Midaq Alley (1995) {Spanish: El callejón de los milagros} సినిమా పరిచయం


Midaq Alley 1995 (Spanish: El callejón de los milagros) మెక్సికన్ సినిమా. నోబెల్ బహుమతి గ్రహిత Naguib Mahfouz రచించిన అరబిక్ నవల Zuqāq al-Midaq 1947 (English Translation: Midaq Alley 1966) ఆధారంగా తీసిన ఈ సినిమాకి దర్శకులు Jorge Fons. దాదాపు 11 అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో పాల్గొన్న ఈ సినిమా, 26 అవార్డులని సొంతం చేసుకుంది. మెక్సికోలో ఆస్కార్ అవార్డులా భావించే Ariel Awards లో 11 అవార్డులని సొంతం చేసుకుంది. IMDB.COM & Entertainment Weekly విడివిడిగా నిర్వహించిన సర్వేలలో అత్యుత్తమ మెక్సికన్ చిత్రంగా ఎంపికయ్యింది.

కథ: ఒక వ్యక్తి స్వలింగ సంపర్క సంబంధం వలన అతని జీవితం, అతని కుటుంబం ఏ రకంగా ఒడిదుడుకులకు లోనయ్యింది అన్న విషయమే ఈ సినిమాకి కథా వస్తువు. అతని కుటుంబ సభ్యులతో ముడిపడి ఉన్న ఇతరుల జీవితాలు, వాళ్ళ కుటుంబ సభ్యులతో ముడిపడి ఉన్న మిగితా వ్యక్తుల జీవితాలు ఎటువంటి ఆటుపోట్లకు గురైయ్యాయన్నది ఆసక్తి రేపుతుంది.

కథనం: ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ కథనం. బార్ లో ఒక పాత్ర కోణంలో కథ ప్రారంభమవుతుంది. ఆ పాత్ర భాగం  పూర్తవగానే, మళ్ళీ అదే బార్ నుండి మరో వ్యక్తి కోణంలో అదే కథ మళ్ళీ మొదలవుతుంది. అయితే ఒక్కో వ్యక్తి యొక్క క్యారెక్టర్, జరిగిన సంఘటనలు  కొత్త కొత్తగా అగుపిస్తాయి. దర్శకుడు తెలివిగా మొదటి వ్యక్తి కోణంలో కథ ప్రారంభం అవగానే, ఎక్కువ మోతాదులో కథ ఇక్కడే చెప్పేస్తాడు. తరువాతి వ్యక్తి కోణంలో సాగే కథ కొద్దిగా తగ్గుతుంది.. అలా ఆ తరువాతి వ్యక్తి కథ కూడా..!! చివరికి క్లైమాక్స్ మనల్ని కట్టిపడేసి, సినిమా అయిపోయాక కూడా చాలా సేపటివరకు వెంటాడుతూనే ఉంటుంది. ఈ కథనం లోని రెండు సన్నివేశాలను కత్తిరిస్తే U/A సర్టిఫికేట్, నాలుగు సన్నివేశాలు కత్తిరిస్తే క్లీన్ U సర్టిఫికేట్ వచ్చేంత హుందాగా తీశారు దర్శకులు.

మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన “యువ(2004)” సినిమా కథనం ఇలాగే హైపర్ లింక్ తరహాలో - అనగా - కాలాన్ని స్తంబింప జేసి, ఒకే సమయంలో విభిన్న వ్యక్తుల వ్యక్తిగత జీవితాలు, పాత్రల స్వభావం, వారి సమాజిక అనుబంధం మొ|| వాటిని విడమరచి చెప్పే శైలిలో ఉంటుంది.


కథనం, దర్శకత్వం తో పాటు ALMITA పాత్రధారి SALMA HAYEK అమాయకపు నటన, SUSANITA పాత్రధారి MARGARITA SANZ భావవ్యక్తీకరణ మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. కూర్పు, నేపథ్య సంగీతం కూడా అద్భుతంగా కుదిరాయి.

RUTILIO భాగం:


RUTILIOకి చెందిన callejón de los milagros అనే బార్ లో, టేబుల్ పై DOMINOES ఆట ఆడుతూ, సిగరెట్, మద్యంతో అందరూ రిలాక్స్ అవుతూ ఉంటారు. (సినిమాలోని ప్రధాన పాత్రధారులందరూ అక్కడే కనిపిస్తారు) RUTILIO కి, అతని కొడుకు CHAVA కి సఖ్యత ఉండదు. CHAVA ఎప్పుడు అతని స్నేహితుడు ABEL తో కలిసి తిరుగుతూ పని తప్పించుకుంటాడని RUTILIO కి కోపం. ABEL ఒక సెలూన్ లో పనిచేస్తుంటాడు. ఆదివారం నాడు పనిచేయనని CHAVA వాదిస్తుండగా RUTILIO కోప్పడతాడు, అప్పుడు అక్కడే ఉన్న కవి UBALDO, కొడుకు మీద ఇలా పబ్లిక్ గా కోప్పడకూడదంటూ నచ్చజెపుతాడు. 

RUTILIO దగ్గర పనిచేసే GUICHO తన యజమాని దగ్గరే దొంగతనం చేస్తూ ఉంటాడు. CHAVA, తనకు తెలిసిన అధికారి ద్వారా ఇమిగ్రేషన్, వీసా ఇబ్బందులు లేకుండా దేశం విడిచి U.S. వెళ్ళిపోయి సంపాదించుకు వద్దామని ABELని పోరుతుంటాడు. ABEL కి అమ్మానాన్న ఎవరూ లేరు కానీ ALMITA ని ప్రేమిస్తున్నందున ఇప్పట్లో రాలేనని కొట్టిపారేస్తుంటాడు. ABEL ఉండేది ALMITA ఎదురు ఇంట్లోనే. ఆమెని బయటకు తీసుకెల్తానని అడగడానికి సంకోచిస్తూ ఉంటాడు. ALMITA తల్లి CATA భవిష్యత్తుని కార్డ్స్(పేక ముక్కల)తో అంచనా వేసి చెబుతూ సంపాదిస్తుంటుంది. SUSANITA తన భవిష్యత్తు గురించి తెలుసుకోవడానికి ALMITA తల్లి అయిన CATA వద్దకు వస్తుంది. ఆ సమయంలో కిటికీ దగ్గర కూర్చుని తల తుడుచుకుంటున్న ALMITAని అప్పుడే వచ్చిన ABEL చూసి మైమరచిపోతాడు. ALMITA ఇంట్లోకి వచ్చాక CATA, ABEL ని చూస్తుంది. బిచ్చగాడితో ప్రేమలో పడకూడదు అని కూతురుని హెచ్చరిస్తుంది.


RUTILIO భార్య EUSEBIA ఆ రాత్రి అతనికిష్టమైన ఆహరం వండిపెడుతుంది. కొడుకు గురించి అడుగగా, రేపటి నుండి బార్ లో మీకు సహాయం చేస్తానని మాటిచ్చాడని చెబుతుంది. బార్ కు కావలసిన మద్యం తీసుకొని రేపు రమ్మన్నానని, రేపు అన్న పదాన్ని నొక్కి చెబుతుంది. RUTILIO కి అర్థం కాదు. ఆవిడ వేసుకున్న కొత్త బట్టలు చూసి కూడా గుర్తు తెచ్చుకోలేకపోతాడు. ఈ రోజు మన ముప్పైయ్యవ పెళ్లి రోజు అని గుర్తు చేసి, డిన్నర్ పూర్తయ్యాక అతని నుంచి ఆశిస్తున్న శృంగారాన్ని గోముగా చెవిన వేస్తుంది. అతను అన్యమనస్కంగానే వింటాడు. ఆమె అతనికిచ్చిన కానుకకి కూడా అతను పెద్దగా సంతోషించడు. పడక గదిలో టి.వి. చూస్తూ ఆమెని పట్టించుకోకుండా ఉన్నప్పటికీ, ఆమె ఊరుకోకుండా పాత విషయాలన్నీ గుర్తుచేసేసరికి, తప్పదన్నట్టు శృంగారానికి ఒప్పుకుంటాడు. 

మరునాడు ఉదయం, ABEL, ALMITAతో ఏదో మాట్లాడుతుండగా అతని సెలూన్ వద్దకు వస్తాడు RUTILIO. తన వయసును తగ్గించేలా హెయిర్ కట్ చేయమంటాడు. మీ ఇద్దరి జోడి బాగుంటుందని, ఆమె కన్నా నువ్వే అందంగా ఉంటావని కితబిస్తాడు. ఈ వయసులో ఆడవాళ్ళని భరించే ఓపిక తనకు లేదని, ఆనందం కోసం ‘కొత్త’ దారులవైపు చూడాల్సి వస్తుందని చెబుతాడు.  కొత్త ఇష్టాలు, కొత్త భావాలు, కొత్త భావోద్వేగాలు అవసరం అంటూ, నన్ను అర్థం చేసుకుంటున్నావ్ కదా అని ABELని అడుగుతాడు. అవునంటూ పనిలో మునిగిపోతాడు ABEL.


ఆ పని అయ్యాక, ఒక బట్టల దుకాణంకి వెళ్లి అక్కడ పనిచేసే సేల్స్ బాయ్ JIMMY ని సాక్సులు కావాలని అడుగుతాడు RUTILIO. ఆ తర్వాత లోదుస్తులు కూడా తీసుకుంటాడు. అయితే అవన్నీ JIMMY కి నచ్చినవే తీసుకుంటాడు RUTILIO. నవ యువకుడైన JIMMY పై ఇష్టం పెంచుకుంటాడు RUTILIO. ఆ తర్వాత అతని కోసం ఎదురుచూసి, పని ముగించుకొని వెళ్తున్న JIMMY ని అనుకోకుండా కలిసినట్టు పలకరించి, వీలయితే తన బార్ కి రావలసిందిగా ఆహ్వానిస్తాడు. పొద్దున్న కొన్న సాక్స్ అతని కోసమే అని వద్దంటున్నా వినకుండా బహుమతిగా ఇస్తాడు.

ABEL పై ALMITA కోప్పడుతుంది. RUTILIO రాగానే కనీసం తనకి బాయ్ కూడా చెప్పకుండా వెళ్లిపోయాడని కోప్పడుతుంది. తనతో బయటకు వస్తే పార్క్ కు తీసుకెళ్తానని, ఆ తర్వాత బోటులో షికారు చేసి, జూకు కూడా వెళ్దామని బతిమాలుతాడు. ఆమె ఎటూ తేల్చకుండా వెళ్ళిపోతుంది.

RUTILIO మనసుని అర్థం చేసుకున్న JIMMY ఒకరోజు రాత్రి పూట బార్ కి వస్తాడు. ఆ రోజు  నైట్ డ్యూటీ తాను చేస్తానని కొడుకు CHAVA చెబుతుంటే, అక్కర్లేదు నువ్వు ఇంటికెల్లు అంటాడు RUTILIO. డబ్బు కూడా ఇస్తానంటాడు. అక్కర్లేదంటాడు CHAVA. వాళ్ళిద్దరి ప్రవర్తన మీద అతనికి అనుమానం కలుగుతుంది.

EUSEBIA తన గోడు వెల్లబోసుకోవడానికి UBALDO దగ్గరికి వెళ్తుంది. వాళ్ళ మధ్యనున్నది ఎల్లలెరుగని ప్రేమ మాత్రమే అని, భౌతికం సంబంధం కాదని అంటాడు. కచ్చితంగా అది భౌతిక సంబంధమే అని రోదిస్తుంది EUSEBIA. నేను మాట్లాడతానని ఓదారుస్తాడు. ఆ రాత్రికే RUTILIO బార్ కి వెళతాడు. అయితే అక్కడ EUSEBIA ఊహించిందే జరుగుతోందని GUICHO ద్వారా తెలుసుకుంటాడు. అలాంటివి ఇకనుండి సాగనివ్వద్దు అని RUTILIO కి హెచ్చరిస్తాడు. నా ఇష్టం వచ్చినట్టు నేనుంటాను, ఇంకో సారి ఇలాంటి సలహాలు ఇస్తే చంపేస్తాను, ఇక్కడి నుండి వెళ్ళిపో అని దురుసుగా సమాధానమిస్తాడు RUTILIO. ఇంటి విషయాలు UBALDOకి ఎందుకు చెప్పావని భార్యని ఇష్టం వచ్చినట్టు కొడతాడు RUTILIO.


బార్ లో కలుసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని JIMMY ని వేరే చోటుకి తీసుకెళతాడు RUTILIO. అక్కడ ఇద్దరూ ‘కలిసి’ స్నానం చేస్తున్న సమయంలో కొడుకు CHAVA కోపోద్రుక్తుడై JIMMY తలని గోడకేసి కొడతాడు. అతనికి రక్తస్రావం కావడంతో, CHAVA భయంతో పారిపోయి రోజంతా ఎక్కడెక్కడో  తిరిగి రాత్రికి ABEL దగ్గరికి వస్తాడు. అప్పటికే ABEL, ALMITA తో ప్రణయమాడుతూ ఉంటాడు. CHAVA జరిగిందంతా చెప్పి, U.S. పోవడానికి ఇదే సరైన సమయం అంటాడు. కానీ ABEL, తను రాలేనని చెబుతాడు. ఇప్పుడిప్పుడే ALMITA తనకు దగ్గరవుతోందని, ఈ పరిస్తితుల్లో రాలేనని అంటాడు. కాని CHAVA అర్థిస్తాడు. ALMITA ని పెళ్లి చేసుకొని సుఖంగా ఉండటానికి డబ్బు సంపాదించాలి కదా, అందుకైన నాతోరా అంటాడు.

ఇంటికి వచ్చిన RUTILIO, JIMMY చనిపోలేదని, తలకి గాయం మాత్రమే అయిందని EUSEBIA తోచెబుతాడు. నీ కొడుకు కనిపిస్తే నేనే మేడలు విరిచేస్తానని, జైలుకు పంపిస్తానని ఆవేశంతో ఊగిపోతాడు. కొడుకు దేశం విడిచిపెట్టి వెళ్లిపోయాడని, ఇక ఈ జన్మలో తిరిగి రాదని EUSEBIA చెబుతుంది. అప్పుడు RUTILIO లో ఉన్న తండ్రి మనసు బయటపడుతుంది. తన ఒక్కగానొక్క కొడుకు తనని, మనల్ని వదిలిపెట్టి వెళ్లిపోయాడని EUSEBIA ఒళ్లో తలదాచుకొని చంటిపిల్లడిలా వెక్కి వెక్కి ఏడుస్తాడు.

-      RUTILIO భాగం సమాప్తం – 


ALMITA(ALMA) భాగం:  


బార్ లో, టేబుల్ పై DOMINOES ఆట ఆడుతూ, సిగరెట్ & మద్యంతో అందరూ రిలాక్స్ అవుతూ ఉంటారు. అదే సమయానికి ALMITA ఇంట్లో రేడియోలో పాటలు వింటూ ఉంటుంది. SUSANITA తన భవిష్యత్తు గురించి తెలుసుకోవడానికి ALMITA తల్లి అయిన CATA వద్దకు వస్తుంది. కిటికీ దగ్గర కూర్చుని తల తుడుచుకుంటున్న ALMITAని అప్పుడే వచ్చిన ABEL చూసి మైమరచిపోతాడు. మరుసటి రోజు ALMITA, ABEL సెలూన్ ముందు నుంచి వెళ్తుంది. ఆమెని మాట్లాడించడానికి ప్రయత్నిస్తాడు. అసలు నువ్వెవరో నాకు తెలియదు అంటుంది. పదిహేను సంవత్సరాల కిందట ఒక కార్యక్రమంలో మనమిద్దరం బొమ్మల పెళ్లి చేసుకున్నాం అని గుర్తుచేస్తాడు. కానీ నువ్వంటే మా అమ్మకు ఇష్టం లేదు అని చెబుతుంది.. వెళ్తూ వెళ్తూ నాక్కూడా ఇష్టం లేదు అంటుంది అమాయకంగా.

ఆ తర్వాత స్నేహితురాలు MARU ని కలుసుకుంటుంది. ఆమె తనకు జరిగిన మొదటి శృంగార అనుభవం గురించి ALMITAతో చెబుతుంది. పైగా ఈ వయసులో కన్యగా ఉండటం మూర్ఖత్వం అని, ఆ అనుభూతిని వదులుకోవద్దని భోదిస్తుంది. అందుకు ఎవరూ లేరని ALMITA వాపోతుండగా, ABEL గురించి గుర్తు చేస్తుంది. అతను పెళ్లి గురించి ఆలోచిస్తుంటాడు అనగానే, కొన్నాళ్ళు వాడుకొని, వదిలేసి తర్వాత మరో మంచి వ్యక్తిని పెళ్ళాడు అని చెబుతుంది.


RUTILIO, FIDEL కి చెందిన నగల దుకాణంలో కూర్చుని మాట్లాడుకుంటుండగా ALMITA అక్కడికి వస్తుంది. FIDEL భార్య చనిపోవడంతో ఒంటరిగా జీవిస్తున్నాడు. ప్రదర్శనలో ఉంచిన నగని చూసి ముచ్చటపడుతుంది. కాని కలలో కూడా అది తన సొంతం కాదని అంటుంది. ABEL దాన్ని కొనిస్తే నీ సొంతమే కదా అని అంటాడు RUTILIO. ALMITA జన్మించింది అతని కోసం కాదు అంటాడు FIDEL. ఆమె కోసం ఒక నిజమైన మగాడు కావలి అంటాడు. అర్థం చేసుకున్న RUTILIO , అవునవును, అనుభవం ఉన్నవాడు కావాలి అంటాడు. ఆ తర్వాత ALMITA వెళ్లిపోతుంది. ఆమె వైపే తీక్షణంగా చూస్తుంటాడు FIDEL. 


ALMITA తో కలిసి ABEL ఓ వీధిలో తింటుంటాడు. ఆ క్రమంలో CHAVA U.S. కి రమ్మంటున్నాడని, కానీ తనకు వెళ్ళడం ఇష్టం లేదని చెబుతాడు. ఇక్కడే ఒక బార్బర్ షాప్ చూశానని, అది లీజు కు దొరికితే, తను దాచుకున్న డబ్బులతో దాన్ని బ్యూటి పార్లర్ లా మార్చేస్తానని అంటాడు. మాటల మధ్యలో నువ్వు వర్జిన్ వా అని అడుగుతుంది. అవును, నేను ఒకే ఒక్క అమ్మాయిని ప్రేమిస్తాను, అది నిన్నే, అంటాడు. ఆ తర్వాత అతను తీసుకొచ్చిన కానుకని ఆమెకిస్తాడు. ఆమె ఏంతో సంతోషించి అతని బుగ్గపై ముద్దు పెడుతుంది. ఇప్పటికైనా నువ్వు నా ప్రియురాలివని అనుకోవచ్చా అంటాడు, ఇప్పుడే కాదు అంటుంది ALMITA.


FIDEL పంపించిన ఖరీదైన నగకు ALMITA తల్లి CATA ఉబ్బి తబ్బిబ్బై, అతనికి పర్సనల్ గా కలిసి ధన్యవాదాలు తెలుపడానికి తయారవుతుంది. ఇప్పుడు నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటే, నీకేం అభ్యంతరం లేదు కదా అని ALMITAని అడుగుతుంది. ALMITA అదేం లేదు అంటుంది. FIDEL దగ్గరికి వెళ్ళాక CATA కి అర్థమవుతుంది ఆ నగ తన కోసం కాదని, ALMITA కోసమని! ఆమెని పెళ్లి చేసుకోవడానికి FIDEL ఆరాటపడుతున్న సంగతి చెబుతాడు. ఇంటికి వచ్చిన CATA మెట్లపై కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తుంటే, పై నుండి వచ్చిన EUSEBIA ఓదారుస్తుంది.


బార్ లో కూర్చుని ఉండగా, RUTILIO కోసం JIMMY వస్తాడు. RUTILIO అక్కడ ఉండకపోగా, అక్కడే ఉన్న CHAVA తన చూపులూ, చేష్టలతో JIMMY ని బెదరగొడతాడు. దాంతో JIMMY వెళ్ళిపోతాడు. ఆ తరువాత ఆ బార్ కి ALMITA స్నేహితురాలు  MARU వచ్చి ALMITA కి వేరే పనుందని, నీతో సినిమాకు రాలేనని చెప్పమందని అంటుంది.

అక్కడి బస్టాండ్ లో ఓ వ్యక్తి (JOSE LUIS) ఖరీదైన కార్ లో వచ్చి ALMITA & MARU ని రమ్మన్నట్టుగా చూస్తాడు. MARU వెళ్దాం అంటుంది, కానీ ALMITA వద్దని వారించి షేర్ టాక్సీలో, ఒక పెద్దల చిత్రాన్ని చూడటానికి వెళ్తారు. ఆ రాత్రి ABEL మత్తు మందు ఉన్న సిగరెట్లని అక్కడే ఉండే ZACARIAS దగ్గర కొనడం చూస్తుంది ALMITA. ఆ తర్వాత అతన్ని తనతో పాటు పైకి తీసుకెళ్ళి ఆమె కూడా ఆ సిగరెట్ల రుచి చూస్తుంది. ఆ తర్వాత అతన్నుండి ఓ ముద్దుని ఆశిస్తుంది. అతను పెళ్ళయ్యాకే అనడంతో, ఆమె మూభావంగా మారుతుంది. చివరికి పెళ్లి ప్రస్తావన తేకుండానే అతనితో ఘడ చుంబనంలో మునిగిపోతుండగా, CHAVA పరుగెత్తుకుంటూ వస్తాడు, తను ఆపదలో ఉన్నానని రక్షించమని వేడుకొంటాడు. ALMITAతో తొందరగా వచ్చేస్తానని చెప్పిన ABEL, సరాసరి అర్థరాత్రి వచ్చి ఆమె రూమ్ తలుపు తట్టి CHAVAతో U.S. వెళ్తున్నానని చెప్తాడు. సంవత్సరంలోపు సంపాదించుకు వస్తానని, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని చెబుతాడు. నువ్వు నన్ను వదిలి వెళ్తున్నావ్, నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? నీకోసం సంవత్సరం ఎదురుచూడాలా ? అంటుంది. చివరికి నీకోసం జీవితాంతం ఎదురుచూస్తానని చెప్పి, తన ఫోటోని గుర్తుగా ఇచ్చి పంపిస్తుంది. 


మరునాడు, ALMITA స్నేహితురాలు MARU, అతను వెళ్లేముందు అయిన శృంగారం జరపాల్సింది అంటుంది. ఒకవేళ అతను గే కావచ్చు అంటుంది. అతనెప్పటికీ తిరిగి రాడు అంటుంది. వేరే ఎవర్నో ఆ దేశంలో తగులుకుంటాడు అంటుంది MARU. అతను నన్ను నిజంగా ప్రేమిస్తున్నాడు, నాకోసమే వెళ్ళాడు అంటుంది ALMITA, కాని అతన్ని మరిచిపోవాలి అని కూడా అంటుంది. అయితే ఆ FIDEL తప్ప మరో అవకాశం లేదు అంటుంది స్నేహితురాలు MARU.

తల్లి CATA కోరిక మేరకు, పేద ALMITA, ఆస్తిపరుడైన FIDEL ను చేసుకోవడానికి అయిష్టంగానే ఒప్పుకుంటుంది. అతను తీసుకొచ్చిన ఖరీదైన బహుమతులు చూసి పొంగిపోతుంది. పెళ్లి గౌను కొనడానికి వెళ్ళినప్పుడు, బస్టాండ్ వద్ద కనిపించిన వ్యక్తి (JOSE LUIS) మళ్ళీ కార్ లో వచ్చి కనిపిస్తాడు, ALMITA వంక నవ్వుతూ చూస్తుంటాడు. ALMITA మనసులో ఏవో ఆలోచనలు!

RUTILIO బార్ లో టేబుల్ పై ఆడుతుండగా FIDEL చాలా సంతోషంగా కనిపిస్తాడు. మరో రెండు వారాల్లో ALMITA ని పెళ్ళిచేసుకోబోతున్నానని, ఆవిడ వల్ల తనకు అదృష్టం పడుతుందని చెబుతుండగా, ఆ ఆటలో అతను గెలుస్తాడు. ఆ సంతోషంలో బిగ్గరగా నవ్వుతూ ఉండగా గుండె ఆగి మరణిస్తాడు. అయితే FIDEL తన ఆస్థినంతా చిల్లిగవ్వతో సహా తన పిల్లల పేర్ల మీదే రాసేసరికి, ALMITA కి వాటా ఏమీ దక్కదు. ALMITA కన్నా, ఆమె తల్లి CATA ఎక్కువ బాధపడుతుంది, వెక్కి వెక్కి రోదిస్తుంది.



FIDEL అంత్యక్రియల సమయంలో అక్కడికి కారులో కనిపించే వ్యక్తి - JOSE LUIS వస్తాడు. ALMITA తో మాట మాట కలిపి డిన్నర్ కి పిలుస్తాడు. అతనెప్పుడూ న్వవ్వుతూనే ఉంటాడు. తను రాను అంటుంది. ఓ రోజు ALMITA ఎక్కడికో తయారై వెళ్తుండగా, SUSANITA వచ్చి నీకు U.S. నుంచి ఫోన్ వచ్చిందని చెప్తుంది. ఫోన్ లో ABEL తో, పెళ్లి గురించి ఇప్పుడెందుకు, నిన్ను ప్రేమిస్తున్నాను, నీ కోసం ఎదురుచూస్తాను అని చెప్తుంది. ఆ తర్వాత కాసేపటికే ఫోన్ కట్ అయిపోతుంది.

ఆ తర్వాత ALMITA, JOSE LUISతో గుర్రపు పందాలకు వెళ్తుంది. ALMITA కాసిన గుర్రం ఓడిపోతుంది. అతను కాసిన గుర్రాలు గెలుస్తాయి. కాని వాటన్నిటిని ALMITA కి ఇచ్చేస్తాడు. నువ్వు పొందినదానికన్నా, పొందాల్సింది, అనుభవించాల్సింది ఎంతో ఉంది. నీకు కావాల్సింది కాస్తంత అదృష్టం, అది నేనిస్తాను, ఎలా వస్తుందో చెప్తాను అంటాడు. ఆ తర్వాత రాత్రికి ఒక రెస్టారెంట్ కి వెళ్తారు.. కలిసి డాన్స్ చేస్తారు. అప్పుడు కూడా ఆ వ్యక్తి నీ అందానికి ఎంతో డబ్బు, ప్రేమ ఈ పాటికే దక్కాల్సింది అంటాడు. అసలు నువ్వుండాల్సింది అటువంటి ప్రాంతంలో కానే కాదు అంటాడు. నువ్వు పెద్ద సినిమా స్టార్ గానో, లేక మాడల్ గానో అంతకు మించో అవ్వాల్సిన దానివి అంటాడు. అవి దక్కేందుకు నేను సహకరిస్తానని, తన కార్డ్ ఇస్తాడు. కాకపోతే ఎట్టి పరిస్తితుల్లోనూ నా మీద నమ్మకాన్ని కోల్పోవద్దని కోరుతాడు. సరే అంటుంది ALMITA. అయితే అతను మాట్లాడుతున్నంత సేపు ఎవరైనా చూస్తున్నారేమో అన్న అనుమానంతో దిక్కులు చూస్తూ మాట్లాడుతుంటాడు. పైగా ఎప్పుడూ సిగరెట్ కలుస్తూనే ఉంటాడు, టెన్షన్ తగ్గటానికి అన్నట్టు.. కాని ఇవేవి ALMITA గమనించదు.

ఎప్పట్లా ALMITA, JOSE LUIS తో కలిసి బయటకు వెళ్లేందుకు రెడీ అవుతుండగా CATA, U.S. నుంచి వచ్చిన ABEL ఉత్తరంతో వస్తుంది. నీకు ABEL సరైన వాడు అంటుంది. కానీ అతన్ని నువ్వు ద్వేశించావుగా అంటుంది ALMITA. అవును, కానీ FIDEL చనిపోయాక నీ గురించి బాగా ఆలోచించాను. నీకు FIDEL లాంటి ముసలి ధనిక భర్త కానీ, ఇప్పుడు నువ్వు రోజు తిరిగే అవకాశవాది కానీ సరిపోరు, నిన్ను జీవితాంతం ప్రేమగా చూసుకునే ABEL నీకు నిజంగా సరైనవాడు అంటుంది. కాని ALMITA నేను సాయంత్రం వచ్చాక మాట్లాడతా అంటూ ఆ ఉత్తరం కూడా చదవకుండా, అక్కడే వదిలేసి వెళ్తుంది.

JOSE LUIS ఆమెని ఒక అపార్ట్ మెంట్ కి తీసుకెళ్తాడు. అందులో ఒక పోర్షన్ లో మాత్రమే తను ఉంటానని, మిగితాది స్నేహితులు వాడుకుంటారని చెప్తాడు. అక్కడ ఆమెతో అనుభవించాలని పథకం వేసుకున్నప్పటికీ, అంతలోనే ఫోన్ వస్తుంది. ఈ లోపు ALMITA డోర్ తీసి హాల్లో జరుగుతున్న తతంగం చూసి నివ్వెరపోతుంది. అప్పటికి అదో సానికొంప అని అర్థమవుతుంది. ఫోన్ పెట్టేసిన JOSE LUIS తో గొడవకు దిగుతుంది. అతను మాత్రం నవ్వుతూ ఇక్కడికొచ్చే ఆడవాళ్లు, మగవాళ్ళు అందరూ సంఘంలో పేరు, ప్రతిష్ట, డబ్బు అనుభవిస్తున్నవారు అని చెప్తాడు. నువ్వు నన్ను మోసం చేశావ్ అంటూ వెళ్ళిపోతుంది. నువ్ మళ్ళీ తిరిగోస్తావ్, ఎందుకంటే నేను నీకు ఇచ్చిన/ఇవ్వబోతున్న సౌఖ్యాలు ఈ ప్రపంచంలో ఇంకెవరూ నీకు ఇవ్వరు అంటాడు JOSE LUIS.

రాత్రి ఇంటికి వచ్చిన ALMITA, ABEL రాసిన ఉత్తరం చదువుతూ వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఆమె కోసం, మరిన్ని డబ్బులు సంపాదించడానికి యుద్ధంలో పల్గొనబోతున్నాను అని, త్వరలోనే వచ్చి పెళ్లి చేసుకుంటానని, రాత్రుళ్ళు నీ ఫోటో చూస్తూ, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని, నాకోసం ఎదురుచూడాలని ఆశతో జీవిస్తున్నాను అని ఆ ఉత్తరంలో రాశాడు.

ఆరోజు ALMITA చర్చ్ దారిలో వెల్తుండగా, RUTILIO భార్య EUSEBIA చర్చ్ నుండి బయటకు వస్తూ పలకరిస్తుంది. నీ వయసు పిల్లలు, చర్చ్ వైపు రావడం లేదు, మనశ్శాంతి కోసం చర్చికి రావడం మంచిది అంటుంది. ఏవేవో ఆలోచనలతో గందరగోళంలో ఉన్న ALMITA ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతుంది.

ఓ రాత్రి ALMITA, JOSE LUIS వద్దకు వెళ్తుంది. ఏవో డ్రగ్స్ తీసుకుంటున్న అతను, ALMITA రాగానే వాటిని దాచేసి, మాట కూడా మాట్లాడకుండా ఆమెని అనుభవిస్తాడు. నువ్వు కన్యవా అని అడుగగా, ఆమె కాదు అని అబద్ధం చెబుతుంది. దాంతో శృంగారంలోని మొదటిసారే ఖరుకుదనాన్ని చవిచూస్తుంది.

ALMITA, కోసం పోలిస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని, స్నేహితులని అడిగానని, అన్ని ప్రదేశాలు తిరిగానని SUSANITA అడుగగా చెబుతుంది CATA. రెండురోజులైనా ALMITA రాకపోయేసరికి, CATA పేక ముక్కలతో భవిష్యత్తుని చూసుకుంటుంది. అందులో ఏముంటుందో కాని ఆమె కళ్ళు ధారాళంగా కారుతూనే ఉంటాయి.
-          

            - ALMITA భాగం సమాప్తం –

       

    SUSANITA భాగం:


    బార్ లో, టేబుల్ పై DOMINOES ఆట ఆడుతూ, సిగరెట్ & మద్యంతో అందరూ రిలాక్స్ అవుతూ ఉంటారు. ఆ సమయంలో వీళ్ళందరూ ఉండే ఆ ఇళ్ళ సముదాయానికి యజమాని అయిన SUSANITA ఓ కిరాయిదారు నుంచి అద్దె వసూలు చేసుకుని వెళ్తుండగా, CATA ఆమెని చూసి వేగంగా నడుస్తుంది. SUSANITA ఆమెని ఆగమనగా, ఇప్పుడు లేవు వచ్చే నెల ఇస్తాను అనుకుంటూ వెళ్తుంది. అద్దె కోసం కాదు, కాస్త వ్యక్తిగతంగా మాట్లాడాలి అంటుంది. ఆ తర్వాత ఈ మధ్య నాకు వింత కలలు వస్తున్నాయని చెబుతుంది. ఓ వ్యక్తి తనని అదే పనిగా చూస్తున్నాడని, తాకుతున్నాడని – దాని అర్థం ఏమై ఉంటుందని అడుగుతుంది. అందుకు CATA, కార్డ్స్(పేక ముక్కలని) అడిగితె మొత్తం తెలుస్తుందని, అందుకు ఒక నెల అద్దె మొత్తం ఖర్చు అవుతుందని చెబుతుంది. ఇప్పుడు మొదలపెడదాం, అంటుంది SUSANITA. CATA ఇంట్లోకి వెళ్లి కూర్చుంటారు. ALMITA అప్పుడే తల తుడుచుకుంటూ కిటికీ వద్ద కూర్చుంటుంది. పేక ముక్కాలతో చూసి, ఓ వ్యక్తి నీ జీవితంలోకి ప్రవేశించబోతున్నాడని చెబుతుంది. SUSANITA సిగ్గు పడుతుంది. ఆవిడకింకా పెళ్లి కాలేదు, అందుకు ఆవిడ పళ్ళు అందంగా ఉండకపోవడం కూడా కారణమై ఉండొచ్చు.

మరునాడు మేడ పై ఉన్న CHAVA ను పలకరించి, ఫుట్ బాల్ మ్యాచ్ చూడటానికి వస్తావా? నా వద్ద రెండు టికెట్లు ఉన్నాయి అంటుంది. ఆమె ఉద్దేశ్యం అర్థమైన CHAVA, నాకు బార్ లో పనుంది అని వెళ్ళిపోతాడు.

మరునాడు ఇంకో సెషన్లో కూడా CATA, SUSANITAతో అదే విషయం మళ్ళీ చెబుతుంది. కచ్చితంగా నీ జీవితంలోకి ఓ వ్యక్తి రాబోతున్నాడు అని. అయితే అతను, CHAVA అయి ఉంటాడా, ఎందుకంటే అతను నావైపు ఆరాధనగా చూస్తున్నట్టు అనిపిస్తుంది అని అడుగుతుంది SUSANITA. అతనో థర్డ్ క్లాస్ మనిషి, ఎంతసేపు ఆ బార్బర్ తో కలిసి U.S. వెళ్దామా అన్న ఆలోచన తప్ప మరోటి లేదు. వేరే వ్యక్తి ఎవరో అయి ఉంటారు, విధి నిర్ణయిస్తుంది అని అంటుంది CATA. కానీ నా కలల్లోకి వచ్చే వ్యక్తి దాదాపు CHAVA లాగే ఉన్నాడు, విధి నిర్ణయం తీసుకోవడానికి ఎక్కువ రోజులు సమయం పడితే వేచి ఉండేందుకు నేను యవ్వనంలో కూడా లేనుగా అని సెలవు తీసుకుంటుంది.


అక్కడే ఉండే ZACARIAS, మరో డెంటిస్ట్ తో కలిసి చిన్నపిల్లలతో బిక్షమెత్తించడం, వీధుల్లో కళాకారులతో ప్రదర్శనలు ఇప్పించడం, పోలీసులకు డబ్బులిచ్చి అడ్డుపడకుండా చూసుకుంటూ సంపాదించుకుంటూ ఉంటాడు.

ఓ అర్థరాత్రి SUSANITA తలుపు బాదుతాడు CHAVA. తను చావు బతుకుల్లో ఉన్నానని, మా నాన్న నేను దొరికితే చంపేసేటట్టు ఉన్నాడని, U.S.కి పరిపోతున్నని, డబ్బులు ఇమ్మని అడుగుతాడు. తిరిగి వచ్చాక అంతకు రెండింతలు ఇస్తానంటాడు. అంత డబ్బు నా దగ్గర లేదని చెప్పి, ఎంత ఉందో చూస్తుండగా CHAVA, SUSANITA వెనకనుండి వాటేసుకొని ముద్దు పెడతాడు. ఆవిడ మైమరచిపోయి అడిగినంత ఇస్తుంది. అవి తీసుకొని CHAVA పారిపోతాడు.

RUTILIO దగ్గర పనిచేసే GUICHO ఎప్పట్లా దొంగ లెక్కలతో చేతివాటం చూపించగా, RUTILIO దాన్ని పసిగట్టి , అతన్ని తిట్టి పంపిస్తాడు. మరోసారి ఇలాంటి తప్పు చేస్తే జైల్లో వేయిస్తానని భయపెడతాడు. కోపంతో RUTILIO ఇంట్లోంచి బయటకు వచ్చిన GUICHO, SUSANITA ను గుద్దుకొని మెట్లపైనుంచి జారుతూ కింద పడతాడు. దెబ్బలు తగలటంతో SUSANITA అతన్ని తన ఇంటికి తీసుకెళ్ళి సపర్యలు చేస్తుంది. ఆ క్రమంలో SUSANITA అతన్ని ఇష్టపడుతుంది. కానీ GUICHO ఆమెకు తెలియకుండా ఆ ఇంట్లో కూడా దొంగతనం చేస్తాడు.

 ఓ రోజు బార్ తొందరగా మూసేసిన GUICHO, SUSANITA తో అక్కడ డాన్స్ చేస్తాడు. ఆమె పళ్ళు అంత బాగాలేవని చెబుతాడు. మరునాడు SUSANITA డెంటిస్ట్ దగ్గరికి వెళ్తుంది. ఓ నలభై ఐదు రోజుల్లో కొత్త పళ్ళు పెడతాను, అప్పుడు నువ్ ఫిల్మ్ స్టార్ లా కనిపిస్తావు అంటాడు.

RUTILIO బార్ లో ZACARIAS, డెంటిస్ట్ ఏదో ప్రమాదంలో ఉన్నామని మాట్లాడుకుంటూ ఉంటారు.

ఆ తర్వాత GUICHO, SUSANITA ల పెళ్లి జరుగుతుంది. ఆ విందులో అందరూ ఆనందంగా డాన్స్ చేస్తారు. అప్పుడే పోలీసులు వచ్చి ZACARIAS ని, డెంటిస్ట్ ని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు.

-      SUSANITA భాగం సమాప్తం – 

THE RETURN(పునరాగమనం) భాగం : 

CHAVA తిరిగి వస్తాడు. అతని వెంట అతని భార్య, నెలల బాబు ఉంటారు. తన కొడుక్కి నాన్న పేరు పెట్టినట్టు వాళ్ళ అమ్మతో చెప్తాడు. ఆ తర్వాత SUSANITA, CATA, అమ్మ EUSEBIA, భార్యతో కలిసి భోజనం చేస్తూ, మొదటి సంవత్సరం చాలా దుర్భరంగా గడిచిందని, తర్వాత నిలదొక్కుకున్నామని, ఆ తర్వాత SAN DIAGO లో ఉద్యోగం సంపాదించినా, సరిహద్దు దళాలతో ఇబ్బందిగా ఉండేదని, సరిహద్దు వద్ద డబ్బులు లేకుండా గడిపిన సందర్భాలూ ఉన్నాయని చెప్పాడు. CATA , ABEL  గురించి అడగగా కొన్నాళ్ళయ్యాక ఇద్దరం ఎవరికీ నచ్చిన రీతిలో వాళ్ళు వేల్లిపోయామని, అతను HOUSTON వెళ్ళాడని, ఆ తర్వాత కనిపించకుండా మాయమైపోయాడని చెప్పాడు. ALMITA కూడా మాయమైందని ఒకావిడ నోరు జారుతుంది. అతను ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత EUSEBIA, తండ్రితో మాట్లాడమని CHAVA తో చెబుతుంది.

బార్ కి వెళ్ళిన CHAVA, తను వెళ్ళిపోయాక జరిగిన మార్పుల గురించి తెలుసుకుంటాడు, GUICHO ఇప్పుడు నాన్నకి కుడి భుజం లా మారడని కూడా తెలుసుకుంటాడు. తండ్రి రాగానే తను తిరిగివచ్చానని, మీ కోసం మీకిష్టమైన విస్కీ తీసుకొచ్చానని చేతికిస్తాడు. దాన్ని ముక్కలయ్యేలా విసిరి పారేస్తాడు RUTILIO.

తండ్రి మీద కోపం తో ABEL ఉండే రూమ్ లోకి  భార్య, పిల్లాడితో సహా వెళ్ళిపోతాడు CHAVA. ఆ తర్వాత యజమానురలైన SUSANITA తో తను ఆమె దగ్గర తీసుకున్న అప్పు గుర్తుందని, సాధ్యమైనంత తొందరలో తిరిగి ఇచ్చేస్తానని అంటాడు. అక్కర్లేదు, నా మనసులో ప్రేమ ద్వారాలు తెరవడం ద్వారా ఆ డబ్బు నువ్వు ఇది వరకే ఇచ్చేశావు అంటుంది SUSANITA.

RUTILIO వచ్చే సరికి మంచం పై బాబు ని పడుకోబెట్టి ఉంచుతుంది CHAVA భార్య. ఆమెని చూసి చిర్రుబుర్రులాడి బయటకు పంపించేస్తాడు RUTILIO. ఆ తర్వాత EUSEBIA ద్వారా బాబుకు అతని పేరే పెట్టారని తెలుసుకుంటాడు, బాబుకి అతని పోలికలు ఉన్నాయని EUSEBIA చెబితే మురిసిపోయి ఎత్తుకుంటాడు RUTILIO. ఇంతలో కోపంగా వచ్చిన CHAVA, తన పిల్లాడిని బలవంతంగా తండ్రి చేతుల్లోంచి తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ బాబుకి నేను తాతను, నాకు ఎత్తుకునే హక్కు ఉంది అంటూ వెంటపడతాడు RUTILIO.

ఆ తర్వాత తన సామానుని ఇంటికి తిరిగి తీసుకువస్తాడు CHAVA. అప్పుడు ALMITA  స్నేహితురాలు MARU కనిపిస్తుంది. మాటల మధ్యలో ALMITA గురించి అడుగుతూ ఆమె వెంట వెళతాడు.

ఓ రాత్రి పిల్లలు పుట్టటానికి మంత్రించిన నీటిని తాగమని CATA, SUSANITA కి ఇస్తుండగా, ఇంటి బయట సంగీతం వినిపించడంతో ఇద్దరూ పరిగెత్తుకుంటూ బయటకు వస్తారు. అక్కడ ABEL ఉంటాడు. అర్కెస్ట్రతో వచ్చిన అతను రొమాంటిక్ గా ALMITA కు ప్రపోస్ చేయడానికి రాగా, వీళ్ళని చూడగానే తను తిరిగి వచ్చేశానని, ALMITA ను బయటకు రమ్మనమని చెబుతాడు. అసలు విషయాన్ని CATA చెప్పలేక చెబుతుంది.

ఆ తర్వాత CHAVA తో ABEL, ALMITA ఎక్కడుంది, ఎలా ఉంది, ఆమెకేమైనా జరిగిందా అంటూ మదనపడుతూ ఉండగా, ఆమెకేమీ కాలేదని CHAVA బదులిస్తాడు. ALMITA స్నేహితురాలు MARU కలిసిందని, ALMITA ఇప్పుడు ప్రొఫెషనల్  వ్యభిచార వృత్తిలో ఉందని చెబుతాడు. అది విన్న ABEL వెక్కి వెక్కి ఏడుస్తాడు.


ZACARIAS, డెంటిస్ట్ ఇద్దరూ జైలు నుంచి తిరిగి వచ్చి RUTILIO బార్ లో తాగుతుంటారు. UBALDO ని RUTILIO క్షమించడంతో అతనూ అక్కడికే రావడం మొదలుపెడతాడు. మనవడితో కలిసి బార్ లో ఉంటాడు RUTILIO. ALMITA వ్యవహారంతో ఖిన్నుడైన ABEL విపరీతంగా తాగటంతో, తండ్రి సలహా మేరకు అతన్ని రూమ్ లో దింపుతాడు CHAVA. అప్పుడు ABEL , ఆమె వ్యభిచారి అయినా ఒక్కసారి తనను చూడాలని ఉందని, మాట్లాడాలని ఉందని, తీసుకెళ్ళమని వేడుకొంటాడు. అప్పుడు  నీకోసం ఆమెని వదిలేసి వచ్చానని, ఇప్పుడు నాకు సహాయం చేయమని చిన్నపిల్లాడిలా మారం చేయడంతో సరే అంటాడు CHAVA.

ALMITA ఉండే ప్రదేశానికి వెళ్తారు ఇద్దరూ. అక్కడ ఆమె డ్రగ్స్ తీసుకుంటూ కనిపిస్తుంది. ABEL ని చూసి పైకి తీసుకెళ్తుంది మాట్లాడటానికి. నాతో ఎందుకు ఇలా చేశావ్ అని అడగగా, నువ్వు నాకు అవసరమైనప్పుడు నన్ను విడిచి వెళ్లిపోయావ్ అంటుంది. దాంతో తేలిగ్గా వ్యభిచారిలా మారిపోయవా అంటాడు, అంత తేలికగా మారలేదు, ఆ సమయంలో నా కళ్ళు బైర్లు కమ్మి, పిచ్చి దానిలా ఈ నిర్ణయం తీసుకున్నాను. కాని అప్పటికీ, ఇప్పటికీ నిన్ను ప్రేమిస్తున్నాను అంటుంది. నీకోసం పిచ్చి కుక్కలా కష్టపడి డబ్బు సంపాదించుకు వచ్చాను, నిన్ను పెళ్లి చేసుకొని బాగా చూసుకుందామనుకున్నాను. నాకోసం ఎదురుచూస్తానని మోసం చేశావ్ అంటాడు. ALMITA ఎదో చెప్పబోతుండగా JOSE LUIS వస్తాడు. అతన్ని చూడగానే చప్పున లేచి నిలబడి అతను నా స్నేహితుడు అని చెప్తుంది. అలా అయితే వాళ్ళు ఇక్కడ ఉండకూడదు అని బయటకు గెంటేయిస్తాడు. ఆ తర్వాత నీకు ఎవరూ లేరు, ఏమీ లేదు.. ఉన్న దల్ల నేనొక్కడినే అంటూ ఆమెని హింసిస్తూ, డ్రగ్స్ ప్రభావంలో ఉన్న ఆమెని హిప్నటైస్ చేస్తాడు.

GUICHO, మళ్ళీ ఇంట్లోనే ఎదో దొంగతనం చేస్తూ భార్య SUSANITA కి దొరికిపోతాడు. అతని ప్రవర్తనకి విసుగు చెందిన ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూ ఇంట్లోంచి వెళ్లి పొమ్మంటుంది. తన తల్లి కి ఆపరేషన్ కోసం తీశానని, నా సంపదనలోంచి తిరిగి ఇచ్చేద్దామనుకున్నానని అంటాడు. నేను నమ్మను అంటూ ఏడుస్తుంది. క్షమించమని కాళ్ళ మీద పడతాడు GUICHO. అయితే అతని అడగడంలో మొదటిసారి నిజాయితీ కనిపిస్తుంది.

ఎక్కడికో వెళ్ళడానికి షేవ్ చేసుకుంటాడు ABEL. MARU తన ఇంట్లో పార్టీ ఇస్తోందని, వెళ్దాం పద అంటూ వస్తాడు CHAVA. పాత విషయాలు మర్చిపోయి కొత్త జీవితం ప్రారంభించు అంటాడు. తన వల్ల కాదంటాడు ABEL. నేను నీతో వస్తా అంటాడు CHAVA. ఇది నా వ్యక్తిగత సమస్య అని, షేవ్ చేసుకున్న కత్తిని కోట్ లో పెట్టుకొని వెళ్తాడు. అక్కడ కాపలవాడికి డబ్బులిచ్చి లోపలి వెల్తాడు. అక్కడ JOSE LUIS మరో కొత్త అమ్మాయికి డ్రగ్స్ అలవాటు చేస్తుంటాడు. ABEL సరాసరి JOSE LUIS వద్దకు వెళ్లి అతని మొహం మీద వెంట తెచ్చుకున్న కత్తితో గాయం చేస్తాడు. ఆ తర్వాత JOSE LUIS తన అనుచరులతో కలిసి కత్తితో ABEL ని నాలుగు పోట్లు పొడుస్తాడు. ఇదంతా చూసిన ALMITA బిగ్గరగా అరుస్తూ, JOSE LUIS కొట్టి ABEL ని తీసుకొని వెళ్ళిపోతుంది. వీధిలో నడుచుకుంటూ వెళ్తుండగా ABEL కుప్పకూలిపోతాడు. టాక్సీ తీసుకొస్తానంటుంది ALMITA, నన్ను విడిచి వెళ్ళకు అంటాడు ABEL, హాస్పిటల్ కి వెళ్తే నీకు నయం చేస్తారు అంటుంది ఆమె, అప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అంటాడు అతను, తప్పకుండా అంటుంది ఆమె, అప్పుడు నువ్వు తెల్ల గౌన్ లో వచ్చి, నా వైపు ప్రేమగా చూడటం మన ఇరుగు పొరుగు వారు చూసి నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో తెలుసుకోవాలి అని ABEL చెప్తుండగానే ప్రాణాలు విడుస్తాడు. ALMITA అతన్ని చంటి పిల్లడికి మల్లె ఒదిగిపట్టుకొని నన్ను అక్కడి నుండి బయటకు తీసుకొచ్చెందుకే నీ ప్రాణాలు పణంగా పెట్టావా అని ఆలోచిస్తూ ఉండిపోతుంది.

 -

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి