంది. ఒకవేళ పాతదే అయితే, చెప్పే కోణం కొత్తగా ఉండేలా చూసుకోండి. ఈ విషయంలో అల్లం రాజయ్య గారు అక్కడ చెప్పిన మాటలు, "భావోద్వేగాలను పక్కకు పెట్టి, దాని వెనకాల ఉన్న వాస్తవాన్ని గ్రహించి రాయండి" ఎప్పటికీ గుర్తుంటాయి. 

 నా మొదటి కథ నవ్యలో 2007, జనవరిలో వచ్చింది, మొదటి బహుమతి ఆటా పోటీలో 2008, అక్టోబర్ లో వచ్చింది. ఆ తర్వాత మొత్తం 19 కథలు ప్రచురితం కాగా, అందులో 6 కథలు బహుమతులు గెలుచుకున్నాయి. కథ వచ్చినపుడు, బహుమతి పొందినపుడు ఆనందం కలిగినా, మొదటి కథ మొదటి బహుమతి ఇచ్చిన సంతోషం మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

శీతాకాల కథా ఉత్సవానికి ఆహ్వానం రాగానే మళ్లీ అటువంటి ప్రత్యేకమైన ఆనందం సంతోషం కలిగాయి. మొదటి రోజే ఖదీర్ బాబు గారు రైటర్స్ మీట్ యొక్క ఉద్దేశ్యం చెప్పారు. అక్కడ నేర్చుకోవటానికి పెద్దగా ఏమీ ఉండదు అని, రెండ్రోజుల పరిచయం స్నేహంగా మారి, అందులోంచి ఇంకో క్రియేటివ్ ప్రాడక్ట్ వచ్చే అవకాశం ఉందని వారి భావన. అది నిజమని రుజువయ్యింది కూడా! 

ఇక ఈ సంవత్సరం రైటర్స్ మీట్ యొక్క ఇరవయ్యొవ వార్షికోత్సవం కావడం, తమిళ కన్నడ రచయిత్రులు వెణ్ణిల, శాంతి అప్పణ్ణల రాకతో దక్షిణ భారత సమావేశంగా రూపాంతరం చెందింది. వచ్చిన వారిలో ఎప్పటి నుండో రాస్తున్నవారు, ఈ మధ్యే మొదలుపెట్టిన వారు, వీరిద్దరికి మధ్య వారథి వంటి వారూ, ఇలా రాసిన వాటిని ఎడిట్ చేసేవారు, పుస్తకాలు ఇష్టంగా చదివేవారు, అంతే ఇష్టంగా ముద్రించేవారు.. ఇలా అందరూ ఉండటం బాగుంది. 

ఈ కథా ఉత్సవంలో నాకు బాగా నచ్చిన అంశం, అందరూ అందర్నీ సమానంగా చూడటం, గంభీర వాతావరణం లేకపోవటం, నేర్చుకోవటానికి అందరి దగ్గర ఎంతో కొంత ఉంటుందని ఎవ్వర్నీ వదలకుండా మాట్లాడింపజేయడం, ఆ క్షణానికి వారు గురువులు కావటం, మిగితా వారంతా చంటి పిల్లల్లా మారి వినటం, వారి స్పీచ్ అయ్యాక ప్రశ్నలు అడుగుతూ అల్లరల్లరి చేయటం.

ఖదీర్ బాబు గారి సరదా వ్యాఖ్యానానికి తోడుగా, దర్శకులు కరుణకుమార్ గారి అనుభవాలను కామెడీగా మార్చి చెప్పటం ఆహ్లాదాన్నిచ్చింది, అయితే అందులో నేర్చుకోదగ్గ జీవిత సత్యాలున్నాయి. అల్లం రాజయ్య గారిని చూసినప్పుడల్లా ఆశ్చర్యపోతుంటాను, అన్ని విషయాలు గుర్తుపెట్టుకునే శక్తికి, ఆ జ్ఞాణాన్ని పంచటానికి ఆయన ప్రయాణాలు చేసే ఓపికకి! సత్యం వేమూరి, మహీ బెజవాడ, పూడూరి రాజిరెడ్డి గార్ల ఆత్మీయ స్పందన ఎప్పటికీ గుర్తుంటుంది.

రైటర్స్ మీట్ కి రావటం కోసం పన్నెండేళ్ళ వయసులో నవలిక రాసేసిన రుబీనా గారి అమ్మాయి సైరా పరోక్షంగా ఛాలెంజ్ చేసేసింది, మిగతావారు ఎప్పుడు రాస్తారంటూ.
ఇక్కడ నేర్పడానికి ఏమీ లేదంటూనే, అక్కిరాజు భట్టిప్రోలు, పూడూరి రాజిరెడ్డి, సురేష్, అనంత్, ఖదీర్ బాబు గార్ల సెషన్స్ కథల పట్ల నాకున్న ధోరణికి కొంత స్పష్టతనిస్తూ, వాటిని రాసే విధానంలో ఆలోచించగలిగే కొత్త కోణాల్ని పరిచయం చేశాయి.

సుజాత గారి సూచన, "టెలిగ్రాం ఆప్ లో వేలల్లో ఉన్న పాఠకులు పి.డి.ఎఫ్. రూపంలో ఉన్న పుస్తకాల్ని చదువుతున్నారు. దాన్ని మార్కెట్ గా ఎందుకు మార్చుకోకూడదు?" ఆలోచింపజేసింది, మనసు పెడితే పరిష్కారం దొరుకుతుందేమో.
శర్మ గారు రాసిన నవల, రాబోతున్న నవల గురించి, వాటి వెనుక ఉన్న శాంత గారి ప్రోద్బలం గురించి, ఝాన్సీ గారి కథల్లో లింగ సమానత్వం గురించి, రష్యన్ కథలపై కూనపరాజు గారు, తాము నవలలు ఎలా రాశామో మధురాంతకం నరేంద్ర గారు (మనోధర్మపరాగం), ఉణుదుర్తి సుధాకర్ (యారాడకొండ) గారు వివరించటం, అనువాదాల గురించి అజయ్ వర్మ, భాస్కర్ గార్లు చెప్పటం బాగుంది. 
ఈ కథా ఉత్సవంలో నాకు దక్కిన మరో ఆనందం, గంధం విజయలక్ష్మి గారు, మా ఊరికి (అభంగపట్నం) రెండు కిలోమీటర్ల అవతల ఉండే నవీపేట (నేను పదవ తరగతి వరకు చదివిన ఊరు) నుంచి రావటం! ఇక్కడికి రాకపోతే కూతవేటు దూరంలో ఉన్న మేడం గురించి ఎప్పటికి తెలిసేదో! విజయలక్ష్మి గారు గోసంగుల జీవన విధానం మీద పి.హెచ్.డి. డాక్టరేట్ చేయగా, ఇప్పుడు గోసంగుల భాష మీద తెలుగు, ఆంగ్ల భాషల్లో అర్థాలని ఇస్తూ నిఘంటువును రూపొందించే పనిలో ఉన్నారని తెలిశాక ఆ సంతోషం రెట్టింపు అయ్యింది. 

 ఇంకా సాయి పాపినేని, వెంకట్ శిద్ధారెడ్డి, అరిపిరాల సత్యప్రసాద్, సాయి వంశీ, గౌస్, మహమూద్, అన్వర్, సదయ్య, సురేంద్ర శీలం, ఛాయా మోహన్, శ్రీ ఊహ, ఉమ నూతక్కి, సుజాత వేల్పూరి, మనోజ్ఞ, రుబీన, దేవేంద్ర, సిద్ది షాజిదా, విజయ్ కుమార్ కోడూరి, మిథున, చరణ్ పరిమి, శ్రీనివాస్ సూఫి, చంద్రశేఖర్ కొప్పు గార్ల గురించి కూడా రాయాలి అంటే ఒక పుస్తకం అంత కంటెంట్ ఉంది.


ఇలాంటి పనిని ప్రేమతో, బాధ్యతతో ఓపిగ్గా ఇరవై యేళ్ల నుంచి చేస్తున్న ఖదీర్ బాబు గారికి, కె. సురేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, అలాగే కోర్ టీం మెంబర్స్ కి కూడా ధన్యవాదాలు. వెళుతూ వెళుతూ చివర్లో అందరికీ కలిపి ఒక విషయం చెప్పారు ఖదీర్ గారు, “వచ్చేసంవత్సరం కథా ఉత్సవానికి రావాలనుకుంటే, ఈ సంవత్సరం కథలు బాగా రాయండి” అని. ఆ పనిలో ఉంటాను. 

 రైటర్స్ మీట్ ఇచ్చిన మరిచిపోలేని బహుమతి నా పోట్రేయిట్. అక్కడికి వచ్చిన వారిలో లెటరింగ్ ఆర్టిస్ట్ Chandrashekar Koppu గారు కూడా ఉండటం, ఆ రెండు రోజుల్లో పదిహేను మంది రైటర్ల బొమ్మలు అప్పటికప్పుడు, తక్కువ సమయంలో గీయటం జరిగింది. ఇలా బొమ్మలో చూసుకోవటం మొదటి సారి నాకు, థాంక్యూ చంద్రశేఖర్ గారు. ఖదీర్ బాబు గారి గేట్ కథకి ఆయన గీసిన బొమ్మలతో పాటు, ఆయన గీసిన ఇతర బొమ్మలు కూడా ఇక్కడ చూడవచ్చు. అయితే అదే రైటర్స్ మీట్ చంద్రశేఖర్ గారికి మరో బహుమతిని అందించింది, అదేంటో తెలియాలి అంటే కొన్ని నెలలు ఆగాల్సిందే. చంద్రశేఖర్ గారిని ఈ నంబర్లలో సంప్రదించవచ్చు: 7702685237 & 8501964716 

  
******************
PC: చరణ్ పరిమి, అన్వర్ మహమ్మద్, సురేంద్ర శీలం 

అందరికీ ధన్యవాదాలు 
 - అరుణ్ కుమార్ ఆలూరి 

#WritersMeet #శీతాకాలకథాఉత్సవం #WinterKathaUtsav