కొంతమంది ఓటు వేశాక, పోలింగ్ బూత్ లోపలే వేలు చూపిస్తూ ఫోటో దిగారు - సెల్ ఫోన్లకు అనుమతి లేదే, బహుశా వీళ్ళు రూల్స్ ని బ్రేక్ డాన్స్ చేయించేవాళ్లు అయిఉండచ్చు, లేదా నేనే ఫస్ట్ తాలూకూ బాపతు అయిఉండచ్చు, లేదా అత్యుత్సాహ అమాయక వీర విధేయులు అయివుండవచ్చు.😂
ఇంకొంతమంది పోలింగ్ బూత్ నుండి బయటకొచ్చాక వెనకాల పోలింగ్ లొకేషన్ కనిపించేలా వేలెత్తారు - వీళ్ళ సెల్ ఫోన్లను లోపలికి కఠినంగా అనుమతించలేదేమో, లేక లోపల జనాలు ఎక్కువై దిగలేక బయటకొచ్చాక దిగారేమో, లేక ఎక్కడ ఓటేశామో అందరికీ పరోక్షంగా తెలిపేందుకు అలా దిగి ఉండవచ్చు.😄
కొంతమంది బుద్ధిగా కార్లలో, ఇళ్లలో, రూముల్లో దిగారు - మూడ్నాలుగు ఫోటోలు ఐదారు కోణాల్లో దిగి, వాళ్లకు ది బెస్ట్ అనిపించింది పోస్ట్ చేసి ఉంటారు.😉
కొంతమంది సతీసమేతంగా వేళ్లని ఎలిగెత్తారు - వాళ్ళ మధ్య అన్యోన్నత లేదన్న వారి నోళ్ళు మూయించడానికి, లేదా వాళ్ళిద్దరినీ కలిపి ఫోటో తీయడానికి మూడో వ్యక్తి ఉన్నాడని నిరూపించుకోవడానికి అలా చేసుండొచ్చు.😆
కొంతమంది వేళ్ళకి ఇంక్ చిన్నగా చుక్కలా ఉంది - అలా ఇంక్ పెట్టిన వాళ్ళు పిసినార్లు అయి ఉండాలి, లేదా ఇదివరకే నాలుగైదు సార్లు ఎలక్షన్ డ్యూటీ చేసిన అనుభవం ఉండాలి, లేదా కళాహృదయులు అయిఉండాలి.😋
కొంతమందికి ఇంక్ మరీ పెద్దగా ఉంది - అలా పెట్టినవారు కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన వాళ్ళు అయి ఉండచ్చు, లేదా ఎక్కువ జాగ్రత్తలు తీసుకునే వాళ్లు అయివుండచ్చు.😁
కొన్ని వేళ్ళకి ఇంక్ తుడిచినట్టుగా ఉంది - వాళ్ళు, వయసుతో సంబంధం లేకుండా మొదటి సారి ఓట్ వేసుండవచ్చు, లేదా సౌందర్య పోషణ కలిగిన నటీనటులు (సినిమా/జీవితం) అయి ఉండవచ్చు, లేదా గతంలో దొంగ ఓట్లు వేసిన అనుభవంతో అలవాటులో పొరపాటుగా తుడిచేసి ఉండవచ్చు.🤣
కొంతమంది కుడి చూపుడు వేలుకి ఇంకించుకుంటే, ఇంకొంతమంది మధ్యన వేలికి ఇంకించుకోబడ్డారు, ముఖ్యంగా సెలబ్రిటీలు - అలా ఇంక్ పెట్టిన వారు మొదటి సారి ఎలక్షన్ డ్యూటీ చేసుండవచ్చు, లేదా జనాలు మరీ ఎక్కువగా ఉండటం వల్ల వేళ్ల మధ్యన తేడాని గమనించకపోయి ఉంవచ్చు, లేదా వీళ్ళే ఏరికోరి ఆ వేళ్ళు చూపించి ఉండవచ్చు, లేదా అసలు ఓటు వేయకపోయినా వేసినట్టు కవర్ చేయడానికి అలా పెట్టుకొని ఉండొచ్చు.🤫
కొంతమంది అసలు వేళ్ల ఫోటోలే పెట్టలేదు - వాళ్ళ వేళ్ళు నొప్పెడుతూ ఉండవచ్చు, లేదా ప్రయాణం చేసి / క్యూలో నిలబడి అలసిపోయి సోయి లేకుండా నిద్రపోయి ఉండవచ్చు, లేదా నాలా బద్ధకస్తులు అయిఉండచ్చు.🤓
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి