ఈ మధ్య కాలంలో చూసిన సినిమాల్లో బాగా నచ్చిన సినిమా A: Ad Infinitum. మొదటి ఫ్రేమ్
నుంచే దర్శకుడు Ugandhar Muni
నాలోని ప్రేక్షకున్ని తన ఆధీనంలోకి తీసుకున్నాడు. పాత్రల రూపకల్పనలో
శ్రద్ధ తీసుకోవటం వల్ల, ఇన్ని సినిమాలు చూసిన అనుభవంతో,
కొన్ని రెగ్యులర్ పాత్రలు (ఉదా: డాక్టర్, పోలీస్)
రాగానే, ఈ పాత్ర అలా /లేకపోతే/ ఇలా ప్రవర్తిస్తుంది అని
అనుకోవడం, ఎక్కువ భాగం సినిమాల్లో అలా ఊహించుకున్నట్టు జరగటం
పరిపాటి. కానీ ఈ సినిమా విషయంలో అలా జరగలేదు. ప్రతి పాత్ర ఆ ఊహను చెరిపేస్తూ
ఇంకోలా ప్రవర్తించడం ముచ్చటగా అనిపించింది.
ఇక హీరో హీరోయిన్ ల నటన, వారి మధ్య కెమిస్ట్రీ, సన్నివేశాలు, చాలా ఆహ్లాదంగా కనిపిస్తాయి. సినిమా లో అందరూ బాగా నటిస్తే హీరోయిన్ Preethi Asrani ఇంకా బాగా నటించింది. సినిమా హీరో Nithin Prasanna మూడు పాత్రల్లో (పోస్టర్ మీద మూడు పాత్రలు కనిపిస్తున్నాయి కాబట్టి అలా రాశాను, ఎన్ని పాత్రలో చెబితే థ్రిల్ పోతుంది, కాబట్టి సినిమా చూసి మీరే తెలుసుకోండి) చాలా అద్భుతంగా నటించాడు. వందల కోట్లు పెట్టి తీసిన సినిమాల్లో హీరో ద్విపాత్రాభినయం చేసినా, అతని ఆహార్యాన్ని బట్టి ఏ పాత్ర అని కనిపెట్టాలి తప్ప నటనలో పెద్ద తేడా ఉండదు (ఆ హీరో అన్నా, దర్శకుడు అన్నా నాకూ ఇష్టమే కానీ ఇది నిజం). కానీ ఈ సినిమాలో నితిన్ ప్రసన్న పోషించిన మూడు పాత్రల్లో ఆహార్యంతోపాటు నటనలో కూడా మూడు పాత్రలకు వేరియేషన్స్ చూపిస్తూ, చక్కని క్వాలిటీతో నటించాడు.
సినిమాలోని సంగీతం (Vijay Kurakula), పాటలు (Anantha Sriram), ఛాయాగ్రహణం (Praveen K Bangari), కళ (Nani), స్క్రీన్ ప్లే, దర్శకత్వం చాలా అద్భుతంగా ఉన్నాయి!
హీరో హీరోయిన్లు బైక్ మీద వాళ్ళ పని చేసే ప్రదేశానికి రావడం, అక్కడ పార్క్ చేయడం లోపలికి
వెళ్లడం - ఈ షాట్ సినిమాలో ప్లస్ పాటల్లో కలిపి దాదాపు పది నుంచి ఇరవై సార్ల వరకు
రావచ్చు. ఆ సన్నివేశం వచ్చిన ప్రతిసారి వారిద్దరి మధ్య కెమిస్ట్రీలో కానీ, లేదా వాళ్ళు ఉంటున్న మానసిక స్థితిలో కానీ లేదా కథలో జరిగిన మార్పు వల్ల
వారు మరోలా ప్రవర్తిస్తూ ఉండటం కానీ, ఇలా ఏదో ఓ మార్పు
కచ్చితంగా ఉంటుంది. మొత్తానికి ఆ షాట్ అన్ని సార్లు వచ్చినా, కెమెరా యాంగిల్లో, కనిపించే దృశ్యంలో మార్పు
లేకపోయినా పైన చెప్పిన వాటిలో ఏదో ఒక మార్పు/ డిఫరెన్స్ కనిపిస్తూ దర్శకుడి ప్రతిభ
మనకు గుర్తుకు వచ్చేలా చేస్తుంది. (ఇక్కడ అప్రస్తుతం అయినా ఈ
విషయంలో ఒక సీనియర్ దర్శకుడు గుర్తొచ్చాడు. నదీ ఒడ్డున సాగే ఓ సినిమాలో, ఒక పాటలో హీరో ఒక చెట్టు చుట్టూ కట్టిన దిమ్మ మీద కూర్చుంటాడు. చెట్టు
కొమ్మ దగ్గర ఉన్న కెమెరా కిందకి దిగుతూ హీరో దగ్గరికి వస్తుంది. నాలుగు వైపుల
నుంచి సాగదీసినట్లుగా కనిపించే లెన్స్ వాడి ఆ షాట్ తీశారు. ఆ దృశ్యం వరుసగా
మూడుసార్లు నాన్-స్టాప్ గా ఆ పాటలో వస్తుంది. ఒకే షాట్ ని రిపీట్ చేయలేదు, మూడు సార్లు షూట్ చేశారు. బ్యాక్ గ్రౌండ్ లో చిన్న చిన్న మార్పులు
కనిపిస్తాయి తప్ప హీరో పొజిషన్లో, కెమెరా మూమెంట్లో తేడా
ఉండదు. ఆ సినిమా థియేటర్లో చూసినప్పుడు ఆ షాట్ నా సహనానికి పరీక్ష పెట్టింది)
నాకు నచ్చిన కొన్ని డౌట్స్ ని దర్శకుడిని అడిగినప్పుడు, వారు ఇచ్చిన సమాధానాన్ని
బట్టి సినిమా స్క్రిప్ట్ సినిమాకన్నా పకడ్బందీగా అద్భుతంగా రాసుకున్నారు కానీ
బడ్జెట్ సమస్యల వల్ల కొన్ని సన్నివేశాలు రాసుకున్నట్టుగా తీయలేకపోయారు అని
తెలిసింది.
అలాగే, చిత్రం యూనిట్ ముందు అనుకున్న టైటిల్ అశ్వత్థామ (Ad Infinitum అనేది ట్యాగ్ లైన్). కానీ కొన్ని అనుకోని కారణాలవల్ల టైటిల్ మార్చవలసి రావటం, అప్పుడున్న పరిస్థితుల్లో ఆ సమయానికి ఉన్న వాటిల్లో A: Ad Infinitum అనే టైటిల్ ఉత్తమం అనిపించి పెట్టినట్టుగా తెలిసింది.
ఏదేమైనా పెద్ద పెద్ద దర్శకుల మొదటి సినిమాలు గమనించినప్పుడు, యుగంధర్ ముని గారి ఈ సినిమా గమనిస్తే భవిష్యత్తులో అద్భుతమైన సినిమాలు వీరి నుంచి మనం ఆశించవచ్చు అని స్పష్టంగా అర్థమవుతోంది.
Note: ఈ సినిమా కోసం IMDB వెబ్ సైట్ కి వెళ్ళి, మొదటి సారి అకౌంట్ ఓపెన్ చేసి 10/10 రేటింగ్ ఇవ్వకుండా ఉండలేకపోయాను. The movie deserves it
Amazon Prime లో ఉంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి