రక్షణ
- అరుణ్ కుమార్ ఆలూరి
(వాసా ఫౌండేషన్ – సాహితీ కిరణం సంయుక్త నిర్వహణలో "సమాజంలో ప్రస్తుత స్త్రీ
సమస్యలు – పరిష్కారాలు" అన్న అంశంపై సెప్టెంబరు 2020లో నిర్వహించిన డా|| వాసా ప్రభావతి స్మారక కథల పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన
కథ)
హైదరాబాద్‌కి కాస్త దూరంగా ఉండే ప్రైవేట్ కళాశాలలో సాధన లెక్చరర్.గా పని చేస్తోంది. సిటీ బస్సులు ఆ రూట్.లో ఎక్కువగా తిరగకపోవడం వల్ల రోజూ తన ఆక్టివా మీద వెళ్లి వస్తుంటు౦ది. గ్రైండర్‌లో ఏదో రుబ్బుతున్న అమ్మకి, టీ.వీ. చూస్తున్న నాన్న ప్రభాకర్ కి కలిపి “వెళ్లొస్తాను” అని చెప్పి కాలేజ్.కి బయలుదేరింది. కూతురు బండిని స్టార్ట్ చేసిన శబ్ధం విని లోకంలోకి వచ్చిన ప్రభాకర్ “జాగ్రత్తమ్మా” అని అరుస్తూ, బయటవరకు వచ్చి ఎలా నడుపుకుంటూ వెళ్తోందో అని గమనించసాగాడు. వాలంటరీ రిటైర్.మెంట్ తీసుకొన్న ప్రభాకర్, ఇన్నేళ్ళూ ఆర్.టీ.సి. డ్రైవర్.గా ఒళ్లు హూనం చేసుకొని పని చేసినందువల్ల, ప్రస్తుతం ఇంటిపట్టునే ఉంటూ పూర్తి విశ్రాంతి తీసుకుంటున్నాడు. సాధన వీధి మలుపు తిరిగాక, లోపలికి వచ్చి మళ్లీ టీ.వీ. చూడసాగాడు. ఏదో వార్తా ఛానెల్.లో చర్చాగోష్టి జరుగుతోంది. టీ.వీ.లో కనిపిస్తున్న వాళ్ళందరి మొహాలు చాలా గంభీరంగా ఉన్నాయి.
“అసలు ఈ అఘాయిత్యానికి
ఒడిగట్టిన వాళ్ళకి నిర్భయ చట్టం గురించి తెలుసా? లేదా? అని అనుమానం వస్తోంది. ఈ
చట్టాల గురించి అవగాహన కల్పించేకుందుకు, ఆయా పరిధిలోని పోలీసులు వెళ్లి, ఎలాంటి
నేరాలకు ఎలాంటి శిక్షలు పడతాయో అని సంవత్సరానికి ఒకసారైనా ప్రజలందరికీ కౌన్సిలింగ్
ఇచ్చేలా ఏర్పాటు చేయాలి” అన్నాడు ఒక సీనియర్ న్యాయవాది.
అసలేం జరిగిందో అర్థం
కాక మరో ఛానల్ పెట్టి చూశాడు ప్రభాకర్. హన్మకొండ, షాద్ నగర్ మరియు శంషాబాద్ ప్రాంతాల్లో యాదృచ్చికమో, దౌర్భాగ్యమో
కానీ ఒకే రోజు ముగ్గురు మహిళలను అత్యాచారం చేసిన కామాంధులు ఆ తర్వాత వాళ్ళను
చంపేసి పారిపోయారు అన్న విషయం అర్థం చేసుకొని నిశ్చేష్టుడైపోయాడు. అతని మదిలో
ఏవేవో ఆలోచనలు చెలరేగి ఒక పట్టాన ఉండనీయట్లేదు. ఉన్నపళంగా సాధనకి ఫోన్ కలిపాడు.
కాసేపు రింగ్ అయ్యాక కాల్ కట్ అయిoది. ఆ తర్వాత ఎస్.ఏం.ఎస్. వచ్చింది, “క్లాస్ లో ఉన్నాను, అయ్యాక
చేస్తాను” అని. వంటింట్లో ఏదో సర్దుతున్న తన భార్య వంక చూశాడు. ఇవన్నీ తనకేమీ
తెలియవు. తెలిస్తే? తెలియకపోవడమే మంచిది అనుకున్నాడు.
ఈ సందర్భంలోనే జరిగిన
చర్చాగోష్టిలో వివిధ రంగాల్లో రాణిస్తున్నవారు వచ్చి తమ అభిప్రాయాలను
పంచుకు౦టున్నారని అర్థమై మళ్లీ అదే టీ.వీ. ఛానల్ పెట్టాడు. ఎవరో రచయిత్రి గొంతు
సవరించుకొని, మైక్ అందుకుని “ప్రతి అమ్మాయికి కరాటే వంటి యుద్ధకళల్ని నేర్పించాలి.
అసలు అమ్మాయిల్ని అందానికి ప్రతీకలుగా సుకుమారంగా కాకుండా అబ్బాయిల్ని పెంచినట్టు,
ఏదైనా ఉపద్రవం వస్తే కనీసం నలుగురిని మట్టికరిపించేలా పెంచాలి. ఆడది భోగ వస్తువు
కాదు, మగవాడు అధికుడు కాదు అనేలా కథలు, కవితలు, పుస్తకాల్లో వచ్చేలా రచనలు
తీసుకురావాలి” అన్నది. అక్కడున్న చాలా మంది ఆమెతో ఏకీభవించారు.
వ్యాఖ్యాత ఆ
కార్యక్రమంలో పాల్గొనే ఇంకెవరి కోసమో ఎదురు చూస్తూ, వాళ్ళు రాకపోవడంతో చర్చకి
ముగింపు పలుకుతూ, చివరగా మైక్.ని గాయనికి అందించింది. ఆవిడ
మాట్లాడుతూ, “వరంగల్.లో తొమ్మిదేళ్ల చిన్నారిని
పాడుచేసి చంపినోడికి ఉరిశిక్ష వేస్తే, వాడు గతంలో దొంగతనం మినహా పెద్ద నేరాలేమీ
చేయని కారణంగా ఆ ఉరిశిక్షని జీవిత ఖైదుగా మార్చారు. దేశ రాజధానిలో జరిగిన నిర్భయ
ఘటనలో కూడా ఒక నేరస్థుడు మైనర్ అని శిక్షించకుండా వదిలిపెట్టారు. ఇలా దోషులు
తప్పించుకోకుండా చట్టాల్ని సవరించాలి” అన్నది.
ఇంతలో ఆ కార్యక్రమానికి
కాస్త ఆలస్యంగా వచ్చిన ప్రముఖ సైకాలజిస్ట్.ను మాట్లాడవలసిందిగా కోరుతూ
మైక్.ని అందించింది వ్యాఖ్యాత. ఆయన అందరి వైపు చూసి గొంతు
సవరించుకొని, “ఇది చాలా పెద్ద మహమ్మారి. మానసిక స్థిరత్వం లేనివారే ఇలాంటి
దారుణానికి పాల్పడతారని నికోలస్ గ్రోత్ అనే సైకాలజిస్టు 1976లో రాసిన “మెన్ హూ
రేప్” అనే పుస్తకంలో రాశారు. ఇటువంటి నేరం చేసిన వారందరి పైనా సైకాలజిస్టులు,
సైకియాట్రిస్టుల నేతృత్వంలో విస్తృతంగా పరిశోధనలు జరపాలి. వాళ్ళు పుట్టి పెరిగిన
వాతావరణం, చదువుకున్న పరిస్థితులు, ఎదుర్కొన్న వివక్ష, ఇలా ప్రతి చిన్న అంశాన్ని విశ్లేషించాలి.
వాళ్ళ హృదయం అంత కర్కశంగా మారడానికి గల కారణాలు కనిపెట్టాలి. ఆ ఫలితాలతో
దీర్ఘకాలికంగా ప్రణాళికలు అమలు చేయాలి.”
“ఉన్నపళంగా వాటికి
అడ్డుకట్ట వేయాలంటే మీ సూచన ఏంటి?” అని అడిగంది వ్యాఖ్యాత.
“అధిక జనాభా ఉన్న
మనలాంటి దేశాల్లో అది సాధ్యం కాకపోవచ్చు. ఎవరికి ఎప్పుడు ఎటువంటి పాడు ఆలోచన
వస్తుందో ఊహించలేంకదా! నేరస్థులకి మరణ శిక్ష విధించడం వల్లో, ప్రజల్లో భయాన్ని
సృష్టించడం వల్లో తాత్కాలికంగా ఆపవచ్చేమో కానీ శాశ్వతంగా రూపుమాపలేం! అయితే..” అంటూ
ఏదో చెప్పబోతుండగా సమయం మించి పోవడంతో, కార్యక్రమాన్ని ముగిస్తున్నట్టు వ్యాఖ్యాత ప్రకటించడం,
ఆ వెంటనే ప్రకటనలు రావడం జరిగిపోయాయి.
టీ.వీ.ని ఆపేసిన ప్రభాకర్
గట్టిగా నిట్టూర్చి మళ్లీ ఫోన్ అందుకుని సాధనకి కలిపాడు. ఆమె ఫోన్ కలవడం లేదు.
కాస్త కంగారు పడ్డాడు. మళ్లీ మళ్లీ ప్రయత్నించగా, స్విచ్ ఆఫ్ అని వచ్చిది. కాలేజీకి
చెందిన ఇతర వ్యక్తుల ఫోన్ నంబర్లు ఏవీ లేకపోవడంతో కంగారు కాస్త పెరిగింది.
పోలీసులకి ఫోన్ చేద్దామా? అని ఆలోచించాడు కానీ అసలేం జరిగిందో తెలియకుండా చేస్తే
తొందరపాటు చర్య అవుతుందేమో అని ఆగిపోయాడు.
బట్టలు మార్చుకొని,
వంటింట్లో ఉన్న భార్యతో “నాక్కొంచెం పనుంది. బయటకెళ్లొస్తా. నువ్వు గడియపెట్టుకొని
ఉండు. నా గొంతు కాని, అమ్మాయి గొంతు కాని వినిపిస్తేనే తలుపు తియ్యు” అని
చెప్పాడు. ప్రభాకర్ భార్య మొదట ఆశ్చర్యపోయినా పరిస్థితిని కొంత ఆకళింపు చేసుకొని
“సరే” అంది.
సాధన పనిచేస్తోన్న
కాలేజ్.కి వెళ్ళాడు ప్రభాకర్. ఆఫీస్.లో తను ఫలానా అని
చెప్పడంతో, రెండవ అంతస్థులో ఉన్న స్టాఫ్ రూంలో చూడవలసిందిగా సూచించారు. అక్కడికి
వెళ్ళాక సాధన కనబడడంతో హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. సాధన చూసి “ఏంటి నాన్న ఇలా వచ్చారు?” అంది.
“నీ ఫోను స్విచ్ ఆఫ్
అని వస్తోందమ్మా” అంటూ కంగారుగా చెప్పాడు.
“స్పెషల్ క్లాస్ వల్ల లేట్
అయింది నాన్న” అంది సంజాయిషీ ఇస్తున్నట్టుగా!
“పరిస్థితులేం బాగలేవు కదమ్మా,
కొంచెం టెన్షన్ పడి వచ్చేశాను” అన్నాడు, అక్కడి నుండి బయలుదేరుతూ!
“ఫోన్ చార్జింగ్
అయిపోయినట్టుంది, చూసుకోలేదు.. సారీ నాన్న” అంది నాన్న వెనకే నడుస్తూ!
ఏదో ఆలోచిస్తూ బండి
దగ్గరికి వచ్చిన ప్రభాకర్, ఒక నిర్ణయానికి వచ్చినవాడిలా కూతురి దగ్గర నుండి
ఆక్టివా తాళంచెవులు తీసుకున్నాడు. బండిని
పోనిస్తూ, “మీ నాన్న బస్సు డ్రైవింగ్ చేసినప్పుడు నువ్వు ఎప్పుడూ చూడలేదు కదమ్మా..
ఇప్పుటి నుంచి చూద్దువు.. ఎందుకంటే ఇక నుంచి మీ నాన్నే నీకు డ్రైవర్” అన్నాడు.
నాన్నతో ఈ విషయం
ఎప్పటినుంచో అడగాలనుకుంది కానీ, ఈ వయసులో ఆయనని కష్టపెట్టడం ఎందుకులే అని
ఊరుకుంది. ప్రభాకర్ మాటతో ఎన్నో సంవత్సరాల నుంచి నెత్తిన మోస్తున్న భారం
ఒక్కసారిగా దించినట్టు అనిపించింది ఆమెకి.
ఆ మరుసటి రోజు నుంచి
సాధనతో పాటు ఆ కాలనీలో ఉన్న మిగితా మహిళలకి ఒక నిపుణుడితో సాయంత్రం పూట కరాటేలో
శిక్షణ ఇప్పించసాగాడు ప్రభాకర్. ఆ తరువాత ఒక పెప్పర్ స్ప్రే బాటిల్ కొని సాధన
బ్యాగులో ఉంచాడు. కొత్త టచ్ స్క్రీన్ మొబైల్ ఫోన్లు కొనిచ్చి, పోలీసుల వారి “హాక్
ఐ” ఆప్‌ని డౌన్లోడ్ చేసి, ఎలా ఉపయోగించాలో భార్యకీ, కూతురికీ వివరించి చెప్పాడు.
ఇంటర్నెట్ లేకపోతే పోలీసుల టోల్ ఫ్రీ నంబరు 100కి ఫోన్ చేసి ఎలా కంప్లైంట్ చేయాలో
కూడా వివరించాడు.
అయినప్పటికీ ఏదో వెలతి!
కూతురుని దిగబెట్టి వచ్చిన తరువాత ప్రభాకర్ ఆలోచనల్లో పడిపోసాగాడు. టీ.వీ.ల్లో
సినిమాల్లో మహిళలను కించపరుస్తూ వచ్చే సన్నివేశాలను నిరసించని తనకు, తాను పనిచేసిన
చోట మహిళలపై చూపులతోనూ మాటలతోనూ జరిగిన లైంగిక దాడిని ఆపలేని తనకు, భార్యను
వంటింటికే పరిమితం చేసిన తనకు, వాళ్ళు నేరస్థులుగా మారడంలో సమాజంలో ఒకడిగా తనకూ భాగస్వామ్యముందా?
అని ఆలోచిస్తూ దిగంతాల్లోకి వెళ్లిపోసాగాడు.
ఇలా ఉంటే కష్టమని, ఎవరైనా
మహిళలు అసౌకర్యానికి గురైనట్టు కనిపిస్తే, వాళ్ళూ నావాళ్ళే అనుకుంటూ ఇబ్బంది
పెడుతున్న వాళ్ళని ఎదిరించడం మొదలుపెట్టాడు. చాలా మంది మెల్లిగా అక్కడి నుంచి
నిష్క్రమించడం ప్రభాకర్‌కి ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది. సమాజంలో మార్పు
తీసుకురావడం ఇంత తేలికా అనుకున్నాడు. అలా కాకుండా గొడవకు దిగిన వారిపై వెంటనే
పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయడం వల్ల అతనిపై అతనికే గౌరవం పెరగసాగింది. ఆ
గౌరవంలోంచి ఒక ప్రశాంతత, ఈ సమాజం పట్ల ఒక నమ్మకం ఏర్పడుతూ, అతని మనసులో
గూడుకట్టుకున్న గుబులు మంచు ముద్దలా కరగడం మొదలుపెట్టింది.
-
అయిపోయింది –
(సాహితీ కిరణం మాస పత్రిక జూన్ 2021 సంచికలో ప్రచురితం)
ఇది ఒక డ్రాఫ్ట్. కథ అనటానికి ఏమీ వీలు లేదు. దీనిని ఇంకా చిత్రికపట్టి తగిన కథను వ్రాయవచ్చును. ఇదీ నా అభిప్రాయం. బ్లాగరు గారికి నామాట నచ్చకపోతే క్షంతవ్యుడను.
రిప్లయితొలగించండికథ చదివి స్పందన తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్. మీ మాటలతో ఏకీభవిస్తున్నాను. అప్పట్లో కథల పోటీల్లో పాల్గొనాలి అన్న జిజ్ఞాస వల్ల, పోటీకి అంశం ఇవ్వటంతో అప్పటికప్పుడు వండి వార్చిన కథ ఇది. దీనికి తోడు పోటీ నిబంధనల్లో "పదాల సంఖ్యకు ఉండే పరిమితి" వల్ల కథకు పూర్తి న్యాయం చేయలేకపోయాను. అలా రెండు, మూడు పోటీల్లో పాల్గొన్న తర్వాత సంతృప్తిగా అనిపించలేదు. ఆ తర్వాతి నుంచి కథ పోటీలకు అప్పటికప్పుడు కథ రాసి పంపటం మానుకున్నాను. ఇక ఇదే బ్లాగ్‌ని మీరు డెస్క్టాప్ వర్షన్‌లో ఓపెన్ చేసి, "నా ముద్రితాలు" అన్న లేబుల్ నొక్కితే, నా కథలన్నీ వరుసగా కనిపిస్తాయి, నా ఇతర కథలు మీకు నచ్చే అవకాశం ఉంది అని భావిస్తున్నాను. వీలైతే చదవగలరు. థాంక్యూ సార్
తొలగించండి