పంచాయత్ (హిందీ) వెబ్ సీరీస్ - సమీక్ష

పంచాయత్ వెబ్ సిరీస్ - సరళమైన హాస్యం, సహజత్వానికి దగ్గరగా ఉండే పాత్రల రూపకల్పన,
అసభ్యత, అశ్లీలానికి తావు లేకుండా ఒక్కో ఎపిసోడ్ కోసం ఎంచుకున్న చిన్న పాటి కథనం, అందులో ఇరికించిన నాటకీయత బాగా నచ్చాయి.

ప్రధాన్ (మనవైపు సర్పంచ్), ఆమె భర్త పాత్రలు వాటి మధ్య ఉండే కెమిస్ట్రీతో మనం ప్రేమలో పడతాము. ఈ సీజన్లో నన్ను అలరించింది ఈ రెండు పాత్రలే, కథానాయకుడు అతని కథ కన్నా కూడా..!

ఇకపోతే గ్రామాల్లో ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యల్ని ఒక్కటి కూడా ప్రస్తావించక పోవడం (ఎన్నికల్లో గెలిచిన మహిళల భర్తలు అధికారం చలాయించడం మినహా) నిరాశ పరిచింది. అలాంటి సమస్యల్ని ప్రస్తావిస్తూ, కొత్తగా వెళ్ళిన కథానాయకుడు ఎలా పరిష్కరిస్తాడు అనేది ఉంటుందని వెబ్ సిరీస్ కి ఉన్న నేపథ్యం దృష్ట్యా ఊహించుకున్నాను. అలా ఊహించుకోవడం నా తప్పేనేమో!

మొదట్నుంచీ ప్రధాన్ కూతురుని చూపించక పోవడంతో, ఆమెని చూపించకుండానే సీజన్ ముగిస్తారు అనుకున్నాను. సీజన్ అయిపోయే సమయంలో ఆమెని చూపించి, రెండో సీజన్లో కథానాయకుడి లక్ష్యాన్ని పరోక్షంగా చెప్పినట్టు అయ్యింది. ఈ ముగింపు కాస్త ఊరటనిచ్చింది.

ఆరవ ఎపిసోడ్ కేవలం ఎపిసోడ్ల సంఖ్యను పెంచేందుకు మాత్రమే ఉపయోగపడింది. ఆ ఎపిసోడ్ ఉన్నా, లేకున్నా కథ - కథనం పరంగా వచ్చే లాభం కానీ, నష్టం కానీ ఏమీ లేదు. అలాగే 1వ ఎపిసోడ్లో కూడా పెద్దగా ఏమీ ఉండదు.

తప్పక చూడండి అని చెప్పలేను.. టైం ఉంటే చూడండి.. కుదరకపోతే 1వ ఎపిసోడ్ & 6వ ఎపిసోడ్ స్కిప్ చేసినా సరే..! మిగితా ఎపిసోడ్లు బాగా నచ్చితే ఈ రెండు ఎపిసోడ్లు చివరికి చూసుకోవచ్చు..!

ఈ పంచాయత్ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో ఉంది.

(మొదటి ఎపిసోడ్ స్కిప్ చేసి చూద్దాం అనుకునేవారికి మాత్రమే: మొదటి ఎపిసోడ్లో పట్టణం నుంచి గ్రామానికి వచ్చి అయిష్టంగానే పంచాయితీ సెక్రెటరీ ఉద్యోగంలో చేరతాడు కథానాయకుడు. ఆ ప్రహసనంలో అతను ఎదుర్కొన్న చిన్న ఇబ్బంది వల్ల మరింత విసుగు చెందుతాడు.)

1 కామెంట్‌: