నా ఏడవ కథ - మిణుకుమనే ఆశలు

మిణుకుమనే ఆశలు

                                         - అరుణ్ కుమార్ ఆలూరి

  


పళ్లెంలో ఉన్న అన్నం కలపకుండా దానివంకే దీర్ఘంగా చూస్తున్నాడు రాము. ఆర్నెల్లుగా జరుగుతున్న పరిణామాలు అతనికి మింగుడుపడటం లేదు. తినమని భార్య సైగ చేయడంతో, ఈ లోకంలోకి వచ్చాడు. రోజురోజుకూ ముభావంగా మారిపోతున్న భర్త తీరుతో ఆందోళన చెందుతూ, ఊర్లో ఉన్న అత్తామామలకి ఫోన్‌ చేసిందామె. వాళ్లు సాయంత్రానికల్లా వచ్చేశారు. నిజామాబాద్‌ నుంచి ముప్పయి కిలోమీటర్ల దూరం, బండి మీద అరగంట ప్రయాణం.

     ‘జరిగేది జరుగ్తది, ఊకె పరేషాన్‌ జేస్కోకు. మేమంత లేమా, ఏమన్న అటీటైతె సూస్కున దల్గి? సంటి పిల్లోడున్నడు ఇంట్ల, బాగా ఆలోచన జేస్తె కుడ మంచిది కాదంట. కోడలు పిల్ల నిన్ను జూశి ఫికర్‌ వెట్టుకుంటున్నది’ అమ్మానాన్న మందలింపుతో కూడిన భరోసా ఇచ్చారు. దాంతో రాము కాస్త స్థిమితపడ్డాడు. వాళ్లమ్మ రెండు, మూడు రోజులు అక్కడే ఉండి సముదాయించింది. నాన్న మాత్రం పొలం పనుల మూలాన పొద్దున వెళ్లి రాత్రికి రాసాగాడు. చివరికి తటపటాయిస్తూనే అయిదో రోజు ఇద్దరూ తిరుగు ముఖం పట్టారు. దాంతో తెలియకుండానే మళ్లీ ఆందోళన మొదలైంది రాము మదిలో!

      రాము కుటుంబానికి ఊర్లో పదెకరాల వ్యవసాయం ఉంది. అయినా అతనెప్పుడూ పొలం వైపు చూడలేదు. సర్కారీ నౌకరీ సాధించాలనేది అతని కల. డిగ్రీ పూర్తిచేశాక మూడేళ్లు హైదరాబాదులోనే ఉండి కష్టపడి చదివాడు. బ్యాంకు ఉద్యోగాలు, గ్రూప్‌ ఉద్యోగాలూ అంటూ దేన్నీ వదలకుండా, తన విద్యార్హతకు తగ్గ అన్ని పరీక్షలూ రాశాడు. రెండు, మూడు పరీక్షలు పాసైనా, ఇంటర్వ్యూ స్థాయిలో చేజారాయి. కానీ, ఊళ్లో వాళ్ల ఆరాలతో పాటు చుట్టాల గుసగుసలూ పెరగడంతో, ‘ఎక్కువ రోజులు ఆగితే బాగుండద’ని రాముకి నచ్చచెప్పి పెళ్లి చేసేశారు. బాధ్యతలు నెత్తిన పడటం, వ్యవసాయం పూర్తిగా తెలియని పని కావడంతో చివరికి ఇందూరులో మొబైల్‌ షాప్‌ పెట్టుకున్నాడతను.

      మొదట్లో వ్యాపారం మందకొడిగా సాగినా క్రమేపీ పుంజుకుంది. కొత్త ఫోన్లు కొనేవారికన్నా, పాతవి పాడయ్యాయని వచ్చేవారు ఎక్కువయ్యారు. దాంతో మూడు నెలలు ఒక వ్యక్తిని షాప్‌లో కూర్చోబెట్టి మరీ సాయంత్రం పూట మరమ్మతుల్లో శిక్షణ తీసుకున్నాడు. పది రూపాయల విలువచేసే మైక్‌ పాడైతే, సర్వీస్‌ ఛార్జీలతో కలిపి వంద రూపాయలు తీసుకునేవాడు. అయినప్పటికీ అది మిగతా కొట్లలో వసూలు చేసేదానికన్నా తక్కువే. పైగా ఆర్నెల్లలోపు మళ్లీ పాడైతే ఉచితంగా బాగుచేసి ఇచ్చేవాడు! రోజులు గడుస్తున్నకొద్దీ ఫీచర్‌ ఫోన్ల మీద జనాలకు ఆసక్తి పెరగడం కూడా రాముకు కలిసొచ్చింది. అలా మూడు అమ్మకాలు.. ఆరు మరమ్మతులతో తక్కువ సమయంలోనే ఎక్కువ ఆర్జించాడు రాము. కాల ప్రవాహంలో బాబు కూడా పుట్టాడు.

      కానీ రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా.. ఎక్కడో ఎవరికో కన్ను కుట్టినట్టుంది. కొన్నాళ్లలో అంతా తారుమారైంది. మార్కెట్‌ స్థిరత్వాన్ని కోల్పోయింది. వినియోగదారుల అవసరాల్ని అంచనా వేయని దిగ్గజ కంపెనీలు మూతపడ్డాయి. కొత్త కొత్త వెబ్‌సైట్లు పుట్టుకొచ్చాయి. ఫోన్లను ఆన్‌లైన్‌ ద్వారా విక్రయించే సంప్రదాయం మొదలైంది. దాంతో జనాలు తాము ఇన్ని సంవత్సరాలుగా బయట కొట్లలో ఫోన్లు కొని ఎంతో నష్టపోయామన్న భ్రమల్లోకి వెళ్లిపోయారు. ఆన్‌లైన్‌ షాపింగ్‌కు గిరాకీ పెరుగుతున్న కొద్దీ రాము గిరాకీ రోజురోజుకూ తగ్గుముఖం పట్టి, దిగులు పెరుగుతూ వస్తోంది.

      రోజూ కొట్టు మూసేశాక స్నేహితులతో కాసేపు మాట్లాడి ఇంటికి వెళ్లడం రాముకు పరిపాటి. అందరూ పదో తరగతి వరకు కలిసి చదువుకున్న చెడ్డీ దోస్తులే! వినాయక్‌ నగర్‌ వంద ఫీట్ల రోడ్డు, వాళ్లు కలుసుకునే చోటు. అక్కడ సాయంత్రం పూట రకరకాల చిరుతిళ్లు, తోపుడుబండ్ల మీద వరుసగా కనిపిస్తాయి. ఆ రోజు కూడా వాళ్లు కలుసుకున్నారు. ఊళ్లో విశేషాలు, ఇతర స్నేహితుల ఇబ్బందులు చర్చించుకున్నాక, ‘‘అసలు ఆన్‌లైన్‌ గొడవ లేని వ్యాపారం పెట్టాల్రా, లేకపోతే బతకలేం!’’ అన్నాడు రాము.

      ‘‘అరె.... సబ్బులు, షాంపూలూ ఆన్‌లైన్ల దొర్కుతున్నయ్‌. ఇట్లయితే కిరాణా దుక్నాలు గుడ మెల్లమెల్లగ మూతవడ్తయేమోరా’’ అన్నాడు సెలూన్‌ పెట్టుకున్న హరి. పది తర్వాత చదువు ఆపేసినా, కస్టమర్లతో మాట్లాడుతూ జ్ఞానాన్ని పెంచుకోవడం వృత్తిరీత్యా అతను నేర్చుకున్న విద్య. అయితే సమయం సందర్భం చూసుకోకుండా ఆ తెలివిని ప్రదర్శించడం అతని బలహీనత.

      హరి మాటలకు, కిరాణా దుకాణం నడిపే గోపికి సర్రున కోపం వచ్చి, ‘‘నీకేంరబై! జనాలకు జుట్టు పెరగదా? నీ దగ్గరకు రారా? నీకేం ఢోకా లేదు, టెన్షన్‌ పడకు’’ అన్నాడు. గతుక్కుమన్నాడు హరి. ఎప్పుడు కలిసినా, విషయం అతని మీదకే మళ్లడం, తనేదో ఉత్తపుణ్యానికే సంపాదిస్తున్నాడని వీళ్లంతా అనుకోవడం షరా మామూలే!      ‘‘అవన్నీ కాదురా రాము... ఆన్‌లైన్‌ ప్రభావం లేనివీ, పెద్ద కంపెనీల కండ్లువడనివీ అంటే, టిఫిన్‌ సెంటర్లు, మెస్‌లు. అవి పెడ్తవా మరి’’ అన్నాడు మందులకొట్టు నడిపిస్తున్న సామ్రాట్‌.

      ‘‘టిఫిన్‌ సెంటర్‌ పెట్టొచ్చు కానీ మాస్టర్లతోని పరేషాన్‌రా! మొన్న మా చిన్నమామ కొడుకు కిషన్‌గాడు రాజరాజేంద్ర టాకీస్‌ చౌరస్తాల పెట్టిండు. రెండు నెల్ల బయానా ఇచ్చి, ఫర్నిచర్‌ అంత కొని ఓపెనింగ్‌ చేసినంక, పదిహేను రోజులకు మాస్టర్‌ ఏదో లొల్లి వెట్టుకొని ఎల్లిపోయిండట! కొత్త మాస్టర్‌ని లెంకదల్గి సచ్చిపోయిండనుకో! ఓలు దొర్కక లాస్టుకి ఫర్నిచర్‌ అంత అచ్చినకాడికి అమ్మేస్కోని ఇంట్ల కూసున్నడు. ఇంకొకడి మీద ఆధారపడి చేసేటి బిజినెస్‌లు కష్టంరా! మాస్టర్‌ రాకుంటే మనమే టిఫిన్లు చేసేటట్టు ఉండాల!’’ అన్నాడు రాము.

      ‘‘వంట జేసుడు మనతోటి యాడైతదిరా! అయినా ఈ ముచ్చట ఒడవది, తెగదిగని బజ్జీలు తిని ఇంటికి వోదాం నడువుండ్రి, మస్తు నిద్రొస్తుంది’’ అన్నాడు హరి. మిగిలిన ముగ్గురూ అతని వంక చూశారు. వాళ్ల చూపుల్లోని విషయం అర్థం చేసుకున్నాడు హరి. ‘కడ్లల్లార.. అప్పటికి నాకేదో కోట్లల్ల లాభమస్తున్నట్టు, ఈల్లకేదో లక్షలల్ల లాస్‌ అస్తున్నట్టు’ అని గొణుక్కుంటూ బజ్జీలు కొని తీసుకొచ్చాడు. అందరూ అన్యమనస్కంగా తిని ఇళ్లకు వెళ్లిపోయారు.     


ఆ రోజు ఉదయం ఏడింటికే రాము ఫోన్‌ ఆగకుండా మోగుతోంది. లేచి చూస్తే, అతనికి ఫోన్లు సప్లయి చేసే శేఖర్‌. ‘మామూలుగా ఇంత పొద్దున చేయడే’ అనుకుంటూ ఫోన్‌ ఎత్తాడు. ఆన్‌లైన్‌లో మొబైళ్ల అమ్మకాల్ని నిషేధించాలని ఈ రోజు ర్యాలీ నిర్వహిస్తున్నారని, పదింటికల్లా కలెక్టర్‌ గ్రౌండ్‌కి వచ్చేయమని చెప్పాడు. వీలైనంత ఎక్కువమందిని తీసుకురమ్మన్నాడు. వెంటనే బయటకొచ్చి స్నేహితులకు ఫోన్‌ కలిపాడు రాము.
      ‘‘అరే... గిట్లాంటియేమన్నుంటే మంగళవారం పెట్టుకోవాల్రా. గిరాకి అంతా పాడుగాదా?’ డాంబికానికి పోతూ నసిగాడు హరి. రాముకి చిర్రెత్తుకొచ్చింది. ‘‘సోమవారంరోజు ఏం గిరాకి ఉంటదిరా నీకు.. ఓడికి కథలు చెప్తున్నవ్‌? రేప్పొద్దున ఏ మల్టీనేషనల్‌ వాడో అచ్చి సెలూన్లు వెడ్తా అంటే నీదిక్కుకెంచి నేను రావల్నా? అద్దా?’’ అన్నాడు. హరి ప్రాణం చల్లపడ్డది. ఈ దేశంలో రాజకీయాలన్నీ కార్పొరేట్‌ శక్తుల చేతుల్లోనే ఉన్నాయని అతని గట్టి నమ్మకం. కేంద్రంలో ప్రభుత్వం తలచుకుందంటే చాలు, ఒక్క బిల్లుతో వేల కుటుంబాలు రోడ్డునపడటానికి ఎక్కువ సమయం పట్టదని అతనికి తెలుసు. ‘‘అరే నువ్వేం టెన్షన్‌ తీస్కోకు. నువ్‌ అందరికంటే ముందువో. మనోళ్లకి ఫోన్‌ చేసి నేనే పట్కస్త’’ అని మద్దతిచ్చాడు.

      పదకొండైనా మైదానంలో వందమందికి మించి పోగవ్వలేదు. ఇప్పుడు ర్యాలీలు చేసినా జనాలు పట్టించుకోరు అని కొంతమంది, ఈ వ్యాపారం బ్రేక్‌ ఈవెన్‌ పాయింట్‌ కొచ్చింది కాబట్టి మరో వ్యాపారంలోకి మారక తప్పదని ఇంకొంతమంది రాకపోయి ఉండొచ్చని శేఖర్‌ అంచనాకొచ్చాడు. ‘ఉన్నోడికేం బాధ లేదు. ఇంకో బిజినెస్‌ పెట్టుకుంటడు. నడిమిట్ల మనసుంటోల్లకే ఈ తిప్పలు! ఉన్నదంత ఊడ్చి, సాలకపోతె అప్పులు తెచ్చి పెట్టినందుకు తప్పది’ అనుకుంటూ ర్యాలీని ప్రారంభించారు.

      కలెక్టర్‌ గ్రౌండ్‌ నుంచి బయలుదేరిన ర్యాలీ.. ఫూలంగ్‌ చౌరస్తా మీదుగా సాగి, ఖిల్లా రామాలయం, పాత బస్టాండ్, కంఠేశ్వర్‌లను పలకరించి తిరిగి కలెక్టర్‌ గ్రౌండ్‌కు చేరుకుంది. ఆ ప్రయాణంలో కొందరు వీళ్లని వింతగా చూశారు. ఇంకొందరు జాలిపడ్డారు, కానీ మరికొందరు వీళ్లని చూసి నవ్వుకోవడాన్ని రాము జీర్ణించుకోలేకపోయాడు. దాంతో విలేకరులతో మాట్లాడుతూ, ‘‘చాలామంది ఆన్‌లైన్‌లో కొత్త ఫోన్‌ ఫలానా రోజు వస్తోందని తెలియగానే పోటీ పడి కొనేస్తున్నారు. అసలు ఆ ఫోన్లు ఎలా పని చేస్తున్నాయి. వాటికి వారంటీ అంటూ ఉంటోందా? అని ఆలోచించడం లేదు. కొన్ని ఫోన్లు రేడియేషన్‌ వల్ల అయిదు నిమిషాలకే వేడెక్కిపోతున్నాయి. ఇంకొన్నింటిలో కెమెరా సరిగ్గా ఉండటం లేదు. మరికొన్ని తొందరగా హ్యాంగ్‌ అవుతున్నాయి. కానీ ఇవన్నీ కొన్నాక కాని తెలియట్లేదు. ఇప్పుడు ఆన్‌లైన్‌లో ప్రీ-బుకింగ్‌ చేసి అమ్మే ఏ ఫోన్‌కి కూడా తగినన్ని స్పేర్‌ పార్టులు తయారు చేయకుండానే విడుదల చేస్తున్నారు. ఒక సంవత్సరం వారంటీ మాత్రం ఇస్తున్నారు. ఎందుకంటే ఏడాది పాటు వాటికేం కాదు అని వాళ్లకి తెలుసు కాబట్టి. కానీ, ఆ తర్వాత పాడైతే, రిపేర్‌ చెయ్యలేక సర్వీసింగ్‌ సెంటర్లు చేతులెత్తేస్తున్నాయి. చచ్చినట్లు వేలు ఖర్చుపెట్టి మళ్లీ కొత్త ఫోన్‌ కొనాల్సి వస్తోంది. కాబట్టి సోదరులారా, మా పొట్టకొడుతున్న ఈ ఆన్‌లైన్‌ అమ్మకాలను నిషేధించాలని కోరుకుంటూ, ప్రజలు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, నష్టపోకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం’ అన్నాడు. ప్రెస్‌తో రాము మాట్లాడిన తీరుకి శేఖర్‌ ఆశ్చర్యపోయాడు. సామ్రాట్, హరి, గోపి కరతాళధ్వనులు చేశారు. రాము చెప్పింది చెప్పినట్లు పేపర్లో వేస్తే, చదివినవాళ్లలో కాస్తయినా మార్పు వస్తుందని అంతా అనుకున్నారు. 

 
మర్నాడు ఉదయం కొన్ని పేపర్లలో ర్యాలీ గురించి ఎక్కడో మూలన చిన్న వార్తగా ఫొటో కూడా లేకుండా వేశారు. మరి కొన్ని పత్రికలు ఏమీ వేయలేదు. కానీ అన్ని పత్రికల్లో మరో వార్త బాగా పెద్దగా వచ్చింది. మనదేశంలో ఆన్‌లైన్‌ వ్యాపారం నిర్వహిస్తున్న అమెరికాకి చెందిన కంపెనీకి, హైదరాబాద్‌లో గిడ్డంగుల్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం భూమిని కేటాయించినట్టు రాశారు. దాంతో రాము దిగులు మరింత ఎక్కువైంది.

      మరికొన్నాళ్లకు 4జీ సేవలు వినియోగంలోకి రావడంతో ఆన్‌లైన్‌ వ్యాపారానికి మరింత ఊతం ఇచ్చినట్టు అయింది. చిన్న చిన్న టౌన్లకి సైతం వస్తువుల్ని సరఫరా చేసేందుకు ఏకంగా సొంత కొరియర్‌ సర్వీసుల్ని ఏర్పాటు చేసుకున్నాయి ఆయా సంస్థలు. చివరికి ఆన్‌లైన్‌లో పేడ, పిడకలు కూడా అమ్మకానికి పెట్టేశారు. అలోపతి మందుల్ని కూడా వీటి సరసన చేర్చడంతో డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేశారు. అందరు మెడికల్‌ షాపుల వాళ్లు కలిసి దేశవ్యాప్తంగా ఒకరోజు దుకాణాల్ని మూసి నిరసన తెలిపారు. రాము, హరి, గోపి కలిసి సామ్రాట్‌కి మద్దతుగా వాళ్లు తీసిన జులుస్‌లో పాల్గొన్నారు.

      ఆ రోజు సాయంత్రం నలుగురు స్నేహితులు చాలా దిగులుగా కనిపించారు. చేతుల్లోని సర్వపిండి అలాగే ఉంది. ఆ బండి పక్కనే ఉన్న పాన్‌షాప్‌ దగ్గర వేలాడుతున్న దిన పత్రికలోని వార్త రాము కంటబడింది. ‘గడిచిన దసరా దీపావళి పండగలప్పుడు దేశం మొత్తం మీద ఆ అయిదు రోజుల్లో జరిగిన ఆన్‌లైన్‌ వ్యాపారం విలువ అక్షరాలా రూ.పదిహేను వేల కోట్లు’ అని దాని సారాంశం. కళ్లు మూసుకుని అచేతనంగా తల అడ్డంగా ఊపాడు రాము. పదిహేను వేల కోట్ల రూపాయల వ్యాపారం పోవడంతో.. దాని ప్రభావం ఎన్ని వేల కుటుంబాల మీద ఉంటుందన్న ఊహే అతన్ని భయభ్రాంతులకు గురిచేసింది.

      ఇంతలో హరి, ‘‘అందుకే కులవృత్తుల్ని నమ్ముకొమ్మని పెద్దోళ్లు చెప్పిండ్రు’’ అంటూ తనలో తానే మాట్లాడుకున్నట్టుగా అన్నాడు. అసలే కోపం మీద ఉన్న సామ్రాట్‌కి ఆ మాటలు మంట పుట్టించాయి. ‘‘నేను రజకుణ్నిరా. ఇప్పుడు ఎవరు బట్టలు ఉతికిపిచ్చుకుంటున్నరు చెప్పు? ఊర్లల్లకు గుడ వాషింగ్‌ మెషిన్లు అచ్చేశినయ్‌! నా కులవృత్తిని నమ్ముకొని నేనెట్ల బతకగల్గుతా?’’ అన్నాడు. అతన్ని సముదాయిస్తున్నట్టుగా చూసిన రాము, ‘‘ఒకప్పుడు డైనోసార్లు బతికుండేటియి! ఆ తర్వాత అంతరించిపోయినయి. ఇప్పుడు సుత అంతే! మాట్లాడేటోళ్లు లేని భాషలు గంగల కలిసిపోయినట్టే కొన్ని వృత్తులు గుడ గంగల కలుస్తయ్‌- ఆటితో పాటే ఆ వృత్తుల్ని నమ్ముకున్న మనుషులు గుడ!’’ అన్నాడు నిర్లిప్తంగా.

      ఇంతలో రాము ఫోను మోగింది. చేసింది వాళ్ల నాన్న. ‘‘హలో బాపు’’ అనుకుంటూ పక్కకెళ్లాడు. వెళ్తున్న రాము వంక దిగులుగా చూశాడు గోపి. ఉప్పులు, పప్పులు దగ్గర్నుంచి అన్ని ఆన్‌లైన్‌లోనే దొరకడం, చివరికి వాళ్ల బంధువులు కూడా అక్కణ్నుంచే తెప్పించుకోవడం అతనికి మింగుడు పడటం లేదు. ‘‘చిన్న చిన్న వస్తువులు, లూజ్‌ ఐటమ్స్‌ కోసం అస్తున్నరు తప్ప నెలవారీ సరుకుల కోసం ఓలు అస్తలేరు. నాకచ్చే రేటుకన్నా ఆన్‌లైన్లల తక్వకే దొర్కుతున్నది. ఆడికి అసలు అంత తక్వకు ఎట్ల దొర్కుతున్నదో అర్థమైతలేదు. టెన్షన్‌ అయితున్నది’’ అన్నాడు.

      ‘‘ఈ జనాల్ని గుడ తప్పుపట్టలేం! అంతా మధ్యతరగతోళ్లే. సంపాదన సాలది, ఎక్వ సంపాదించదల్గి దారి దొర్కది. ఉన్నంతల పైసల్‌ మిగుల్చుదమని, ఆ సైటు ఈ సైటు చూసి, యాడ తక్వకస్తే ఆడ కొంటున్నరు’’ అన్నాడు సామ్రాట్‌ఇంతలో రాము ఫోన్‌ మాట్లాడి వచ్చేశాడు. అతని మొహంలో మునుపటి దిగులు లేదు. కాస్త నిబ్బరంగా కనిపిస్తున్నాడు. ‘‘ఏమైందిరా?’’ అన్నారు దోస్తులందరూ ముక్తకంఠంతో!

      ‘‘నేను ఇంటికి పోతున్నరా... బాపు ఎంటనే అచ్చేశెయ్‌ అంటున్నడు’’ ఆనందంతో చెప్పాడు రాము. అందరూ నోరెళ్లబెట్టారు. ‘‘అసలేం మాట్లాడినవ్‌రా ఫోన్ల?’’ అన్న వాళ్ల ప్రశ్నకు, ఫోన్లో రికార్డయిన తమ సంభాషణను వినిపించాడు.


      ‘‘అరేయ్‌ రామూ.. ఇన్ని సంవత్సరాలు- సదుకున్నోడివి నీకెందుకులే అని అడగలేగాని, ఇప్పుడు ఒక మాట చెప్తా ఇంటవా?’’
      ‘‘చెప్పు బాపు’’
      ‘‘నువ్వు చిన్నగున్నప్పుడు మనకున్నది పదెకరాలు. ఆ తర్వాత మనం కొన్నది పదిహేను ఎకరాలు. అంటే మొత్తం ఇరవై ఐదు ఎకరాల పొలం మనకున్నదిప్పుడు’’
      ‘‘బాపూ..’’
      ‘అవున్రా నిజం! మనూర్లె అందరు అమెరికాల, ఆస్ట్రేలియాల పొయి సదువుకుంట అటే సెటిల్‌ అయితున్నరు. ఇంకొంత మంది నీలెక్క బిజినెస్‌ పెట్టుకొని దూరంగ బతుకుతున్నరు. మరి ఈడుండి యవుసం జేశెటోడు ఓడు? ఇంత మంచి భూమిని ఇట్లనే ఇడ్సివెడ్తమా?’’
      ‘‘అంటే.. అదీ..’’
      ‘‘అరే... 2010ల మన పంటకు ఎంతచ్చిందో నీకు ఎరుకే కదా? అదే నువ్వు యాపారంల సంపాదించాలంటే కనీసం పదేండ్లు అయితది, ఎర్కనే కదా!’’
      ‘‘అవును బాపు’’
      ‘‘ఈ ఒక్కసారి నా మాటిను. ఒక్క మూడేండ్లు నాతోని యవుసం జేసుడు నేర్సుకో... అప్పటికీ యవుసం నీకు సమజ్‌ కాకపోయిన, లేక యవుసం జేసుడు నీకిష్టం లేకపోయినా, మనకున్న పొలంల సగం అమ్మి నీకు ఇంతకంటే పెద్ద బిజినెస్‌ పెట్టిస్త. సదుకున్నోడు యవుసం జేసుడేందని ఇది కాకు.. అమెరికాల ఒక్కొక్కోడు ఒంటిచేత్తోని వెయ్యి ఎకరాలు సాగు జేత్తున్నరట... మరి మనం గుడ అట్ల జెయ్యాలంటే ఏమేం జెయ్యాల్నో నీ సదువు, తెలివితోని దొర్కవట్టు’’ అని వాళ్ల నాన్న చెప్పాక కాల్‌ కట్ అయింది.

      కాసేపు అంతా నిశ్శబ్దం. ఆ తర్వాత సర్వపిండి తినడం పూర్తి చేసిన రాము, ‘‘ఇన్ని రోజులు ఆన్‌లైన్‌ గోల లేని పని ఏమున్నదా అని ఆలోచించి నెత్తి ఖరాబ్‌ జేసుకున్నరా.... ఇప్పుడర్థమైంది అది వ్యవసాయమని! ఇగ రిస్కు, టెన్షన్‌ ప్రతి వ్యాపారంలో ఉంటది. వ్యవసాయాన్ని కూడా అట్లనే అనుకుందాం. అదేదో మనూర్లనే, మన ఇంటి దగ్గర్నే పడదాం’’ అన్నాడు.

      గోపి, సామ్రాట్‌ ఒకళ్ల మొహాలు ఒకళ్లు చూసుకున్నారు. ఏదో సమాధానం దొరుకుతోంది వాళ్ల మదిలో! రాము కొనసాగిస్తూ, ‘‘మీక్కూడా ఎంతో కొంత పొలమున్నది కదా... స్టార్ట్‌ చేద్దాం. ఇంకో ఇరవై ఏండ్లు అయినంక వ్యవసాయం చేసెటోళ్లు వేళ్ల మీద లెక్కవెట్టేటట్టు ఉంటరు. మనూర్లె, మన వయసోళ్లు మనతోని కలిపి పదిమంది దాటరు. అప్పుడు ఊర్లె ఉన్నపొలం మొత్తం కౌలుకు తీసుకొమ్మని మన దగ్గరికే అస్తరు. పొలం కొనకున్నా మనిషికి వంద ఎకరాల దాక సాగుచేస్తం. ఏమంటరు?’’ అన్నాడు.

      సంతోషంతో తలలూపారు గోపి, సామ్రాట్‌. హరి మాత్రం రాము లెక్కలకు నోరెళ్లబెట్టాడు. కాసేపటికి తేరుకొని, ‘‘ట్రిమ్మర్లు అచ్చినకాడ్నుంచి షాపుకచ్చి షేవింగ్‌ చేస్కునెటోళ్లు తక్కువైండ్రు, రెడీమేడ్‌ కిట్లు అచ్చిన్నుంచి ఫేషియల్‌ చేస్కునేటోల్లు గుడ ఎక్కువ కనిపిస్తలేరు. ఆదివారం, చుట్టీలు ఉన్నప్పుడు తప్ప మిగిల్న రోజులల్ల కస్టమర్లు అస్తలేరు. ఈ షాపుని మనూర్లనే పెట్టి, నేను గుడ మీతోటి యవుసంల దున్కుత! నా పొట్టకన్న నేను పండించుకుంట’’ అన్నాడు.

      హరి నిర్ణయానికి రాము, గోపి, సామ్రాట్‌ భుజం తట్టారు. ఇంతలో సర్వపిండి అమ్మే బండి అతను అడిగాడు, ‘‘ఏ ఊరన్నా మీది?’’ అని.
      ‘‘అంకాపూర్‌ అన్నా’’ అని బదులిచ్చి నలుగురూ బైకుల్ని ఉత్సాహంగా దౌడు తీయించారు.

http://www.teluguvelugu.in/kathalu.php?news_id=MTMzNQ==&subid=Nw==&menid=Mw==&authr_id=MTAwMw==

* తెలుగు వెలుగు మాస పత్రిక లో జూన్ 2019 సంచికలో ప్రచురితం *




8 కామెంట్‌లు:

  1. తెలుగు వెలుగు జూన్ (2019) సంచిక మార్కెట్లోకి వచ్చిన దగ్గరి నుంచి కథ చదివిన పాఠకులు మెస్సేజ్ రూపంలో స్పందిచడమే కాకుండా ఫోన్లు చేసి మరీ అభినందనలు తెలియజేశారు. చాలా సంతోషంగా ఉంది.
    .
    ఫోన్లు చేసి మనసారా అభినందించిన పాఠకులు:
    .
    వి. పి. చందన్ రావ్ (కవి, ఉపన్యాసకులు – నిజామాబాద్), హిమజ (విజయవాడ), ఎస్. వి. ఆర్. కృష్ణా రావ్ (విజయనగరం), వి. కే. చైతన్య (ఆంధ్రనగర్, నిజామాబాద్), సి. ఏ. ప్రసాద్ (సైనిక్ పూరి, హైదరాబాద్), రమేష్ నాయని (అడ్వకేట్, హైదరాబాద్), నారాయణ మూర్తి (వైజాగ్), ఎలమంద(ఖమ్మం), కే. వి. ప్రసాద్ (బెంగళూరు), షేక్ మాబుసుభాని (చిలకలూరి పేట, గుంటూరు), చక్రవర్తి (కామారెడ్డి), రాజమణి (ఆర్య నగర్, నిజామాబాద్) గార్లకు – అలాగే మెసేజ్ ల రూపంలో అభినందనలు తెలియజేసిన రామానుజం (విశ్రాంత ఉపాధ్యాయుడు, విజయనగరం), వాణి శ్రీపాద (అనంతపురం), వై. సంజీవ కుమార్ (స్కై ఫౌండేషన్), బుగ్గా రెడ్డి (సెక్రెటరి, జిల్లా గ్రంథాలయ సంస్థ-నిజామాబాద్), చింతా అశోక్ కుమార్ (సికింద్రాబాద్), రమేష్ (వైష్ణవి ఎస్టేట్, హైదరాబాద్) గార్లు ఇచ్చిన ప్రోత్సాహం మాటల్లో చెప్పలేనిది. వీరందరికీ మనఃపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. {వీళ్ళలో ఒకరు సైకిల్ షాప్ నడుపుతుండగా ఇంకొకరు టీ షాప్ నడుపుతున్నారు. వాళ్ళు పుస్తకాలు, కథలు చదువుతుండడం - పైగా ఫోన్ చేసి అభినందించడం నన్ను అమితాశ్చర్యానికి, ఆనందానికి గురిచేసింది. They made my day.}
    .
    అలాగే కథ చదివి స్పందించిన సోపతోళ్లు, ఆపతోళ్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
    .
    (నోట్: ఈ కథ మొదటి డ్రాఫ్ట్ సంవత్సరం క్రితం రాశాను. ఆ తరువాత పనిలో పడి మర్చిపోయాను. మొత్తానికి పూర్తి చేసి ఫిబ్రవరిలో తెలుగు వెలుగు కి పంపించాను. వారు జూన్ లో అచ్చేశారు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, మేలో విడుదలై ‘ఎపిక్ బ్లాక్ బస్టర్’గా ప్రకటించుకోబడ్డ ఒక సినిమాలోని కొన్ని అంశాలకి, ఈ కథలోని క్లైమాక్స్ కి కాస్త సారూప్యత ఉన్నట్టు మీకు అనిపిస్తే, అది యాధృచ్చికమే కానీ వారికి మాకు ఎటువంటి సంబంధం లేదు అని, ఎవర్నీ ఎవరూ కాపీ కొట్టడం, ఇన్స్పైర్ చేసుకోవడం లాంటివి కానీ చేయలేదని సవినయంగా మనవి చేస్తున్నాను  )
    .
    - అరుణ్ కుమార్ ఆలూరి
    ఈ నోట్ రాసిన తేదీ: 04-07-2019

    రిప్లయితొలగించండి
  2. ఫోన్లు చేసి అభినందించిన వక్తల పలుకులు సంక్షిప్త రూపంలో:
    .
    వి. పి. చందన్ రావ్ (కవి, ఉపన్యాసకులు – నిజామాబాద్): మంచి వాక్యం చదివిన తరువాత ఆ వాక్యం రసాత్మకం కావ్యం. మహాకవి కుందుర్తి గారు అన్నట్టు వచనం ఎలా ఉండాలి అంటే బయట వ్యక్తులు సంభాశించినట్టుగా ఉండాలి. మీ రచనలో నాకు బాగా నచ్చింది ఏంటంటే రచయిత ఎక్కడా కనబడరు, తెర వెనుక ఉంటారు. తెర ముందు పాత్రలు సంభాశించుకోవడం, సన్నివేశాలు ఆవిష్కరించిన విధానము చాలా నచ్చింది. మరొక్క సారి శుభాకాంక్షలు.
    .
    హిమజ (విజయవాడ): మీ కథ చాలా బాగుందండి. ఆన్ లైన్ బిజినెస్ వచ్చాక చిన్న చిన్న వ్యాపారులు ఎంత నష్టపోతున్నారో తెలిసింది. మేము ఆన్ లైన్ లో కొంటుంటాం కాని వీళ్ళు ఇంత సఫర్ అవుతున్నారని అనుకోలేదు.
    .
    ఎస్. వి. ఆర్. కృష్ణా రావ్ (విజయనగరం): కథ చాలా బాగుంది. ప్రస్తుతం ప్రతి కుటుంబంలో జరుగుతున్న వాస్తవాన్ని మీరు బాగా స్టడీ చేసి చాలా చక్కగా ప్రజెంట్ చేశారు. నేను కథ జరిగిన ప్రాంతంలో తిరిగాను. మీ ప్రాంత యాసని చాలా క్లియర్ గా వాడారు. అది అర్థం చేసుకోవడానికి మాకు కొంత ఇబ్బంది అయ్యింది కాని కంటెంట్ బాగున్నప్పుడు మాటలకాంటేయదు.
    .
    వి. కే. చైతన్య (ఆంధ్రనగర్, నిజామాబాద్): నేను నిజామాబాద్, చెన్నై, హైదరాబాద్, చిత్తూరు – ఇలా వివిధ ప్రాంతాలలో పని చేశాను. 1990 ప్రాంతంలో అంకాపూర్ అభివృద్ధి గురించి ఈనాడు సండే మ్యాగజైన్ కోసం ఆర్టికల్ రాశాను. మీ కథ చదువుతుంటే ఎక్కడో ఎక్కడో తిరిగి చివరికి మన ఊరికి రావడం అనేది ఎంత సంతోషంగా ఉంటుందో అనిపించింది. కథలో యాస ఎక్కడా అక్షరం పొల్లుపోకుండా బాగా రాశారు. చిన్నప్పుడు స్నేహితులతో మాట్లాడినంత హాయిగా అనిపించింది.
    .
    సి. ఏ. ప్రసాద్ (సైనిక్ పూరి, హైదరాబాద్): మిణుకుమనే ఆశలు కథ చాలా చక్కగా ఉంది. మాది బేసిక్ గా గుంటూరు డిస్ట్రిక్ట్. 1953లో అప్పటి ప్రభుత్వాలు సరిగ్గా సహకరించక పంటలు లేక వ్యవసాయం ఇబ్బందిగా మారడంతో మా వాళ్ళు వరంగల్ షిఫ్ట్ చేశారు. తర్వాత 1993లో హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాము. మీ కథ చదివాక అదంతా ఒక్కసారిగా గిర్రున తిరిగింది.
    .
    రమేష్ నాయని(అడ్వకేట్, హైదరాబాద్): స్టోరి చాలా బాగుందండి. కాంటెంపరరి థీం తీసుకున్నారు. నేను చాలా మందిని చూస్తున్నాను, ఇది నిజంగా చాలా సీరియస్ ఇష్యు. కథ రూపంలో తీసుకురావడం అనేది మీరు చేసిన మంచి పని. ఆన్ లైన్ వచ్చిన తరువాత బిజినెస్ డల్ అయిపోయి వేరే ఏం చేయాలో తెలియక షాప్ ఓనర్లు సూసైడ్ కూడా చేసుకుంటున్నారు. ఆన్ లైన్ లో కొనుక్కోవడానికి నేను కూడా వ్యతిరేకినే!
    .
    నారాయణ మూర్తి (వైజాగ్): మాది వైజాగ్ అయినప్పటికీ, ప్రస్తుతం గోవాలో ఉంటున్నాము. మీ కథ చదివాక ఒకసారి ఊరికి వెళ్లి వచ్చినట్టు అనిపించింది. పండించిన రైతులు ఎప్పుడు గిట్టుబాటు ధర రాక మోసపోతూ ఉన్నారు. దళారులకు మాత్రం ఏ ఇబ్బందీ లేదు. మాకు కొబ్బరి తోటలు ఉండేవి. బయట 35 రూ. - 40 రూ. అమ్మే కొబ్బరి బొండంని మా దగ్గర నుంచి రూపాయి, రూపాయిన్నర పెట్టి కొనుక్కెల్లేవారు. ఇంత తక్కువేంటి అంటే, ఇంకా ఖర్చులుంటాయి కదా అనేవారు. రైతులు మోసపోకుండా ఉండే వ్యవస్థ రావాలి.
    .
    ఎలమంద(ఖమ్మం): అగ్రికల్చర్ మీద మంచి కాన్సెప్ట్ మీద కథ, సబ్జెక్ట్ చాలా బాగా డెవెలప్ చేశారు. అభినందనలు!
    .
    కే. వి. ప్రసాద్ (బెంగళూరు): నేను 1990 - 98 వరకు ఉద్యోగ రీత్యా ఇందూరులో ఉన్నాను. 1995 - 98 ఆంధ్రాబ్యాంకు మేనేజరుగా అంకాపూర్ లో పనిచేశాను. ఆ ప్రాంతమంతా చాలా ఇష్టం నాకు. మీ కథ ఆ ప్రాంతం చుట్టూ సాగుతుండడంతో పాత జ్ఞాపకాలు కళ్ళ ముందు మెదిలాయి. అప్పట్లో నక్సలైట్ల ఉద్యమం ఉదృత స్థాయిలో ఉండేది. రోజు సాయంత్రం బ్యాంకు తాళాలు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ లో పెట్టేవాడిని. మళ్లీ ఉదయం వెళ్లి తీసుకొని బ్యాంకు తెరిచే వాడిని. మొత్తానికి మీ కథ బాగుంది.
    .
    షేక్ మాబుసుభాని (సైకిల్ షాప్, చిలకలూరి పేట, గుంటూరు): కథ అద్భుతంగా రాశారు. జీవితంలో రోజులు ఎప్పుడు ఒకేలాగా ఉండవు అని మీరు కథలో రాశారు. ప్రపంచంలో ప్రతి మనిషి జీవితం ఇప్పుడున్న పరిస్థితుల్లోనే, అంటే చేసే పని కాని, వచ్చే ఆదాయం కాని ఏదైనా ఇలాగే జీవితాంతం కొనసాగుతుంది అని మనిషి అనుకుంటాడు. కాని మీరు ఇక్కడ రాసినట్టు అట్లా జరగదు. ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటటువంటి మాట ఇది.
    .
    చక్రవర్తి (కామారెడ్డి): కథ చదివాము, బాగుంది అండి.
    .
    - అరుణ్ కుమార్ ఆలూరి
    ఈ నోట్ రాసిన తేదీ: 04-07-2019

    రిప్లయితొలగించండి
  3. మెసేజ్ (వాట్సప్/ఎస్.ఏం.ఎస్) రూపంలో వచ్చిన పాఠకుల స్పందనలు యథాతతంగా:
    .
    రామానుజం (విశ్రాంత ఉపాధ్యాయుడు, విజయనగరం): మీ కథ స్ఫూర్తిదాయకంగా, సందేశాత్మకంగా.. నేటి తరానికి అవసరమైన సూచన ప్రాయంగా ఉంది. శుభాకాంక్షలు. మీ కలం నుండి మరిన్ని అంశాలు వెలుగులోకి రావాలని ఆశిస్తున్నాను.
    .
    వాణి శ్రీపాద: Telugu Velugu Magazine lo me story chala bavundhi... simply awesome .. me writing skills superb... last lo father chepe words, aa four friends conversation bavundi... subject & ending inka bavundi... Telugu Velugu lo story publish iyindante manchi subject ankutam ma lanti readers...!
    .
    కథ బాగుంది అని మెసేజ్ చేసిన మరికొంత మంది పాఠకులు:
    .
    వై. సంజీవ కుమార్ (స్కై ఫౌండేషన్), బుగ్గా రెడ్డి (సెక్రెటరి, జిల్లా గ్రంథాలయ సంస్థ-నిజామాబాద్), చింతా అశోక్ కుమార్ (సికింద్రాబాద్), రమేష్ (వైష్ణవి ఎస్టేట్, హైదరాబాద్).
    .
    - అరుణ్ కుమార్ ఆలూరి
    ఈ నోట్ రాసిన తేదీ: 04-07-2019

    రిప్లయితొలగించండి
  4. అందరికీ శతకోటి వందనాలు
    - అరుణ్ కుమార్ ఆలూరి

    రిప్లయితొలగించండి
  5. కథ సమకాలీనంగా చాలా బాగుంది. నాకు బాగా నచ్చిన వాక్యం // “ ఇన్ని రోజులు ఆన్‌లైన్‌ గోల లేని పని ఏమున్నదా అని ఆలోచించి నెత్తి ఖరాబ్‌ జేసుకున్నరా.... ఇప్పుడర్థమైంది అది వ్యవసాయమని! ” //. మంచి లాజిక్. ఆ మేరకు వ్యవసాయానిది అదృష్టమనే చెప్పాలి.

    కానీ అసలు ప్రమాదం వేరే ఉంది - అదే వ్యవసాయ రంగంలోకి కార్పొరేట్లు అడుగుపెట్టడం. ఆ మహమ్మారులు డైరెక్ట్ గా ప్రవేశిస్తే దురదృష్టకరమనే చెప్పాలి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కథ చదివి స్పందన తెలియజేసినందుకు ధన్యవాదాలు.. కథ మీకు నచ్చినందుకు చాలా సంతోషం.. ఇక మీరు ఊహించిన ప్రమాదం - కార్పొరేట్ల రంగప్రవేశం - అది నిజంగా దురదృష్టమే!

      తొలగించండి
  6. చాలా బాగుందండి కథ... ముందుగా యాసలో రాసినందుకు అభినందనలు.మన కథ అనిపించేలా చేసింది.ఆన్లైన్ బిజినెస్ వల్ల ఎంతమంది నష్టపోతున్నారో తెలిసింది.వ్యవసాయం చేయ్యలన్న ఆలోచన బాగుంది.ఇప్పుడు ఈ వ్యవసాయం పై కూడా కార్పోరేట్ అడుగులు పడుతున్నాయి.చూడాలికా మన రాత ఎలా ఉందో రైతు రాజు అవుతాడో కూలి గానే మిగిలిపోతాడో...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ స్పందన తెలిపినందుకు ధన్యవాదాలు అండి! రైతు ఎప్పుడు రాజుగానే ఉండాలని ఆశిద్దాం!

      తొలగించండి