మాస్టర్ సమీక్ష

 

                కాంబినేషన్ల మోజులో సినిమా మొదలుపెడితే, ఆ ఒత్తిడికి తట్టుకోవడం లోకేష్ కనగరాజ్ వల్ల కూడా కాదని, అతని రెండు గంటలా యాభై ఏడు నిమిషాల మాస్టర్ సినిమా చెప్తోంది. నగరం, ఖైదీ సినిమాల దర్శకుడిగా ఈ సినిమా పై అంచనాలు పెట్టుకోవడం పెద్ద తప్పు!

                విజయ్ కనిపించిన మొదటి రెండు సీన్లు చూశాక, అతను కనిపించిన ప్రతిసారి 10 సెకండ్ల ఫార్వర్డ్ నొక్కుతూ వెళ్లిపోయాను. కేవలం సేతుపతిని మాత్రమే చూశాను. నిజానికి ఆ పిల్లల్ని చంపకపోతే హీరో ఇతనే అనుకునే ప్రమాదం కూడా ఉంది (ప్రస్తుతపు సినిమాల ధోరణిలో ఊహించుకుంటే). మానరిజమ్, లుక్, స్టోరి, ఫైట్లు - ఈ నాలుగు సేతుపతికి ప్లస్ అయితే, విజయ్ కి మైనస్ అయ్యాయి. అలా అని విజయ్ సేతుపతి ఎపిసోడ్ అద్భుతంగా ఉందని కాదు, విజయ్ తో పోలిస్తే కాస్త నయమని అర్థం!

                ఒకవైపు స్లో మోషన్ సీన్లు టీవీ సీరియల్లతో పోటీపడి సా...గుతూ సావగొడుతుంటే, మరోవైపు అనిరుధ్ మ్యూజిక్ తో వాయించేశాడు. అదెంటో ఇతని పాటలు కొత్తగా ఎన్నివిన్నా, ఇది వరకే ఆ ట్యూన్ విన్నట్టు, ఆ పాట ఎప్పట్నుంచో తెలుసన్నట్టు నా కనిపించడం షరామామూలే! ఆలిండియా సాక్సొఫోన్ అధ్యక్షుడిగా ఉన్న అతన్ని వెంటనే దింపేసి, వేరే ఏదైనా వాయిద్య పదవి కట్టబెట్టాలని మనవి.

                రచన, దర్శకత్వం, ఎడిటింగ్, మ్యూజిక్ - ఈ నాలుగు ఈ‌ సినిమాకి ప్రధాన లోపాలు. వీటి మీద ఆధార పడ్డ పాటలు, ఫైట్లు కూడా అధనపు లోపాలు. ఈనాడు ఫ్రంట్ పేజి & రెండో పేజిలో, ఈ సినిమా చూడమంటూ ప్రైమ్ వాడు ఫుల్ పేజీ ప్రకటలివ్వడం గొప్ప విషయం!

                పి.యస్: ఈ సినిమాని "తమిళాంధ్ర తెలంగాణ భాషలో తీసిన మొట్టమొదటి సినిమా"గా పబ్లిసిటి ఇచ్చుకొనుంటే మరింత బాగుండేదేమో! అదేం కొత్త భాషో అన్న ఉత్సుకతతోనైనా కాస్త ఎక్కువ రోజులు ఆడేదనుకుంటున్నా!

                పి.యస్ 2 (ఇక్కడ సిగ్గుపడుతున్న బ్రహ్మి ఎమోజీని ఊహించుకోండి): కొత్తగా ఎడిటింగ్ లోకి ప్రవేశించాలనుకునే వాళ్లు ఈ సినిమాని డౌన్ లోడ్ చేసుకొని, 3 గంటల నిడివున్నదాన్ని 2 గంటలకు కాస్త అటుఇటుగా వచ్చేట్టుగా కుదించండి. అవసరమైతే కొత్తగా దర్శకులవ్వాలనుకునే మీ స్నేహితుల సహాయం తీసుకోండి. మీ అదృష్టం బాగుండి ఎవరైనా నిర్మాత మీ వర్క్స్ చూపించమంటే, మీ డెమో ప్రాజెక్టులతో పాటు మీ వర్షన్ లో కట్ చేసిన మాస్టర్ సినిమానివ్వండి. మీ డేమో ప్రాజెక్టుల వల్ల పనవ్వకపోతే, మీదైన మాస్టర్ వల్ల అవ్వచ్చేమో!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి