కాపీ కొట్టడంలోనూ క్రియేటివిటీ

సత్యానంద్ గారి ఫ్రెండ్‌లాంటి స్నేహితుడు నాక్కూడా ఒకడున్నాడు. సాయంత్రం మా ఇంటికొచ్చాడు. "వాడికి తెలియంది ఏముంటుంది?" అని భావించి ఫేస్బుక్లోని నా సాధకబాధకాలు  చెప్పుకోవడం మొదలు పెట్టాను.

నేను: 
"కాపీ కొట్టడంలోనూ క్రియేటివిటీ చూపించే వాళ్లు ఉంటారని ఈ రోజే తెలిసింది."

ఫ్రెండ్: 
'అవునా అదెలాగా?'

నే: 
"నిన్న చిరంజీవి గారి మీద ఒక పోస్ట్ పెట్టాను.‌ ఆ తర్వాత ఫేస్బుక్ ఓపెన్ చేస్తే, ఆ పోస్ట్‌లో నేను పెట్టిన ఫోటోనే నాకు కనిపించేసరికి ఆశ్చర్యపోయాను, ఎందుకంటే ఫేస్బుక్లో మామూలుగా మనం పెట్టిన పోస్టులు మనకు కనిపించవు కదా!"

ఫ్రె:
'నువ్వు ఫేస్బుక్ దేంట్లో వాడతావు?'

"మొబైల్‌లో, ఆప్ ద్వారా"

ఏదో నిధి దొరికిన వాడిలాగా మొహం పెట్టి 'ఇంతకీ ఆ ఫోటో నువ్వు పెట్టిందే అని ఎలా గుర్తు పట్టావ్?' అన్నాడు.

"ఆ ఫోటోలో వాళ్లు మాత్రమే ఫోకస్ అయ్యేలా చుట్టూ బ్లర్ చేశాను. ఎక్కడెక్కడ బ్లర్ చేశానో నాకు మాత్రమే తెలుసు కాబట్టి!" 

'తర్వాత' కాఫీ అందుకుంటూ అన్నాడు. 

"ఈ క్రియేటివ్ కాపీ రైటర్ ఏం చేశాడంటే నేను 56 పదాల్లో రాసింది, అతను మూడు పదాల్లో రాశాడు."

'అతను ఏ పత్రికలోనైనా ఎడిటర్ గా పని చేస్తున్నాడేమో! అంతా లెంత్ అక్కర్లేదని కత్తిరించి పాడేసినట్టున్నాడు.'

నేను కోపంగా చూశాను.

'సర్లే.. ఇంతకీ క్రియేటివ్ కాపీ అని ఎందుకు అన్నావ్?'

"నేను ఇంగ్లీషులో రాసింది అతను తెలుగులో రాశాడు,  నేను తెలుగులో రాసింది అతను వదిలేశాడు. పైగా నా ఫోటోని  డౌన్లోడ్ చేసి అతని పోస్టులో వాడుకున్నాడు. నా పోస్టు నచ్చితే షేర్ చేసుకోవాలి, ఆ ఆప్షన్ కూడా ఇచ్చాను. కానీ అతను షేర్ చేసుకోలేదు సరి కదా కనీసం లైక్  కూడా కొట్టలేదు." 

'లైక్ కొడితే అతని ఫ్రెండ్స్ లిస్టులో ఉన్న వాళ్లందరికీ నీ పోస్ట్ కనిపించే ఛాన్స్ ఉంది. అప్పుడు అతను కాపీ రైటర్ అని తెలిసిపోతుంది కదా! ఇంతకీ నీ బాధేంటి?'

"కాపీ కొట్టడం తప్పు కదా" 

'నువ్వు పోస్ట్ పెట్టిన టైంలోనే అతనికీ అదే ఐడియా వచ్చి ఉండొచ్చు కదా?'

దాంతో అతని ప్రొఫైల్ ఒకసారి ఓపెన్ చేసి మా వాడికి చూపించాను.‌ దొంగ దొరికిపోయాడు, నేను పోస్ట్ పెట్టిన ఆరు నిమిషాలకి అతను కాపీ కొట్టినట్టు తెలిసిపోతోంది. పైగా అతని టైంలైన్‌పై అన్నీ ఇలాంటి పోస్టులే! వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చిన ఫార్వర్డ్ మెసేజ్లను కూడా వదలకుండా ఫోటోలతో సహా ఫేస్బుక్లో సొంతంగా రాసుకున్నట్లు పోస్ట్ చేసుకున్నాడు. 

'ఇలా ఎందుకు కాపీ కొట్టావని నిలదీస్తావా?'

"వాడు చేసింది తర్జుమా కదా! అది కాపీ కిందకు ఎలా వస్తుంది? ప్రూవ్ చేయలేం!" అన్నాను.

'అయితే ఒక పని చెయ్.. అతన్ని బ్లాక్ చేయకుండా, అతని ఫ్రెండ్ లిస్టులో ఉన్న వాళ్లందరికీ నువ్వు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టేసెయ్. నెక్స్ట్ టైం నుంచి నువ్వు రాసిన పోస్ట్‌ని వాడు కాపీ కొడితే వాళ్లందరికీ తెలిసిపోతుంది. ఎలా ఉంది నా ఐడియా' అంటూ కళ్లెగరేశాడు.

అతని ఫ్రెండ్స్ అందరికీ నేను రిక్వెస్ట్ పెట్టడం ఏంటి చెండాళంగా.. దానికన్నా అతన్ని బ్లాక్ చేయడం ఉత్తమం అని బ్లాక్ చేసేశాను.

'నా ఐడియా  వాడునుకున్నావ్‌గా.. మరి నాకేంటీ?' అన్నాడు ఖాళీ కప్పు అక్కడుంచుతూ!

"నీ ఐడియా నేనెక్కడ వాడాను? దానికి రివర్స్లో కదా నేను చేసింది"

'ఏదేమైనా నా ఐడియా లోంచే కదా నీకు ఐడియా వచ్చింది.. కాబట్టి క్రెడిట్ నాకే దక్కాలి'

"సరే ఇప్పుడు ఏం కావాలో చెప్పు"

'ఒకసారి నీ ఫోన్ ఇలా ఇవ్వు చాలు'

ఇచ్చాను 

'పాస్వర్డ్ ఏంటి?'

"నా మొహం"

నా వైపు గుర్రుగా చూశాడు. ఆ తర్వాత నాలిక్కరుచుకొని, నా మొహం ముందు ఫోన్ పెట్టి అన్లాక్ చేసుకున్నాడు. ఫేస్బుక్ ఓపెన్ చేసి, వాడి ప్రొఫైల్‌లోకి వెళ్ళి చూసుకోసాగాడు.

వాడ్ని ఫాలో అవుతున్నానా? లేదా? అని అనుమానం వచ్చినట్టుంది వెధవకి! "నిన్ను ఫాలో అవకుండా ఎలా ఉంటానురా?!" అన్నాను భరోసానిస్తూ!

మావాడు విలన్‌లా నవ్వాడు నావైపు చూస్తూ!

నాక్కొంచెం భయమేసింది.

గత నెల రోజులుగా వాడు పెట్టిన పోస్టులన్నిటికీ లైకులు, లవ్‌లు,  స్మైలీలు ఎలా పడితే అలా కొట్టేసుకొని ఫోన్ నా చేతిలో పెట్టాడు.

'వాటిని కానీ మళ్ళీ తీసేశావ్ అనుకో, మన ఫ్రెండ్‌షిప్ మీద ఒట్టే' అంటూ వెళ్లిపోయాడు.

అసలేం జరిగిందో రెండ్నిమిషాలక్కాని అర్థం కాలేదు. ఇన్‌బాక్స్‌లోకి మెసేజ్‌లు పోటెత్తసాగాయి, "అతని పోస్టుల్లో ఏముందని లైకులు కొట్టావ్?" అంటూ!!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి