కొత్త కథ 2022 - ఆవిష్కరణ - ఒడ్డున ఉన్నోడు కథ

కొత్త కథ 2022 ఆవిష్కరణ సభ మే 15 సాయంత్రం, సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో జరిగింది. ఆ స్పందనను నేనైతే ఊహించలేదు. హాల్‌లో కుర్చీలు నిండిపోయాయి. కొంతమంది మిత్రులు నిలబడటం మొదలైంది. వెంటనే మరిన్ని కుర్చీలు తెప్పించి పరిస్థితిని కాస్త అదుపులోకి తెచ్చారు ఖదీర్ బాబు గారు. 

 ఆచార్య కొలకలూరి ఇనాక్‌గారి అధ్యక్షతన సమావేశం జరిగింది. బృందాలుగా ఏర్పడి నలుగురి అభిప్రాయం తీసుకోవడం వల్ల రచయితకు రచనకు ఒనగూరే ప్రయోజనం గురించి ఆయన అనుభవంలోంచి తీసిన మాటల ద్వారా చెప్పారు. 

రైటర్స్ మీట్‌తో ఉన్న అనుబంధం - అందులో తను మాట్లాడిన విషయాలు, చెప్పిన పాఠాలను గుర్తుచేసుకున్నారు చిన వీరభద్రుడు గారు. 

ఇరవై యేళ్ళు పూర్తి చేసుకున్న రైటర్స్ మీట్ ప్రస్థానాన్ని సింహావలోకనం చేశారు అనంత్ గారు. 

ఈ కొత్త కథ 2022లో ఉన్న కథల పై, ఆ రచయితలతో ఒక ఇంటరాక్టివ్ సెషన్ రాబోయే మీట్‌లో పెడితే బాగుంటుందని వాసిరెడ్డి నవీన్ గారు సూచించారు.

ఈ పుస్తకంలోని కథల గురించి ఆయనతో పాటు, ఎన్ వేణుగోపాల్ గారు, కాత్యాయని గారు మాట్లాడారు.


నా కథ "ఒడ్డున ఉన్నోడు" పై వేణుగోపాల్ గారు ఈవిధంగా విశ్లేషించారు... "ప్రజాస్వామ్యానికీ, నిజమైన ప్రజాభిప్రాయ వ్యక్తీకరణకు చిహ్నంగా ఉండవలసిన ఎన్నికల రాజకీయాలు ఇవాళ్టి సమాజంలో ఎట్లా వక్రీకరణకు గురై సాగుతున్నాయో, ఎన్నికలంటే ఎన్ని అక్రమాలో, ఎన్ని అబద్ధాలో, ఎన్ని కలలో, ఎన్ని కల్లలో అద్భుతంగా చిత్రించారు ఆలూరి అరుణ్ కుమార్ (ఒడ్డున ఉన్నోడు). " వేణుగోపాల్ గారికి ప్రేమపూర్వక ధన్యవాదాలు. ఈ పుస్తకంలోని అన్ని కథలు చదివి వారు ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. అది చదవాలి అనుకుంటే ఈ లింక్ క్లిక్ చేయండి. 


ఈ సంకలనంలో ఉన్న ఒక్కో కథారచయితకి, ఆవిష్కరణకు విచ్చేసిన వ్యక్తులతో పుస్తకం ఇప్పించారు. నాకు ఇష్టమైన రెండు రంగాల్లో (సాహిత్యం, సినిమా) సమంగా కృషి చేసి రాణిస్తున్న వెంకట్ శిద్దారెడ్డి గారి నుంచి కొత్త కథ 2022ను నేనందుకున్నాను.

రైటర్స్ మీట్‌లో కలిసిన రచయితలతో పాటు, ఫేస్‌బుక్‌లో మాత్రమే పరిచయం ఉన్న మన్‌ప్రీతమ్, వి.మల్లిఖార్జున్‌, భారతీయుడు ఒంటెపాక (ఇది కలంపేరు), సుదర్శన్ బూదూరి, బాలాజీ ప్రసాద్‌లను ప్రత్యక్షంగా కలుసుకున్నాను. 

 మొత్తానికి కొత్త కథ 2022 ఆవిష్కరణ సంతృప్తిగా, సంతోషంగా సాగింది. సంపాదకులు కె.సురేష్, మహమ్మద్ ఖదీర్‌బాబు, ప్రూఫ్ రీడింగ్ చేసిన మల్లికార్జున్, పోస్టర్స్ రూపొందించిన మహీ, బుక్‌ని డిజైన్ చేసిన లేపాక్షి గార్లకు, రైటర్స్ మీట్ కోర్‌టీం మెంబర్స్‌కి, వచ్చిన అతిథులు, సాహితీ అభిమానులకు - అందరికీ మనఃపూర్వక ధన్యవాదాలు 💐🙏❤️

  కొత్త కథ 2022 సంకలనం నవోదయ బుక్ హౌస్ (కాచిగూడ)లో, అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో దొరుకుతుంది. ఆన్‌లైన్‌లో కావాలనుకుంటే అమేజాన్‌లో లభ్యమవుతుంది. లింక్ (లింక్ అని ఉన్న పదం పై క్లిక్ చేస్తే అమేజాన్ సైట్ లో పుస్తకం కనిపిస్తుంది - కింద ఉన్న బటన్ క్లిక్ చేసినా చాలు) P.C.: చేగొండి చంద్రశేఖర్ గారు








కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి