తనకు మాలిన ధర్మం
- అరుణ్ కుమార్ ఆలూరి
సుబ్బారావు తన గదిలో సెల్ ఫోన్ ని ఒకచోట దాచి పెట్టి వీడియో రికార్డింగ్ ఆన్ చేసి ఉంచాడు. ఈ తతంగం అంతా తెలియని అతని భార్య మంగతాయారు, భర్త గది వద్దకు వచ్చి, “ఊ, ప్లేట్ పట్టండి.” అంది. సుబ్బు గది బయట వేసున్న స్టూల్ మీద కంచం పెట్టి, వెనక్కి మల్లి దీనంగా కెమెరాకేసి చూసి, మళ్లీ మంగకేసి చూశాడు. మంగ తీసుకువచ్చిన అన్నాన్ని పైనుంచి సుబ్బు కంచంలో పడేసింది, అచ్చం భిక్షానికి వచ్చే యాచకుల పళ్లెంకి తగలకుండా ఎలా వేస్తారో అలా! అన్నం వేశాక ఉడకబెట్టిన గుడ్డు, కాస్త కూర, పై నుంచి సాంబారు పోసి, “పెరుగు గిన్నె ఏది? రోజూ చెప్పాలా?” అని అసెంబ్లీలో స్పీకర్ లా విసుక్కుంది. మళ్లీ దీనంగా మొహం పెట్టి, లోపలికి వచ్చి గిన్నె తీసుకుని ఒకసారి కెమెరాకేసి జాలిగా చూసెళ్లి పళ్లెంలో పెట్టాడు. పెరుగు కూడా పైనుంచే పోసింది. “వేడిగా ఉన్నప్పుడే మొత్తం తినండి, ఏం మిగల్చద్దు!” అని హోంవర్క్ ఎగ్గొట్టే స్టూడెంట్ కి చెప్పినట్టు, వార్నింగ్ లాంటి కంఠంతో చెప్పి వెళ్ళబోతున్న తరుణంలో, “సకినాలు, కారప్పూసవంటివేమీ లేవా నంజుకోవటానికి?” అన్నాడు సుబ్బు కాస్త ధైర్యం తెచ్చుకొని!
“ఆ, మీ అమ్మ అన్ని చేసిపెట్టి వెళ్లిందని ఉంటాయ్ మరి! అసలే పనమ్మాయిని వద్దని
ఇంట్లో పనంతా ఒక్కదాన్ని చెయ్యలేక నేను చచ్చిపోతుంటే
నీకు నంజుకోవటానికి కావాలా? దా,
నన్నుతిను!” అంటూ అధికారం కోల్పోయిన నాయకుడిలా కయ్యుమని లేచింది. ఇంతలో లోపల్నుంచి
ఒక్కగానొక్క ఆరేళ్ల కూతురు “అమ్మా” అని అరవడంతో సుబ్బు వంక, పై
నుంచి కింది దాకా ఒక చూపు చూసి వెళ్లిపోయింది. ఆ చూపులో మళ్లీ మధ్యాహ్నం వరకు ఏమీ
అడక్కూడదన్న అర్థం సుబ్బుకి గోచరించింది. మంగ వెళ్లిపోగానే, ఆ
వీడియో రికార్డింగ్ ఆఫ్ చేసి, దానికి హృదయం ద్రవించే నేపథ్య
సంగీతాన్ని జోడించి ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి, వాట్సప్ లోని
అన్ని గ్రూపులకు పంపించాడు. అయితే మంగకు కానీ, మంగ తరఫు బంధువులు
స్నేహితులకు కానీ అవి కనిపించకుండా సెట్టింగ్స్ మార్చి జాగ్రత్త పడ్డాడు.
-0-
సుబ్బారావుకి రెండుగంటల ప్రయాణ దూరంలో
ఉంటున్న స్నేహితుడు అప్పారావ్ ఆ వీడియో చూసి చలించిపోయాడు. వెంటనే సుబ్బుకి ఫోన్
చేశాడు. సుబ్బు అన్నం తింటూ ఆ ఇన్ కమింగ్ కాల్ ని చూడగానే నవ్వాపుకున్నాడు, కానీ ఆ కాల్ అటెండ్ చేయలేదు! సుబ్బు ఫోన్ ఎత్తకపోయేసరికి అప్పారావ్, “పాపం, వాడే పరిస్థితుల్లో ఉన్నాడో? వాడి భార్య ఎంత హింస పెడుతుందో?” అని బాధ పడ్డాడు.
-0-
సుబ్బు ఉండేది ఒక చిన్న ఇంట్లో.
ఆ ఇంటి యజమాని అదే ఊర్లో ఇంకో ఇల్లు కట్టుకొని అక్కడికి మారడంతో దీన్ని
అద్దెకిచ్చాడు. సుబ్బు ఆ ఊరికి ట్రాన్స్ ఫర్ అయినప్పుడు వెతగ్గా వెతగ్గా ఆ ఇల్లు
దొరికింది. సుబ్బు అమ్మగారు అతనితోనే ఉంటుంది కాబట్టి, ఇల్లు ఎలా ఉన్నా దానికి రెండు బాత్రూములు ఉండటం అనేది కచ్చితమైన అవసరంగా
గోచరించింది. దాంతో ఇరవై ఏళ్ల క్రితం చిన్న అగ్గిపెట్టెల్లాంటి రూములతో కట్టిన ఆ
ఇంట్లోకి దిగాడు. అయితే ఇంటి ఆవరణలో రెండు కార్లు పార్క్ చేసుకునేంత విశాలమైన
స్థలం ఉండటంతో అక్కడ మొక్కలు పెంచుకుంటు, వాటితో సగం సమయం
బయటే గడుపుతూ ఉంటుంది మంగ.
అయితే కొత్త ఇంటి దగ్గర, మున్సిపాలిటీ వాళ్లు కొత్త డ్రైనేజీలు కట్టే ఉద్దేశ్యంతో, పాతవాటిని తవ్వేశారు. దాంతో అప్పటివరకు కబ్జా చేసిన డ్రైనేజీ పైన పెట్టిన
ఇనుప రేకుల షట్టర్ ని ఎక్కడ పెట్టాలో తెలియక తీసుకొచ్చి పాత ఇంట్లో పెట్టాడు ఇంటి
యజమాని. “ఇబ్బంది అవుతుంది సార్!” అని సుబ్బారావ్ చేతులు పిసుక్కుంటూ చెప్పాడు. “మీకు
కార్ లేదు కదమ్మా, అందుకే ఆ ప్లేస్ లో పెట్టా! మహా అయితే
నెలరోజుల్లో కొత్త డ్రైనేజీలు కట్టిస్తారు. అలా వాళ్ళు కట్టడం ఆలస్యం, మళ్లీ దాని మీద స్లాబ్ వేయించి దీన్నితీసుకెళ్లనూ. ఇదిక్కడే ఉంటే నాకే రెంట్
లాస్ కదా!” అని చెప్పేసి గేటు దాకా వెళ్లిన వ్యక్తి సుబ్బుని ఒకసారి చూసి వెనక్కి
వచ్చి, తెగ పిసుక్కుంటున్న అతని చేతుల్ని విడదీసి, భుజంతట్టి పోయాడు. ప్రస్తుతానికి నీడపట్టున ఉన్న అదే ఇనుప రేకుల డబ్బాలో, షట్టర్ పైకనేసి లోపల పాత మడత మంచం వేసుకొని, గాలి
కోసం బయట ఒక టేబుల్ ఫ్యాన్ పెట్టుకొని కాలం వెళ్లదీస్తున్నాడు సుబ్బారావ్!
-0-
“మంగా, మంచినీళ్లు అయిపోయాయి.” అంటూ అరిచాడు సుబ్బు. ఐదు నిమిషాల తర్వాత, అక్కడ స్టూల్ మీద పెట్టిన స్టీల్ బాటిల్ లో వేడి వేడి మంచినీళ్లు పోసి, “ట్యాబ్లెట్స్ అన్నీ వేసుకుంటున్నారా?” అంది. తల
అడ్డంగా ఊపాడు సుబ్బు. మంగ కళ్ళు పెద్దవయ్యాయి. దాంతో తాను చేసిన తప్పు గుర్తొచ్చి
నిలువునా ఊపాడు. అయినా ఆ కళ్ళు చిన్నగా అవలేదు. దాంతో భయపడి అన్ని కోణాల్లో తల
తిప్పాడు. మళ్లీ ఎగాదిగా చూసి వెళ్లిపోయింది. మంగ అలా వెళ్లిపోగానే, ఆ వేడి నీళ్లు తాగలేక తాగుతున్నట్టు ఊపుకుంటూ తాగి,
అప్పటి వరకు రికార్డ్ అయిన వీడియోకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ జోడించి సమాజిక
మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు.
కాసేపటికి ఆ వీడియోని చూసిన
అప్పారావ్ మళ్లీ సుబ్బుకి ఫోన్ చేశాడు. ఆ సమయంలో ఎవరూ డిస్టర్బ్ చేయకూడదని సుబ్బు
ఫోన్ సైలెంట్ లో పెట్టి గురకపెట్టి నిద్రపోతున్నాడు. దాంతో ఆ కాల్ కూడా అటెండ్
చేయకపోయేసరికి, అప్పారావ్ కి భయం పట్టుకుంది. ఎలాగైనా
సుబ్బుని కలిసి ధైర్యం చెప్పాలని నిర్ణయించుకున్నాడు.
-0-
మరునాడు సుబ్బు తన బట్టలు బయట ఉన్న
బాత్రూంలోనే ఉతుక్కొని, తరువాత స్నానం చేసి, ఆ
తర్వాత వాటిని మేడమీద ఆరేసి మెట్లు దిగుతుండగా మాస్క్ పెట్టుకున్న మంగ, గది దగ్గర ప్రత్యక్షమై ఎదురుచూస్తోంది. ఆమెను చూడగానే శిలా విగ్రహంలా
నిలబడిపోయాడు సుబ్బు.
“నేను స్నానానికి వెళ్తున్నా, లోపల పాప టీవీ చూస్తోంది. ఫోన్లో మునిగిపోకుండా ఒక చెవి అటు వేసి
ఉంచండి.” అని చెప్పింది.
“సరే మంగ.” అన్నాడు అమాయకంగా!
“ఈ వేషాలకేమీ తక్కువ లేదు. ఇటు
బోళ్లు తోమి మూడు పూటలా వేడివేడిగా వంట చేయటం, అటు ఇల్లంతా ఊడ్చి బయట
కడగటం, అటు చెట్లని ఇటు ఇంట్లో పిల్లని చూసుకోవటం, ఇవి చాలవన్నట్టు కూరగాయలు కిరాణా సమాను అంతా నేనే తేలేక చచ్చిపోతున్నాను.
ఇదంతా అయ్యాక మీకుంటుంది నా చేతిలో..!” అని గొణడానికి అరవడానికి మధ్యలో ఉన్న
శృతిలో పాడుకుంటూ వెళ్ళిపోయింది.
-0-
తల స్నానం చేసొచ్చిన మంగ, జుట్టు ఆరబెట్టుకుందామని బయటకొచ్చి చూసేసరికి సుబ్బు పక్కనే స్టూల్ వేసుకొని
అప్పారావ్ కూర్చొని ఉండటం చూసి ఆశ్చర్యపోయింది. వెంటనే తేరుకొని లోపలికెళ్లి ముక్కుకి
మాస్క్, జుట్టుకి టవల్ తగిలించుకొని వచ్చి, “మీదన్నయ్య నిజమైన స్నేహిమంటే! ఈ పరిస్థితుల్లో మీ ఫ్రెండుకి ధైర్యం
చెప్పడానికి ఆయన పక్కన కూర్చోవడం చాలా గ్రేట్.” అంది భావోద్వేగంతో!
రాయిని ఆలిగ చేసిన రాముడివా
అన్న పాట మదిలో మెదులుతుంటే సిగ్గుపడిపోయాడు అప్పారావ్!
“మరి అప్పిగాడంటే ఏమనుకున్నావ్? నన్ను చూడ్డానికి ఎవరూ రారనుకున్నావ్ కదు! చూడు బైక్ మీద గుంటూరు నుంచి
వచ్చాడు నాకోసం!” అన్నాడు సుబ్బు.
“అవును నిజమే!” అని ఒప్పుకుంది
మంగ. లోపలికెళ్ళి వేడివేడిగా టీ చేసి తీసుకొచ్చింది. ట్రేలో ఉన్న పేపర్ గ్లాసు
అందుకోబోయాడు అప్పి ఉరఫ్ అప్పారావ్. “అది మీక్కాదు అన్నయ్య. ఆయనకి, మసలా టీ!” అని చెప్పడంతో కప్పు అందుకున్నాడు. టీ తాగుతూ యోగక్షేమాలు
తెలుసుకున్నారు.
“ఎంత మీ ఫ్రెండ్ మీద అభిమానం
ఉంటే మాత్రం, మాస్క్ లేకుండా కూర్చోవడం అంటే..?” అంటూ
అర్థోక్తిలో ఆగిపోయింది.
“హ..హా..హా” అంటూ బిగ్గరగా
నవ్వాడు అప్పి. “ఇంకా కరోనా గురించి భయపడితే ఎలా అమ్మా! అదెప్పుడో మనకు వచ్చి
వెళ్లిపోయుంటుంది.” అన్నాడు జ్ఞానిలా!
“నేనూ అదే చెప్పి ఊరెళ్లానురా, ఒక చిన్న ఫంక్షన్ కి! తనేమో ఒకటే కంగారు పడి, ఈ
టైంలో వద్దండి అంది. కరోనా మొదటి వేవ్ లోనే మనకేం కాలేదు,
సెకండ్ వేవ్ లో ఏం చేస్తుందే పిచ్చిమొహమా అనేసి వెళ్లొచ్చాను. అక్కడే అంతా తలకిందులయ్యింది.
దాంతో అమ్మ అక్కడ అలా, నేనేమో ఇక్కడ ఇలా...” అని చెబుతున్న
సుబ్బు మాటలకు అడ్డుతగులుతూ, “తలకిందులంటే గుర్తొచ్చింది, మీరు చూస్తే ఇంత సంతోషంగా ఉన్నారు. మరి ఈ రూంలో వీడిని ఉంచడం ఏంటి? అన్నం బెగ్గర్ కు వేసినట్టు పెట్టడమేంటి? తాగటానికి
వేడి వేడి నీళ్లు ఇవ్వటమేంటి? కొంపదీసి ప్రాంక్ వీడియోలు
ఏమైనా చేస్తున్నారా?” అన్నాడు అప్పి నవ్వుతూ!
కాస్త బిత్తరపోయి చూస్తూ, “ఏ వీడియోల గురించి అన్నయ్య మీరు మాట్లాడేది?” అంది
మంగ.
ఫిలమెంట్ ఎగిరిపోయిన బల్బులా
అయిపోయింది అప్పి మొహం. ఒకసారి మంగని, సుబ్బుని నోరెళ్లబెట్టి
చూసి, లాభం లేదని తన ఫోన్ తీసి ఆ వీడియోలు మంగకు చూపించాడు. వాటిని
చూస్తూనే పళ్లు పటపటా కొరుకుతూ ఒరకంట సుబ్బుని చూసింది మంగ. సుబ్బు తలదించి
పరోక్షంగా ఓటమిని అంగీకరించి తెల్లజండా ఎగరేశాడు.
“మళ్ళీ నాకు కరోనా అంటుకోకుండా, అలా దూరం నుంచి వేశాను అన్నయ్య.” అని చెప్పింది.
“ఏ ఏ ఏంటి? అ అ అర్థం కాలేదు. క క కరోనా ఏంటి? ఎ ఎ ఎవరికి?” అంటూ కరెంట్ షాక్ కొట్టిన కాకిలా విలవిలలాడుతూ అడిగాడు అప్పి. అప్పటికే
అతని కాళ్లు చేతులు వణకడం మొదలయ్యాయి!
“మీ ఫ్రెండుకే అన్నయ్య.” అని
సుబ్బు వైపు తిరిగి “ఏంటండీ చెప్పలేదా మీరు?” అంది.
“ఆ వీడియోలో కింద రాశాను కదా”
అని, అప్పి వైపు తిరిగి “ఏరా చూడలేదా?”
అన్నాడు.
నొరెళ్లబెట్టి “ఆ..!” అన్నాడు.
అప్పి ఫోన్ తీసుకొని, ఆ వీడియో కింద పోస్ట్ చేసిన పదాలు చూపించాడు. “వెన్ యు హావ్ సీప్లస్, యు షుడ్ బీ బీప్లస్” అని ఆ షాక్ నుండి తేరుకోకుండా మెల్లిగా చదివాడు అప్పి.
“అది సీప్లస్, బీప్లస్ కాదురా, సీ పాజిటివ్ అంటే కరోనా పాజిటివ్, ఇంకోటి బీ పాజిటివ్. అంటే దానర్థం మీకు కరోనా పాజిటివ్ అని తెలిసినప్పుడు, మీరు సానుకూల దృక్పథంతో ఉండాలి అని!” అంటూ ఐ.ఏ.యస్. ఇంటర్వ్యూలో అడిగిన
ప్రశ్నకి సమాధానం చెప్పిన భావిభారత కలెక్టర్ లా ఫీలైపోయాడు సుబ్బు.
“ఒరేయ్ నువ్వనుకుంటే సరిపోయిందా? ఎదుటివాడికి అర్థం కావద్దూ?” దాదాపు ఏడుస్తున్న
గొంతుతో అనేశాడు అప్పి.
“నాకేం తెల్సురా నీకు అర్థం
కాదని?” అమాయకంగా అన్నాడు సుబ్బు.
“అంటే ఆయనకి కరోనా అని తెలియకుండా ఇక్కడొచ్చి కూర్చున్నారా అన్నయ్య?” అంది మంగ.
పరిస్థితి చెయ్యిదాటిపోయిందని అర్థమై, “వా, ఇప్పుడేంటి నా పరిస్థితి?” అని ఏడునొక్కరాగం అందుకున్నాడు.
“టెన్షన్ పడకండి అన్నయ్య.
ఎవర్నీ ముట్టుకోకుండా బైక్ పై ఇంటికెళ్ళి అటాచ్డ్ బాత్రూం ఉన్న రూంలో ఐసొలేషన్ లో
ఉండండి. ఇంట్లో కిటికీన్నీ తెరిచి ఉంచండి, గాలి వెలుతురు మీరున్న
గదిలోకి బాగా రావాలి. రెండు మూడు రోజులతర్వాత టెస్ట్ చేయించుకోండి. నెగెటివ్ వస్తే
మళ్లీ మూడు నాలుగు రోజులు ఐసొలేషన్ లో ఉండి ఇంకోసారి టెస్ట్ చేయించుకోండి. అప్పుడు
కూడా నెగిటివ్ వస్తే మీరు సేఫ్ అన్నట్టు!”
“ఒకవేళ పాజిటివ్ వస్తే?”
“అయినా సరే టెన్షన్
అక్కర్లేదన్నయ్యా! వాళ్లు ఐదు రోజులకు ట్యాబ్లెట్లు ఇస్తారు, టైం ప్రకారం వేసుకోండి. ఆయుష్ వాళ్ళు చెప్పిన కషాయం తాగండి లేదా దాంతో
మసలా టీ చేసుకోండి, జ్వరం తగ్గిన తర్వాత రోజుకు రెండు ఉడకబెట్టిన
గుడ్లు తినండి, రాత్రికి పసుపు కలిపిన పాలుతాగి పడుకోండి.
అన్నిటికన్నాముఖ్యమైంది రోజూ పసుపు నీళ్లతో ఐదారుసార్లు ఆవిరి పట్టుకోవడం. ఆ ఆవిరి
నీళ్లల్లో పసుపు తప్ప వేరే ఏ మందులు వేయకండి. బరువులు ఎత్తకండి, శ్వాస సంబంధిత ఇబ్బందులు వస్తాయి. ఛాతిలో ఊపిరిని ఇరవై సెకండ్లకు మించి
ఆపగలిగితే ఊపిరితిత్తులు బాగా పనిచేస్తున్నట్టు అర్థం. కాస్త తక్కువగా అనిపిస్తే
ఖాళీ కడుపుతో ఉన్న సమయంలో ప్రాణాయామం చెయ్యండి. వేడి వేడి అన్నమే తినండి, గోరు వెచ్చటి నీళ్లే తాగండి. వేరే సమస్యలేమైనా ఉంటే హాస్పిటల్ కి వెళితే
సరిపోతుంది.”
మంగ అనుభవపూర్వకంగా ఇచ్చిన భరోసాతో, కరోనా వచ్చినప్పటికీ హాయిగా ఉన్న సుబ్బుని చూసి కాస్త స్థిమితపడ్డాడు అప్పి.
“ఒరేయ్, ఒక్క మాట నీకు కరోనా వచ్చింది కాబట్టి ఇలా మా ఆవిడ
చేస్తోంది అని తెలుగులో పెడితే నీ సొమ్మేం పోయేదిరా? నిజం
చెప్పు పాత కక్షలేవో మనసులో పెట్టుకున్నావ్ కదు? నాలుగో తరగతిలో
లెక్కల మాస్టారు నువ్వు తప్పుడు లెక్క చెప్పావని కర్ర తీసుకురమ్మంటే రూల్ కర్ర
తీసుకొచ్చానని కోపమా?” అన్నాడు.
“మరెందుకు తెచ్చావ్ రా?” అన్నాడు సుబ్బు.
“అప్పుడే చెప్పా కదరా, కర్ర కోసం వెళ్తుంటే గ్రౌండ్ లో ఉన్న మన ప్రిన్సిపాల్ ఆపి, రూల్ కర్ర ఇచ్చి పంపించాడని!”
“అది సరే కాని, తొమ్మిదో తరగతిలో సంధ్యని చెంప మీద ముద్దుపెట్టుకున్నట్టు పుకారు లేపితే, నిజంగా వచ్చి పెట్టుకుంటుంది అన్నావ్! కానీ ఆమె వాళ్ళ నాన్నని తీసుకొచ్చి
ప్రిన్సిపాల్ కి చెప్పి మడతపెట్టిన కరెంట్ సర్వీస్ వైర్ తో వీపులో కొట్టించింది
తెలుసా?” అన్నాడు సుబ్బు పాతగాయం గుర్తుకువచ్చి!
తలబాదుకుంటూ సుబ్బుని ఎగాదిగా
చూస్తూ ఒకసారి మంగ వంక చూశాడు అప్పి. కళ్ళళ్ళో కారాలు మిరియాలతో పాటు గరం మసాలా
మొత్తం వేసుకొని, బిర్యానీ వండగలిగేంత మంటతో సుబ్బు వంక
చూస్తోంది. “హిహిహి” అంటూ పళ్ళు కనిపించేలా నవ్వుతూ “జోక్ చేశా అంతే, లోల్ అన్నమాట!” అంటూ కవర్ చేశాడు.
“వీడెంటమ్మా, సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడు?” అన్నాడు అప్పి వాతావరణాన్ని
తేలిక పరుస్తూ!
“ఆయనకు కొంచెం తిక్కుందని
తెల్సు కదా అన్నయ్య! ఆరు నెలల క్రితం చిన్న ఆక్సిడెంట్ అయి తలకి దెబ్బ తగిలి ఆ తిక్క
కాస్త ముదిరింది!” కన్నీళ్ళు రాకపోయినా, బాగోదని కొంగుని
కళ్లకేసి ఒత్తుకుంటూ అంది మంగ!
సుబ్బు ఇదేమీ పట్టించుకోకుండా
ఫోన్ కేసి చూస్తూ, “రేయ్, నువ్వు నన్ను
చూడటానికి వచ్చావని మన వాట్సప్ గ్రూప్ లో పెట్టగానే, అందరూ
కలిసి కుంభమేళకి వచ్చినట్టు రేపొద్దామని ప్లాన్ చేసుకుంటున్నార్రా!” అంటూ సంతోషంగా చెప్పాడు.
సుబ్బు వంక జాలిగా చూసిన అప్పి, మంగ వైపు తిరిగి, “నీకేం ఇబ్బంది పెట్టట్లేదు కదమ్మా
వీడు?” అన్నాడు.
“లేదన్నయ్య, పాపం ఇంట్లో చెప్పినట్టు వింటాడు. ఆ ఫంక్షన్ ఒక్కదానికే వెళ్లొద్దు అన్నా
వినకుండా వెళ్లి ఈ కరోనా తెచ్చుకున్నాడు. గుడ్ న్యూస్ ఏంటంటే అత్తయ్యకి మాత్రం కరోనా
రాలేదు. దాంతో ఈయనకు తగ్గే వరకు అత్తయ్యని అక్కడే ఉండమన్నాం.” అని చెప్పి, మెల్లిగా అప్పారావ్ కి మాత్రమే వినిపించేలా, “మీ
ఫ్రెండ్స్ వేసుకున్న కుంభమేళా ప్లాన్ నువ్వే ఆపెయ్యాలి అన్నయ్య.” అంది.
“అందరికీ పర్సనల్ గా నేను మెసేజ్
పెడతాలే. సరేనమ్మా వెళ్ళొస్తాను! బై రా” అంటూ సెలవు తీసుకున్నాడు అప్పి.
అతను అలా వెళ్ళిన మరుక్షణం, సుబ్బు చేతిలోని ఫోన్ లాక్కుంది మంగ. “ఐసొలేషన్ పీరియడ్ ఐపోయి నెగిటివ్
వచ్చేంత వరకు ఫోన్ లేదు, ఏం లేదు. డాక్టరేమో పడుకొని పూర్తిగా
విశ్రాంతి తీసుకొమ్మంటే, మీరిలా ఫోన్ తో టైంపాస్ చేస్తారా?” అంటూ కోప్పడి ఫోన్ ని, చేతుల్ని సానిటైజ్ చేసుకోడానికి
లోపలికి వెళ్ళిపోయింది మంగ.
మంగ చెప్పినట్టుగా పడుకొని, ఖాళీగా ఉండలేక ఆ ఇనుప రేకుల డబ్బాకి ఎన్ని నొక్కులున్నాయని లెక్కపెట్టసాగాడు సుబ్బు!
- అయిపోయింది
-
( తపస్వి మనోహరం అంతర్జాల సాహిత్య పత్రికలో
జూన్ 20, 2021న ప్రచురితం https://thapasvimanoharam.com/weekly-magazines/weekly-magazine-20-06-2021/ )
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి