నా ఎనిమిదవ కథ - పొదుగు

పొదుగు

-        అరుణ్ కుమార్ ఆలూరి

(కణిక వేదిక జనవరి 2020లో “మహిళలపైన జరుగుతున్న ఆకృత్యాలు” అనే అంశం పై నిర్వహించిన కథల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కథ)


        రాత్రి వరకు వచ్చిన వార్తలు కంపోస్ చేయడం పూర్తయ్యాక, ప్రెస్ నుంచి నేరుగా  ఇంటికి వచ్చి హాల్లో ఉన్న సోఫాలో అసహనంగా కూలబడ్డాడు రాఘవ.

అతన్ని చూస్తూనే “నాన్నా” అంటూ అతని ఆరేళ్ళ కూతురు వచ్చి అల్లుకుపోయింది. అతి కష్టం మీద నవ్వు తెచ్చుకొని పాపని దగ్గరికి తీసుకున్నాడు.

“అమ్మా.. నాన్న వచ్చాడు” అంటూ సమాచారాన్ని చేరవేశాడు, హోం వర్క్ చేసుకుంటున్న ఐదో తరగతి కొడుకు.

వంటగది నుంచి వచ్చిన శైలజ, రాఘవ మూడ్‌ని గమనించి, పాపని అతని దగ్గరి నుంచి తీసుకుంటూ, “నాన్న స్నానం చేసి వచ్చాక మళ్లీ వెళుదువులే” అని పరోక్షంగా భర్తతో చెప్పి అతని భుజం మీద తట్టింది “లోపలికి వెళ్ళమన్నట్టుగా!”

-౦-

దిశ నిందితుల ఎన్‌కౌంటర్ తర్వాత సమాజంలో ఒక మార్పు వస్తుందని ఆశ పడ్డ వ్యక్తుల్లో రాఘవ కూడా ఒకడు. కానీ, కొన్ని రోజుల  క్రితం నారాయణపేట జిల్లాకు చెందిన ఒక స్కూల్ విద్యార్థినిని, కొంత మంది దుర్మార్గపు యువకులు నిత్యం ఏడిపిస్తుండటంతో,  మనస్థాపం చెంది ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందన్న వార్త చదివి కలవరపడ్డాడు. గుంటూరుజిల్లా యువతిపై ముగ్గురు రాక్షసుల సామూహిక దమనకాండని విని భయపడ్డాడు. రెండు రోజుల క్రితం అనంతపురం జిల్లాలో  ఓ నాలుగేళ్ల  చిన్నారిపై 70 ఏళ్ల  వృద్ధుడు చేసిన అఘాయిత్యానికి క్షోభకు గురైయ్యాడు. బాగా కలిచివేసిన విషయం ఏంట౦టే, అదే ముసలివాడు, అదే స్థలంలో ఏడేళ్ల క్రితం ఇలాంటి మరో నాలుగేళ్ళ  చిన్నారిపై అత్యాచారం చేస్తే, ఆ కేసును కోర్టు ఇటీవలే కొట్టివేయడం.

న్యాయస్థానాల్లో తీర్పులు వచ్చేందుకు ఏళ్ళు పట్టడం, ఈలోపు సాక్ష్యాలు తారుమారై కేసులు కొట్టేయడం విరివిగా జరిగే మనలాంటి దేశాల్లో, ఎన్‌కౌంటర్ చేయడమే సరైన మార్గమని నమ్మాడు. కానీ దిశ ని౦దితుల ఎన్‌కౌంటర్ సమాజంలో ఎటువంటి మార్పును చూపకపోవడం ఆశ్చర్యానికి, బాధకు గురిచేసింది. అసలు అలా౦టి ఎన్‌కౌంటర్ అనేది ఏదీ జరగనట్టుగా, తప్పు చేయాలనుకునే వ్యక్తుల మెదళ్ళలో ఎటువంటి భయం లేకుండా, ఆడవారిపై రోజుకో దౌర్జన్యం ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంది. ఎటుతిరిగీ కొన్ని సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి, కొన్ని రావట్లేదు, అంతే!

-౦-

వంట ముగించి డైనింగ్ టేబుల్‌పై వాటిని ఉంచసాగింది శైలజ. ప్రభుత్వ బ్యాoకులో పనిచేస్తున్న ఆమెకి సమయం సరిపోకపోవడం వల్ల, ఉదయం మధ్యాహ్నం వంటమనిషి చేసిందే తినక తప్పని పరిస్థితి! ఒక్క పూటైన తన చేతి రుచి చూపించాలని, రాత్రిపూట మాత్రం లేని ఓపిక తెచ్చుకొని వండుతుంది. అన్నింటినీ అమర్చి, రమ్మని కేకేసింది. పిల్లలతో పాటు వచ్చి మూభావంగా కూర్చున్నాడు రాఘవ. పిల్లలు తలలు ఎత్తకుండా తింటున్న సమయం చూసి, రాఘవ వంక చూస్తూ “ఏంటి విషయం?” అన్నట్టుగా సైగ చేసింది శైలజ. తల అడ్డంగా ఊపాడు రాఘవ, కొత్తగా ఏమీ లేదన్నట్టుగా! దాంతో అతను దేని గురించి ఆలోచిస్తున్నాడో ఊహించగలిగింది. నిర్భయ ఘటన జరిగిన దగ్గరి నుంచి భర్తలో వచ్చిన మార్పు ఆమెను మనఃశ్శాంతిగా ఉండనీయట్లేదు.

తినడం పూర్తయ్యాక, పిల్లల్ని చెరో మంచం మీద పడుకోబెట్టి హాల్లోకి వచ్చింది. తిన్నాక కాసేపు పచార్లు చేయడం అలవాటున్న రాఘవ, శైలజని చూసి నడక ఆపేశాడు. భర్తని తీక్షణంగా గమనిస్తూ సోఫాలో కూర్చుంది.

“ఈ దేశంలో ఎం.ఎల్.ఏ.లకీ, ఎం.పీ.లకీ పోలీసుల రక్షణ ఉంది కానీ సామాన్య ప్రజలకి మాత్రం లేదు. ఆడపిల్లల రక్షణ గురించి ఆలోచిస్తుంటేనే..” అంటుండగానే ఎక్కడో మూలన దాక్కున భయం అతని మొహంలో ప్రత్యక్షమయ్యింది.

రాఘవ అనవసరoగా ఎక్కువ ఆలోచిస్తాడు అనుకునే శైలజ,  “పోనీ ఇలాంటి సంఘటనలు జరగని ఒక దేశం పేరు చెప్పు, అక్కడికి పారిపోయి బతుకుదాం!” అంది కాస్త కోపంగా.

నిస్సహాయంగా చూశాడు, ఎందుకంటే అలాంటి దేశమేదీ లేదని అతనికీ తెలుసు.

“నూట ముప్పై ఎనిమిది కోట్ల జనాభా ఉన్న దేశంలో, కేవలం డెబ్భై శాతం మంది మాత్రమే చదువుకుంటున్న పరిస్థితుల్లో, అందులో ఆడ మగ సమానమేనన్న విచక్షణా జ్ఞానo ఎంతమందికుందో చెప్పలేని దౌర్భాగ్య స్థితిలో జరిగే ఇలాంటి ఘోరాలను ఎన్‌కౌంటర్‌లు, మరణ శిక్షల వల్ల నిరోధించలనుకోవడం అసాధ్యం.” అంది ప్రాక్టికల్‌గా ఆలోచిస్తూ!

ఆలోచనలో పడిపోయిన రాఘవ, “వీలైనంత మంది ఎక్కువ పోలీసులను నియమిస్తే ...” అన్నాడు తనలో తాను అనుకుంటున్నట్టుగా.

“అలా నియమించాలంటే, ముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించాలి. ఆ స్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళ్ళే సత్తా ఉన్న  నాయకుణ్ణి ఎన్నుకోవాలి. కేవలం వంద కోట్ల టర్నోవర్ వున్న కంపెనీకి సి.ఈ.ఓ.ని నియమించాలంటే, కొన్ని నెలల పాటు వడపోసి నిర్ణయం తీసుకుంటారు. పది నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు ఆ కంపెనీలో పనిచేసిన వ్యక్తిని ఎన్నుకుంటారు. కానీ ఎనిమిది, తొమ్మిది లక్షల కోట్ల జీ.డీ.పీ. ఉన్న మనలాంటి రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో, వార్డ్ మెంబర్‌గా కూడా పోటీ చేయలేని వ్యక్తులు, సినిమా అవకాశాలు తగ్గిన కథానాయకులు నిలబడుతున్నారు. ప్రజలేమో ఎన్నికల ముందు పది రోజులు కూడా ఆలోచించకుండా, చర్చించకుండా నిర్ణయం తీసుకుంటున్నారు.” ఆవేదనగా చెప్పింది శైలజ.

ఆమె చెప్పింది వింటుంటే రాఘవ మదిలో మరో ఆలోచన మెదిలింది. “అంటే యాభై శాతానికి దగ్గరగా ఉన్న మహిళా ఓటర్లoదరూ తలుచుకుంటే నాయకత్వ మార్పు సాధ్యమే! వారి రక్షణ కోసం ఒక తీర్మానాన్ని చేసుకొని, దాన్ని అమలు పరిచే పార్టీకి మద్దతు ఇవ్వడమో లేక వారే ఒక పార్టీని స్థాపించడమో జరగాలి!” అన్నాడు సాలోచనగా.

అలసిపోయిన శరీరంతో ఆ రాత్రి వేళ అంతకు మించి చర్చించే ఓపిక లేక, “అవన్నీ మన చేతుల్లో లేని విషయాలండీ.. ప్రతిరోజూ మీరిలా టెన్షన్ పడటం నేను చూడలేను.. మన పిల్లల కోసం మనం ఏం చేయగలమో అది చెప్పండి.” అంది.

“ఇరవై నాలుగ్గంటలూ ప్రైవేటు సెక్యురిటీ అందించే స్థోమత మనకు ఎలాగో లేదు.”

“అయితే”

“ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు, తోడుగా ఎవరో ఒకరు వెళ్ళడం వల్ల ఇలాంటి దారుణాలు చాలా వరకు జరిగేవి కావు. కానీ ఇప్పుడు ఉద్యోగాల పేరుతో ఊళ్లు వదిలి, బతకడానికి ఒక స్థాయిని నిర్ణయించుకొని అందుకు తగ్గట్టు సంపాదించడానికి ఇద్దరం ఉద్యోగాలు చేయల్సివస్తోంది. నిజానికి మనం ఇప్పుడు అద్దెకు ఉంటున్న ఈ ఇల్లు, ఈ క్వాలిటీ ఆఫ్ లివింగ్ మనకు అవసరమా?”

కాస్త అలోచించి, “నిజానికైతే అక్కర్లేదు.. వాళ్ళనీ, వీళ్ళనీ చూసి ఆచరిస్తున్నదే కదా!” అంది.

“అందుకే ఇద్దర్లో ఒకరమే ఉద్యోగం చేద్దాం.. ఇంకొకరం పూర్తిగా పిల్లల బాధ్యత తీసుకుందాం. పక్షులు, జంతువులు ఎలాగైతే పిల్లల్ని పొదుగుతూ సాకుతాయో మనం కూడా అలాగే రక్షణ కల్పిద్దాం. సంపాదన తగ్గుతుంది కాబట్టి ఖర్చులు తగ్గిద్దాం. ఏదైనా బస్తీలో ఇల్లు తీసుకుందాం. అబ్బాయిలపై కూడా సామూహిక అరాచకాలు జరుగుతున్న ఈ పరిస్థితుల్లో అన్నిటికన్నా ముఖ్యమైంది పిల్లలు క్షేమంగా ఉండటమే అనిపిస్తోంది.” అన్నాడు రాఘవ.

క్షణాలు నిమిషాలయ్యేంత వరకు ఆలోచించింది శైలజ. భర్త చెప్పింది అక్షరాల నిజం. ఒక దశ దాటిన తర్వాత డబ్బుకన్నా మనఃశ్శాంతి మాత్రమే తృప్తిని ఇస్తుందని ఆమె నమ్మకం. “సరే, అలాగే చేద్దాం! మరి ఇద్దర్లో ఎవరు ఉద్యోగం మానేస్తే మంచిది అని అనుకుంటున్నారు?”

“పెద్దగా ఆలోచించేది ఏముంది? నీది ప్రభుత్వ బ్యాంకులో ఉద్యోగం కాబట్టి నువ్వు దాన్ని వదులుకోవడం మూర్ఖత్వం అవుతుంది. పైగా బయటి విషయాలు చూసుకోవాలంటే శారీరకంగా ఆడవారికన్నా ధృఢంగా ఉండేది మగవాళ్ళే కాబట్టి ఆ బాధ్యత నేను తీసుకుంటాను.”

భర్త నిర్ణయానికి ఆశ్చర్యపోయింది. “మరి తెలిసినవాళ్ళు నువ్వు ఉద్యోగం చేయడం లేదని చులకనగా చూస్తారేమో? ఆలోచించావా?”

“ఎవరో ఏదో అనుకుంటారని మన పిల్లల్ని గాలికొదిలేసి బిక్కుబిక్కుమంటూ బతుకుదామా? ఇప్పుడు వాళ్ళ సేఫ్టీ కన్నా నాకేదీ ముఖ్యం కాదు. అయినా పిల్లల్ని స్కూల్లో దింపి వచ్చాక సాయంత్రం వరకు టైం ఉంటుంది కాబట్టి, ఇంట్లోనే ఉండి చేసుకునే చిన్న వ్యాపారం ఏదైనా ఉంటే ట్రై చెయ్యొచ్చు. రోజంతా ఖాళీగా ఉండలేను కదా! కాకపోతే వ్యాపారం అనేది కేవలం టైం కిల్లింగ్ కోసం, పిల్లలు నా హై ప్రయారిటీ!”


“అలా అయితే నాకేం అభ్యంతరం లేదు. గో ఎహెడ్!” అంటూ మనఃస్ఫూర్తిగా అభినందించింది.

-౦- 


పొద్దున్నే లేవబోతున్న కొడుకు వంక చూస్తూ, “ఈ రోజు నుంచి నువ్వు ఇంకో గంట ఎక్కువ సేపు పడుకోవచ్చు నాన్న.” అంది శైలజ.

“అలా అయితే ఆటో వెళ్ళిపోతుంది కదమ్మా!” అంటూ అమాయకంగా అడిగాడు వాళ్లబ్బాయి.

“ఈ రోజు నుంచి ఆటోలో కాదు, మీ నాన్నే మిమ్మల్ని దిగబెట్టి వస్తాడు. సాయంత్రం స్కూల్ నుంచి వచ్చాక మా కోసం ఎదురుచూసే అవసరం కూడా లేదు. మీ నాన్నే స్కూల్ నుంచి తీసుకొచ్చి మీకు తోడుగా ఉంటారు.” అంది.

నమ్మలేని ఆ పిల్లాడు, హాల్లో ఉన్న రాఘవ దగ్గరికి పరుగెత్తుకుంటూ వచ్చి“నాన్నా.. నిజంగానా?” అన్నాడు. ఎప్పుడు విన్నదో తెలియదు కానీ, అన్నయ్య వెనకాలే చిన్ని చిన్ని పాదాలతో పరుగెత్తుకుంటూ వచ్చి నాన్న ఒళ్లో కూర్చొని సమాధానం కోసం ఎదురుచూడసాగింది వాళ్ల పాప.

“అవును.. ఇప్పట్నుండి నేనే మీకు ఫ్రెండ్‌ని, నాన్నని, పోలీస్‌ని కూడా!” నవ్వుతూ అన్నాడు రాఘవ.

“హేయ్” అంటూ చప్పట్లు కొడుతూ గంతులేసి రాఘవని గట్టిగా హత్తుకున్నారు పిల్లలిద్దరూ!

ఆ కేరింతల్లో ఆ పసిమనసులు ఇన్నాళ్లూ పడ్డ, ఆ చెప్పుకోలేని కాస్త ఇబ్బందిని అంచనా వేయసాగారు ఆ దంపతులు! 

-          అయిపోయింది

(సంచిక ఆన్లైన్ వీక్లీలో ఆగస్టు 15, 2021న ప్రచురితం. లింక్: https://sanchika.com/podugu-story/)

(Image Courtesy: Charan Parimi)



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి