జయమ్మ పంచాయితీ సినిమాలో నా పేరు

మొదటిసారి వెండితెరపై నా పేరు పేరు పడింది. జయమ్మ పంచాయితీ సినిమాకు గాను స్క్రిప్ట్ విషయంలో సపోర్ట్గా ఉన్నందుకు గాను "SINCERE THANKS" కింద నా పేరు వేశారు. Thank You Vijay Kumar Kalivarapu 😍❤️🙏🤝

జనవరి 2007లో నా కథ ప్రచురితం అయినప్పుడు నా పేరు మొదటి సారి పేపర్లో వచ్చింది. ఇప్పుడు ఈ రూపంలో వెండితెరపై రావడానికి 15 సంవత్సరాలు పట్టింది. (మధ్యలో ఒక పది సంవత్సరాలు కొన్ని కారణాల వల్ల సినిమా, సాహిత్యం వైపు కన్నెత్తి చూడలేదు. అలా అని 5 సంవత్సరాల్లో ఈ స్థాయికి వచ్చాను అని అనుకోవటం భావ్యం కాదు.)

సినిమాల వైపు గత రెండు సంవత్సరాల నుంచి మెల్లిమెల్లిగా అడుగులు వేస్తున్నాను. ఒక సినిమాకి స్క్రిప్ట్ డాక్టర్‌గా, మరో సినిమాకి స్క్రిప్ట్ ఎడిటర్‌గా, ఇంకో సినిమాకి రచనా సహకారం అందిస్తూ రచయితగా అడుగులు పడుతున్నాయి.

ఇక జయమ్మ పంచాయితీ సినిమాకు నేను రివ్యూ ఇవ్వటం బాగుండదు కాబట్టి, కేవలం నా అనుభవం మాత్రం పంచుకుంటాను. ఈ సినిమా చూడటం మొదలుపెట్టిన నాకు దాదాపు ముప్పై నిమిషాల వరకు తలకెక్కలేదు, ఏదో చూస్తున్నానా అంటే చూస్తున్నాను.. అందుకు కారణం కథా పాత్రలు సన్నివేషాలు - ఏకంగా స్క్రిప్టు మొత్తం తెలుసు కాబట్టి. అయితే స్క్రిప్ట్ చదివినప్పుడు నేను ఊహించుకున్న పాత్రలు ప్రాణం పోసుకొని తెరపై కనిపించడం కొత్త అనుభవం. అందులోనూ మొదటి డ్రాఫ్ట్‌కి, చివరి డ్రాఫ్ట్‌కి వచ్చిన మార్పులు తెలుసు కాబట్టి అవి కనబడుతుంటే భలే సంతోషంగా అనిపించింది. ఇక అరగంట తర్వాత సినిమాలోకి లాక్కుపోయాడు దర్శకుడు, అన్నీ తెలిసిన నన్ను కేవలం అరగంటలో కథలో లీనమయ్యేలా చేయడం అతని ప్రతిభ.

ఏదైనా శుభకార్యం చేసినప్పుడు అనుకోకుండా వచ్చే ఖర్చుకి, ఆర్థికంగా సహాయంగా ఉంటుందని పెట్టిన - ఈడులు / కట్నం / చదివింపుల సంప్రదాయం పై కథ అల్లుకోవడంతోనే కొత్తదనం మొదలవుతుంది. పాత్రలు, వాటి రూపకల్పన, సహజమైన సన్నివేశాలు, మట్టి భాష, ఊళ్ళో ఉండే సామాజిక ఐక్యత, భోళాతనం - ఇలా అన్ని రకాల భావాలు కల మనుష్యులను ఒకే కథలో ఇమడ్చటం, వాళ్ళని ప్రేక్షకులు గుర్తుపెట్టుకునేలా సన్నివేశాలు అల్లటంలోనే ఈ కథలోని ఆత్మ దాగుంది. అక్కడ దర్శకుడు నూటికి నూరుపాళ్ళు సక్సెస్ అయ్యాడు.

సుమ కనకాల ప్రధాన పాత్ర అనగానే, గతంలో కొంతమంది వ్యాఖ్యాతలు ఏళ్ళ తరబడి సినిమాల్లో నటించినప్పటికీ, వారి డైలాగ్ డెలివరి - వ్యాఖ్యానం చేసినట్టుగానే టిపికల్‌గా ఉండటం గమనించి భయపడ్డాను. అయితే టెస్ట్ షూట్ వీడియో చూశాక ఆ భయం పోయింది. సుమ గారి వల్ల, తన మొదటి సినిమాకు పనిచేయగలనని ఊహించని టెక్నీషియన్స్ విజయ్‌కి తోడయ్యారు. అందులో ముఖ్యులు కీరవాణిగారు. దాంతో ఒక సాధారణ స్థాయి బడ్జెట్ సినిమాకు ఈ మధ్య కాలంలో ఎవరూ చూడని పబ్లిసిటి చేయటం, హైప్ రావటం, తద్వారా సక్సెస్ అవ్వటానికి కారణం అయ్యాయి.


సుమ గారి తర్వాత భర్త పాత్రలో చేసిన దేవీ ప్రసాద్ గారి నటన సమంగా సరిపోయింది. ముందు నుంచీ పేలుతుంది అనుకున్న జమ్మడు పాత్ర నవ్వులు పూయించింది. పుష్ప, యేసుబాబు పాత్రల్లో ఇద్దరూ బాగా కనిపించారు. ఆ తర్వాత బాగా నచ్చింది అనుష్ కుమార్ గారి కెమెరా పనితనం. శ్రీకాకుళం అందాలను చక్కగా ఒడిసి పట్టారు. ఎడిటింగ్, ఆర్ట్, హాయిగా సాగే పాటలు - ఇలా అన్ని క్రాఫ్ట్స్ యొక్క బెస్ట్ అవుట్‌పుట్‌ను తీసుకొని మన ముందుకొచ్చింది ఈ సినిమా.
2018 అక్టోబరులో ఈ స్క్రిప్టు నా చేతికి వచ్చిది. దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత సినిమాగా మారి బయటకొచ్చింది. మొదటి సినిమా కాబట్టి, అందులో ఉండే సాదకబాధకాలు తెలుసు కాబట్టి, ఆ మాత్రం సమయం పడుతుంది, కానీ స్క్రిప్టులు తొందరగా రాసేయగల సత్తా ఉన్న విజయ్, కనీసం సంవత్సరానికి ఒక సినిమా తియ్యాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. All The Best Dear 👍💐🤝😍

జయమ్మ పంచాయితీ అమేజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది. చూడని వాళ్ళు చూసి రండి. లింక్స్:

కంప్యూటర్‌లో చూడటానికి లింక్: https://www.primevideo.com/.../0RZR.../ref=atv_dp_share_cu_r


ఫోన్‌లో చూడటానికి లింక్:

https://app.primevideo.com/detail?gti=amzn1.dv.gti.d8d91b9a-05f3-4bc5-aa10-23c8a9f3378b&ref_=atv_dp_share_mv&r=web

(లింక్ అన్న పదం పై క్లిక్ చేసినా ఓపెన్ అవుతాయి)



Thank You All 


2 కామెంట్‌లు:

  1. మీ పేరు సినిమాతెర మీద కనిపించినందుకు అభినందనలు. అవునండీ, సిన్సియర్ థాంక్స్ జాబితాలో వేసే బదులు రెగ్యులర్ క్రెడిట్స్ లోనే స్క్రిప్ట్ సపోర్ట్ అని మీ పేరు చూపించవచ్చుగా, ఇంకా ఘనంగా ఉంటుంది? థాంక్స్ జాబితాలో వేస్తే మీ పేరు (ఇతరుల పేర్లు కూడా) ఎందుకు వేస్తున్నారు, ఆ సినిమాకు మీరు చేసిన పని ఏమిటి, ఆ సినిమాకు మీకు సంబంధం ఏమిటి అన్నది ప్రేక్షకులకు ఎలా తెలుస్తుంది?

    అసలు నాకు తెలియక అడుగుతున్నాను ఏమనుకోకండి - సినిమా క్రెడిట్స్ లో ఈ మధ్య కాలంలో మొదలైన ధోరణి థాంక్స్ / స్పెషల్ థాంక్స్ / సిన్సియర్ థాంక్స్ అంటూ డజన్ల డజన్ల కొద్దీ పేర్లు వేస్తుంటారు వాళ్ళ contribution ఏమిటో చెప్పకుండా. ఉదాహరణకు షూటింగ్ జరిగిన ఊళ్ళల్లో సహకారం అందించారని ఆ ఊరి పెద్దల పేర్లు వేశారంటే సరే అనుకోవచ్చు. ఆ ప్రాంతపు పోలీసు, రెవెన్యూ అధికారుల పేర్లు చూపించారంటే అర్థం చేసుకోవచ్చు. అసలు ఆ సినిమాలో నటించకపోయినా సినిమారంగ పెద్దల పేర్లు కూడా వేస్తుంటారు ఎందుకు? అంటే వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటున్నట్లు అనుకోవాలా? ఏమిటి ఈ ప్రక్రియ అంతరార్థం? మీరు సినిమారంగ వ్యక్తిలా ఉన్నారు. కాస్త చెబుతారా?

    అవునండీ, "జయమ్మ పంచాయతి" సినిమా చాలా విభిన్నంగా ఉంది - సినిమావాళ్ళ ఊతపదాలైన "డిఫరెంట్", "వెరైటీ" ఈ సినిమాకు బాగానే సరిపోతాయి. జయమ్మ తిప్పలు చూస్తుంటే అయ్యో అనిపిస్తుంది, పట్టుదల చూస్తే ముచ్చటగానూ ఉంది. చివర్లో అన్నలను తీసుకురావడం కొంచెం విచిత్రంగా అనిపించింది. ఆఖరు సీన్లో జయమ్మ కష్టాలు మళ్ళీ మొదలయినట్లు చూపించడం మంచి టచ్ 🙂.

    అన్నట్లు మీరు ఇక్కడ ప్రైమ్ విడియో లింక్ ఇచ్చారు కదా, ప్రైమ్ విడియోలో అకౌంట్ లేకపోయినా ఆ లింక్ పని చేస్తుందా? నాకు అకౌంట్ ఉంది గాబట్టి మీరిచ్చిన లింక్ నొక్కితే డైరెక్ట్ గా నా అకౌంట్ ద్వారానే ఓపెన్ అయిందా, మరి అకౌంట్ లేనివారి సంగతేమిటి అని నా సందేహం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. థాంక్యూ అండి.. మనం చేసిన పనిని బట్టి క్రెడిట్స్ ఉంటాయి, కొన్ని పనులకి క్రెడిట్స్ ఇవ్వలేక (ఆ పని చిన్నగా ఉండొచ్చు లేక ఆ పనికి క్రెడిట్ ఇచ్చే పదం ఉండకపోవచ్చు), అలా అని వారి సేవల్ని విస్మరించలేక - థాంక్స్, సిన్సియర్ థాంక్స్ వగైరా పేర్లతో ఇస్తారు. ఇక ఎవరు ఏమేం పని చేశారు అన్న విషయాలు ప్రేక్షకులు తెలియాల్సిన అవసరం ఉందంటారా?

      సినిమా రంగ పెద్దల పేర్లు వేయడానికి కారణం - వారి వల్ల సినిమాకు అవసరం పడింది, వారు ఆ సినిమాని ప్రోత్సహించే ఉద్దేష్యంతో లాభాపేక్ష లేకుండా ఆ పనిని నెరవేర్చారు అని అర్థం.

      ఇక సినిమా విషయానికి వస్తే దర్శకుడు తను చూసిన ప్రాంతాన్ని సజీవంగా చూపించాలి అనుకొని, కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధరంగా రాసుకున్న కథ. అందులో భాగంగానే నక్సలైట్లు - అయితే సినిమా లిబర్టీ కింద జరిగిన సమయానికి, చూపించిన సమయానికి వ్యత్యాసం ఉండొచ్చు.

      ప్రైమ్ వీడియో అకౌంట్ లేకపోతే పనిచేయందండి. ఉన్నవారికి సులువుగా ఉంటుందని, వెతికే శ్రమ తప్పించడానికి లింక్ ఇచ్చాను. మీరు మీ అకౌంట్ లోనుంచే చూశారు.

      మా సినిమా షూసినందుకు, సంగ్రంగా విశ్లేశించినందుకు ధన్యవాదాలు. ఇటువంటి జానర్ సినిమాలు ఇష్టపదే మీ స్నేహితులకు, బంధువులకు - ఈ సినిమా చూడమని సిఫార్సు చేయవల్సిందిగా కోరుతున్నాను.

      తొలగించండి