జై భీమ్.. తప్పకుండా చూడాల్సిన మంచి సినిమా. అన్నీ అద్భుతంగా కుదిరిన సినిమా, ముఖ్యంగా రైటింగ్ క్వాలిటీ, బాగా నచ్చింది. ఆ తర్వాత కాస్టింగ్, నటీనటుల ఎంపిక చాలా బాగా కుదిరింది. ఇలాంటి సినిమాని నిర్మించడం ఒకెత్తయితే, స్వయంగా నటించడం మరో ఎత్తు. అవి చేసిన సూర్య చాలా ఎత్తుకు ఎదిగాడు. నిజ జీవితంలో మానవ హక్కుల కేసులకు ఒక్క రూపాయి కూడా ఫీజు తీసుకోకుండా వాదిస్తూ, జడ్జ్ గా మారాక ఆరేళ్లలో తొంబై ఆరువేల కేసుల్ని పరిష్కరించిన చంద్రు గారికి హాట్సాఫ్!
సినిమా ప్రారంభంలో కులాల పేర్లు అడుగుతూ, కొన్ని కులాల వారిని మరో నేరం మోపటానికి అటు వైపు నిలబెడుతూ, ఇంకొన్ని కులాల వారిని విడుదల చేస్తూ ఉన్న సన్నివేశంలో, అలా విడుదల అవుతున్న ఒక వ్యక్తి యొక్క కులం పేరు ఉన్నదున్నట్లు కాకుండా కాస్త మార్చి పరోక్షంగా చెప్పించారు. ఇది తమిళంలో కూడా ఉందా, లేక తెలుగు డబ్బింగ్ లో మాత్రమే అలా చేశారా అనేది అర్థం కాలేదు. అవి స్పష్టంగా ఉంటేనే కదా అక్కడ కుల వివక్ష గురించి అర్థం అయ్యేది.
ఇక నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాని, కమర్షియల్ సినిమాలా కాకుండా, వరల్డ్ సినిమాలా తెరకెక్కించడం బాగా నచ్చింది. అయితే నేరం చేసిన పోలీసుల ప్రవర్తన ముందు నుంచి కూడా ఎక్కడా తొట్రపాటు లేకుండా, కాన్ఫిడెంట్ గా, ఆ ముగ్గురూ తప్పిపోయారు అన్నట్టుగానే ప్రవర్తిస్తూ ఉంటారు. ఇదొక్కటీ నచ్చలేదు. ఒక వేళ ఆ పోలీసులు అలాంటి నేరాలు చేసి చేసి ఆరితేరి పోయారు అని చెప్పాలి అనుకుంటే, వాటిని బలపరిచే సన్నివేశాలు ముందే ప్లాంట్ చేసి ఉండాలి, అవి లేవు. కమర్షియల్ సినిమాల్లో ఉన్నట్టుగా, కథలో సస్పెన్స్ కోసం వాళ్ళని ఏమీ ఎరుగని అమాయకుల్లా నటింపజేయడం మింగుడుపడదు.
వ్యక్తిగతంగా ఈ రెండు చిన్న పాయింట్లు నచ్చలేదు, అవి పక్కన పెడితే సినిమా అద్భుతం!
మీరు కనక విసరనై (తెలుగులో విచారణ పేరుతో విడుదల అయ్యింది) చూసుంటే, ఈ సినిమా చూస్తున్నప్పుడు అది అక్కడక్కడ గుర్తొస్తుంది, చదివిన వాళ్ళకి డా. కేశవ రెడ్డి గారి నవల ఒకటి (చివరి గుడిసె అనుకుంటా - ఎలుకలు పట్టే వృత్తి యానాదుల గురించి, వాళ్ల నైపుణ్యం గురించి ఉంటుంది) గుర్తొస్తుంది. అలాగే కొంతమందికి అంకురం సినిమా కూడా గుర్తొచ్చింది. అలా అని కాపీ అని చెప్పటానికి లేదు, ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు, లేదా యాదృచ్ఛికంగా కూడా జరిగి ఉండవచ్చు!
ఏదేమైనా వరల్డ్ సినిమాని ఇష్టపడే వారు అస్సలు మిస్ అవకండి, ప్రైమ్ లో ఉంది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి