బాహుబలి-1 సమీక్ష

బాహుబలి సినిమాని కాస్త ఆలస్యంగా చూడటం వల్ల కాస్త ఆలస్యంగా సమీక్షిస్తున్నాను.
బాహుబలి సినిమాని విమర్శిస్తే కోడిగుడ్డుపై ఈకలు పీకినట్టే అవుతుంది. అంత అద్భుతంగా ఉంది ఈ సినిమా.. It’s a Visual Wonder..!! రాజమౌళి దర్శకత్వ ప్రతిభ మెచ్చుకొని తీరాలి. నాకు రాజమౌళి సినిమాలు నచ్చడం మొదలైంది మర్యాద రామన్న సినిమా నుంచి, ఆ తర్వాత వచ్చిన ఈగ కూడా బాగా నచ్చింది. ఇప్పుడు బహుబలితో ఆ నమ్మకాన్ని రెండింతలు చేసుకున్నాడు రాజమౌళి.

సంగీతం:

టైటిల్స్ & క్రెడిట్స్ వచ్చినప్పుడు కీరవాణి అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. అఫ్ కోర్స్ ట్రైలర్ లో కూడా!! సినిమాలో వచ్చే నేపథ్య సంగీతం ఫర్వాలేదనిపించింది. కొన్ని అద్భుతమైన సన్నివేశాలకి నేపథ్య సంగీతం ఇవ్వలేక తన గొంతు సవరించుకొని పాటపాడి నెట్టుకొచ్చినట్టు అనిపించింది. ఈ విషయంలో కీరవాణి అసంతృప్తిని కలిగించాడు. పాటలు కూడా పెద్దగా గుర్తులేవు, ఒక్క పచ్చబొట్టు పాట తప్ప! ఇక ఎపిక్ సినిమాలో ఐటం సాంగ్ ఏంటో అర్థం కాలేదు. పనిగట్టుకొని ఇరికించినట్టుగానే ఉంది తప్ప, సిట్యుయేషన్ డిమాండ్ ఏం కనిపించలేదు. ఇక్కడ కూడా రాజమౌళి తెలుగు సినిమా ఫార్ములాని వదిలించుకోకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. బాహుబలి సినిమాకి నేపథ్య సంగీతాన్ని కీరవాణి తప్ప మరెవ్వరూ ఇవ్వలేరని ప్రభాస్, రానా వ్యాఖ్యానించినట్టు గుర్తు. మణిశర్మ, రెహమాన్ ఇంతకన్నా అద్భుతంగా ఇవ్వగలరని వారి గత చిత్రాలు చెబుతున్నాయి.

కథ:
విజయేంద్ర ప్రసాద్ ఇచ్చిన కథ గురించి ఈ బాహుబలి -1 లో చెప్పుకోవడానికి ఏమీ లేదు. చందమామ కథలా, fairy taleలా సాగే కథ. రెండో భాగంలో ఏమన్నా చెబుతారేమో చూడాలి. కథనం ఈ సినిమాకి ఆయువుపట్టు. చిన్న చిన్న డీటెయిల్స్ ని ఒడిసిపట్టి చూపిస్తూ దర్శకత్వంలో చాలా ఎదిగిపోయాడు రాజమౌళి.

పాత్రలు:

పాత్రలు మలచడంలో చాలా శ్రద్ధ వహించారు. అన్ని పాత్రలు చాలా అద్భుతంగా చెక్కారు. ఒక్క అవంతిక (తమన్నా) పాత్ర మాత్రం నీరుగారిపోయింది. మొదట్లో ఏంతో ఉన్నతంగా కనిపించే పాత్ర, ప్రేమలో పడి శరీరాన్ని అర్పించుకొని, తన లక్ష్యాన్ని శివుడు (ప్రభాస్)కి ఇచ్చేసి, తను మిన్నకుండిపోయి ఆ పాత్ర అగాథంలో పడిపోయినట్టు అనిపించింది. కేవలం తనని అందంగా మలిచినందుకు, తన మాస్క్ తీసుకొని తనని వెతుక్కుంటూ జలపాతాలు, కొండలు ఎక్కి వచ్చినందుకు, నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పగానే ముక్కు మొహం తెలియని వ్యక్తికి తన దేహాన్ని అర్పించడం అస్సలు మింగుడు పడదు. శారీరకంగా బలంగా ఉన్న ఆ పాత్ర మానసికంగా బలహీనంగా చూపించడం ఊహించలేం. అదే అదనుగా శివుడు అవకాశాన్ని వాడుకున్నట్టుగా అనిపించి, అమ్మాయిని పొందడానికి మించి లక్ష్యం ఏమీ లేనట్టుగా ఉండే అతని మానసిక దౌర్భల్యంపై జాలి కలుగుతుంది. అమరేంద్ర బాహుబలికి, శివుడి పాత్రకి ఉన్న ప్రధానమైన తేడా ఇదే..! ఇంక ఎందులోనూ వారిద్దరి మధ్య పెద్ద తేడా ఏం చూపించలేకపోయారు, ఆహార్యంతో సహా..!!

అవంతిక బృంద నాయకుడికి కూడా మనో నిబ్బరం పెద్దగా కనిపించదు.

భళ్లాలదేవ పాత్ర ఇండియాన్ సినిమా హిస్టరీలోకెల్లా పవర్ ఫుల్ విలన్ అని రానా చాలా సార్లు చెప్పుకొచ్చారు. ఆయన పాత్ర ఈ మొదటి భాగంలో ఆ స్థాయిలో లేదు. ఇంకా చెప్పాలంటే రాజమౌళి గత సినిమాల్లోని విలన్లు కాస్త నయం. ఈ భళ్లాలదేవ పాత్ర రామాయణంలోని రావణుడి పాత్రలా ఉంటుంది. భళ్లాలదేవ కుమారుడి పాత్ర భద్రుడు (అడవి శేష్)లో విలనీ లక్షణాలు బాగా ఒదిగాయి.


కట్టప్ప పాత్ర మగధీరలో కాళ భైరవ(రాం చరణ్) పాత్రలా ఉంటుంది. ఎటుతిరిగీ అక్కడ ఆ పాత్ర 25ఏళ్ళకు మించి బతకదు, ఇక్కడ బతుకుతుంది. కాళకేయ పాత్ర మగధీరలో షేర్ ఖాన్(కీ.శే.శ్రీహరి) పాత్రలా ఉంటుంది. అకస్మాత్తుగా దండయాత్రకు వస్తాడు. ముందు వెనకలు ఏమీ ఉండవు. ఇక్కడ డీటెయిల్స్ మిస్ అయిన భావన కలుగుతుంది.

మాటలు:
ఇక మాటల విషయానికి వస్తే అవి చాలా పేలవంగా అనిపించాయి. నాకు తెలిసి ఇదే సినిమా హిందీ, తమిళం, మలయాళ భాషల్లోని మాటలు కచ్చితంగా ఇంతకన్నా బాగుండే ఉంటాయి. ఎపిక్ సినిమాల్లో వాడే భాష మీద కాస్త పరిశోధన చేసి ఉండాల్సింది. ఆంగ్ల పదాలు లేకుండా చూసుకున్నారు తప్ప మిగితా అంతా ఈ కాలంలో మాట్లాడుకున్నట్టే ఉంటుంది. పైగా అక్కడక్కడా కోస్తా యాస కూడా మిళితం చేయడం పరాకాష్ఠ..!! అయితే అది కావాలనే పెట్టారా లేక నటులు ఆ ప్రాంతం వాళ్ళు అవడం వల్ల పొరపాటుగా అలా పలికారా అన్నది సందేహాస్పదం!

నటన:

నటీనటులందరూ తమ పరిధిలో అద్భుతంగా నటించారు. ప్రభాస్, రానా, అనుష్క, నాజర్, సత్యరాజ్ అందరూ చాలా బాగా నటించారు. ఊహించినట్టుగానే రమ్యకృష్ణ అద్భుతంగా నటించింది. అందరూ 200% నటించారు అని ఎక్కడో రాశారు.. నాకైతే ఆ స్థాయిలో నటించింది ప్రభాకర్ (కాళకేయ) మాత్రమే అనిపించింది. పాత్ర పరిధి దాటి అద్భుతంగా నటించి ఆ పరిధినే తనవైపు లాక్కున్నాడు. తమన్నా పరిస్థితి మరీ విచిత్రం. మొదటి నుండి ఆవిడ నటన ఒకలానే ఉంటుంది. మ్యూట్ పెట్టుకొని చూస్తే బాధతో మాట్లాడే సన్నివేశంలో కోపంగా మాట్లాడుతుందా అన్నట్టుగా అక్కడ భావాలకి - పెదాల కదలిక, ముఖకవళికలకి సంబంధం లేనట్టుగా కనిపిస్తాయి. ఇక్కడా అదే జరిగి ఫర్వాలేదన్నట్టుగా నటించింది.

స్క్రీన్ ప్లే లో పొరపాట్లు:

నా అంచనా ప్రకారం సినిమా స్క్రిప్ట్ దశలో మనోహరి పాట లేదు. సాకేతుడు సైనిక రహస్యాలను రాసుకొని పావురం ద్వారా కాలకేయుడుకి చేరవేస్తాడు. ఆ తర్వాత బాహుబలి & భల్లాలదేవ అతడిని వెంటపడి పట్టుకుంటారు. అంతవరకే స్క్రిప్ట్ దశలో ఉండి ఉండాలి. కానీ మాస్ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకొని మనోహరి పాటను ఇరికించారు. సాకేతుడు ఆ రహస్యాలతో పారిపోయి దొంగల సామ్రాజ్యంలో తలదాచుకున్నట్టు, అక్కడ మనోహరి పాట పూర్తయ్యాక సాకేతుడు పారిపోతూ చివరికి పావురాన్ని ఎగరవేసి లోయలో దూకినట్టు, ఆ తర్వాత పట్టుకున్నట్టు చూపించారు. పాట జరుగుతున్నప్పుడు బాహుబలి & భల్లాలదేవ దుస్తులు, పాట పూర్తయ్యాక సాకేతుడిని పట్టుకునే సమయంలో దుస్తుల్లో మార్పు వచ్చింది. అసలు ఈ కథంతా కట్టప్ప శివుడుకి చెబుతున్నాడు. ఈ పాటను ఇరికించడం వల్ల కట్టప్ప ప్రత్యక్షంగాను, పరోక్షంగాను తను లేని దగ్గర కూడా అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది కళ్ళకు కట్టినట్టు అని చెప్పడం వల్ల స్క్రీన్ ప్లే పరంగా పెద్ద తప్పిదం జరిగింది.


యుద్ధ సన్నివేశంలో మధ్యలో వచ్చే “నాతో వచ్చే దెవరూ, చచ్చేదెవరూ” అంటూ బాహుబలి ఉత్తేజాన్ని నింపే సన్నివేశం కూడా స్క్రిప్ట్ దశలో లేదు. ఎందుకంటే ఆ సన్నివేశం చెబుతున్నప్పుడు బాహుబలి కుడి భుజం పక్కన బాణం గుచ్చుకుంటుంది. దాన్ని తీసి, శత్రు సైనికుడిని దానితోనే చంపి మళ్ళీ గుర్రంపై బయలుదేరుతాడు. ఆ సన్నివేశం తరువాత బాహుబలి కుడి భుజం దగ్గర గాయమైనట్టు కాని, రక్తపు మరకలు కాని మళ్ళీ కనిపించవు. పైగా ఆ సన్నివేశం తర్వాత గుర్రం పై వస్తున్నప్పుడు బాహుబలి ఆయుధాలు అప్పటికప్పుడు మారుతుంటాయి. ఆ సన్నివేశం జరిగాక బాహుబలి కాలకేయ దగ్గరికి వెళ్ళాలి కాబట్టి గుర్రం పై వచ్చే సన్నివేశాల్ని ఎడిటింగ్ లో వాడుకొని కవర్ చేశారు.

ఇతర విభాగాలు:
సినిమా స్లో గా ఉంది, ఎడిటింగ్ వీక్ గా ఉంది అని కూడా ఎవరో రాశారు .. కానీ హిస్టారికల్ సినిమాలకి అలాగే ఉండాలి.. ఇప్పటి సినిమాల్లాంటి టేకింగ్ ని ఇలాంటి సినిమాలకి అపాదించలేం. కోటగిరి వెంకటేశ్వర రావు పనితనానికి రాజమౌళే వంకపెట్టలేరు. ఎడిటింగ్, వి.ఎఫ్.ఎక్స్/గ్రాఫిక్స్, కళ, సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం – ఈ నాలుగు విభాగాలు అత్యద్భుతంగా పనిచేశాయి. ఈ విభాగాళ వైపు వేలెత్తి చూపించే అవసరం లేదు. 
 -

ఇక సినిమా చూస్తున్నంత సేపు ఏదో ఒక హాలివుడ్ సినిమా మనకు గుర్తొస్తూనే ఉంటుంది. కాపీని ఇన్స్పిరేషన్ గా మార్చుకొని చలామణి అవుతున్న తరుణంలో దాని గురించి మాట్లాడటం అరణ్య రోదన అవుతుంది. 
అక్కడక్కడా లాజిక్ లు కూడా మిస్ అయ్యాయి.  

ఇకపోతే బాహుబలి భారతదేశం గర్వించే సినిమా అని ప్రచారం చేసుకోవడం బాధాకరం. గతంలో వరల్డ్ సినిమాకు సమానమైన సినిమాలు మనదేశం నుంచి ఎన్నో వచ్చాయి. వాటిని దాటే స్థాయిలో బాహుబలి లేదు. ఇది అత్యధిక భారీ బడ్జెట్ చిత్రం అవ్వచ్చు, రికార్డ్స్ క్రియేట్ చేసే సినిమా కూడా అవ్వచ్చు..!! ఏదేమైనా ప్రపంచంలో వచ్చిన అన్ని సీక్వెల్ సినిమాల్లోకెల్లా మొదటి భాగాన్ని అసంపూర్ణంగా వదిలేసిన మొదటి సినిమాగా ఇది మిగిలిపోతుంది. ఒకే కథని, ఒకే సినిమాని రెండు దఫాలుగా, రెండు సార్లు ఖర్చుపెట్టుకొని చూడాల్సి రావడం నిజంగా చాలా దారుణం.


పార్ట్-2 ఎలా ఉండవచ్చు? 
కట్టప్పనే బహుబలిని చంపినట్టు చూపించారు. కట్టప్ప ఎత్తి పరిస్థితుల్లోనూ రాజుకు రక్షణగా ఉంటాడు. కాబట్టి కట్టప్ప చంపే సమయానికి భళ్లాలదేవ రాజుగా మారి, బాహుబలి చేతిలో చావబోతుండగా అతన్ని రక్షించేందుకు కట్టప్ప బాహుబలిని చంపి ఉండాలి. ఆ పరిస్థితులకు శివగామి కారణం కావచ్చు, ఎందుకంటే తను పాపం చేసినట్టు సినిమా మొదట్లోనే చెప్పించారు కాబట్టి ఇది ఒక అంచనా..!! సైనికులు శివగామిని వెంట పడటం, చంపేందుకు వెనుకాడకపోవడం బట్టి, రాజుగా మారాక భళ్లాలదేవ, బిజ్జలదేవ ఆమె ఊహించినదానికన్నా క్రూరంగా రూపాంతరం చెంది వుండవచ్చు. అమరేంద్ర బాహుబలి కుమారుడిని సైతం చంపేందుకు వెనుకాడకపోవడంతో పాప పరిహారంగా ఆ బాలుడిని ఆమె రక్షించవచ్చు. లేదా బాహుబలి విషయంలో ఆమె ఏదైనా కుట్ర చేసి ఉండవచ్చు.
ఇక భళ్లాలదేవ, దేవసేనతో ‘నన్ను కదన్నావ్’ అంటాడు, కాబట్టి భళ్లాలదేవ, దేవసేన, బాహుబలి – వీళ్ళ మధ్యలో ఒక ప్రేమకథని ఆశించవచ్చు. కాళకేయ చనిపోయాడు కాబట్టి అతని వారసులు ప్రతీకారం కోసం దండయాత్రకు రావచ్చు, ఇక్కడ ఒక చిన్నపాటి యుద్ధాన్ని ఆశించవచ్చు. అవసరమైనప్పుడు సహాయం చేస్తానని మాటిచ్చాడు ఆయుధ వ్యాపారి అస్లాం ఖాన్ (సుదీప్). అతని సహాయం తీసుకోనైనా / తీసుకోకపోయినా శివుడికి, కొడుకు పోయిన బాధలో రగిలిపోతున్న భళ్లాలదేవుడికి మధ్య యుద్ధం ఆశించవచ్చు. అయితే అప్పటికి భళ్లాలదేవుడే రాజుగా ఉంటే కట్టప్ప ఎవరి పక్షం వహిస్తాడనేది ఆసక్తికరంగా మారుతుంది. దేవసేన రాజకుమారిలా ట్రైలర్ లో & సినిమా అయ్యాక వచ్చిన క్రెడిట్స్ లో కూడా చూపించారు కాబట్టి ఆమె తల్లి తరఫు వ్యక్తులు, సన్నివేశాలు, కథ మలుపులు ఏమైనా ఉండవచ్చు. లేదా ఎవ్వరూ ఊహించనట్టుగా అమరేంద్ర బాహుబలి బతికే ఉన్నట్టు చూపించవచ్చు.

ఈ ఊహలన్నింటికి మించి బాహుబలి-2 ఉంటుందని నా గట్టి నమ్మకం. లేకపోతే రాజమౌళిపై గౌరవం తగ్గిపోతుంది.

Off the Record: పూర్వీకులు ఇచ్చిన మాట ప్రకారం, తనకు ఇష్టం లేకపోయినా భళ్లాలదేవ రాజుకు రక్షణగా ఉంటాడు కట్టప్ప.  శివగామి దగ్గర మాత్రం ఇష్టంగానే రక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తాడు. ప్రధాన రక్షణాధికారి అయినప్పటికీ భోజనం కోసం అందరు సైనికులతో సమానంగా, వరుసలో పళ్ళెం పట్టుకొని మరీ నిలబడడం ఏంటో అర్థం కాదు. పంచభక్ష్య పరమాన్నాలు ఆశించకపోయినా, ప్రధాన రక్షణ అధికారిగా అదే భోజనం అతని వద్దకు రాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ రాజనీతి పైరసీని అరికట్టాలని చెప్పేందుకు, అన్ని పత్రికలను పిలవడం, ప్రధాన తారాగణం యొక్క ఇంటర్వ్యూలు మాత్రం కొన్ని పత్రికలకే ఇవ్వడంలో కూడా కనిపిస్తుంది. ప్రభాస్ కన్నా రానాకు ఎక్కువ పబ్లిసిటి ఇస్తున్న విషయంలోనూ, ఇరవై నిమిషాల యుద్ధ ఘట్టానికి కారణమైన కాళకేయ పాత్రధారి ప్రభాకర్.ను పబ్లిసిటికి పూర్తిగా దూరంగా పెట్టడంలోనూ ఇదే రాజనీతి కనిపిస్తుంది.

కొసమెరుపు: సినిమాకు సంబంధించి ప్రస్తావించిన నెగెటివ్ విషయాలన్నీ కేవలం 5 శాతానికి  సంబంధించినవే.. అవన్నీ పక్కన పెడితే బాహుబలి 95 శాతం అద్భుతమైన సినిమా. ఈ సినిమాని విమర్శిస్తే కోడిగుడ్డుపై ఈకలు పీకినట్టే అవుతుంది.

10 కామెంట్‌లు:

  1. కోస్తా యాస అంటే? కోస్తాకంతా కలిపి ఒక యాసంటూ ఏమీ లేదు. ప్రతి రెండు జిల్లాలకో స్పెషల్ ఉచ్చారణ ఉంది. అయితే అందరికీ తెలిసిన/ అందరూ అర్థం చేసుకునే కామన్ కోస్తాయాస మన టీవీల్లో/ రేడియోల్లో వార్తలు చదివే విధానాన్ని పోలి ఉంటుంది. అది ప్రత్యక్షంగా వినాలంటే కృష్ణా-గుంటూరు జిల్లాలలో వినపడుతుంది. ఈ సినమాలో మీరు విన్నది బహుశా గోదావరి జిల్లాల యాస కావచ్చు. ఎందుకంటే దర్శకుడితో సహా ఆ నటీనటులు ఆ జిల్లాలవాళ్ళే. కానీ కోస్తాలోని మిగతా 7 జిల్లాల్లో ఉచ్చారణ పద్ధతి అలా ఉండదు.

    మీ సమీక్ష - మీకు రాజమౌళిగారి మీద ఉన్న గౌరవాన్ని ప్రతిబింబించడం లేదు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అజ్ఞాత7/24/2015

      ఈ సినిమా నేనింకా చూడలేదు కాని, మర్యాదరామన్న సినిమాలోని మాటలపై ఒక మాట.
      ఆ సినిమాలో హీరో రాయలసీమలో పుట్టి హైదరాబాదులో పెరుగుతాడు. కాని చక్కగా గోదావరి యాసలో మాట్లాడుతాడు.

      తొలగించండి
    2. @Marripoodi Mahojas: మీరన్నది నిజమే కావచ్చు.. ప్రత్యక్షంగా వింటే యాసల మధ్య తేడాల్ని గమనించవచ్చు.. రాజమౌళి గారి మీద గౌరవం ఉంది కాబట్టే, ఆయన సినిమాల్లో లోపాల్ని చూడలేకపోతున్నాను.. బాగున్న విషయాల గురించి ప్రత్యేకంగా ఎందుకు, ఎలా బాగుంది అని చెప్పడం వల్ల చదివే వారికి విసుగు పుడుతుంది, ఎందుకంటే అందరికీ అవి తెలిసిన విషయాలే ఉంటాయి.. లోపాల్ని విడమర్చి చెబితే ప్రయోజనం ఉంటుంది.. సమీక్ష ప్రధాన ఉద్దేశ్యం కూడా అదే.. తెలుగు సినిమా నుండి ప్రపంచ స్థాయి సినిమాని ఆశించాలంటే, ప్రస్తుతానికి అది కేవలం రాజమౌళి వల్లే సాధ్యం.

      తొలగించండి
    3. @bonagiri: అంచనాలు పెట్టుకోకుండా బాహుబలి చూడండి. నచ్చుతుంది. మర్యాదరామన్నలో మీరన్నది నిజమే.. మరి కాస్త శ్రధ్ధ వహించాల్సింది..!!

      తొలగించండి
  2. చాలా బాగా రాసారు.. కోడి గుడ్డు మీద ఈకలు బాగానే పీకారు... రాజమౌళి సామాజిక వర్గానికి చెందిన వారి భజన రివ్యూ లకి భిన్నంగా వుంది.. పొగుడుతూనే తిట్టడం ఏవిటో ఇప్పటికి తెలిసింది.. వెరీ గుడ్.. కీప్ ఇట్ అప్..

    రిప్లయితొలగించండి
  3. అజ్ఞాత7/25/2015

    చాలా బాగుంది రివ్యూ లోపాలను సరిగ్గా గుర్తించారు గుడ్

    రిప్లయితొలగించండి